కవల శిశువుల జననం గురించి మనం వినేవుంటాం. ఒకే కాన్పులో ఇద్దరో లేదా ముగ్గురో పుట్టడాన్ని కూడా చూసేవుంటాం. అయితే ఒకే కాన్పులో ఏకంగా ఐదుగురు శిశువులు జన్మంచడాన్ని అంతగా చూసి ఉండం. వినివుండం. బీహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలో 20 ఏళ్ల మహిళ ఏకకాలంలో ఐదుగురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది.
ఈ ఉదంతం చర్చనీయాంశంగా మారింది. శిశువులంతా ఒక కిలో లోపు బరువుతో ఉన్నారు. తల్లి, శిశువులంతా ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. ఆ మహిళకు పురుడు పోసిన డాక్టర్ ఫర్జానా మాట్లాడుతూ ఈ కేసు తనకు చాలెంజింగ్‌గా అనిపించిందని, ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయని తెలిపారు. కాగా ఆ మహిళకు సాధారణ ప్రసవం ద్వారా శిశువులంతా జన్మించడం విశేషం.
కిషన్‌గంజ్ జిల్లాలోని కనక్‌పూర్ పంచాయతీ పరిధిలోని జల్మిలిక్ గ్రామానికి చెందిన తాహిరా బేగం (20) గర్భం దాల్చినప్పటి నుంచి ఓ ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లో చికిత్స అందుకుంటోంది. ఈ నేపధ్యంలో ఆమె కడుపులో ఐదుగురు కవలలు ఉన్నారని స్కానింగ్‌లో వెల్లడయ్యింది. దీంతో ఆమె భయపడిపోయింది. అయితే డాక్టర్ ఫర్జానా ఆమెకు ధైర్యం చెప్పారు. తరువాత ఆమెకు తొమ్మిది నెలల పాటు రెగ్యులర్ చెకప్ కొనసాగింది. శనివారం ఆమె ఐదురుగు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. తాహిరా ఇప్పుడు రెండోసారి తల్లి అయ్యింది. ఆమెకు ఇప్పటికే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఆమె ఆరుగురు పిల్లలకు తల్లిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment