యువఘర్షణ | Youth clash | Sakshi
Sakshi News home page

యువఘర్షణ

Published Tue, Feb 23 2016 10:05 PM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM

యువఘర్షణ

యువఘర్షణ

హెచ్‌సీయు, జేఎన్‌యూలు ‘జాతివ్యతిరేక కార్యకలాపా’లకు అడ్డాగా మారాయి’ అంటూ  వార్తల్లోకెక్కాయి.దీంతో దేశంలోని విద్యార్థులే కాదు మేధావులూ ‘దేశభక్తి’, ‘దేశద్రోహం’ అనే అంశాలపై చర్చోపచర్చలకు దిగారు. ప్రస్తుత వాతావరణం ప్రచ్ఛన్న యుద్ధాన్ని తలపిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి  నాయకురాలు చింటూతో సాక్షి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ...
 
మీరు చదువుకునే విద్యార్థులు. కాని ఇవాళ మిమ్మల్ని దేశద్రోహులని కొందరు అంటున్నారు? దానికి మీ  సమాధానం?
చింటూ: అణ్వాయుధాల నుంచి ఆకలి చావుల వరకు, కశ్మీర్ నుంచి మా కాలేజీ కాంట్రాక్ట్ వర్కర్ల సమస్యల వరకు అనేకానేక సమస్యల పై పగలూరేయీ తేడా లేకుండా జేఎన్‌యూలో మా విద్యార్థులం చర్చిస్తాం. అది మా విశ్వవిద్యాలయ సత్సంప్రదాయం. దళితులు, ఆదివాసీలు, విద్యార్థుల హక్కుల కోసం మాట్లాడితే మేం దేశ ద్రోహులమా? జాతివిద్రోహులమా? ఇటీవల ఫిబ్రవరి 9 ఘటనలోనే కాదు గతంలో కూడా అనేక సార్లు మా పై దేశ ద్రోహం ముద్ర వేసారు. స్వయంగా బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి మాకా బిరుదిచ్చారు. ఈ దేశంలో ఎవరు దేశభక్తులో, ఎవరు దేశద్రోహులో ఈ దేశప్రజలు నిర్ణయిస్తారు.

అఫ్జల్ గురు ఉరిని మీరు వ్యతిరేకించడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. దానికి మీ స్పందన.
చింటూ: అఫ్జల్ గురు, మెమన్‌ల ఉరిశిక్షలే కాదు, అసలు ఉరిశిక్షలనే మేం రద్దుచేయాలని అడుగుతున్నాం. ఈ ప్రపంచంలో వందకుపైగా దేశాలు ఉరిశిక్షలను రద్దు చేశాయి. మన దేశంలో కూడా ఎందరో న్యాయమూర్తులు ఉరిశిక్షలను వ్యతిరేకిస్తున్నారు. వారంతా
జాతివిద్రోహులా? ప్రాణానికి ప్రాణం ప్రతీకారమౌతుంది. న్యాయం ఎలా అవుతుంది?
     
కశ్మీరీ ఆజాదీ గురించిన నినాదాలు చేశారన్న ఆరోపణపై మీరేమంటారు?
చింటూ: కశ్మీర్ ప్రజలకు తమ భవిష్యత్తును తాము నిర్ణయించుకునే హక్కు వుంది. వాళ్ళు పాకిస్తాన్‌తో ఉండాలా? ఇండియాతో ఉండాలా అన్నది అక్కడి ప్రజల ఇష్టం. మేం ఈ దేశాన్ని భౌగోళికంగా కాదు మనుషులుగా ప్రేమిస్తాం. మట్టికి కాదు మనుషుల అభిప్రాయాలకు విలువివ్వండని కోరుతున్నాం.
     
పాకిస్తాన్‌కి అనుకూల నినాదాలిచ్చారని మీపై ఆరోపణ.

 చింటూ: అటువంటి నినాదాలెవ్వరూ ఇవ్వలేదు.  సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న కన్హయ్య ఉపన్యాసం వీడియోలో అతని వెనుక ముక్కలైన భారతదేశ పటం కనిపిస్తుంది. సభ జరిగినప్పుడు అతని వెనుక ఏ బ్యానర్‌లేదు. మరి హఠాత్తుగా ముక్కలైన భారతదేశపటాన్ని కన్హయ్య వెనుక ఎవరుంచారు? ఇదే కాదు ఇంకా చాలా అవాస్తవాలను వాస్తవాలుగా ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

కన్హయ్య అరెస్టులో వాస్తవాలేమిటి?
చింటూ: ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదు. కావాలని ప్రీప్లాన్డ్‌గా చేశారు. కన్హయ్య అరెస్టు తీరు చూస్తే అది మరింత స్పష్టమవుతుంది. గతంలో మాదిరిగానే ఆ రోజు చాలా శాంతియుతంగా అఫ్జల్‌గురు సభ జరుపుకుంటున్నాం. రెండు రోజులు ముందుగానే విశ్వవిద్యాలయం పర్మిషన్ తీసుకున్నాం. పర్మిషన్ ఇవ్వకూడదనుకుంటే ముందే చెప్పొచ్చు. కానీ అలా జరగలేదు. సరిగ్గా సభ జరగడానికి 5 నిముషాల ముందు విశ్వవిద్యాలయంలో పోలీసులు మోహరించారు. ఢిల్లీ ప్రధాన నగరం నుంచి జేఎన్‌యూకి చేరుకోవాలంటే రెండున్నరగంటలు. మీడియా వాహనాలు కూడా టైమ్‌కి అక్కడికెలా చేరుకున్నాయి?  అప్పటికప్పుడు మాకు వ్యతిరేకంగా ప్లకార్డులు ఎలా వచ్చాయి? వీటన్నింటికీ సమాధానం ఒక్కటే. ఎ.బి.వి.పి విద్యార్థులు పక్కా ప్లాన్  ప్రకారం ఈ దాడికి పూనుకున్నారు. అంతెందుకు న్యాయస్థానాల సాక్షిగా మా విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయి. ఏరోజూ విద్యార్థులు హింసాత్మకంగా వ్యవహరించలేదు. కానీ నేను కూడా వారి హిట్ లిస్టులో ఉన్నాను.
     
దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఒకే ఎత్తులో త్రివర్ణపతాకాన్ని ఎగురేయాలని మంత్రి స్మృతీ ఇరానీ అంటున్నారు? మీ అభిప్రాయం.
చింటూ: ఈ దేశంలో త్రివర్ణపతాకాన్ని ఎగురేయడంపై మాకెటువంటి సమస్యలేదు. మేం ఈ దేశాన్ని అమితంగా ప్రేమిస్తున్నాం. ఇంకా ఎత్తులో ఎగురేయండి. మేం గౌరవిస్తాం. కానీ త్రివర్ణపతాకాన్ని ఎగురవేయాలంటున్నవారికి ఆ పతాకంపై ఎంత గౌరవం ఉంది? జాతీయ జెండా గౌరవం గురించి మాట్లాడుతున్నవాళ్లే  జనవరి 26 వ తేదీన ఆ పతాకాన్ని కాకుండా కాషాయ జెండాలను వీధివీధినా ఎగురవేస్తున్నారు. ఈ దేశంలోని విశ్వవిద్యాలయాలను శాఫ్రనైజ్ చేయొద్దంటున్నాం. మేం ఈ దేశాన్ని కాషాయీకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అందుకే మాపై ఈ దేశవిద్రోహ ప్రచారం. అంతేకాదు ఇప్పుడు జేఎన్‌యూ బయటకి వెళ్ళాలంటే మాకు ఆటో కూడా దొరకదు. మమ్మల్ని పాకిస్తానీయులు అంటున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మమ్మల్ని వ్యభిచారులంటున్నారు. జేఎన్‌యూ విద్యార్థినులకిప్పుడు భద్రత లేదు. స్మృతీ ఇరానీకి ఇవేమీ పట్టవా? త్రివర్ణ పతాకాలెగురవేస్తే కులం పేరుతో, మతం పేరుతో, జెండర్ పేరుతో జరుగుతున్న దాడులు పరిష్కారం అవుతాయా... ఆమె సమాధానం చెప్పాలి.

దేశ సరిహద్దులను కాపాడుతూ ప్రాణాలు కోల్పోతున్న వారిని గురించి మీరేమంటారు?
చింటూ: దేశసరిహద్దులను కాపాడే సైనికుల్లాగానే ఈ దేశాన్ని అన్ని రకాల దోపిడీలనుంచి కాపాడేది విద్యార్థులే. రోహిత్ వేముల విషయంలోనూ, కన్హయ్య విషయంలోనూ అది స్పష్టమైంది. ఈ దేశంలోని విశ్వవిద్యాలయాలన్నింటిలో కొనసాగుతోన్న వివక్ష ఈ రోజు చర్చనీయాంశం అయ్యింది. దానికి సమాధానం చెప్పలేక, వారి మంత్రులను కాపాడుకొనేందుకు ఈ రోజు హెచ్‌సియు విద్యార్థులను, జేఎన్‌యూ విద్యార్థులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు.

