లిబరల్ పార్టీ పగ్గాలపై కన్ను
కెనడా ప్రధాని పదవి కోసం మరో భారతీయ నేత తలపడనున్నారు. ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో త్వరలో బాధ్యతల నుంచి తప్పుకుంటుండటం తెలిసిందే. అధికార లిబరల్ పార్టీ సారథ్య బాధ్యతలను కూడా వదులుకోనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో లిబరల్ పార్టీ నేత పదవికి భారత సంతతికి చెందిన పార్టీ నాయకురాలు రూబీ దల్లా పోటీ పడనున్నారు.
రూబీ దల్లా తల్లిదండ్రులు పంజాబ్ నుంచి కెనడా వలస వెళ్లారు. ఆమె కెనడాలో మనిటోబాలోని విన్నిపెగ్‌లో జన్మించారు. బయో కెమిస్ట్రీ, ఆరోగ్య సంరక్షణలో డిగ్రీ చేశారు. కొంతకాలం ఆరోగ్య సంరక్షకురాలు (చిరోప్రాక్టర్)గా పని చేశారు. తర్వాత అందాల పోటీల్లో, సినిమాల్లోనూ రాణించారు. 1993లో మిస్ ఇండియా–కెనడా పోటీల్లో రెండో స్థానంలో నిలిచారు. అనంతరం పారిశ్రామికవేత్తగా రాణించారు. దల్లా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓగా ఉన్నారు.
కెనడా పార్లమెంటుకు మూడుసార్లు వరుసగా ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా నిలిచారు. అదే ఊపులో ఆ దేశ ప్రధాని పదవి చేపట్టిన తొలి నల్లజాతి మహిళగా కూడా రికార్డు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. 2008లో జరిగిన ఓ సర్వేలో కెనడా పార్లమెంటులో సెక్సీయెస్ట్ ఎంపీల్లో రూబీ మూడో స్థానంలో నిలిచారు. అదే ఏడాది మాక్సిమ్ మేగజైన్ ఆమెకు ప్రపంచంలోని హాటెస్ట్ రాజకీయవేత్తల్లో మూడో ర్యాంకు ఇచ్చింది.
తాను ప్రధాని అయితే అక్రమ వలసదారులందరినీ కెనడా నుంచి పంపించేస్తానని ప్రకటించడం ద్వారా రూబీ ఇటీవలే వార్తల్లో నిలిచారు. అందుకు తన వద్ద స్పష్టమైన ప్రణాళికలున్నాయని కూడా చెప్పుకొచ్చారు. పార్టీ సారథ్యం, ప్రధాని పదవి విషయంలో బ్యాంక్ ఆఫ్ కెనడా గవర్నర్ మార్క్ కార్నీ, మాజీ ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ నుంచి ఆమె గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. లిబరల్ పార్టీ తదుపరి నేత ఎవరన్నది మార్చి 9న తేలే అవకాశముంది.
పదేళ్ల వయసులోనే ఇందిరకు లేఖ
పదేళ్ల వయసులోనే నాటి భారత ప్రధాని ఇందిరాగాం«దీకి లేఖ రాసి రూబీ ఔరా అనిపించారు. పంజాబ్‌లో అస్థిరత, అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంపై చేపట్టిన బ్లూస్టార్ సైనిక చర్యలపై తన అభిప్రాయాలను లేఖలో సూటిగా వెల్లడించారు. ‘‘పంజాబ్ హింసాకాండను టీవీలో చూసి వికలమైన మనసులో మీకు లేఖ రాస్తున్నా. అమాయక సిక్కుల ఊచకోతను, స్వర్ణ దేవాలయంపై దాడులను దయచేసి అడ్డుకోండి.
సమస్యను ఇరు వర్గాలూ చర్చల ద్వారా పరిష్కరించుకుంటే మేలు. ఈ విషయంలో నేను చేయగల సాయమేమైనా ఉంటే దయచేసి చెప్పండి’’ అంటూ రాశారు. ఆ లేఖకు ఇందిర బదులివ్వడమే గాక ఈ విషయాన్ని మీడియాతో కూడా పంచుకున్నారు! చిన్నారి రూబీని భారత్‌కు ఆహ్వానించారు. కానీ ఆలోపే ఇందిర హత్యకు గురయ్యారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment