లోకంలోని ప్రతీ చిన్నారి తన తల్లిదండ్రుల అండ కోరుకుంటుంది. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన బాలల జీవితంలో ఎప్పుడూ శూన్యం తాండవమాడుతుంటుంది. అట్లాంటాకు చెందిన టిఫనీ జీవితంలో కూడా అటువంటి శూన్యతే ఏర్పడింది. ఆమె తన నాలుగేళ్ల వయసులోనే క్యాన్సర్ కారణంగా తండ్రిని కోల్పోయింది. ఆమె తల్లి ఇదే విషయాన్ని ఆమెకు తరచూ చెప్పేది. అయితే ఆమెకు చాలాకాలానికి తండ్రి గురించిన నిజం తెలియడంతో నివ్వెరపోయింది.
మిర్రర్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం జార్జియాలోని అట్లాంటాలో ఉంటున్న టిఫనీ గార్డనర్ తన నిజమైన తండ్రిని మిస్సయ్యింది. ఆమెకు నాలుగేళ్లు ఉన్నప్పుడు తండ్రి క్యాన్సర్‌తో మరణించాడని ఆమె తల్లి చెప్పింది. తరువాత ఆమె తల్లి మరో పెళ్లి చేసుకుంది. టిఫనీ తన సవతి తండ్రికి దగ్గరయ్యింది. అయితే తన అసలు తండ్రిని మిస్సయ్యాననే బాధ ఆమెను నిరంతరం వెంటాడుతూ వచ్చింది.
2018లో టిఫనీ 36వ పుట్టినరోజున తల్లి ఆమెకు ఒక చేదు నిజాన్ని చెప్పింది. టిఫనీ ఇన్నాళ్లూ ఎవరినైతే తన అసలు తండ్రిగా భావించిందో, అతను తనకు నిజమైన తండ్రి కాడని ఆమె తెలుసుకుంది. తన తల్లి మొదటి భర్త తన అసలు తండ్రి కాడని ఆమె గ్రహించింది. అంతే ఆమెకు కాళ్ల కింద భూమి కంపించినట్లు అనిపించింది.
తాను స్పెర్మ్ డొనేషన్ ద్వారా జన్మించానని, తన తల్లి ఎవరినుంచో స్పెర్మ్ తీసుకొని తనకు జన్మనిచ్చిందని టిఫనీకి అర్థం అయ్యింది. టిఫనీ తల్లి మొదటి భర్త.. టిఫనీని సొంత కూతురులా చూసుకున్నాడు. టిఫనీ జన్మ రహస్యం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. టిఫనీ 1982లో జన్మించింది. ఇటీవల టిఫనీ డీఎన్‌ఏ పరీక్ష చేయించుకుంది. దీంతో నిజమైన తండ్రి ఎవరో వెల్లడయ్యింది. అతను సజీవంగా ఉన్నాడనే సత్యం కూడా ఆమెకు తెలిసింది.
అయితే టిఫనీ తొలుత అతనిని కలవాలని అనుకున్నా, ఆమె ఇంటిలోనివారి ఒత్తిడి మేరకు అతనిని కలుసుకోలేదు. ఇదేవిధంగా ఆమె అసలు తండ్రి కుటుంబ సభ్యులు కూడా టిఫనీని కలుసుకోవద్దని కోరారు. దీంతో వీరి మధ్య పరిచయాలు అంతటితోనే ఆగిపోయాయి. ప్రస్తుతం టిఫనీకి 41 ఏళ్లు. 17 ఏళ్ల క్రితం టిఫనీకి వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులున్నారు. స్పెర్మ్ డోనర్ గుర్తింపును ఇకపై దాచకూడదంటూ ఆమె అమెరికా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment