మోదీ దేశద్రోహానికి పాల్పడ్డారు | Rahul Gandhi alleges treason by Narendra Modi | Sakshi
Sakshi News home page

మోదీ దేశద్రోహానికి పాల్పడ్డారు

Published Wed, Feb 13 2019 3:11 AM | Last Updated on Wed, Feb 13 2019 5:48 AM

Rahul Gandhi alleges treason by Narendra Modi - Sakshi

ఏఐసీసీలో మీడియాతో మాట్లాడుతున్న రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ: రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వివాదంలో మంగళవారం కొత్తగా మరో అంశం తెరపైకి వచ్చింది. భారత్‌–ఫ్రాన్స్‌లు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ముందే దీని గురించి పారిశ్రామిక వేత్త అనిల్‌ అంబానీకి సమాచారం అందిందనీ, అంబానీ నాడు ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి జీన్‌–యైవ్స్‌ లీ డ్రియాన్స్‌ కార్యాలయాన్ని కూడా సందర్శించారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఇందుకు రుజువుగా ఆయన ఓ ఈ–మెయిల్‌ను బహిర్గతం చేశారు.

ప్రధానమంత్రి నరేంద్రమోద అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించి అనిల్‌ అంబానీకి రఫేల్‌ ఒప్పంద వివరాలను ముందుగానే తెలియజేయడం ద్వారా దేశద్రోహానికి పాల్పడ్డారంటూ రాహుల్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. అనిల్‌కు మధ్యవర్తిగా మోదీ వ్యవహరించారని అన్నారు. బీజేపీ ఈ ఆరోపణలను ఖండించింది. అసలు ఆ ఈ–మెయిల్‌లో ఉన్న విషయం రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించినదే కాదని బీజేపీతోపాటు అనిల్‌ అంబానీ సంస్థ రిలయన్స్‌ డిఫెన్స్‌ స్పష్టం చేసింది. ఎయిర్‌బస్‌ సంస్థ ఉద్యోగి హెలికాప్టర్‌ల ఒప్పందానికి సంబంధించిన వివరాలను అందులో ప్రస్తావించారంది. ‘కాంగ్రెస్‌ బయట పెట్టిన ఈ–మెయిల్‌ రిలయన్స్‌ డిఫెన్స్, ఎయిర్‌బస్‌ సంస్థల మధ్య పౌర, రక్షణ హెలికాప్టర్ల ఒప్పంద చర్చలకు సంబంధించినది. ఇందులో రఫేల్‌ ప్రస్తావన లేదు.’ అని రిలయన్స్‌ డిఫెన్స్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

రక్షణ మంత్రి కన్నా ముందు అంబానీకే..
2015 మార్చి 28 నాటి తేదీతో ఉన్న, ఎయిర్‌బస్‌ ఉద్యోగి నికోలస్‌ ఛాముస్సీ ‘అంబానీ’ అనే సబ్జెక్ట్‌తో ముగ్గురికి పంపిన ఈ–మెయిల్‌ను రాహుల్‌ మీడియాకు విడుదల చేశారు. రఫేల్‌ ఒప్పందం ఖరారు కావడానికి ముందే అనిల్‌ అంబానీ ఫ్రాన్స్‌ రక్షణ మంత్రిని కలిసి నాటికి ఇంకా రూపుదిద్దుకుంటున్న ఎంవోయూ గురించి మాట్లాడారనీ, మోదీ ఫ్రాన్స్‌ పర్యటనలో ఒప్పందాన్ని ఖరారు చేసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారని రాహుల్‌ ఆరోపించారు. అంటే నాటి రక్షణ మంత్రి మనోహర్‌ పరీకర్, విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్‌ జైశంకర్‌లకంటే ముందుగానే అనిల్‌ అంబానీకి రఫేల్‌ ఒప్పందం విషయం తెలుసునని రాహుల్‌ పేర్కొన్నారు. ‘ఇది అధికారిక రహస్యాల చట్టం ఉల్లంఘన.

నాటికి ఈ ఒప్పందం గురించి తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి ప్రధాని మోదీయే అనిల్‌కు ఈ సమాచారాన్ని చేరవేశారు. ఇది దేశద్రోహమే. గూఢచారులు చేసే పనిని మోదీ చేస్తున్నారు. రహస్యాలను వెల్లడించనని ప్రమాణం చేసిన తర్వాత ఆయన రక్షణ ఒప్పందాల రహస్యాలను బయటపెడుతున్నారు. అనిల్‌కు మధ్యవర్తిగా మోదీ వ్యవహరిస్తున్నారు’ అని రాహుల్‌ ఆరోపించారు. ఈ వ్యవహారంపై నేర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. రఫేల్‌ అంశం గతంలో కేవలం అవినీతి, విధానపరమైన అవకతవకలకు సంబంధించినదేనని తాము భావించామనీ, ఇప్పుడు ఇది అధికారిక రహస్యాల చట్టం ఉల్లంఘనగా తేలడంతో మరింత తీవ్రమైన అంశంగా మారిందన్నారు. రఫేల్‌పై జేపీసీ విచారణ జరిపించాలని మరోసారి డిమాండ్‌ చేశారు.

రాహుల్‌ తన మొహంపైనే పేడ కొట్టుకున్నారు: బీజేపీ
ప్రధానమంత్రిని నిందించడం ద్వారా రాహుల్‌ తన మొహంపైనే పేడ కొట్టుకున్నారనీ, ఆయన అబద్ధాలను ప్రజలకు వివరిస్తామని బీజేపీ పేర్కొంది. కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘గాంధీ కుటుంబం నుంచి వచ్చిన గత ప్రధాన మంత్రులతో మా పార్టీకి తీవ్రమైన భేదాభిప్రాయాలున్నాయి. వారి హయాంలో జరిగిన అనేక అవినీతి రక్షణ ఒప్పందాలే ఇందుకు కారణం. కానీ మేం ఎన్నడూ వారిపై దేశద్రోహం ఆరోపణలు చేయలేదు. రాహుల్‌ ఓ అబద్ధాల యంత్రం. తాజా అబద్ధాలు ఆయన సిగ్గులేని తనానికి, బాధ్యతారాహిత్యానికి ఓ నిదర్శనం’ అని అన్నారు. రాహుల్‌ బయటపెట్టిన ఎయిర్‌బ స్‌ ఈ–మెయిల్‌ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించినది తప్ప రఫేల్‌ యుద్ధ విమానాల అంశం అందులో లేదని స్పష్టం చేశారు. రాహులే విదేశీ కంపెనీలకు లాబీయిస్ట్‌గా పనిచేస్తున్నారన్నారు.  ఎయిర్‌బస్‌ సంస్థ అంతర్గత ఈ–మెయిల్‌ రాహుల్‌కు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement