Treason
-
చిక్కుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన కార్యాలయంలో రహస్య పత్రాలు బయటపడ్డ ఉదంతం క్రమంగా చినికి చినికి గాలివానగా మారుతోంది. ఆ పత్రాల్లో బ్రిటన్, ఉక్రెయిన్, ఇరాన్‌లకు సంబంధించిన పలు సున్నితమైన అంశాలున్నట్టు వస్తున్న వార్తలు మరింత దుమారానికి దారి తీస్తున్నాయి. బరాక్ ఒబామా హయాంలో బైడెన్ ఉపాధ్యక్షునిగా ఉన్నప్పటి సదరు పత్రాలు ఆయన పదవి నుంచి తప్పుకున్నాక ఉపయోగించిన ప్రైవేట్ కార్యాలయంలో గత నవంబర్‌లో బయటపడ్డాయి. ఈ అంశం సోమవారం వెలుగులోకి వచ్చింది. వాటి ఉనికిని కనిపెట్టింది బైడెన్ తరఫు లాయర్లేనని, వెంటనే వారు నేషనల్ ఆర్కైవ్స్‌కు సమాచారమిచ్చారని ఆయన వర్గం సమర్థించుకున్నా విపక్షాలు ఇప్పటికే దీనిపై దుమ్మెత్తిపోస్తున్నాయి. 2022 ఆగస్టులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసంలోనూ ఇలాగే భారీ సంఖ్యలో రహస్య పత్రాలను నేషనల్ ఆర్కైవ్స్ స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. ఈ విషయమై ట్రంప్‌పై దర్యాప్తు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతున్నాయి. అదే కోవలో బైడెన్ కూడా విచారణ ఎదుర్కోక తప్పదంటున్నారు. దీనిపై అటార్నీ జనరల్ మెరిక్ గార్లండ్కు ఇప్పటికే ప్రాథమిక నివేదిక అందింది. నేషనల్ ఆర్కైవ్స్, రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ ఈ విషయాన్ని తనకు నివేదించగానే దీనిపై విచారణ బాధ్యతలను షికాగో అటార్నీ జాన్ లాష్చ్ జూనియర్‌కు గార్లండ్ అప్పగించారు. ఆయన నుంచి ఇప్పటికే అన్ని వివరాలూ తెప్పించుకున్నారు. బైడెన్‌పై పూర్తిస్థాయి నేర విచారణ ప్రారంభించాలా, వద్దా అన్న కీలక అంశంపై గార్లండ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ట్రంప్ రహస్య డాక్యుమెంట్లకు సంబంధించి ఆయన ఫ్లోరిడా ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ సోదాలతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది గార్లండే కావడం విశేషం! అధ్యక్షుల నిజాయితీకి అత్యంత ప్రాధాన్యమివ్వడమే గాక వారి ప్రవర్తన విషయంలో అత్యంత పట్టింపుగా ఉండే అమెరికాలో చివరికిది బైడెన్ పదవికి ఎసరు పెడుతుందా అన్నది చూడాలి. ఏం జరిగింది? బైడెన్ వద్ద పలు రహస్య పత్రాలు బయట పడ్డట్టు సోమవారం అమెరికా మీడియాలో వార్తలొచ్చాయి. దాంతో వైట్‌హౌస్ దీనిపై అధికారిక ప్రకటన చేసింది. 2022 నవంబర్ 2న వాషింగ్టన్ డీసీలోని పెన్ బైడెన్ సెంటర్లో ఉన్న బైడెన్ ప్రైవేట్ కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న సందర్భంగా అందులో పలు రహస్య పత్రాలను ఆయన లాయర్లు కనుగొన్నట్టు పేర్కొంది. అవన్నీ ఒబామా అధ్యక్షునిగా, బైడెన్ ఉపాధ్యక్షునిగా ఉన్నప్పటివని, అంటే 2013–16 నాటివని చెబుతున్నారు. ప్రెసిడెన్షియల్ రికార్డ్స్ యాక్ట్ పరిధిలోకి వచ్చే పలు పత్రాలు కూడా వీటిలో ఉన్నాయి! అవి రహస్య పత్రాలని తెలియగానే తన లాయర్లు వెంటనే నేషనల్ ఆర్కైవ్స్‌కు సమాచారమిచ్చి వాటిని అప్పగించారని బైడెన్ చెప్పుకొచ్చారు. ఉపాధ్యక్షునిగా పదవీకాలం ముగిశాక 2017 నుంచి మూడేళ్లపాటు ఆయన ఈ కార్యాలయాన్ని వాడుకున్నారు. ఆ పత్రాల్లో ఏముంది? బైడెన్ ఆఫీసులో దొరికినవి మామూలు రహస్య పత్రాలేనంటూ తొలుత వార్తలు వచ్చాయి. అయితే వాటిలో బ్రిటన్, ఇరాన్, ఉక్రెయిన్లకు సంబంధించి అమెరికా నిఘా వర్గాలు సేకరించిన అత్యంత రహస్య సమాచారం ఉందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ సీఎన్ఎన్ తదితర వార్తా సంస్థలు తాజాగా వెల్లడించడం సంచలనం రేపుతోంది. కావాలనే ఆలస్యంగా బయట పెట్టారా? రహస్య పత్రాలు ప్రైవేట్ కార్యాలయంలో దొరకడం ఒక ఎత్తైతే, దాన్ని ఇంతకాలం దాచి ఉంచడం బైడెన్‌కు మరింత ఇబ్బందికరంగా మారేలా కన్పిస్తోంది. 2022 నవంబర్ 2న ఈ పత్రాలు వెలుగు చూసినప్పటికి అమెరికాలో కీలకమైన మధ్యంతర ఎన్నికలు మరో వారంలోపే ఉన్నాయి. పత్రాల విషయం అప్పుడే బయటికొస్తే ఆ ఎన్నికల్లో డెమొక్రాట్లకు పెద్ద ఎదురుదెబ్బే తగిలేది. అందుకే దీన్ని దాచి ఉంచినట్టు తేలితే బైడెన్‌కు మరింత తలనొప్పిగా మారడం ఖాయం. మధ్యంతరంలో ప్రతినిధుల సభలో విపక్ష రిపబ్లికన్లకు స్వల్ప మెజారిటీ లభించడం తెలిసిందే. రాజకీయ వేడి బైడెన్ కార్యాలయంలో రహస్య పత్రాలు దొరకడం అధికార డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య దుమారానికి దారి తీస్తోంది. ట్రంప్ ఎస్టేట్ మాదిరిగా బైడెన్ ఇల్లు, కార్యాలయాల్లో ఎఫ్‌బీఐ ఎప్పుడు సోదాలు చేస్తుందంటూ రిపబ్లికన్ నేతలు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. ట్రంప్ అయితే మరో అడుగు ముందుకేసి, రహస్య పత్రాలను కాపాడలేకపోయినందుకు వైట్‌హౌస్‌లో కూడా ఎఫ్‌బీఐ సోదాలు చేయాలన్నారు! ప్రతినిధుల సభలో రహస్య పత్రాల వ్యవహారాలను చూసే శక్తిమంతమైన ఓవర్‌సైట్ కమిటీ సారథి అయిన రిపబ్లికన్ సభ్యుడు జేమ్స్ కోమర్ ఇప్పటికే దీనిపై పూర్తి సమాచారమివ్వాలంటూ నేషనల్ ఆర్కైవ్స్‌కు, వైట్‌హౌస్ కౌన్సెల్ కార్యాలయానికి లేఖలు రాశారు. ట్రంప్ పత్రాల గొడవ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా తప్పుకున్నాక పలు రహస్య పత్రాలను వైట్‌హౌస్ నుంచి తన ఫ్లోరిడా ఎస్టేట్‌కు తీసుకెళ్లారన్న వార్తలు సంచలనం సృష్టించాయి. 2022 ఆగస్టులో ఆయన ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ సోదాల్లో వందలాది డాక్యుమెంట్లు దొరికాయి. తనకేమీ తెలియదని, ఇదంతా రాజకీయ కుట్ర సాధింపని ట్రంప్ ఎదురు దాడికి దిగారు. దొరికినవన్నీ తన వ్యక్తిగత పత్రాలేనంటూ బుకాయించారు. దీనిపై ఇప్పటికే ఆయనపై సివిల్, క్రిమినల్ విచారణలు జరుగుతున్నాయి. మొత్తం 3,000కు పైగా డాక్యుమెంట్లను వైట్‌హౌస్ నుంచి తరలించినట్టు టంప్ర్పై అభియోగాలు నమోదయ్యాయి. నాకు తెలియదు: బైడెన్ వాషింగ్టన్: తన కార్యాలయంలో రహస్య పత్రాలు బయటపడ్డట్టు తెలిసి ఆశ్చర్యపోయానని బైడెన్ అన్నారు. ‘ఆ పత్రాల గురించి, ఉపాధ్యక్షునిగా నేను తప్పుకున్న తర్వాత నా కార్యాలయంలోకి అవెలా వచ్చాయో నాకు తెలియదు. వాటిల్లో ఏముందో కూడా తెలియదు. వీటిపై జరుగుతున్న విచారణకు పూర్తిగా సహకరిస్తున్నా. ఇలాంటి అంశాలను నేనెంత సీరియస్‌గా తీసుకుంటానో అందరికీ తెలుసు’ అన్నారు. మెక్సికో పర్యటనలో ఉన్న ఆయన మీడియా ప్రశ్నించడంతో ఈ అంశంపై తొలిసారిగా స్పందించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘రాజద్రోహం’పై విస్తృత ధర్మాసనం అనవసరం
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహం చట్టంపై విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఈ చట్టం దుర్విని యోగం కాకుండా నియంత్రించగలిగామని చెప్పా రు. దీనిపై మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు. రాజద్రోహం చట్టాన్ని సవాలు చేస్తూ ఎస్జీ వొంబట్కెరే, ఎడిటర్స్ గిల్డ్ తదితరులు వేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఇటీవల మహారాష్ట్రలో ఎంపీ నవనీత్ కౌర్ రాణా దంపతుల అరెస్టు కేసును ధర్మాసనం ప్రస్తావించింది. ‘‘దేశంలో ఏం జరుగుతోందో కోర్టుకు తెలుసు. హనుమాన్ చాలీసా చదువుతామన్న వారిపై దేశద్రోహం కేసులు పెడుతున్నారు. చట్టం దుర్వినియోగం కాకుండా మార్గదర్శకాలు జారీ చేయాలే గానీ విస్తృత ధర్మాసనం అవసరం లేదు. సెక్షన్ 142ఏ చెల్లుబాటుపై కేదార్నా«థ్‌సింగ్ కేసులో ఇచ్చిన తీర్పును సమర్థించాల్సి ఉంది. కేంద్రం వైఖరి చెప్పాల్సి ఉంది’’ అని ఏజీ వేణుగోపాల్ తెలిపారు. సెక్షన్ 124ఏను రద్దు చేయొచ్చు రాజద్రోహం చట్టంపై దాఖలైన పిటిషన్లపై కౌంటరు దాఖలు చేయాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించడం లేదంటూ కేంద్రంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. న్యాయవాదులు సిద్ధం చేసిన ముసాయిదాకు ఆమోదం రాలేదని, ఈ నేపథ్యంలో మరింత గడువు కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. భారతదేశంలో తమ పాలనను కాపాడుకోవడానికి బ్రిటిషర్లు చేసిన రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయాలని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోరారు. ఈ చట్టం కారణంగా స్వేచ్ఛాభారతంలో జర్నలిస్టులు, విద్యార్థులు అరెస్టవుతున్నారని వాపోయారు. ‘‘సొలిసిటర్ జనరల్ అభ్యర్థన మేరకు కౌంటర్ దాఖలుకు సోమవారం వరకూ సమయం ఇస్తున్నాం. విస్తృత ధర్మాసనం ఏర్పాటుపై వాదప్రతివాదులు లిఖితపూర్వక అభ్యర్థనలను శనివారం ఉదయం అందజేయాలి. మే 10 మధ్యాహ్నం విచారిస్తాం. వాయిదాకు అంగీకరించబోం’’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఇక పూర్తి సామర్థ్యంతో సుప్రీంకోర్టు! సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులు ఉండాలి. ప్రస్తుతం రెండు ఖాళీలున్నాయి. వీటి భర్తీ ప్రక్రియ మొదలయ్యింది. కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు నియమితులైతే సుప్రీంకోర్టు ఇక పూర్తి సామర్థ్యంతో పనిచేయనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఇద్దరి పేర్లను ప్రతిపాదించింది. గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు ధూలియా, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జంషెడ్ బి.పార్దివాలాను సుప్రీం జడ్జీలుగా నియమించాలని కేంద్రానికి సూచించినట్లు సమాచారం. దీనిని ఆమోదిస్తే జస్టిస్ జంషెడ్ బి.పార్దివాలా జడ్జిగా, ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలున్నాయి. -
దేశ ద్రోహులకు విదేశాల్లో..
కేవాడియా: మన దేశానికి ద్రోహం చేసినవారికి ప్రపంచంలో ఇంకెక్కడా స్వర్గధామాలు లేకుండా చేయాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులకు ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారు. భారత్‌లో నేరాలకు పాల్పడి, విదేశాలకు పారిపోయి తలదాచుకొనే పరిస్థితి లేకుండా చూడాలన్నారు. ‘దేశానికి ద్రోహం చేసిన వారికి, ఇక్కడ నేరాలకు పాల్పడిన వారికి విదేశాల్లో నిలువ నీడ లేకుండా చేయాలి’ అని అధికారులను ఉద్దేశించి పేర్కొన్నారు. గుజరాత్‌లోని కేవాడియాలో బుధవారం సీవీసీ, సీబీఐ ఉమ్మడి సదస్సులో మోదీ వర్చువల్‌గా మాట్లాడారు. దేశ ప్రయోజనాలకు, దేశ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే వారు ఎంతటి బలవంతులైనా ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్థిక నేరాలకు పాల్పడి, విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి వారిని వెనక్కి రప్పించేందుకు కేంద్రం ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అవినీతి.. పేదల హక్కులను హరిస్తుంది కేంద్ర ప్రభుత్వం గత ఆరేడేళ్లుగా సాగిస్తున్న నిరి్వరామ కృషితో దేశ ప్రజల్లో విశ్వాసం ఏర్పడిందని, అవినీతిని అడ్డుకోవడం సాధ్యమేనని వారు నమ్ముతున్నారని ప్రధాని మోదీ చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, లంచాల బెడద లేకుండా ప్రభుత్వ పథకాలతో నుంచి తమకు రావాల్సిన ప్రయోజనాలు పొందవచ్చని ప్రజలు భావిస్తున్నారని గుర్తుచేశారు. అవినీతి.. అది చిన్నదైనా, పెద్దదైనా పేద ప్రజల హక్కులను హరిస్తుందని అన్నారు. దేశ అభివృద్ధి నిరోధిస్తుందని చెప్పారు. మన సమ్మిళిత శక్తిని ప్రభావితం చేస్తుందని వెల్లడించారు. అవినీతిని నియంత్రించే దిశగా గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ప్రస్తుతం రాజకీయ సంకల్పం, పాలనాపరమైన సంస్కరణలతో అవినీతికి చెక్ పెడుతున్నామని మోదీ తెలియజేశారు. ప్రజలపై నియంత్రణ చర్యలను తగ్గిస్తున్నామని, తద్వారా వారి జీవితాలను సరళతరం చేస్తున్నామని చెప్పారు. కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన అనే విధానాన్ని తాము విశ్వసిస్తున్నాని వెల్లడించారు. -
జీవించే హక్కు వీరికి లేదా?
సమాజానికి రాజకీయం అవసరం. నలుగురు కూడి ఓ సమస్యకు పరిష్కారం వెతికే అద్భుత క్రతువే రాజకీయం. రాజకీయంలో భిన్న ఆలోచనలుంటాయి. అంతులేని విజ్ఞాన శోధన ఉంటుంది. వాటిలో తార్కి కత ఉంటుంది. ఏకాభిప్రాయాలు, విస్తృతాభిప్రాయాలు, విభేదాలు కూడా ఉంటాయి. ఈ సంఘర్షణలోంచే భిన్న రాజకీయ దృక్పథాలు ఉత్పన్నమవుతాయి. విప్లవ భావజాలం పుట్టుకొస్తుంది, అది పరిసరాలను, ప్రాంతాలను, అవసరాలను బట్టి సాయుధ పోరాటంగానూ మారవచ్చు లేదా శాంతి మార్గంలోనూ నడవవచ్చు. ఎలా రూపాంతరం చెందాలనేది అక్కడి ప్రజల విశ్వాసాలు, అవసరాలు, ఆకాంక్షలను బట్టి ఉంటుంది. ప్రశ్నించే స్థాయికి ఎదిగితే రాజద్రోహమే పాలకులకు ఎప్పుడూ ప్రజా విశ్వాసాలు మూఢంగా ఉండాలి. రాజభక్తిని ప్రదర్శించే విధంగానే ఉండాలి. అంతే కానీ అవి బలమైన భావజాలంగా మారొద్దు. రాజ్యహింసను, దోపిడీని, నిరంకుశత్వాన్ని ప్రశ్నించే స్థాయికి ఎదగొద్దు. అట్లా ఎదిగితే వాళ్లు రాజద్రోహులు అవుతారు. వాళ్ల మీద పోలీసు నిర్బంధం పెరుగుతుంది. ఇనుప గజ్జల బూట్ల కింద పౌరహక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ప్రజా విశ్వాసాల మీద నిర్బంధ దాడి మొదలవుతుంది. ఇక్కడే ధర్మదేవత అడ్డం పడి ప్రజా హక్కులను రక్షించాలి. పౌర స్వేచ్ఛను కాపాడాలి. కానీ ఎందుకో న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక శాఖ తీరుగానే ఆలోచన చేస్తోంది. పోలీసులు చేసే హక్కుల ఉల్లంఘనకు అంగీకార ముద్ర వేసే ధోరణి క్రమంగా బలపడుతోంది. నిర్బంధించడం రాజ్యానికి కొత్తేమీ కాదు ప్రధాన మంత్రి మోదీని హత్య చేయటానికి మావోయిస్టులు కుట్ర పన్నారనే అభియోగం మోపి పుణే పోలీసులు హక్కుల ఉద్యమకారులు సురేంద్ర గాడ్లింగ్, సుధీర్ ధావ్లే, రోనా విల్సన్, మహేశ్ రౌత్, సుధా భరద్వాజ్, వర్నన్ గోంజాల్వెస్, అరుణ్ ఫరేరా, వరవరరావుల మీద కుట్ర కేసులు పెట్టి జైల్లో నిర్బంధించారు. అంతకుముందు ప్రొఫెసర్ సాయిబాబా మీద కూడా దేశ ద్రోహం కిందనే జైల్లో పెట్టారు. ప్రజా విశ్వాసాల మీద పోలీసులు దాడి చేస్తూ.. కృత్రిమ లేఖలు, ఊహాత్మక అభియోగాలతో ప్రజా సంఘాల నాయకులను ఏళ్లకు ఏళ్లుగా జైల్లో బంధించటం అనేది రాజ్యానికి కొత్తేమీ కాదు. ప్రపంచాన్ని కోవిడ్–19 మహమ్మారి కబళి స్తున్న సమయం ఇది. అన్ని వ్యవస్థలను లాక్డౌన్ చేసి స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయాం. వయసు మళ్ళిన వృద్ధుల మీద ఆ కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ఇటువంటి వాళ్లకు సామాజిక దూరమే పరిష్కారమని వైద్య పరిశోధనలు, పరిశీలనలు చెబుతున్నాయి. కరోనా కేసుల్లో మహారాష్ట్ర రికార్డు దేశంలోకల్లా మహారాష్ట్రలోనే అత్యధికంగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. మే 9 నాటికి ఈ రాష్ట్రంలో అత్యధికంగా 19,063 కేసులు నమోదు కాగా 1,089 పాజిటివ్ కేసులు కొత్తగా నిర్ధారణ అయ్యాయి. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా మృతుల సంఖ్య ఈ శుక్రవారానికి 731కి చేరుకుంది. పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఒక్క రాష్ట్రంలోనే 714 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. సమూహాలుగా ఉంటే వైరస్ వేగంగా విస్తరించే అవకాశాలు ఎక్కువ. ఈ నేపథ్యంలోనే పుణే జైలులో స్థాయికి మించి ఖైదీలను బంధించి ఉంచారని, ఖైదీలకు సులువుగా కరోనా అంటుకునే ప్రమాదం ఉందని, ఈ వ్యాధి బారి నుంచి తప్పించుకోవడానికి తమకు తాత్కాలికంగా బెయిలు మంజూరు చేయాలని వరవరరావు, సోమాసేన్ ముంబైలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టుకు దరఖాస్తు పెట్టుకున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ వారి ఇద్దరి బెయిల్ అభ్యర్థన పట్ల అభ్యం తరం చేసింది. కోర్టు బెయిలు నిరాకరించింది. మరో వైపు నాగపూర్ సెంట్రల్ జైలులో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్య పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఆయనకు పిత్తాశయం, క్లోమ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. 90 శాతం అంగవైకల్యం, దాదాపుగా కుప్పకూలిన వ్యాధినిరోధక సామర్థ్యం. ఛాతీ నొప్పి, గుండెదడ తదితర ఆరోగ్య సమస్యలతో ఉన్న సాయిబాబా జీవించే హక్కులో భాగంగా న్యాయస్థానాల్లో బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకుంటే అంగీకరించలేదు. 25 కేసులు కొట్టేసినా వీవీని వదలని రాజ్యం వరవరరావు మీద కుట్ర కేసులు కొత్తేమీ కాదు.ఆయన మీద 25 రకాల కేసులు పెట్టారు. ఇందులో ఒకటి అంటే ఒక్కటి కూడా నిర్ధారణ కాలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో కుట్ర చేశారని 1974లో 46 మందిపై కుట్ర, రాజద్రోహ అభియోగం మోపారు. నాటి నక్సలైట్ నేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి లతో పాటు విప్లవ రచయితల సంఘం సభ్యులైన వరవరరావు, చెరబండరాజు, కె.వి.రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, ఎం.టి.ఖాన్‌లను ఈ కుట్ర కేసులో నిందితులుగా పేర్కొన్నారు. 1989 ఫిబ్రవరి 27న సెషన్స్ కోర్టు అందరినీ నిర్దోషులుగా తేల్చింది. 1986లో ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నారంటూ రాంనగర్ కుట్ర కేసు పెట్టారు. కొండపల్లి సీతారామయ్య, వరవరరావు తదితరులను నిందితులుగా పేర్కొన్నారు. కేసు విచారణ జరిగిన ఈ సుదీర్ఘ కాలంలో వరవరరావు, సూరిశెట్టి సుధాకర్‌లు మినహా మిగిలిన నిందితులంతా మరణించారు. 2003 సెప్టెంబర్‌లో వరవరరావు, సూరి శెట్టి సుధాకర్‌లు ఇద్దరినీ నిర్దోషులుగా పేర్కొంటూ కోర్టు కేసు కొట్టివేసింది. 2005లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఔరంగాబాద్‌లో కుట్ర పన్ని, అది అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని విరసం సభ్యులను 2005 మే 30న నిజామాబాదులో అరెస్ట్ చేశారు. 2010 ఆగస్ట్ 2న నిజామాబాద్ అడిషనల్ సెషన్స్ జడ్జి ఆ కేసును కొట్టేశారు. రాజ్యహింస ప్రజా విశ్వాసాలపై దాడి ఇలా ఏ కేసు స్టడీ చేసినా రాజ్యహింసే ఉంది. ప్రజా విశ్వాసాల మీద పోలీసుల దాడి కనిపిస్తుంది. బెయిల్ మంజూరు చేసే విషయంలో కోర్టు ఈ రికార్డును కూడా పరిగణనలోకి తీసుకొని విచారణ జరపాలి. సామూహిక ప్రదేశాల్లో నివసించడం వలన కరోనా వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఒక్కసారి వ్యాధి అంటుకుంటే ఒకవైపు వృద్ధాప్యం మరోవైపు వ్యాధి నిరోధక శక్తిని పోగొట్టుకున్న వీళ్లు తట్టుకుని నిలబడటం కష్టం. అదే జరిగితే వాళ్ల జీవించే హక్కును రాజ్యాంగం హరించినట్లు అవుతుంది. కార్యనిర్వాహక వ్యవస్థ తరహాలో కాకుండా న్యాయవ్యవస్థ విభిన్నంగా, తార్కిక ఆలోచన చేయాలి. ఉద్యమకారులకు సత్వర న్యాయాన్ని అందించాలి. మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసుకొని హక్కుల ఉద్యమకారులపై పెట్టిన రాజద్రోహం కేసులను ఉపసంహరించుకోవాలి. జీవించే హక్కును గౌరవించాలి. వ్యాసకర్త: సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ శాసనసభ అంచనాలు, పద్దుల కమిటీ చైర్మన్ మొబైల్ : 94403 80141 -
మోదీ దేశద్రోహానికి పాల్పడ్డారు
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వివాదంలో మంగళవారం కొత్తగా మరో అంశం తెరపైకి వచ్చింది. భారత్–ఫ్రాన్స్‌లు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ముందే దీని గురించి పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి సమాచారం అందిందనీ, అంబానీ నాడు ఫ్రాన్స్ రక్షణ మంత్రి జీన్–యైవ్స్ లీ డ్రియాన్స్ కార్యాలయాన్ని కూడా సందర్శించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇందుకు రుజువుగా ఆయన ఓ ఈ–మెయిల్‌ను బహిర్గతం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోద అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించి అనిల్ అంబానీకి రఫేల్ ఒప్పంద వివరాలను ముందుగానే తెలియజేయడం ద్వారా దేశద్రోహానికి పాల్పడ్డారంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. అనిల్‌కు మధ్యవర్తిగా మోదీ వ్యవహరించారని అన్నారు. బీజేపీ ఈ ఆరోపణలను ఖండించింది. అసలు ఆ ఈ–మెయిల్లో ఉన్న విషయం రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించినదే కాదని బీజేపీతోపాటు అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ డిఫెన్స్ స్పష్టం చేసింది. ఎయిర్‌బస్ సంస్థ ఉద్యోగి హెలికాప్టర్ల ఒప్పందానికి సంబంధించిన వివరాలను అందులో ప్రస్తావించారంది. ‘కాంగ్రెస్ బయట పెట్టిన ఈ–మెయిల్ రిలయన్స్ డిఫెన్స్, ఎయిర్‌బస్ సంస్థల మధ్య పౌర, రక్షణ హెలికాప్టర్ల ఒప్పంద చర్చలకు సంబంధించినది. ఇందులో రఫేల్ ప్రస్తావన లేదు.’ అని రిలయన్స్ డిఫెన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. రక్షణ మంత్రి కన్నా ముందు అంబానీకే.. 2015 మార్చి 28 నాటి తేదీతో ఉన్న, ఎయిర్‌బస్ ఉద్యోగి నికోలస్ ఛాముస్సీ ‘అంబానీ’ అనే సబ్జెక్ట్‌తో ముగ్గురికి పంపిన ఈ–మెయిల్‌ను రాహుల్ మీడియాకు విడుదల చేశారు. రఫేల్ ఒప్పందం ఖరారు కావడానికి ముందే అనిల్ అంబానీ ఫ్రాన్స్ రక్షణ మంత్రిని కలిసి నాటికి ఇంకా రూపుదిద్దుకుంటున్న ఎంవోయూ గురించి మాట్లాడారనీ, మోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఒప్పందాన్ని ఖరారు చేసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారని రాహుల్ ఆరోపించారు. అంటే నాటి రక్షణ మంత్రి మనోహర్ పరీకర్, విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జైశంకర్‌లకంటే ముందుగానే అనిల్ అంబానీకి రఫేల్ ఒప్పందం విషయం తెలుసునని రాహుల్ పేర్కొన్నారు. ‘ఇది అధికారిక రహస్యాల చట్టం ఉల్లంఘన. నాటికి ఈ ఒప్పందం గురించి తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి ప్రధాని మోదీయే అనిల్‌కు ఈ సమాచారాన్ని చేరవేశారు. ఇది దేశద్రోహమే. గూఢచారులు చేసే పనిని మోదీ చేస్తున్నారు. రహస్యాలను వెల్లడించనని ప్రమాణం చేసిన తర్వాత ఆయన రక్షణ ఒప్పందాల రహస్యాలను బయటపెడుతున్నారు. అనిల్‌కు మధ్యవర్తిగా మోదీ వ్యవహరిస్తున్నారు’ అని రాహుల్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై నేర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రఫేల్ అంశం గతంలో కేవలం అవినీతి, విధానపరమైన అవకతవకలకు సంబంధించినదేనని తాము భావించామనీ, ఇప్పుడు ఇది అధికారిక రహస్యాల చట్టం ఉల్లంఘనగా తేలడంతో మరింత తీవ్రమైన అంశంగా మారిందన్నారు. రఫేల్‌పై జేపీసీ విచారణ జరిపించాలని మరోసారి డిమాండ్ చేశారు. రాహుల్ తన మొహంపైనే పేడ కొట్టుకున్నారు: బీజేపీ ప్రధానమంత్రిని నిందించడం ద్వారా రాహుల్ తన మొహంపైనే పేడ కొట్టుకున్నారనీ, ఆయన అబద్ధాలను ప్రజలకు వివరిస్తామని బీజేపీ పేర్కొంది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ‘గాంధీ కుటుంబం నుంచి వచ్చిన గత ప్రధాన మంత్రులతో మా పార్టీకి తీవ్రమైన భేదాభిప్రాయాలున్నాయి. వారి హయాంలో జరిగిన అనేక అవినీతి రక్షణ ఒప్పందాలే ఇందుకు కారణం. కానీ మేం ఎన్నడూ వారిపై దేశద్రోహం ఆరోపణలు చేయలేదు. రాహుల్ ఓ అబద్ధాల యంత్రం. తాజా అబద్ధాలు ఆయన సిగ్గులేని తనానికి, బాధ్యతారాహిత్యానికి ఓ నిదర్శనం’ అని అన్నారు. రాహుల్ బయటపెట్టిన ఎయిర్బ స్ ఈ–మెయిల్ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించినది తప్ప రఫేల్ యుద్ధ విమానాల అంశం అందులో లేదని స్పష్టం చేశారు. రాహులే విదేశీ కంపెనీలకు లాబీయిస్ట్‌గా పనిచేస్తున్నారన్నారు. ఎయిర్‌బస్ సంస్థ అంతర్గత ఈ–మెయిల్ రాహుల్‌కు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఉమ్మడి పౌరస్మృతి అవసరం లేదు
