
10వ తేదీ కల్లా భవనాలు సిద్ధం:నారాయణ
►ఏపీ మంత్రి నారాయణ వెల్లడి
►తాత్కాలిక సచివాలయంలో పలు కార్యాలయాలు ప్రారంభం
అమరావతి : ఏపీలోని వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ సముదాయ భవనాలన్నీ 10వ తేదీ నాటికి పూర్తవుతాయని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. గురువారం ఉదయం 9.45 గంటల కు పురపాలక శాఖ కార్యాలయాన్ని నారాయణ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఇకపై తాత్కాలిక సచివాలయం నుంచే పాలన కొనసాగుతుందని తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హోంశాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు.
కృష్ణా పుష్కరాలను డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. అంతకుముందు ఏపీ మంత్రి శిద్దా రాఘవరావు ఐదో భవనంలోని రవాణాశాఖ కార్యాలయంలో తన చాంబర్‌ను ప్రారంభించారు. పుష్కరాల సందర్భంగా మూడు జిల్లాల్లో రూ.400 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టామని శిద్దా తెలిపారు. ప్రతి బస్టాండ్‌లో పుష్కర కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల, సీడీఎంఏ డెరైక్టర్ కె.కన్నబాబు, పల్లోంజి షాపోర్జి సంస్థ ప్రతినిధులుపాల్గొన్నారు.
పూర్తి కాకున్నా ప్రారంభం...
గురువారం ప్రారంభించిన రెండో భవనం ముఖద్వారం పూర్తి కాలేదు. నారాయణ ఉదయమే పురపాలక శాఖ కార్యాలయాన్ని ప్రారంభించాల్సి ఉండటంతో ద్వారం ముందు హడావుడిగా ఇసుక నింపి దానిపై గ్రీన్ కార్పెట్‌ను పరిచారు. రెండో భవనం ముందు భాగంలో ఓ వైపు టైల్స్ వేస్తుంటే.. మరోవైపు కార్యాలయాల ప్రారంభాల కోసం మంత్రులు, అధికారులు వెళ్లడం కనిపించింది.