కొత్త జిల్లాల్లో చైల్డ్ కేర్ సెంటర్లు
♦ తుమ్మల నాగేశ్వరరావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలోనూ చైల్డ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం సచివాలయంలో సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ(కారా) సలహా కమిటీ చైర్మన్ రాంచందర్‌రెడ్డి, సంబంధిత అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ప్రైవేటు చైల్డ్ కేర్ సెంటర్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని అధికారులు పేర్కొనగా మంత్రి పైవిధంగా స్పందించారు.
కొత్త జిల్లాల్లో చైల్డ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రికి సమర్పించినట్లు వివరించారు. ఒకట్రెండు రోజుల్లో వీటికి ఆమోదం లభిస్తుందన్నారు. నవజాత శిశువుల దత్తత విషయంలో ప్రైవేటు చైల్డ్ కేర్ సెంటర్లు అక్రమాలకు పాల్పడుతున్నాయని, దత్తత ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలోనే నిర్వహించాలని కారా చైర్మన్ రాంచందర్‌రెడ్డి సూచించగా మంత్రి స్పందిస్తూ పూర్తిస్థాయి విచారణ చేపడతామన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తులు తీసుకుని అర్హులకు మాత్రమే దత్తత ఇస్తున్నామని అన్నారు. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ సలహా కమిటీ తరహాలోనే స్టేట్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీని(సారా) ఏర్పాటు చేస్తామన్నారు.