
విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి గాంధీ
► 18 ప్రతిపక్షాలూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి: సోనియా
► ఇకపై నెలకోసారి భేటీ
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ మన వడు, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాల కృష్ణ గాంధీని తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా 18 ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా ప్రకటించాయి. సమావేశంలో ఒకేఒక్క పేరు చర్చకు వచ్చిం దని, జేడీయూ సహా అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు 71 ఏళ్ల గోపాల కృష్ణకు ఏక గ్రీవంగా మద్దతు తెలిపారని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మంగళ వారం చెప్పారు. సమావేశం అనంతరం గులాంనబీ ఆజాద్ (కాంగ్రెస్), సీతారాం ఏచూరి(సీపీఎం), డెరెక్ ఓబ్రెయిన్ (తృణమూల్) గోపాలకృష్ణకు ఫోన్ చేశారని, తమ అభ్యర్థిగా ఉండటానికి ఆయన అంగీకరించారని సోనియా తెలిపారు.
‘ఉప రాష్ట్రపతి పదవికి గోపాలకృష్ణను మించిన అభ్యర్థి మరొకరు లేరు. ఆయన ఎన్నిక ఏక గ్రీవమవుతుందని భావిస్తున్నాం’ అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తనను అభ్యర్థిగా ఎన్నుకున్న 18 విపక్ష పార్టీల ఐకమత్యాన్ని గోపాలకృష్ణ గాంధీ కొనియాడారు. ఈ ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని సీరియస్‌గా తీసుకుని పోటీకి దిగుతున్నట్లు ఆయన స్పష్టంచేశారు.
యాత్రికులపై ఉగ్రదాడికి ఖండన...
సమావేశంలో అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ప్రతిపక్ష పార్టీలు తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఇది మానవత్వం, భారత భిన్నత్వంలో ఏకత్వంపై దాడని పేర్కొన్నాయి. ఈనెల 17న ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఆర్‌జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌పై దాడులు, నేషనల్ హెరాల్డ్ తదితర కేసులపై చర్చించారు. వివిధ సమస్యలపై ప్రభు త్వంపై పోరాడటానికి నెలకోసారి ఇలా పార్టీ లన్నీ కలవాలని నిర్ణయించినట్టు ఓబ్రెయిన్ చెప్పారు.