
సునామీని ఇలా ఆపొచ్చు!
లండన్: విధ్వంసకరమైన సునామీలను తీరప్రాంతాన్ని తాకకముందే ధ్వని గురుత్వాకర్షణ తరంగాల (ఏజీడబ్ల్యూ) సహాయంతో నిలువరించవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. సునామీ సంభవించినప్పుడు నీటిలోని ధ్వని తరంగాలను ఏజీడబ్ల్యూల ద్వారా అదుపుచేయవచ్చని అమెరికాలోని కార్డిఫ్ యూనివర్సిటీకి చెందిన ఉసామా కాద్రి చెప్పారు. దీంతో సునామీని తీరప్రాంతాన్ని తాకకముందే అదుపుచేయవచ్చని ఆయన వివరించారు.
ఈ ఏజీడబ్ల్యూ తరంగాలు సముద్రం లోపలికి వెళ్లగలవని, ఉపరితలం కింద వేల మీటర్ల వరకు ప్రయాణించగలవని చెప్పారు. వీటితో సునామీల తీవ్రత, వ్యాప్తిని తగ్గించవచ్చని, అంతేకాకుండా ఆ సమయంలో ఉబికివచ్చే అలల ఎత్తును కూడా తగ్గించేలా చేయవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. సునామీ తీరప్రాంతాన్ని తాకే లోపు దాని ఎత్తను తగ్గించగలిగినట్లయితే పర్యావరణానికి, పౌరులకు జరిగే నష్టాన్ని తగ్గించవచ్చని కాద్రి పేర్కొన్నారు. ఈ ఏజీడబ్ల్యూ తరంగాలను సునామీ వచ్చినపుడు వచ్చే తరంగాలపై నిరంతరం ప్రయోగించడం ద్వారా సునామీని పూర్తి స్థాయిలో అదుపుచేయవచ్చని ఆయన వివరించారు.