జేఎన్‌యూ పై  ఇదంతా ఎందుకు జరుగుతోంది?
చింటూ: ప్రగతిశీల, అభ్యుదయ భావాలకు జేఎన్‌యూ వేదిక. సమాజాభివృద్ధిని స్వచ్ఛంగా కోరుకునేవారమే మేమంతా. ఈ దేశంలోని ప్రతి పైసా ఈ దేశ ప్రజలకే చెందాలన్నది మా అభిప్రాయం. కానీ ఈ దేశంలోని కూలినాలీ చేసుకునే జనం కష్టార్జితాన్ని దోచుకొని ఆ డబ్బును  విదేశీ బ్యాంకుల్లో జమ చేసుకుంటున్న వారిని ఏ పేరుతో పిలవాలి? ఈ దేశంలో ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడి యథేచ్ఛగా తిరుగుతున్న  వారినేమనాలి? ఈ దేశ స్త్రీలను కించపరుస్తూ మాట్లాడేవారు దేశభక్తులుగా చలామణీ అవుతున్నారు... వారినేమనాలి? జేఎన్‌యూలో చదువుకొని వెళ్ళినవాళ్ళనేక మంది ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలుగా, న్యాయమూర్తులుగా, న్యాయవాదులుగా ఈ దేశాన్ని తీర్చే దిద్దే గొప్పవ్యక్తులుగా దేశానికి సేవ చేస్తున్నారు. అభ్యుదయభావాలకు నిలయంగా ఉన్న జేఎన్‌యూ ప్రతిష్టను దెబ్బతీసే ఈ ప్రయత్నాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
     
రోహిత్ చట్టంపై మీ పోరాటం ఎలా ఉండబోతోంది?
చింటూ: రోహిత్ వేముల చట్టం కోసం, జేఎన్‌యూ విద్యార్థుల సమస్యలు, దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతోన్న అన్ని రకాల వివక్షలకి వ్యతిరేకంగా మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతాం.
 - అత్తలూరి అరుణ, సాక్షి, ప్రిన్సిపల్ కరస్పాండెంట్
 
ఇందులో మా ప్రమేయం లేదు
ఢిల్లీ జేఎన్‌యూ ఘటనలో ఏబీవీపీ స్టూడెంట్స్ పోలీసులకు ఫోన్ చేయలేదు. సభ జరిగే మూడు రోజుల ముందు నుంచి యూనివర్శిటీలో జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ వాళ్లు అతికించిన పోస్టర్లను చూసి వీసీకి కంప్లయింట్ ఇచ్చాం. అలాగే ప్లకార్డులు పట్టుకుంది మేం అని వాళ్లు ఆరోపిస్తున్నారు. మా దగ్గర దేశభక్తి కోసం, జాతీయ జెండా కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులు 42 మంది ఉన్నారు. అలాంటి మేమెందుకు ఆ ప్లక్కార్డులు పట్టుకుంటాం? ఇక కన్హయ్య మాట్లాడిన వీడియోను మార్ఫింగ్ చేయాల్సిన అవసరం మాకులేదు. మా వీడియోలనే వాళ్లు మార్ఫింగ్ చేశారు. దీని మీద మేం సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ కూడా ఇచ్చాం.
 - జువ్వాజి దిలీప్
 ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రటరీ    
 
మట్టికి కాదు మనిషికి విలువివ్వండి
దళితులు, ఆదివాసీలు, విద్యార్థుల హక్కుల కోసం మాట్లాడితే మేం జాతివిద్రోహులమా? అఫ్జల్ గురు, మెమన్‌ల ఉరిశిక్షలే కాదు, అసలు ఉరిశిక్షలనే మేం రద్దుచేయాలని అడుగుతున్నాం. ఈ ప్రపంచంలో వందకుపైగా దేశాలు ఉరిశిక్షలను రద్దు చేశాయి. మన దేశంలోకూడా ఎందరో న్యాయమూర్తులు ఉరిశిక్షలను వ్యతిరేకిస్తున్నారు. వారంతా జాతివిద్రోహులా? ప్రాణానికి ప్రాణం ప్రతీకారమౌతుంది. న్యాయం ఎలా అవుతుంది?  ఈ దేశంలోని విశ్వవిద్యాలయాలను శాఫ్రనైజ్ చేయొద్దంటున్నాం.  మట్టికి కాదు మనుషుల అభిప్రాయాలకు విలువివ్వండని కోరుతున్నాం. ఈ దేశంలోని కూలినాలీ చేసుకునే జనం కష్టార్జితాన్ని దోచుకొని ఆ డబ్బును  విదేశీ బ్యాంకుల్లో జమ చేసుకుంటున్న వారిని ఏ పేరుతో పిలవాలి?ఈ దేశంలో ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడి యథేచ్ఛగా తిరుగుతున్న  వారిని ఏమనాలి?   ఈ దేశ స్త్రీలను కించపరుస్తూ మాట్లాడేవారు దేశభక్తులుగా చలామణీ అవుతున్నారు వారినేమనాలి?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement