'ఇమేజ్ కాపాడుకునే కట్టుకథ అది'
తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మరోసారి విమర్శల దాడి పెంచారు. అగస్టా వెస్ట్ లాండ్ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టామని, దానిని ఎన్డీయే ప్రభుత్వం ఎత్తివేసి తిరిగి ఆహ్వానిస్తుందని కాంగ్రెస్ చెప్పిన మాటలన్నీ కేవలం కట్టుకథ అన్నారు. సొంత ఇమేజ్ ను కాపాడుకునేందుకు చేసుకునే ఒక ప్రయత్నం మాత్రమేనని చెప్పారు. చాపర్ల కొనుగోలులో అవకతవకలు జరిగినట్లు తెలిసిన వెంటనే తాము అగస్టా వెస్ట్ ల్యాండ్ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో చేర్చామని రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ చెప్పిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అరుణ్ జైట్లీ ఆయన మాటలు తప్పుబట్టారు. మే 16న కేరళలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్డీయే విజన్ విడుదల కోసం వెళ్లిన ఆయన అక్కడ మాట్లాడారు. అగస్టా ఒప్పందం లంఛం తీసుకొని చేసిన చర్య అని ఆరోపించారు. లంఛాలు ఇచ్చారన్న విషయం ఇప్పటికే స్పష్టమైందని, అయితే అది ఎవరికి అందిందన్నది తేల్చడమే తమ ఉద్దేశం అని చెప్పారు. ఈ ఒప్పందాన్ని ప్రభావితం చేసిన వారే లంఛం తీసుకుని ఉంటారు తప్ప కొత్తవారికి అది ముట్టే అవకాశం లేదని అన్నారు.