
అందరూ మహిళలే జరుపుకొనే వేడుక ఇది. అత్యధిక సంఖ్యలో మహిళలు ఒకేచోట చేరి జరుపుకొనే కార్యక్రమంగా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన అరుదైన వేడుక ఇది. ఈ వేడుకలో పాల్గొనడానికి పురుషులకు అనుమతి ఉండదు. తరతరాలుగా సాగుతున్న ఈ వేడుక కేరళ రాజధాని తిరువనంతపురం చేరువలోని అట్టుకల్ గ్రామంలో వెలసిన భగవతి అమ్మవారి ఆలయంలో జరుగుతుంది. ఏటా పదకొండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో లక్షలాది మంది మహిళలు పాల్గొంటారు.
తిరువనంతపురం జిల్లా అట్టుకల్ గ్రామంలోని భగవతి అమ్మవారి ఆలయం చాలా పురాతనమైనది. అట్టుకల్ గ్రామంలో వెలసినందున ఈ అమ్మవారు ‘అట్టుకల్ భగవతి’గా ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాది మార్చి 5 నుంచి 15 వరకు ఈ ఆలయంలో అట్టుకల్ భగవతి అమ్మవారి వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల తొమ్మిదో రోజున లక్షలాది మంది మహిళలు ఇక్కడకు చేరుకుని, అమ్మవారికి పొంగలి నైవేద్యం సమర్పిస్తారు. ఈ కార్యక్రమాన్ని ‘అట్టుకల్ పొంగల్’ వేడుకగా పిలుస్తారు.
తొమ్మిదో రోజున తిరువనంతపురం నగరంలోని అన్ని రహదారులూ అట్టుకల్ భగవతి అమ్మవారి ఆలయానికి వెళ్లే మహిళలతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి. ఈ వేడుకల్లో పాల్గొనడానికి కేరళ నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన మలయాళీ మహిళలు పెద్దసంఖ్యలో ఇక్కడకు చేరుకుంటారు.
ఇక్కడకు వచ్చే మహిళలు ఆలయ ప్రాంగణంలోను, ఆలయ పరిసరాల్లోని వీథుల్లోను ఇటుకలతో కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసుకుని, వాటి మీద పొంగలి, చక్కెరపొంగలి వండుతారు. ఆలయ ప్రధాన అర్చకుడు నిర్ణయించిన ముహూర్తానికి అందరూ ఒకేసారి పొయ్యిలు వెలిగించి వంట మొదలుపెడతారు. ముహూర్త సమయం ఆసన్నం కాగానే, అర్చకుడు గంట మోగిస్తాడు. అయితే, మహిళలు పొంగలి వండుతున్న ప్రదేశంలోకి ఆలయ అర్చకులు కూడా అడుగు పెట్టరు.
ఈ వేడుకలో భాగంగా మహిళలందరూ తిరువనంతపురంలోని మనకాడు ప్రాంతంలో ఉండే శ్రీధర్మ శాస్త ఆలయం వరకు భారీ ఊరేగింపు జరుపుతారు. మొదటి రోజున ‘కప్పుకెట్టు’ కార్యక్రమంతో ఈ వేడుక మొదలవుతుంది. ఇందులో భాగంగా ‘కణ్ణగి చరిత’ను గానం చేస్తారు. ‘కణ్ణగి చరిత’గానం వరుసగా తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. చివరి రోజున ‘కురుత్తి తర్పణం’ పేరుతో తర్పణాలు విడిచిపెట్టడంతో ఈ వేడుకలు ముగుస్తాయి.
వేడుక కొనసాగినన్ని రోజులూ అట్టుకల్ భగవతి అమ్మవారి ఆలయానికి చేరుకునే వీథులన్నీ రంగురంగుల అలంకరణలతో కనువిందు చేస్తాయి. ఈ వేడుకల సందర్భంగా వీథుల్లో ఏర్పాటు చేసే బహిరంగ వేదికలపై సంప్రదాయ నృత్య సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
అట్టుకల్ పొంగల్ వేడుకలలో 1997 సంవత్సరంలో 15 లక్షల మందికి పైగా మహిళలు పాల్గొనడంతో తొలిసారి గిన్నిస్‌బుక్ రికార్డుల్లో నమోదైంది. ఆ తర్వాత 2009లో 25 లక్షలకు పైగా మహిళలు పాల్గొనడంతో మరోసారి గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కింది. ఈ వేడుక ప్రశాంతంగా జరగడానికి వీలుగా కేరళ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తుంది.
(చదవండి: అంచనాలు నెరవేరకపోయినా..బంధం స్ట్రాంగ్‌గానే ఉండాలి..!)
Comments
Please login to add a commentAdd a comment