హెలికాప్టర్ల కుంభకోణంలో మీడియా పాత్ర ఎంత?
- అగస్టా వెస్ట్‌లాండ్‌కు అనుకూలంగా మీడియా కథనాలపై పిల్
- విచారణకు సుప్రీంకోర్టు సమ్మతి
న్యూఢిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చాపర్ల కొనుగోలు ఒప్పందంపై వివిధ మీడియా సంస్థలు, జర్నలిస్టులు అనుకూల కథనాలు రాసి లబ్దిపొందారన్న ఆరోపణల నేపథ్యంలో వారిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) దర్యాప్తునకు ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం(పిల్)ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ మేరకు మంగళవారం నిర్ణయాన్ని వెలిబుచ్చిన కోర్టు.. తన ఆదేశాలపై స్పందన తెలియజేయాల్సిందిగా సీబీఐ, ఈడీలను కోరింది.
వీవీఐపీ హెలికాప్టర్ల కోసం భారత రక్షణ శాఖ 2010లో అగస్టా వెంస్ట్‌లాండ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.3,660 కోట్ల విలువైన ఈ ఒప్పందంపై వివిధ పత్రికల్లో అనుకూల కథనాలు రాసిన జర్నలిస్టులకు భారీగా ముడుపులు అందాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. అగస్టా ఒప్పందాన్ని సమర్థిస్తూ వార్తలు రాసిన జర్నలిస్టులకు రూ.50 కోట్ల మేర లంచాలు అందాయని, వారిపైనా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ల వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించి, పిల్ విచారణకు అంగీకారం తెలిపింది. (అగస్టా కుంభకోణంపై సమగ్ర కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి)