కేవాడియా: మన దేశానికి ద్రోహం చేసినవారికి ప్రపంచంలో ఇంకెక్కడా స్వర్గధామాలు లేకుండా చేయాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులకు ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారు. భారత్‌లో నేరాలకు పాల్పడి, విదేశాలకు పారిపోయి తలదాచుకొనే పరిస్థితి లేకుండా చూడాలన్నారు. ‘దేశానికి ద్రోహం చేసిన వారికి, ఇక్కడ నేరాలకు పాల్పడిన వారికి విదేశాల్లో నిలువ నీడ లేకుండా చేయాలి’ అని అధికారులను ఉద్దేశించి పేర్కొన్నారు.
గుజరాత్‌లోని కేవాడియాలో బుధవారం సీవీసీ, సీబీఐ ఉమ్మడి సదస్సులో మోదీ వర్చువల్‌గా మాట్లాడారు. దేశ ప్రయోజనాలకు, దేశ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే వారు ఎంతటి బలవంతులైనా ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్థిక నేరాలకు పాల్పడి, విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి వారిని వెనక్కి రప్పించేందుకు కేంద్రం ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అవినీతి.. పేదల హక్కులను హరిస్తుంది
కేంద్ర ప్రభుత్వం గత ఆరేడేళ్లుగా సాగిస్తున్న నిరి్వరామ కృషితో దేశ ప్రజల్లో విశ్వాసం ఏర్పడిందని, అవినీతిని అడ్డుకోవడం సాధ్యమేనని వారు నమ్ముతున్నారని ప్రధాని మోదీ చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, లంచాల బెడద లేకుండా ప్రభుత్వ పథకాలతో నుంచి తమకు రావాల్సిన ప్రయోజనాలు పొందవచ్చని ప్రజలు భావిస్తున్నారని గుర్తుచేశారు. అవినీతి.. అది చిన్నదైనా, పెద్దదైనా పేద ప్రజల హక్కులను హరిస్తుందని అన్నారు. దేశ అభివృద్ధి నిరోధిస్తుందని చెప్పారు.
మన సమ్మిళిత శక్తిని ప్రభావితం చేస్తుందని వెల్లడించారు. అవినీతిని నియంత్రించే దిశగా గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ప్రస్తుతం రాజకీయ సంకల్పం, పాలనాపరమైన సంస్కరణలతో అవినీతికి చెక్ పెడుతున్నామని మోదీ తెలియజేశారు. ప్రజలపై నియంత్రణ చర్యలను తగ్గిస్తున్నామని, తద్వారా వారి జీవితాలను సరళతరం చేస్తున్నామని చెప్పారు. కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన అనే విధానాన్ని తాము విశ్వసిస్తున్నాని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment