
'ఆమె నిందితురాలని నేను చెప్పలేదు'
న్యూఢిల్లీ: అగస్టావెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో 101 శాతం రాజకీయ జోక్యం ఉందని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ అన్నారు. ఈ స్కామ్ వెలుగులోకి వచ్చినప్పుడు అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తుకు ఆదేశించే సాహసం చేయలేకపోయారని, ఆయనకు గట్స్ లేవని పేర్కొన్నారు.
ఈ కుంభకోణంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిందితురాలని తాను ఎప్పుడూ అనలేదని స్పష్టం చేశారు. ఆమె పేరును తానేప్పుడు ఈ చర్చలోకి లాగలేదన్నారు. ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పలేదన్నారు. అగస్టావెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో ఎవరు ఉన్నారనేది దర్యాప్తులో తేలుతుందన్నారు. సీబీఐ దర్యాప్తులో తమ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవడం లేదని, కేసు పురోగతి గురించి మాత్రమే అడిగామని పరీకర్ చెప్పారు.