న్యూఢిల్లీ: ప్రస్తుత తరుణంలో ఉమ్మడి పౌరస్మృతి(అందరికీ ఒకే చట్టం) అవసరం గానీ, దానివల్ల ప్రయోజనం గానీ లేదని కేంద్ర న్యాయ కమిషన్ పేర్కొంది. వివాహం, విడాకులు, జీవనభృతి, పురుషులు, మహిళలకు చట్టబద్ధ వివాహ వయస్సు తదితర అంశాలపై ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల్లో మార్పులు అవసరమని ఉమ్మడి పౌరస్మృతిపై విడుదల చేసిన సంప్రదింపుల పత్రంలో అభిప్రాయపడింది. స్త్రీ, పురుషులకు వివాహ వయసును 18 ఏళ్లుగా మార్చాలంది. వివాహ చట్టాల్లో మార్పులు చేయాలి.. మహిళలకు సమాన హక్కులపై స్పందిస్తూ.. ‘ఒక మహిళ సంపాదనతో నిమిత్తం లేకుండా ఇంట్లో ఆమె పాత్రను గుర్తించాలి. వివాహం తర్వాత సంపాదించుకున్న ఆస్తిలో విడాకుల సమయంలో మహిళకు సమాన వాటా అందాలి’ అని తెలిపింది. ఇందుకోసం హిందూ వివాహ చట్టం 1955, ప్రత్యేక వివాహ చట్టం 1954, పార్సీ వివాహ, విడాకుల చట్టం యాక్ట్ 1936, క్రైస్తవ వివాహ చట్టం 1972, ముస్లిం వివాహ రద్దు చట్టం 1939లను సవరించవచ్చని పేర్కొంది. పురుషులకు, మహిళలకు కనిష్ట వివాహ వయస్సు 18 ఏళ్లుగా ఉండాలని, వేర్వేరు వివాహ వయస్సుల్ని రద్దు చేయాలంది. ప్రస్తుతం వివాహానికి పురుషుడికి 21 ఏళ్లు, మహిళకు 18 ఏళ్లు చట్టబద్ధ వయసుగా ఉంది. వితంతు హక్కులు, వివాహం అనంతరం సొంతంగా సంపాదించుకునే ఆస్తులపై చట్టాలు, సరిదిద్దలేనంతగా వివాహ జీవితం విచ్చిన్నం కావడాన్ని విడాకులను ప్రామాణికంగా తీసుకోవడం వంటి అంశాలపై సూచనలు చేసింది. పార్సీలకు సంబంధించి ఆ మతానికి చెందిన మహిళ వేరే మతస్తుడ్ని వివాహం చేసుకున్నా వారసత్వ ఆస్తిలో ఆమెకు భాగం ఉండాలంది. పిల్లల సంరక్షణ బాధ్యతల అప్పగింతలో వ్యక్తిగత చట్టాలకన్నా ఆ చిన్నారి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కమిషన్ పేర్కొంది. మతం ముసుగులో.. మత సంప్రదాయాల ముసుగులో ట్రిపుల్ తలాఖ్, బాల్య వివాహాలు వంటి సాంఘిక దురాచారాలు అమలుకాకుండా చూడాల్సి ఉందని కమిషన్ అభిప్రాయపడింది. ఉమ్మడి పౌరస్మృతి చాలా విస్తృతమైందని, దాని పరిణామాల ప్రభావంపై ఎలాంటి అధ్యయనం జరగలేదు అని పేర్కొంది. రెండేళ్ల పాటు విస్తృత పరిశోధన, సంప్రదింపుల అనంతరం భారతదేశంలోని కుటుంబ చట్టాలపై సంప్రదింపుల పత్రం సమర్పిస్తున్నామని తెలిపింది. విభేదించడం రాజద్రోహం కాదు ప్రభుత్వాన్ని విమర్శించడం, లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా అంశాలతో విభేదించడం రాజద్రోహం కాదని, ఉద్దేశ పూర్వకంగా చట్టవిరుద్ధంగా, హింసాత్మకంగా ప్రభుత్వాన్ని కూలగొట్టే చర్యలకు పాల్పడినప్పుడే ఆ నేరం రాజద్రోహంగా పరిగణిస్తారని పేర్కొంది. ఐపీసీ 124ఏ సెక్షన్‌ను సమీక్షించాలని, దేశంలో బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన రాజద్రోహం సెక్షన్‌ని పదేళ్ళ క్రితమే బ్రిటన్‌లో రద్దుచేసిన విషయాన్ని కమిషన్ గుర్తుచేసింది. ప్రజాస్వామ్య మనుగడకు భావప్రకటనా స్వేచ్ఛ ఎంతో అవసరమని, జాతి సమగ్రతను కాపాడాలనుకుంటే దానిని హరించకూడదని స్పష్టం చేసింది. -
ఇపుడైనా వింటారా?!
సాధారణ ప్రజానీకానికి వినియోగపడటం మాట అటుంచి ఎడాపెడా దుర్వినియోగం అవుతున్న చట్టాల జాబితా రూపొందిస్తే రాజద్రోహ చట్టం అందులో అగ్ర భాగాన ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేయాలని సర్వోన్నత న్యాయ స్థానం సంకల్పించడం ప్రజాస్వామ్యవాదులకు ఊరటనిస్తుంది. అంతక్రితం నిలదీ సేవారూ, నిలదీయమని ప్రజలను ప్రోత్సహించేవారూ ప్రభుత్వాలకు కంట్లో నలుసులా కనబడేవారు. అలాంటివారంతా ‘రాజద్రోహుల’ ఖాతాకు ఎక్కేవారు. కేసులు, జైళ్లు, కోర్టు విచారణలతో నానా యాతనలూ పడేవారు. కాలం మారింది... ఈమధ్య దేశం గురించి తపన పడేవారు పెరిగిపోయారు. ఫలితంగా ఈ రాజద్రోహ చట్టం మంచినీళ్ల ప్రాయమైంది. తమ విశ్వాసాలకు భిన్నంగా, తాము సరైందను కున్నదానికి విరుద్ధంగా ఏం చేసినా...అది రాత కావొచ్చు, గీత కావొచ్చు, మాట కావొచ్చు- ఈ చట్టం కింద ఫిర్యాదు చేయడం ఒక్కసారిగా పెరిగిపోయింది. సాధా రణ ఆదివాసీ ప్రజలపై ఈ మాదిరి కేసులు పెట్టి జార్ఖండ్ రాష్ట్రం రికార్డు సష్టించింది. రాజద్రోహం కేసుల్లో 72 శాతం వాటా ఆ రాష్ట్రానిదే. బీహార్ 20 కేసులతో రెండో స్థానంలో ఉంది. యూపీఏ పాలనాకాలంలో చిన్నగా మొదలైన ఈ ధోరణి ఇప్పుడు వికతరూపం దాల్చింది. అవినీతిపై కార్టూన్లు వేశాడని కాన్పూర్‌కు చెందిన ఆసిమ్ త్రివేదీని ముంబై పోలీసులు నాలుగేళ్లక్రితం అరెస్టుచేశారు. రచయిత్రి అరుంధతీరాయ్, వైద్యుడు బినాయక్ సేన్, జేఎన్‌యూ విద్యార్థి నేతలు, పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసిన హార్దిక్‌పటేల్ తదితరులపై ఇందుకు సంబంధించిన కేసులున్నాయి. