
వాషింగ్టన్: అమెరికాలో కోడి గుడ్లు ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. నెల నెలా రేటు పెరుగుతూ కొనుగోలు దారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అమెరికా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరిలో డజను కోడి గుడ్లు ధర 5.90 డాలర్లు (భారత కరెన్సీలో రూ.508.76) ఉండగా మార్చి నెలలో 6.23 డాలర్లకు (రూ.536) చేరింది.
అయితే, అమెరికాలో కోడి గుడ్లు ధరలు ఆకాశాన్ని తాకడం వెనుక బర్డ్ ఫ్లూ ఓ కారణం. బర్డ్ ఫ్లూని అరికట్టేందుకు అమెరికా గుడ్లు పెట్టే కోళ్లను నిర్మూలించింది. ఆ ప్రభావం రిటైల్ మార్కెట్‌లోని గుడ్ల ధరలపై పడింది.
ట్రంప్ వరుస ప్రకటనలు
ఫలితంగా గుడ్లు తేలేసేలా.. కొండెక్కిన కోడిగుడ్ల ధరలతో అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆందోళనలపై.. గత కొన్ని వారాలుగా తన పాలనలో గుడ్లు ధరల్ని తగ్గించామంటూ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. తాను రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హోల్‌సేల్ గుడ్ల ధరలు 59శాతం నుంచి చివరికి 79 శాతానికి తగ్గాయని చెప్పారు’ అని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.
బర్డ్ ఫ్లూ నియంత్రణకు బయోసెక్యూరిటీ
ఇదే విషయంపై వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లి సైతం ప్రస్తావించారు. బర్డ్ ఫ్లూ నియంత్రణకు బయోసెక్యూరిటీని బలోపేతం చేసినట్లు, కొత్త నిబంధనలను సడలించి కోడి గుడ్ల సరఫరా పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బర్డ్ ఫ్లూపై మేం తీసుకున్న చర్యలు ఫలితాల్ని ఇస్తున్నాయి’ అని పేర్కొన్నారు.
గుడ్ల ధరలపై భిన్నాభిప్రాయాలు
అమెరికాలో అమాంతం పెరిగిపోతున్న గుడ్ల ధరలపై ఆర్థిక నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ ఆహార ఆర్థిక నిపుణుడు డేవిడ్ ఓర్టెగా మాట్లాడుతూ.. హోల్‌సేల్ ధరలు తగ్గినా, ఆ ప్రభావం రిటైల్ ధరలపై పడేందుకు కొన్ని వారాలు సమయం పడుతుందన్నారు. పాల్ట్రీ ఫారాల్లో బర్డ్ ఫ్లూ తగ్గడం, సరఫరా పెరగడం వల్ల హోల్‌సేల్ ధరలు తగ్గినప్పటికీ.. రిటైల్ ధరలు ఎంత తగ్గుతాయో అంచనా వేయడం కష్టం’ అని కార్నెల్ యూనివర్శిటీకి ఆర్థిక నిపుణుడు క్రిస్టఫర్ బి. బారెట్ చెప్పారు.