
అమెరికాలో అనూహ్యంగా పెరుగుతున్న ధరలు
వాషింగ్టన్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో స్థానిక చిరువ్యాపారుల వద్ద ఒక కోడిగుడ్డు ధర ఐదారు రూపాయల మధ్యే తిరుగుతుంటుంది. అమెరికాలో మాత్రం ఒక్క గుడ్డు ధర ఏకంగా 44 రూపాయలకు పెరిగింది. అమెరికాలో డజను గుడ్ల ధర 6.23 డాలర్ల(దాదాపు రూ.536)కు చేరుకుంది. మార్చి నెలకు సంబంధించి వినియోగదారుల ధరల సూచీలో గుడ్ల ధరను అమెరికా ప్రభుత్వం గురువారం వెల్లడించడంతో గుడ్ల కొరత అంశం మరోసారి తెరమీదకొచ్చింది.
గత కొన్నాళ్లుగా అమెరికాలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తుండటంతో వ్యాధి వ్యాప్తి కట్టడే లక్ష్యంగా కోట్లకొలదీ కోళ్లను వధించారు. దీంతో గుడ్ల కొరత విపరీతమైంది. అందుకు తగ్గట్లే డజను గుడ్ల ధర కొండెక్కింది. ఫిబ్రరిలో ఒక దశలో డజను గుడ్ల ధర ఏకంగా 7.34 డాలర్లకు పెరిగి మళ్లీ దిగొచ్చింది. ఇప్పుడది మళ్లీ 6 డాలర్లను దాటింది. ఈస్టర్ పండుగ సందర్భంగా గుడ్లకు గిరాకీ ఎక్కువైంది.
ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీన ఈస్టర్ జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆ తేదీదాకా ధరల ఉరవడి ఆగకపోవచ్చని తెలుస్తోంది. బర్డ్ ఫ్లూ భయాలతో జనవరి, ఫిబ్రవరిలో ఏకంగా 3 కోట్లకుపైగా గుడ్లు పెట్టే కోళ్లను వధించడంతో ఈ సమస్య మరింత ఎక్కువైంది. కోళ్లఫారాలను పూర్తిగా శానిటైజ్‌చేసి, కొత్త కోళ్లను సాకుతున్నారు. దీంతో కొత్త కోళ్లతో గుడ్ల దిగుబడి పెరిగితే ధరలు కిందకు దిగొచ్చే వీలుంది.