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ క్రికెట్ టీం పరుగులు చేసినందుకు సంతోషపడ్డారని రెండేళ్లక్రితం మీరట్‌లో ఉన్న స్వామి వివేకానంద సుభారతి యూనివర్సిటీ హాస్టల్లోని 67మంది కశ్మీరీ యువకులపై రాజద్రోహం కేసు పెట్టారు. యావజ్జీవ శిక్ష పడటానికి ఆస్కారం ఉన్నంతటి తీవ్రమైన చట్టాన్ని ఇంత అలవోకగా, విచక్షణారహితంగా ప్రయోగించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ క్రమంలో మన దేశం, సమాజం నవ్వులపాలవుతుందన్న స్పహ లేకపోవడం మరింత వింతగా అనిపిస్తుంది. ఈమధ్యే కర్ణాటకకు చెందిన మాజీ కాంగ్రెస్ ఎంపీ రమ్యపై కూడా రాజద్రోహానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు నమోదైంది. రక్షణమంత్రి మనోహర్ పరీకర్ చెప్పినట్టు పాకిస్తాన్ నరకం కాదని అనడమే ఆమె చేసిన నేరం. ఇలాంటి కేసుల్లో ఇరుక్కున్న వారు ఏళ్లతరబడి కోర్టుల చుట్టూ తిరిగాక కేసులు తరచుగా వీగిపోతున్నాయి. కానీ ఈలోగా ఆ కేసుల్లో నిందితులైనవారు జీవితంలో విలువైన సమయాన్ని కోల్పోతు న్నారు. వారి కుటుంబాలుపడే మానసిక వేదన మాట అటుంచి, ఆర్థికంగా ఆ కేసులు కుంగదీస్తున్నాయి. అవి కొనసాగినంతకాలమూ సమాజంలో వారికెదురవు తున్న నిరాదరణ, అవమానాలు తక్కువేమీ కాదు. ఏ పౌరుడైనా తెలియక తప్పు చేశానంటే చట్టం ఊరుకోదు. చట్టం గురించిన అజ్ఞానం ఎంతటివారినైనా కాపాడలేదు. చట్టంలో ఏముందో, సర్వోన్నత న్యాయ స్థానం ఏం చెప్పిందో తెలుసుకోకుండా రాజద్రోహం లాంటి కేసులు పెట్టేవారి పైనా, వాటిని శిరసావహించి దర్యాప్తు పేరిట, విచారణల పేరిట ఇబ్బందులు సష్టించేవారిపైనా సరిగ్గా ఇదేవిధంగా చర్య తీసుకునే అవకాశం ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. అది లేకపోబట్టి రాజద్రోహం కేసులు నానాటికీ పెరుగుతూ పోతున్నాయి. ఈ పరిస్థితిని సమీక్షించి ప్రభుత్వాలకూ, కింది స్థాయి కోర్టులకూ తగిన సూచనలివ్వాలన్న పిటిషన్‌ను విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు ఎన్నదగినవి. 1962లో కేదార్నాథ్ కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును గుర్తు చేస్తూ ఇప్పటికీ అందులోని మార్గదర్శకాలే వర్తిస్తాయని చెప్పింది. ఆ కేసులో రాజద్రోహం చట్టం రాజ్యాంగబద్ధమైనదని చెబుతూనే దాని ప్రయోగంపై అనేక పరిమితులను విధించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన అది రాజద్రోహం కిందకు రాదని... హింసకు ప్రేరేపించ నంతవరకూ ఏ పౌరుడైనా తన అభిప్రాయాన్ని లేదా విమర్శను స్వేచ్ఛగా వ్యక్తం చేయొచ్చునని చెప్పింది. తాజాగా సుప్రీంకోర్టు దాన్నే పునరుద్ఘాటించింది. ప్రభుత్వంపై తీవ్ర విమర్శ చేస్తే పరువు నష్టంగా పరిగణించడం, రాజద్రోహంగా భావించడం సరైంది కాదని స్పష్టం చేసింది. కేదార్నాథ్ కేసులో ఇచ్చిన మార్గ దర్శకాలు పోలీసులూ, న్యాయస్థానాలూ కూడా దష్టిలో పెట్టుకోవలసి ఉంటుం దని తెలిపింది. ఏదైనా కేసులో ఆ మార్గదర్శకాలు ఉల్లంఘించారన్న అభిప్రాయం ఏర్పడితే తగిన చర్య తీసుకోవడం సాధ్యమవుతుందని వివరించింది. రాజద్రోహం చట్టం ప్రయోగించిన ప్రతిసారీ ఇలాంటి ఉల్లంఘనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఆ ధోరణి మరిన్ని కేసులకు ఊతం ఇస్తున్నది. కేదార్నాథ్ కేసు వరకూ అవసరం లేదు...1995లో పంజాబ్‌లో ఇద్దరు ప్రభుత్వోద్యోగులపై పెట్టిన రాజద్రోహం కేసు విషయంలో సైతం సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగానే ఉంది. ‘ఖలిస్తాన్ జిందాబాద్’ అని వీరిద్దరూ ఇచ్చిన నినాదాలు రాజద్రోహం కేసు పెట్టడానికి అర్హమైనవి కాదని తెలిపింది. వారి నినాదాల కారణంగా హింస జరిగిం దని రుజువు చేస్తే వేరుగానీ కేవలం నినాదాలివ్వడమే నేరమంటే కుదరదని చెప్పింది. కానీ ఇప్పుడు మన కళ్లముందు జరుగుతున్నదంతా దానికి విరుద్ధం. ప్రభుత్వాలు తామే స్వయంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ తప్పుడు కేసులు పెడుతుండగా ప్రై వేటు వ్యక్తులను అవి అదుపు చేస్తాయని ఎవరూ విశ్వసించలేరు. నిజానికి ఇలాంటి చట్టాలకు ప్రజాస్వామ్యంలో తావులేదు. ఈ చట్టాన్ని 1870లో మన దేశంపై రుద్దిన బ్రిటిష్ పాలకులు తమ దేశంలో దీన్ని రద్దు చేసుకున్నారు. ఇండొనేసియా, స్కాట్లాండ్, దక్షిణ కొరియా వంటి దేశాల న్యాయ స్థానాలు ఈ మాదిరి చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించి కొట్టేశాయి. అమెరికాలో 218 ఏళ్లనాటి రాజద్రోహ చట్టం ఇంకా కొనసాగుతున్నా అందులో చాలా క్లాజులను న్యాయస్థానాలు రద్దు చేశాయి. మన సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు ఆహ్వానించదగ్గవనడంలో సందేహం లేదు. అయితే వీటి పర్యవసానంగా పరిస్థితి ఎంతవరకూ చక్కబడుతుందో వేచిచూడాలి. -
జేఎన్‌యూలో మరో వివాదం
న్యూఢిల్లీ: ఇటీవల వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన జేఎన్‌యూలో మరో వివాదం చోటుచేసుకుంది. తరగతి గదిలో తాము అకడమిక్ కరికులమ్‌లో భాగంగా ఒక చిత్రాన్ని చూస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది సోదాలు నిర్వహించారని జేఎన్‌యూ ఎంఫిల్ విద్యార్థులు ఆరోపించారు. కొంతమంది విద్యార్థులు ఈ విషయాన్ని జేఎన్‌యూ విద్యార్థి సంఘం దృష్టికి తీసుకెళ్లి వర్సిటీ అధికార యంత్రాంగాన్ని నిలదీయాలని కోరారు. సెక్యూరిటీ ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడలేదని, ఇటీవల ఘటనల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండేం దుకే సోదాలు చేశారని వర్సిటీ అధికారులు చెప్పారు. ‘రాజద్రోహం’ టైప్ చేస్తే జేఎన్‌యూ ప్రత్యక్షం: సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఓ సరికొత్త వివాదానికి కేంద్రమైంది. ‘గూగూల్ మ్యాప్స్’లో ‘యాంటీ-నేషనల్(జాతి వ్యతిరేకం), సెడిషన్(రాజద్రోహం), పెట్రియాటిజమ్(దేశభక్తి), భారత్ మాతా కీ జై’ అనే పదాల కోసం వెతుకుతుంటే ఢిల్లీలోని ‘జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ’ (జేఎన్‌యూ) ప్రత్యక్షమవుతోంది. దీనిపై వర్సిటీ విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, దీన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని గూగుల్ ప్రతినిధి చెప్పారు. -
కన్హయ్యకు బెయిల్ ఇవ్వద్దు
మాట మార్చిన ఢిల్లీ పోలీసులు న్యూఢిల్లీ: రాజద్రోహం అభియోగాలతో అరెస్ట్ చేసిన జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్యకుమార్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ పోలీసులు మాట మార్చారు. తొలుత అతడికి బెయిల్ మంజూరు చేయటానికి అభ్యంతరం లేదని పేర్కొన్న పోలీసులు.. మంగళవారం బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించారు. ఈ కేసు విచారణకు వచ్చినపుడు.. అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్‌మెహతా ఢిల్లీ పోలీసుల తరఫున హాజరై.. పిటిషన్‌ను వ్యతిరేకిస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభారాణికి తెలిపారు. అతడి బెయిల్‌కు అభ్యంతరం చెప్పబోమని గత వారం పేర్కొన్న ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి.ఎస్.బస్సి.. కన్హయ్య బెయిల్‌పై విడుదలై వచ్చినట్లయితే దర్యాప్తుపై ప్రభావం చూపుతారని పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాదుల వాగ్వాదం... ఈ కేసులో మెహతా, సంజయ్‌జైన్, న్యాయవాది అనిల్సోనీలు ఏఎస్జీలుగా వాదించటంపై ఢిల్లీ ప్రభుత్వ న్యాయవాది రాహుల్మెహ్రా అభ్యంతరం తెలిపారు. దీంతో.. జేఎన్‌యూ కేసులో పోలీసుల తరఫున వాదించేందుకు ఢిల్లీ ప్రభుత్వ న్యాయవాదిని తొలగించి.. మెహతా, జైన్, సోనీ తదితరులను ఏఎస్జీలుగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నియమించినట్లు ఆయన కార్యాలయం పోలీసులకు తెలిపింది. 8 మంది బయటివారి ఫొటోలు సిద్ధం... జేఎన్‌యూ వివాదంలో ప్రమేయం ఉందని అనుమానిస్తూ 8 మంది వ్యక్తుల ఫొటోలను ఢిల్లీ పోలీసులు సిద్ధం చేశారు. వారు ఆ వర్సిటీ విద్యార్థులు కాదని భావిస్తున్నారు. -
యువఘర్షణ
హెచ్సీయు, జేఎన్‌యూలు ‘జాతివ్యతిరేక కార్యకలాపా’లకు అడ్డాగా మారాయి’ అంటూ వార్తల్లోకెక్కాయి.దీంతో దేశంలోని విద్యార్థులే కాదు మేధావులూ ‘దేశభక్తి’, ‘దేశద్రోహం’ అనే అంశాలపై చర్చోపచర్చలకు దిగారు. ప్రస్తుత వాతావరణం ప్రచ్ఛన్న యుద్ధాన్ని తలపిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి నాయకురాలు చింటూతో సాక్షి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ... మీరు చదువుకునే విద్యార్థులు. కాని ఇవాళ మిమ్మల్ని దేశద్రోహులని కొందరు అంటున్నారు? దానికి మీ సమాధానం? చింటూ: అణ్వాయుధాల నుంచి ఆకలి చావుల వరకు, కశ్మీర్ నుంచి మా కాలేజీ కాంట్రాక్ట్ వర్కర్ల సమస్యల వరకు అనేకానేక సమస్యల పై పగలూరేయీ తేడా లేకుండా జేఎన్‌యూలో మా విద్యార్థులం చర్చిస్తాం. అది మా విశ్వవిద్యాలయ సత్సంప్రదాయం. దళితులు, ఆదివాసీలు, విద్యార్థుల హక్కుల కోసం మాట్లాడితే మేం దేశ ద్రోహులమా? జాతివిద్రోహులమా? ఇటీవల ఫిబ్రవరి 9 ఘటనలోనే కాదు గతంలో కూడా అనేక సార్లు మా పై దేశ ద్రోహం ముద్ర వేసారు. స్వయంగా బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి మాకా బిరుదిచ్చారు. ఈ దేశంలో ఎవరు దేశభక్తులో, ఎవరు దేశద్రోహులో ఈ దేశప్రజలు నిర్ణయిస్తారు. అఫ్జల్ గురు ఉరిని మీరు వ్యతిరేకించడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. దానికి మీ స్పందన. చింటూ: అఫ్జల్ గురు, మెమన్‌ల ఉరిశిక్షలే కాదు, అసలు ఉరిశిక్షలనే మేం రద్దుచేయాలని అడుగుతున్నాం. ఈ ప్రపంచంలో వందకుపైగా దేశాలు ఉరిశిక్షలను రద్దు చేశాయి. మన దేశంలో కూడా ఎందరో న్యాయమూర్తులు ఉరిశిక్షలను వ్యతిరేకిస్తున్నారు. వారంతా జాతివిద్రోహులా? ప్రాణానికి ప్రాణం ప్రతీకారమౌతుంది. న్యాయం ఎలా అవుతుంది? కశ్మీరీ ఆజాదీ గురించిన నినాదాలు చేశారన్న ఆరోపణపై మీరేమంటారు? చింటూ: కశ్మీర్ ప్రజలకు తమ భవిష్యత్తును తాము నిర్ణయించుకునే హక్కు వుంది. వాళ్ళు పాకిస్తాన్‌తో ఉండాలా? ఇండియాతో ఉండాలా అన్నది అక్కడి ప్రజల ఇష్టం. మేం ఈ దేశాన్ని భౌగోళికంగా కాదు మనుషులుగా ప్రేమిస్తాం. మట్టికి కాదు మనుషుల అభిప్రాయాలకు విలువివ్వండని కోరుతున్నాం. పాకిస్తాన్‌కి అనుకూల నినాదాలిచ్చారని మీపై ఆరోపణ. చింటూ: అటువంటి నినాదాలెవ్వరూ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న కన్హయ్య ఉపన్యాసం వీడియోలో అతని వెనుక ముక్కలైన భారతదేశ పటం కనిపిస్తుంది. సభ జరిగినప్పుడు అతని వెనుక ఏ బ్యానర్లేదు. మరి హఠాత్తుగా ముక్కలైన భారతదేశపటాన్ని కన్హయ్య వెనుక ఎవరుంచారు? ఇదే కాదు ఇంకా చాలా అవాస్తవాలను వాస్తవాలుగా ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కన్హయ్య అరెస్టులో వాస్తవాలేమిటి? చింటూ: ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదు. కావాలని ప్రీప్లాన్డ్‌గా చేశారు. కన్హయ్య అరెస్టు తీరు చూస్తే అది మరింత స్పష్టమవుతుంది. గతంలో మాదిరిగానే ఆ రోజు చాలా శాంతియుతంగా అఫ్జల్‌గురు సభ జరుపుకుంటున్నాం. రెండు రోజులు ముందుగానే విశ్వవిద్యాలయం పర్మిషన్ తీసుకున్నాం. పర్మిషన్ ఇవ్వకూడదనుకుంటే ముందే చెప్పొచ్చు. కానీ అలా జరగలేదు. సరిగ్గా సభ జరగడానికి 5 నిముషాల ముందు విశ్వవిద్యాలయంలో పోలీసులు మోహరించారు. ఢిల్లీ ప్రధాన నగరం నుంచి జేఎన్‌యూకి చేరుకోవాలంటే రెండున్నరగంటలు. మీడియా వాహనాలు కూడా టైమ్‌కి అక్కడికెలా చేరుకున్నాయి? అప్పటికప్పుడు మాకు వ్యతిరేకంగా ప్లకార్డులు ఎలా వచ్చాయి? వీటన్నింటికీ సమాధానం ఒక్కటే. ఎ.బి.వి.పి విద్యార్థులు పక్కా ప్లాన్ ప్రకారం ఈ దాడికి పూనుకున్నారు. అంతెందుకు న్యాయస్థానాల సాక్షిగా మా విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయి. ఏరోజూ విద్యార్థులు హింసాత్మకంగా వ్యవహరించలేదు. కానీ నేను కూడా వారి హిట్ లిస్టులో ఉన్నాను. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఒకే ఎత్తులో త్రివర్ణపతాకాన్ని ఎగురేయాలని మంత్రి స్మృతీ ఇరానీ అంటున్నారు? మీ అభిప్రాయం. చింటూ: ఈ దేశంలో త్రివర్ణపతాకాన్ని ఎగురేయడంపై మాకెటువంటి సమస్యలేదు. మేం ఈ దేశాన్ని అమితంగా ప్రేమిస్తున్నాం. ఇంకా ఎత్తులో ఎగురేయండి. మేం గౌరవిస్తాం. కానీ త్రివర్ణపతాకాన్ని ఎగురవేయాలంటున్నవారికి ఆ పతాకంపై ఎంత గౌరవం ఉంది? జాతీయ జెండా గౌరవం గురించి మాట్లాడుతున్నవాళ్లే జనవరి 26 వ తేదీన ఆ పతాకాన్ని కాకుండా కాషాయ జెండాలను వీధివీధినా ఎగురవేస్తున్నారు. ఈ దేశంలోని విశ్వవిద్యాలయాలను శాఫ్రనైజ్ చేయొద్దంటున్నాం. మేం ఈ దేశాన్ని కాషాయీకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అందుకే మాపై ఈ దేశవిద్రోహ ప్రచారం. అంతేకాదు ఇప్పుడు జేఎన్‌యూ బయటకి వెళ్ళాలంటే మాకు ఆటో కూడా దొరకదు. మమ్మల్ని పాకిస్తానీయులు అంటున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మమ్మల్ని వ్యభిచారులంటున్నారు. జేఎన్‌యూ విద్యార్థినులకిప్పుడు భద్రత లేదు. స్మృతీ ఇరానీకి ఇవేమీ పట్టవా? త్రివర్ణ పతాకాలెగురవేస్తే కులం పేరుతో, మతం పేరుతో, జెండర్ పేరుతో జరుగుతున్న దాడులు పరిష్కారం అవుతాయా... ఆమె సమాధానం చెప్పాలి. దేశ సరిహద్దులను కాపాడుతూ ప్రాణాలు కోల్పోతున్న వారిని గురించి మీరేమంటారు? చింటూ: దేశసరిహద్దులను కాపాడే సైనికుల్లాగానే ఈ దేశాన్ని అన్ని రకాల దోపిడీలనుంచి కాపాడేది విద్యార్థులే. రోహిత్ వేముల విషయంలోనూ, కన్హయ్య విషయంలోనూ అది స్పష్టమైంది. ఈ దేశంలోని విశ్వవిద్యాలయాలన్నింటిలో కొనసాగుతోన్న వివక్ష ఈ రోజు చర్చనీయాంశం అయ్యింది. దానికి సమాధానం చెప్పలేక, వారి మంత్రులను కాపాడుకొనేందుకు ఈ రోజు హెచ్‌సియు విద్యార్థులను, జేఎన్‌యూ విద్యార్థులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. జేఎన్‌యూ పై ఇదంతా ఎందుకు జరుగుతోంది? చింటూ: ప్రగతిశీల, అభ్యుదయ భావాలకు జేఎన్‌యూ వేదిక. సమాజాభివృద్ధిని స్వచ్ఛంగా కోరుకునేవారమే మేమంతా. ఈ దేశంలోని ప్రతి పైసా ఈ దేశ ప్రజలకే చెందాలన్నది మా అభిప్రాయం. కానీ ఈ దేశంలోని కూలినాలీ చేసుకునే జనం కష్టార్జితాన్ని దోచుకొని ఆ డబ్బును విదేశీ బ్యాంకుల్లో జమ చేసుకుంటున్న వారిని ఏ పేరుతో పిలవాలి? ఈ దేశంలో ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడి యథేచ్ఛగా తిరుగుతున్న వారినేమనాలి? ఈ దేశ స్త్రీలను కించపరుస్తూ మాట్లాడేవారు దేశభక్తులుగా చలామణీ అవుతున్నారు... వారినేమనాలి? జేఎన్‌యూలో చదువుకొని వెళ్ళినవాళ్ళనేక మంది ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలుగా, న్యాయమూర్తులుగా, న్యాయవాదులుగా ఈ దేశాన్ని తీర్చే దిద్దే గొప్పవ్యక్తులుగా దేశానికి సేవ చేస్తున్నారు. అభ్యుదయభావాలకు నిలయంగా ఉన్న జేఎన్‌యూ ప్రతిష్టను దెబ్బతీసే ఈ ప్రయత్నాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రోహిత్ చట్టంపై మీ పోరాటం ఎలా ఉండబోతోంది? చింటూ: రోహిత్ వేముల చట్టం కోసం, జేఎన్‌యూ విద్యార్థుల సమస్యలు, దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతోన్న అన్ని రకాల వివక్షలకి వ్యతిరేకంగా మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతాం. - అత్తలూరి అరుణ, సాక్షి, ప్రిన్సిపల్ కరస్పాండెంట్ ఇందులో మా ప్రమేయం లేదు ఢిల్లీ జేఎన్‌యూ ఘటనలో ఏబీవీపీ స్టూడెంట్స్ పోలీసులకు ఫోన్ చేయలేదు. సభ జరిగే మూడు రోజుల ముందు నుంచి యూనివర్శిటీలో జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ వాళ్లు అతికించిన పోస్టర్లను చూసి వీసీకి కంప్లయింట్ ఇచ్చాం. అలాగే ప్లకార్డులు పట్టుకుంది మేం అని వాళ్లు ఆరోపిస్తున్నారు. మా దగ్గర దేశభక్తి కోసం, జాతీయ జెండా కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులు 42 మంది ఉన్నారు. అలాంటి మేమెందుకు ఆ ప్లక్కార్డులు పట్టుకుంటాం? ఇక కన్హయ్య మాట్లాడిన వీడియోను మార్ఫింగ్ చేయాల్సిన అవసరం మాకులేదు. మా వీడియోలనే వాళ్లు మార్ఫింగ్ చేశారు. దీని మీద మేం సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ కూడా ఇచ్చాం. - జువ్వాజి దిలీప్ ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రటరీ మట్టికి కాదు మనిషికి విలువివ్వండి దళితులు, ఆదివాసీలు, విద్యార్థుల హక్కుల కోసం మాట్లాడితే మేం జాతివిద్రోహులమా? అఫ్జల్ గురు, మెమన్‌ల ఉరిశిక్షలే కాదు, అసలు ఉరిశిక్షలనే మేం రద్దుచేయాలని అడుగుతున్నాం. ఈ ప్రపంచంలో వందకుపైగా దేశాలు ఉరిశిక్షలను రద్దు చేశాయి. మన దేశంలోకూడా ఎందరో న్యాయమూర్తులు ఉరిశిక్షలను వ్యతిరేకిస్తున్నారు. వారంతా జాతివిద్రోహులా? ప్రాణానికి ప్రాణం ప్రతీకారమౌతుంది. న్యాయం ఎలా అవుతుంది? ఈ దేశంలోని విశ్వవిద్యాలయాలను శాఫ్రనైజ్ చేయొద్దంటున్నాం. మట్టికి కాదు మనుషుల అభిప్రాయాలకు విలువివ్వండని కోరుతున్నాం. ఈ దేశంలోని కూలినాలీ చేసుకునే జనం కష్టార్జితాన్ని దోచుకొని ఆ డబ్బును విదేశీ బ్యాంకుల్లో జమ చేసుకుంటున్న వారిని ఏ పేరుతో పిలవాలి?ఈ దేశంలో ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడి యథేచ్ఛగా తిరుగుతున్న వారిని ఏమనాలి? ఈ దేశ స్త్రీలను కించపరుస్తూ మాట్లాడేవారు దేశభక్తులుగా చలామణీ అవుతున్నారు వారినేమనాలి?