ఆ ఇద్దరి బాటలోనే మన గవర్నర్ కూడా?
అంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తన గవర్నర్ పదవి త్వరలో రాజీనామా చేయనున్నారా ? అగస్టా వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలులో చోటు చేసుకున్న పరిణామాలపై గవర్నర్ నరసింహన్ను బుధవారం సీబీఐ గంటన్నర పాటు ప్రశ్నించింది. ఇదే అంశంపై ఇప్పటికే సీబీఐ... బెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్, గోవా గవర్నర్ బి.వి.వాంచూలను ప్రశ్నించింది. సీబీఐ ప్రశ్నించిన కొద్ది రోజులకే నారాయణన్, వాంచూలు వరుసగా తమ పదవులకు రాజీనామా చేశారు.
ఈ నేపథ్యంలో తాజాగా సీబీఐ ... గవర్నర్ నరసింహన్ను ప్రశ్నించడంతో ఆయన కూడా నారాయణన్, వాంచూల బాటలోనే పయనిస్తారని వదంతులు వినవస్తున్నాయి. కేంద్రంలో ప్రభుత్వం మారడంతో రాష్ట్రాల గవర్నర్లు మారతారన్న విషయం విదితమే. అయితే కొందరు గవర్నర్లు తమ పదవికి ఢోకా లేదని భావించారు. అలాంటి వారిలో రోశయ్య, నరసింహన్తోపాటు పలువురు గవర్నర్లు ఆ జాబితాలో ఉన్నారు.
అసలు అగస్టా వెస్ట్ల్యాండ్కు ఈ ముగ్గురు గవర్నర్లనే ఎందుకు ప్రశ్నించింది?
వీవీఐపీల కోసం కేంద్ర ప్రభుత్వం 12 హెలికాప్టర్లు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అందుకోసం టెండర్లు పిలిచింది. ఈ నేపథ్యంలో అగస్టా వెస్ట్ల్యాండ్ టెండర్ దాఖలు చేసింది. అయితే హెలికాప్టర్ ప్రయాణించే ఎత్తుకు సంబంధించి సాంకేతిక అంశాలతో అగస్టా హెలికాప్టర్లుకు పొంతన కుదరదని ప్రభుత్వం భావించింది. ఇదే అంశంపై కేంద్రప్రభుత్వం అప్పటి కేంద్ర భద్రత సలహాదారు ఎం.కె.నారాయణన్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ చీఫ్ బి.వి.వాంచూ, ఇంటిలిజెన్స్ బ్యూరో అధిపతి ఈఎస్ఎల్ నరసింహన్తో కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
2005, మార్చి 1న ఈ కమిటీ సమావేశమై హెలికాప్టర్ సాంకేతిక అంశాలు పరిశీలించింది. వీవీఐపీల కోసం అగస్టా వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్ల సరైనవే నంటూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. దాంతో కేంద్ర ప్రభుత్వం ఆ హెలికాప్టర్లను రూ. 3600 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అగస్టా హెలికాప్టర్ల కొనుగోలులో రూ. 360 కోట్ల మేర అవకతవకలు జరిగాయని దుమారం చెలరేగింది. దాంతో సీబీఐ విచారణ చేపట్టిన అప్పటి వైమానికి దళ చీఫ్ త్యాగీతోపాటు13 మందిపై కేసులు నమోదు చేసింది.
అగస్టా వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కోసం సాంకేతిక అంశాలు నిర్ణయాలపై సాక్షులుగా ఎం.కె.నారాయణన్, వాంచూ, నరసింహన్లను సీబీఐ ప్రశ్నించింది. బెంగాలు, గోవా రాష్ట్రాల గవర్నర్లు నారాయణన్, వాంచూలును నియమించిన ప్రభుత్వం అధికారం కోల్పోవడం వల్ల రాజీనామా చేశారని రాజకీయ పండితుల చెబుతున్నారు. అయితే గవర్నర్ నరసింహన్ మరి కొంత కాలం గవర్నర్గా కొనసాగే అవకాశాలు లేకపోలేదని వారు వెల్లడిస్తున్నారు.