Child Care Centers
-
కృష్ణా జిల్లాలో మూడు చైల్డ్‌కేర్ సెంటర్ల ఏర్పాటు
సాక్షి, కృష్ణా : కరోనాతో ఆస్పత్రిపాలైన కుటుంబాల్లోని చిన్నపిల్లల రక్షణ కోసం చైల్డ్‌కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. సీఎం ఆదేశాలతో కలెక్టర్ ఇంతియాజ్.. కృష్ణా జిల్లాలో మూడు చైల్డ్‌కేర్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పిల్లలను తరలించేందుకు మూడు వాహనాలు సిద్ధం చేశామని, కరోనాతో ఆస్పత్రిపాలైన కుటుంబాల్లో చిన్నపిల్లలు ఉంటే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 1098, 181 టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. తల్లిదండ్రులు కోలుకునే వరకు పిల్లలను సంరక్షిస్తామని అన్నారు. -
కోవిడ్‌తో అనాథలైన పిల్లల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ: కోవిడ్ కట్టడి కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బారిన పడి ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారి పిల్లలకు ప్రత్యేక సంరక్షణ కేంద్రాల ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. కోవిడ్ బారిన పడి తల్లిదండ్రులు మరణించి అనాథలైన పిల్లలకు ఈ సంరక్షణ కేంద్రాల్లో వసతి కల్పించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి.. వాటికి ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో కోవిడ్ కట్టడి కోసం పగటి పూట కర్ఫ్యూని పటిష్టంగా అమలు చేస్తున్నప్రభుత్వం.. కరోనా పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటుంది. అలానే మహమ్మారి కట్టడి కోసం రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగతున్న సంగతి తెలిసిందే. చదవండి: గ్రామాల్లో సోడియం హైపోక్లోరైట్ పిచికారీ -
'అన్యమతమంటూ దుష్ప్రచారం చేస్తున్నారు'
సాక్షి, విజయవాడ : సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల వికాస కేంద్రం పాఠశాలల ద్వారా బాల, బాలికలకు సంప్రదాయాలు అలవర్చుకునేలా విద్యాబుద్ధులు నేర్పడం శుభపరిణామమని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాల వికాస కేంద్రం పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. బాలవికాస కేంద్రాలు హిందూ ధర్మరక్షణకు దోహదపడుతున్నాయని, దళితులకు సైతం వేద, మంత్ర పఠనం నేర్పిస్తున్నట్లు వెల్లడించారు. అన్యమత ప్రచారం చేస్తున్నామంటూ మాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేవాలయాల నిర్మాణాలకు ఇప్పటివరకు రూ. 5 లక్షలు ప్రభుత్వం వెచ్చిస్తుండగా, ఇప్పుడు దానిని రూ 7 లక్షల నుంచి రూ 10లక్షల వరకు పెంచనున్నట్లు వివరించారు. దళితవాడల్లో, గిరిజన ప్రాంతాల్లో దేవాలయాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటివరకు 500 దేవాలయాలను నిర్మించామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 115 బాల వికాస కేంద్రాలు ఉన్నాయని, వీటి సంఖ్య మరింత పెంచనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. చదువు రాని పెద్దలకు విద్య నేర్పాలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. సంప్రదాయ విలువలు పెంపొందించేలా దార్మిక సదస్సులను ప్రతి నెలా ఒకటి చొప్పున నిర్వహిస్తామని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లాలోని 8 మండలాలకు చెందిన బాల వికాస కేంద్రం పాఠశాల విద్యార్థులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
తల్లీబిడ్డలకు భరోసా!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్, ఆప్తమాలజీ, ఈఎన్టీ, ఆర్థోపెడిక్ సేవలు అందుతున్నాయి. ఈ విభాగాలన్నింటికీ రెండు ఆపరేషన్ థియేటర్లు మాత్రమే ఉన్నాయి. సిజేరియన్లు కూడా ఈ థియేటర్లోనే చేస్తున్నారు. ఇకపై ఈ పరిస్థితి మారనుంది. మాతాశిశు సంరక్షణ కేంద్రం మంజూరుతో.. తల్లీబిడ్డలకు వైద్య సేవల కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ విభాగానికి విడిగా రెండు ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేస్తారు. శుభపరిణామం.. కొండాపూర్‌లోని ఏరియా ఆస్పత్రిని ఇటీవల జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈక్రమంలో వంద నుంచి 250 పడకలకు ఆస్పత్రి సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంది. ఇది ఇంతవరకు అమలు కాలేదు. వంద పడకల్లోనే గైనకాలజీ, పీడియాట్రిక్ విభాగాలకు 25– 30 బెడ్లను వినియోగిస్తున్నారు. మిగిలిన పడకలను ఇతర విభాగాల పేషెంట్లకు కేటాయిస్తున్నారు. గైనిక్, పీడియాట్రిక్ విభాగాలకు ఆ పడకలు ఏమాత్రం చాలడం లేవు. కేసీఆర్ కిట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పటి నుంచి జిల్లా ఆస్పత్రికి గైనిక్ పేషెంట్లు రాక పెరిగింది. నెలకు సగటున 200లకుపైగా సాధారణ కాన్పులు, సిజేరియన్లు జరుగుతున్నాయి. నిత్యం ఓపీ సంఖ్య 250కి తగ్గడం లేదు. రోజు పది మంది ఇన్‌పేషంట్లు డిశ్చార్జ్ అవుతుండగా.. అంతే మొత్తంలో ఇన్ పేషెంట్లుగా చేరుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఆస్పత్రిలో మాతాశిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు కానుండడం శుభపరిణామం. ఫలితంగా విస్తృత స్థాయిలో గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు వైద్య సేవలు అందనున్నాయి. మరిన్ని పోస్టులు మంజూరు పీడియాట్రిక్, గైనిక్ విభాగాల్లో రోగుల తాకిడికి అనుగుణంగా వైద్యులు, సిబ్బంది లేరు. ప్రస్తుతం ఆరుగురు రెగ్యులర్ గైనిక్ వైద్యులు, మరో ఇద్దరు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. అలాగే చిన్నపిల్లల వైద్య నిపుణులు నలుగురు ఉన్నారు. మాతాశిశు సంరక్షణ కేంద్రం రాకతో మరిన్ని పోస్టులు వచ్చే వీలుంది. అదనంగా గైనిక్ వైద్యులు, సిజేరియన్లలో కీలకమైన అనస్థిషియన్, చిన్న పిల్లల వైద్య నిపుణులు నాలుగు చొప్పున మంజూరయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. వీటితోపాటు నర్సు ఇతర పారామెడికల్ పోస్టులు కూడా వచ్చే వీలుందని పేర్కొంటున్నాయి. స్థలం ఎక్కడ? ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి జీ+2 అంతస్తుల్లో కొనసాగుతోంది. ఇదే భవనంపై మరో అంతస్తు నిర్మించి అక్కడ మాతాశిశు సంరక్షణ కేంద్ర ఏర్పాటు చేస్తే బాగుంటుందని జిల్లా ఆస్పత్రి అధికార వర్గాలు భావిస్తున్నాయి. అన్ని రకాల వైద్య సేవలు ఒకే ప్రాంగణంలో లభిస్తాయని, తద్వారా రోగులకు వ్యయప్రయాసాలకు తప్పుతాయని చెబుతున్నారు. అయితే, మాతాశిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు కనీసం అర ఎకరం స్థలం కావాలని వైద్యవిధాన పరిషత్ డైరెక్టరేట్ పేర్కొంటోంది. భూముల ధరలు చుక్కలనంటుతున్న శేరిలింగంపల్లిలో ఆమేరకు భూమి అందుబాటులో లేదని అధికారులు పేర్కొంటున్నారు. స్థలం విషయమై త్వరలో కలెక్టర్‌ను సంప్రదించనున్నట్లు సమాచారం. ఒకవేళ స్థలం లభిస్తే మాతా శిశు సంరక్షణ కేంద్రం భవనాన్ని ప్రత్యేకంగా నిర్మిస్తారు. స్థల లభ్యత లేకుంటే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి భవనంపైనే ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదు. -
ఆడ పిల్ల వద్దమ్మా..
బల్మూర్ (అచ్చంపేట): మగ సంతానం కోసం ఆ తల్లిదండ్రులు నలుగురు పిల్లలను కన్నారు.. అయితే ఐదో కాన్పులోనూ ఆడ శిశువే జన్మించడంతో వదిలించుకోవాలనుకున్నారు. ఈ మేరకు కన్న పేగు బంధాన్ని కూడా కాదనుకుని అంగన్వాడీ టీచర్‌కు సమాచారమిచ్చారు. అంగన్వాడీ సిబ్బంది ఎంత నచ్చచెప్పినా ఆ దంపతులు వినకపోవడంతో చివరకు శిశువును శిశు సంరక్షణ గృహానికి చేర్చారు. వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని బాణాల గ్రామానికి చెందిన రామావత్ దస్లీ–నిరంజన్ దంపతులకు ఇది వరకే నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఇందులో ఓ కూతురు అనారోగ్యంతో కన్నుమూసింది. ఆ తర్వాత మళ్లీ గర్భం దాల్చిన దస్లీ శనివారం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మళ్లీ ఆడ శిశువుకే జన్మనిచ్చింది. దీంతో ఇప్పటికే ఉన్న ముగ్గురు ఆడ పిల్లలకు తోడు ఈ శిశువు భారం మోయలేమని గ్రామ అంగన్వాడీ టీచర్ అనితకు సమాచారం ఇచ్చారు. దీంతో సూపర్వైజర్ విజయలక్ష్మి, ఇతర సిబ్బంది ఆస్పత్రికి చేరుకుని దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చినా వారు వినలేదు. దీంతో శిశువును మహబూబ్‌నగర్‌లోని శిశు సంరక్షణ గృహం అధికారులకు అప్పగించారు. -
కొత్త జిల్లాల్లో చైల్డ్ కేర్ సెంటర్లు
♦ తుమ్మల నాగేశ్వరరావు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలోనూ చైల్డ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం సచివాలయంలో సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ(కారా) సలహా కమిటీ చైర్మన్ రాంచందర్‌రెడ్డి, సంబంధిత అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ప్రైవేటు చైల్డ్ కేర్ సెంటర్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని అధికారులు పేర్కొనగా మంత్రి పైవిధంగా స్పందించారు. కొత్త జిల్లాల్లో చైల్డ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రికి సమర్పించినట్లు వివరించారు. ఒకట్రెండు రోజుల్లో వీటికి ఆమోదం లభిస్తుందన్నారు. నవజాత శిశువుల దత్తత విషయంలో ప్రైవేటు చైల్డ్ కేర్ సెంటర్లు అక్రమాలకు పాల్పడుతున్నాయని, దత్తత ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలోనే నిర్వహించాలని కారా చైర్మన్ రాంచందర్‌రెడ్డి సూచించగా మంత్రి స్పందిస్తూ పూర్తిస్థాయి విచారణ చేపడతామన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు తీసుకుని అర్హులకు మాత్రమే దత్తత ఇస్తున్నామని అన్నారు. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ సలహా కమిటీ తరహాలోనే స్టేట్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీని(సారా) ఏర్పాటు చేస్తామన్నారు.