సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ నేత, తెలంగాణ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరులతో సుదీర్ఘంగా చర్చల అనంతరం కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ముహూర్తం కూడా ఆయన ఖరారు చేసుకున్నట్లు సమాచారం. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంలోనే ఊహించని ప్రతిపాదన ఒకటి తెరపైకి వచ్చింది.
సెప్టెంబర్ 6వ తేదీన తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో.. కుదరకుంటే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే తన అనుచరులతో వరుస సమావేశాలు పెడుతున్న తుమ్మల.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
ఈ క్రమంలో తుమ్మల పోటీ చేసే నియోజకవర్గంపైనా ఆసక్తికర ప్రచారం ఒకటి వినిపిస్తోంది. ఖమ్మం, పాలేరు ఈ రెండింటిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాల నడుమ.. అనూహ్యాంగా కూకట్ పల్లి(హైదరాబాద్) పేరు తెర మీదకు వచ్చింది. కమ్మ ఓటర్లకు గాలం వేసేందుకు తుమ్మలను కూకట్‌పల్లి నుంచి పోటీ చేయించే యోచన చేస్తోంది కాంగ్రెస్. అయితే ఆ ప్రతిపాదనకు తుమ్మల అంత సుముఖంగా లేనట్లు స్పష్టమవుతోంది. తాను పాలేరు(ఖమ్మం) నుంచే పోటీ చేస్తానని చెప్తున్నారట. దీంతో ఆయన పోటీచేయబోయే నియోజకవర్గ విషయంలో కాంగ్రెస్ ఇంకా మంతనాలు కొనసాగిస్తున్నట్లు భోగట్టా.
బీఆర్‌ఎస్ తరపున పాలేరు టికెట్ దక్కకపోవడంతో.. తీవ్ర అసంతృప్తికి లోనైన తుమ్మల నాగేశ్వరరావు భారీ అనుచరుగణంతో బలప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్రజల కోసమైనా పోటీ చేస్తానని.. తలవంచేది లేదంటూ ప్రకటన సైతం చేశారు. అయితే ఆయన పార్టీ మారతారా?.. ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అనే విషయాలపై మాత్రం ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
ఇదిలా ఉండగా.. పాలేరు నుంచే తుమ్మల పోటీ చేయనున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. దీంతో, కూకట్‌పల్లి నుంచి తుమ్మల పోటీ నిలిచే అవకాశం లేనట్టు తెలుస్తోంది.
బీఆర్‌ఎస్‌కు ఇంకా తుమ్మల రాజీనామా చేయని సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌లో చేరికలపై తుమ్మలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు,రేఖానాయక్‌లు సైతం పీసీసీతో మంతనాలు చేస్తున్నారు.
ఇది చదవండి: సాగర్‌లో కారు లొల్లి
Comments
Please login to add a commentAdd a comment