నరసింహన్ను ప్రశ్నించనున్న సీబీఐ
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్లాండ్ ఒప్పందం కేసులో సీబీఐ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను త్వరలో ప్రశ్నించనుంది. సీబీఐ అధికారులు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కేసులో సీబీఐ ప్రశ్నించనున్న మూడో గవర్నర్ నరసింహన్.
ఇదే కేసులో సీబీఐ ఇంతకుమందు పశ్చిమబెంగాల్, గోవా గవర్నర్లు నారాయణన్, వాంచూను ప్రశ్నించారు. ఆ తర్వాత వీరిద్దరూ పదవులకు రాజీనామా చేశారు. 3,726 కోట్ల రూపాయిల హెలీకాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగినట్టు ఆరోపణలు రావడంతో సీబీఐ విచారణకు ఆదేశించారు. ఒప్పందం సమయంలో నారాయణన్ జాతీయ భద్రత సలహాదారుగా, వాంచూ స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్ ఛీప్గా, నరసింహన్ ఇంటలిజెన్ప్ బ్యూరో చీఫ్గా ఉన్నారు. 2005లో జరిగిన సమావేశానికి ఈ ముగ్గురు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నరసింహన్ వాంగూల్మం కీలకంకానున్నట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆయనను సాక్షిగా ప్రశ్నించనున్నారు.