20 Years of Tsunami: రాకాసి అలలను దాటి.. విషసర్పాల కారడవిలో శిశువుకు జన్మనిచ్చి.. | Gave Birth to a Son in a Forest Full of Snakes Named him Tsunami Namita hasnt Forgotten her Pain | Sakshi
Sakshi News home page

20 Years of Tsunami: రాకాసి అలలను దాటి.. విషసర్పాల కారడవిలో శిశువుకు జన్మనిచ్చి..

Published Thu, Dec 26 2024 12:06 PM | Last Updated on Thu, Dec 26 2024 12:06 PM

Gave Birth to a Son in a Forest Full of Snakes Named him Tsunami Namita hasnt Forgotten her Pain

సరిగ్గా 20 ఏళ్ల క్రితం తమిళనాడు తీరంలో సముద్రపు రాకాసి అలలు సృష్టించిన బీభత్సాన్ని నేటికీ  ఎవరూ మరచిపోలేరు. 2004 డిసెంబర్ 26న ఏకంగా 6,605 మందిని బలిగొన్న సునామీ మిగిల్చిన విషాదం ఇప్పటికీ స్థానికులను వెంటాడుతూనే ఉంది. నాటి సునామీ బాధితులలో నమితా రాయ్‌ ఒకరు. ఆనాడు ఆమెకు అనూహ్య అనుభవం ఎదురయ్యింది. దానిని తలచుకున్నప్పుడల్లా ఆమె నిలువెల్లా వణికిపోతుంటుంది.

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో ఉంటున్న నమితా రాయ్ నాటి సునామీ అనుభవాలను మీడియాకు తెలిపారు. అవి ఆమె మాటల్లోనే.. ‘2004లో నేను కుటుంబంతోపాటు అండమాన్, నికోబార్‌లోని హాట్‌బే ద్వీపంలో  ఉండేవాళ్లం. ఆ సమయంలో నేను గర్భవతిని. ఆ రోజు నేను రోజువారీ పనుల్లో బిజీగా ఉన్నాను. అకస్మాత్తుగా హట్ బే ద్వీపం దిశగా సముద్రపు అలలు ఎగసిపడుతూ వచ్చాయి. వాటిని చూసిన వారంతా పెద్దగా కేకలు పెడుతూ, కొండపైకి పరుగులు తీశారు. దీనిని చూసిన నేను భయంతో స్పృహ కోల్పోయాను.

నేను తేరుకుని కళ్లు తెరచి చూసేసరికి దట్టమైన అడవిలో ఉన్నాను. నా చుట్టూ చాలామంది ఉన్నారు. అంతకుముందు అపస్మారక స్థితిలో ఉన్న నన్ను నా భర్త, పెద్ద కుమారుడు ఇక్కడికి తీసుకువచ్చారు. భీకరమైన అలల తాకిడికి హాట్‌బే ద్వీపమంతా ధ్వంసమయ్యిందని చెప్పారు. ఆ మాట వినగానే షాక్‌కు గురయ్యాను. ఆరోజు రాత్రి 11.49 గంటల సమయంలో నాకు అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. దగ్గర్లో డాక్టర్లెవరూ లేరు.

పురిటి నొప్పులతో బాధపడుతూ మెలికలు తిరిగిపోయాను. దీనిని గమనించిన నా భర్త నన్ను ఒక చదునైన బండరాయిపై పడుకోబెట్టారు. సహాయం కోసం వైద్యులకు కాల్ చేశారు. ఎంత ‍ప్రయత్నించినా  వైద్య సహాయం అందలేదు. వెంటనే నా భర్త.. నేను పడుతున్న పురిటినొప్పల గురించి అక్కడున్న మహిళలకు చెప్పి,సాయం అర్థించారు. వెంటనే వారు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో నాకు పురుడు పోశారు. అంతటి విపత్కర సునామీ పరిస్థితుల మధ్య నేను నా కుమారునికి జన్మనిచ్చాను. ఆ ఆడవిలో లెక్కకు మించిన విష సర్పాలు ఉంటాయి. వాటి మధ్యనే నేను పురుడు పోసుకున్నాను. నా కుమారునికి ‘సునామీ’ అని పేరు పెట్టుకున్నాను.

అయితే అధిక రక్తస్రావం కారణంగా నా ఆరోగ్య పరిస్థితి దిగజారింది. అతికష్టం మీద నా బిడ్డకు పాలు తాగించాను. అయితే అంతకుమందు నేను ఏమీ తినకపోవడంతో నా పిల్లాడికి కావాల్సినంత పాలు ఇవ్వలేకపోయాను. దీనిని గమనించిన చుట్టుపక్కల మహిళలు నా కుమారుని చేత కొబ్బరి నీళ్లు తాగించారు. అటువంటి దుర్భర పరిస్థితుల్లో అదే ప్రాంతంలో మేము నాలుగు రోజులు ఉండాల్సి వచ్చింది. తరువాత రక్షణ సిబ్బంది అక్కడికి వచ్చి మమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అక్కడి నుంచి నన్ను వైద్య చికిత్స కోసం పోర్ట్ బ్లెయిర్‌లోని జీబీ పంత్ ఆసుపత్రికి ఓడలో తీసుకెళ్లారు.

కోవిడ్ -19 మహమ్మారి సమయంలో నా భర్త లక్ష్మీనారాయణ కన్నుమూశారు. ప్రస్తుతం నేను నా కుమారులు సౌరభ్, సునామీలతో పాటు హుగ్లీలో ఉంటున్నాను. పెద్ద కొడుకు సౌరభ్ ఒక ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రెండవవాడు సునామీ భవిష్యత్‌లో సముద్ర శాస్త్రవేత్త కావాలని అనుకుంటున్నాడు’ అని నమితా రాయ్ తెలిపారు.

అనంతరం ఆమె కుమారుడు సునామీ మీడియాతో మాట్లాడుతూ ‘మా అ‍మ్మే నాకు సర్వస​ం. మా నాన్నగారు మరణించాక అమ్మ మమ్మల్ని పెంచిపెద్ద చేసేందుకు ఎంతో శ్రమించింది. సునామీ కిచెన్‌ను నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకువచ్చింది. భవిష్యత్‌లో నేను సముద్ర శాస్త్రవేత్త కావాలనుకుంటున్నాను’ అని తెలిపారు.

ఇది  కూడా చదవండి: Veer Bal Diwas: మొఘలులను ఎదిరించిన ఆ చిన్నారుల బలిదానానికి గుర్తుగా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement