ఈ ప్రశ్నలకు బదులు లేదంటే రా‘ఫేల్‌’! | Rafale Deal Row : Modi Govt Must Answer These Questions | Sakshi
Sakshi News home page

ఈ ప్రశ్నలకు బదులు లేదంటే రా‘ఫేల్‌’!

Published Wed, Oct 3 2018 5:53 PM | Last Updated on Wed, Oct 17 2018 5:55 PM

Rafale Deal Row : Modi Govt Must Answer These Questions - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుతం 60 వేల కోట్ల రూపాయలకు మించిపోయిన రాఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందంపై కొనసాగుతున్న రగడకు సంబంధించి ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సమాధానానికి ఎక్కడ ఇసుమంత కూడా సంబంధం ఉండడం లేదు. ఈ విషయంలో ప్రజలకు స్పష్టత రావాలంటే కొన్ని ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా సమాధానం ఇవ్వాల్సిందే. 

మొదటి ప్రశ్న : ఈ రాఫెల్‌ యుద్ద విమానాల ఒప్పందం గురించి అప్పటి కేంద్ర రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌కు తెలుసా? తెలిస్తే ఆయన ఎందుకు క్యాబినెట్‌ సమావేశంలో ఇంత పెద్ద ఒప్పందం గురించి చర్చించలేదు ? చర్చించినట్లయితే ‘మినిట్స్‌’ ఉంటాయి గదా! ఎందుకు లేవు ? ప్రధాని నరేంద్ర మోదీ పారిస్‌ వెళ్లి ఒప్పందం చేసుకున్నప్పుడు ఆయన వెంట పారికర్‌ ఎందుకు వెళ్లలేదు?

2015, ఏప్రిల్‌ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ పారిస్‌ వెళ్లి అప్పటి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్‌ హొలాండేతో చర్చలు జరిపారు. 126 రాఫెల్‌ యుద్ధ విమానాలకు గాను 36 యుద్ద విమానాల సరఫరాకు ఫ్రాన్స్‌తో అవగాహన ఒప్పందం కుదిరినట్లు ఆదే ఏడాది ఏప్రిల్‌ 10వ తేదీన మోదీ ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు ఒప్పందానికి సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇక రాఫెల్‌ యుద్ధ విమానాలను తయారు చేస్తున్న డసౌ కంపెనీకి భారతీయ భాగస్వామి కంపెనీగా ఎంపికయిన అనిల్‌ అంబానీ నాయకత్వంలో రిలయెన్స్‌ గ్రూపు ‘రిలయెన్స్‌ డిఫెన్స్‌ ఫిక్సిడ్‌ వింగ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌’ సంస్థ మోదీ పర్యటనకు కేవలం 12 రోజుల ముందే 2015, మార్చి నెలలో ఏర్పాటయింది.
 
అనిల్‌ అంబానీ గ్రూప్‌ 2015, జూన్‌ నెలలో మహారాష్ట్ర ప్రభుత్వానికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చింది. నాగపూర్‌లో ఇంటర్నేషనల్‌ కార్గో హబ్, ఎయిర్‌ పోర్ట్‌ సెజ్‌ నుంచి 289 ఎకరాల స్థలాన్ని కోరింది. అదే సంవత్సరం ఆగస్టు 28వ తేదీన ఆ మేరకు స్థలాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం అనిల్‌ అంబానీ గ్రూప్‌ సంస్థకు అప్పగించింది. 2016లో భారత్, ఫ్రాన్స్‌ మధ్య రాఫెల్‌ యుద్ధ విమానాల తుది ఒప్పందం కుదిరింది. ఆ తర్వాతనే అనిల్‌ అంబానీ రిలయెన్స్‌ పేరు బయటకు వచ్చింది. 

2017, అక్టోబర్‌ 27వ తేదీన నాగపూర్‌లో ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్‌ పార్లీతో అనిల్‌ అంబానీ. పక్కన డసౌ ఏవియేషన్‌ సీఈవో ఎరిక్‌ ట్రాపియర్‌....

నాగపూర్‌లో 2017, అక్టోబర్‌ 27వ తేదీన ‘డసౌ రిలయెన్స్‌ ఎయిరోస్పేస్‌ లిమిటెడ్‌’ పేరిట సంయుక్త ప్లాంట్‌కు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి గడ్కారీ, డసౌ సీఈవో ఎరిక్‌ ట్రాపియర్, ఫ్రెంచ్‌ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్‌ పార్లీ, అనిల్‌ అంబానీ హాజరయ్యారు. అయినా డసౌ భాగస్వామ్య కంపెనీ రిలయెన్స్‌ కంపెనీ అని తనకు తెలియదని మనోహర్‌ పారికర్‌ స్థానంలో సెప్టెంబర్‌లోనే కేంద్ర రక్షణ మంత్రి బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్‌ పలు సార్లు పదే పదే చెప్పడం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం. 2016, జూన్‌ నెలలో అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ పార్లమెంట్‌లో ఓ ప్రకటన చేస్తూ రాఫెల్‌ యుద్ధ విమానాల గురించి తనకు తెలయదనే చెప్పారు.

పవర్‌ఫుల్‌ ప్రధాని ఉన్నప్పుడు కేబినెట్‌ డమ్మీగా ఉండడం సహజమేగానీ, ఏకంగా 60 వేల కోట్ల రూపాయలకుపైగా విలువైన రక్షణ ఒప్పందం గురించి రక్షణ మంత్రికి చెప్పకుండా ఓ ప్రధాని ఒప్పందం చేసుకుంటారా? అన్నది రెండో ప్రశ్న. ఒప్పందం గురించి తనకు తెలియదన్నట్లుగా మాట్లాడినందుకే పారికర్‌ను మూడు నెలల్లోనే ఆ శాఖ నుంచి తప్పించారా? అనారోగ్య కారణాలే కారణమా?

2018, ఫిబ్రవరి నెలలో నిర్మలా సీతారామన్‌ రాజ్యసభలో మాట్లాడుతూ రాఫెల్‌ ఒప్పందం విలువను వెల్లడించకపోవడానికి కారణం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలంటూ నాడు ఫ్రాన్స్, భారత్‌తో ఒప్పందం చేసుకోవడమేనని తెలిపారు. ఇందులో ఏ మాత్రమైన నిజముందా? భారత్‌కు సంబంధించిన భారీ మొత్తాన్ని ఖర్చు పెడుతున్నప్పుడు భారతీయులకు జవాబుదారీగా ఉండాల్సిన భారత ప్రభుత్వం ఇలాంటి ఒప్పందానికి లొంగడం అంటే ఎంత అర్థరహితం. ఫ్రాన్స్‌కు చెందిన డసౌ ఏవియేషన్స్‌ కంపెనీ ప్రభుత్వ లిమిటెడ్‌ కంపెనీ, అలాంటప్పుడు రహస్య ఒప్పందాలకు ఆస్కారం ఉండదు. భారత్‌కు 36 రాఫెల్‌ యుద్ధ విమానాలను సరఫరా చేయడానికి 8.139 బిలియన్‌ యూరోల విలువైన రక్షణ ఒప్పందం చేసుకున్నట్లు 2016 బ్యాలెన్స్‌ షీట్‌లో ఆ కంపెనీ పేర్కొంది. ఒప్పందం విలువలో రహస్యమేమి లేదని, 36 విమానాల్లోని ఫీచర్స్‌ ఏమీటన్నదే రహస్యమని ఫ్రాన్స్‌ అధ్యక్షుడే ఆ తర్వాత వివరణ ఇవ్వడం ఇక్కడ గమనార్హం. నేటి రూపాయి విలువతో పోలిస్తే నాటి బిలియన్‌ యూరోల ఒప్పందం అక్షరాల 69 వేల కోట్ల రూపాయలు. 

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌కు అనుభవం లేదా?
రాఫెల్‌ యుద్ధ విమానాలకు సంబంధించి యూపీఏ ప్రభుత్వం చర్చలు జరిపినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థయిన ‘హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)’ కంపెనీ డసౌ భాగస్వామ్య కంపెనీగా ఉండాలని ప్రతిపాదించారు. ఆ కంపెనీని కాదని అనిల్‌ అంబానీ కంపెనీని తీసుకరావడానికి కారణం ఏమిటంటే హెచ్‌ఏఎల్‌కు అంత అనుభవం లేకపోవడమేనని నిర్మలా సీతారామన్‌ వివరణ ఇచ్చారు. 

అనుభవాలిదుగో!
అంతకుముందు సోవియట్, ఆ తర్వాత రష్యా నుంచి మిగ్, సుఖోయ్‌ రేంజ్‌ యుద్ధ విమానాల ఒప్పందంలోనూ, ఆ తర్వాత బ్రిటన్, ఫ్రెంచ్‌ జెట్‌ యుద్ధ విమానాల ఒప్పందంలోనూ, ఫొలాంగ్‌ గ్నాట్‌ నుంచి ఆంగ్లో-ఫ్రెంచ్‌ విమానాల ఒప్పందాల వరకు క్రియాశీలక భాగస్వామ్య కంపెనీగా ఉన్నది హెచ్‌ఏఎల్‌యే. అంతెందుకు ‘ఫ్రెంచ్‌ మిరేజ్‌-2000’ యుద్ధ విమానాల ప్రాజెక్టులో ప్రస్తుత డసౌ కంపెనీతోనే హెచ్‌ఏఎల్‌ గత 30 ఏళ్లుగా కలిసి పనిచేస్తోంది. 

అనిల్‌ కంపెనీకి జీరో అనుభవం
యుద్ధ విమానాలను తయారు చేయడంలో అనిల్‌ అంబానీ కంపెనీకి ఎలాంటి అనుభవం లేదు. అయినా నౌకా కంపెనీలో ఎరోనాటిక్స్‌ అన్నది ఓ చిన్న విభాగం. ఆయన నౌకా కంపెనీ 2011లో భారతీయ నౌకాదళంలో ఐదు నౌకల తయారీకి ఒప్పందం కుదుర్చుకుంది. వాటిని 2016, నవంబర్‌ నాటికి అప్పగించాలి. గత నెల సెప్టెంబర్‌ నెలలో రెండో నౌకను సరఫరా చేసింది. ఇక మరో మూడు ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు. 

45 వేల కోట్ల అప్పులు
అనిల్‌ అంబానీ నాయకత్వంలోని రిలయెన్స్‌ కమ్యూనికేషన్లకు 45 వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. ఆ అప్పులను భరించలేకనే ఆయన ఇటీవల అధాని గ్రూపునకు తన పవర్‌ కంపెనీలను 18వేల కోట్ల రూపాయలకు విక్రయించారు. అప్పుల్లో ఉన్న కంపెనీకి ఓ భారీ ప్రాజెక్టును కట్టబెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో వివరించాలి? ఈ ప్రాజెక్ట్‌తో ఆ అప్పులన్నింటినీ తీర్చుకోమని చెప్పడమా?

అనిల్‌ అంబానీ వేరు, ముకేష్‌ అంబానీ వేరు
2012, 2013లో రాఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందం గురించి అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫ్రాన్స్‌తో చర్చలు జరిపినప్పుడు రిలయెన్స్‌ కంపెనీని కూడా పరిగణలోకి తీసుకున్నారని, అప్పుడు లేని తప్పు ఇప్పుడు ఆ కంపెనీతో ఒప్పందం చేసుకుంటే వచ్చిందా? అని మోదీ ప్రభుత్వంలోని కొందరు ముఖ్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు ట్వీట్లు కూడా వదులుతున్నారు.  ముకేష్‌ అంబానీ నాయకత్వంలోని రిలయెన్స్‌ ఇండస్ట్రీ అప్పట్లో సంప్రతింపుల్లో పాల్గొన్న మాట నిజం. 2014లోనే అది పూర్తిగా తప్పుకొంది. ముకేష్‌ కంపెనీలు వేరు అనిల్‌ అంబానీ కంపెనీలు వేరన్న విషయం మోదీ ముఖ్యులకే తెలియకపోతే ఎలా? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement