
'దోషిగా తేలితే సోనియాను అరెస్ట్ చేయండి'
పట్నా: అగస్టా వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్ల వ్యవహారంలో బిహార్‌లో కాంగ్రెస్ మిత్రపక్షం జేడీ(యూ) ఎట్టకేలకు నోరు విప్పింది. ఈ కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దోషిగా తేలితే కచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. జేడీ(యూ) వ్యాఖ్యలతో బీహార్ ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఇరుకునపడింది.
మోదీ ప్రభుత్వం ఎందుకు ఈ కేసు వ్యవహారంలో జాప్యం చేస్తుందని జేడీ(యూ) అధికారప్రతినిధి అజయ్ అలోక్ మండిపడ్డారు. మాజీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎస్‌పీ త్యాగిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన ధ్వజమెత్తారు. ఈ మొత్తం వ్యవహారంలో త్యాగి, కేంద్రప్రభుత్వానికి మధ్య లోపాయికారి ఒప్పందాలు జరిగిఉండొచ్చని అజయ్ ఆరోపించారు.
'అగస్టా వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించండి. సోనియా గాంధీకి ఈ కుంభకోణంలో ప్రమేయమున్నట్టు తేలితే తప్పకుండా ఆమెను కేంద్రం అరెస్ట్ చేయాలి. ఇలా చేయకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు' అంటూ అజయ్ వ్యాఖ్యానించారు.
2010లో అగస్టా హెలికాప్టర్లను యూపీఏ ప్రభుత్వం ఆర్డర్ చేసిన విషయం తెలిసిందే. వీటి కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయని తెలియడంతో 2013లో ఈ ఆర్డర్ను యూపీఏ రద్దు చేసింది. అటుపక్క ఇటలీలో కూడా ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. లంచాలు ఇచ్చేందుకు ప్రయత్నించారని అగస్టాపై నేరారోపణలు వచ్చాయి.