
స్వామి కాదు సైకో!
పనాజీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంతో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి సంబంధాలు ఉన్నాయంటూ తనదైన శైలిలో విరుచుకుపడుతున్న బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామిపై గోవా హస్తం నాయకుడు ఒకరు భగ్గుమన్నారు. స్వామి ఒక సైకో అని విమర్శించారు. గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు లుజిన్హో ఫలీరో మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణానికి సంబంధించిన ఘటనల క్రమాన్ని వివరించారు.
ఈ సందర్భంగా పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తిన సుబ్రహ్మణ్యస్వామిని ఉద్దేశించి 'ఆయన రాజ్యసభలో ఓ సైకిక్ వ్యక్తి (మానసికంగా అతిశయోక్తులు చెప్పే వ్యక్తి)' అని మండిపడ్డారు. కాంగ్రెస్ అధినాయకత్వమైన రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏకే ఆంతోనీని ఈ కుంభకోణంలోకి లాగేందుకే బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని దుయ్యబట్టారు.
గోవా బిడ్డ పారికర్!
అదే సమయంలో కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌ను తప్పుబట్టడానికి ఫలీరో ఒప్పుకోలేదు. 'పారికర్ గోవా బిడ్డ. ఆయనతో నేను పోరాడాలని మీరు కోరుకోవచ్చు కానీ, కానీ నేను పోరాడను' అని పేర్కొన్నారు. పారికర్ పట్ల వ్యక్తిగతంగా తనకు ఎలాంటి ద్వేషం లేదని, సిద్ధాంతాలపరంగానే ఆయనతో విభేదాలు ఉన్నాయని చెప్పారు.