రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: పబ్లిక్ స్థలాల్లో నిర్మించిన భవనాలు, నిర్మించబోయే భవనాల్లో శిశువుల సంరక్షణకు, వారికి తల్లులు స్తన్యం ఇచ్చేందుకు ప్రత్యేక వసతులు కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలని సూచించింది. ప్రత్యేక గదుల్లాంటివి నిర్మిస్తే తల్లుల గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉంటుందని, పిల్లలకు సైతం మేలు జరుగుతుందని వెల్లడించింది.
పబ్లిక్ స్థలాల్లో ఫీడింగ్ రూమ్‌లు, చైల్డ్‌కేర్ గదులు నిర్మించేలా ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ప్రసన్న బి.వరాలీతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తల్లులు, బిడ్డల కోసం భవనాల్లో తగినంత స్థలం కేటాయించి, వసతులు కల్పించాలని పేర్కొంది.
సుప్రీంకోర్టు విచారణకు కేంద్ర ప్రభుత్వం తరఫు హాజరైన న్యాయవాది స్పందిస్తూ... పబ్లిక్ స్థలాల్లో తల్లులు, శిశువులకు వసతులు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సూచిస్తూ 2024 ఫిబ్రవరి 27న కేంద్ర మహిళ, శిశు అభివృద్ది శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఈ ఆదేశాలపై ధర్మాసనం సంతృప్తి వ్యక్తంచేసింది. ఆదేశాలను రాష్ట్రాలకు మరోసారి గుర్తుచేయాలని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment