న్యూఢిల్లీ: ప్రస్తుత తరుణంలో ఉమ్మడి పౌరస్మృతి(అందరికీ ఒకే చట్టం) అవసరం గానీ, దానివల్ల ప్రయోజనం గానీ లేదని కేంద్ర న్యాయ కమిషన్ పేర్కొంది. వివాహం, విడాకులు, జీవనభృతి, పురుషులు, మహిళలకు చట్టబద్ధ వివాహ వయస్సు తదితర అంశాలపై ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల్లో మార్పులు అవసరమని ఉమ్మడి పౌరస్మృతిపై విడుదల చేసిన సంప్రదింపుల పత్రంలో అభిప్రాయపడింది. స్త్రీ, పురుషులకు వివాహ వయసును 18 ఏళ్లుగా మార్చాలంది.
వివాహ చట్టాల్లో మార్పులు చేయాలి..
మహిళలకు సమాన హక్కులపై స్పందిస్తూ.. ‘ఒక మహిళ సంపాదనతో నిమిత్తం లేకుండా ఇంట్లో ఆమె పాత్రను గుర్తించాలి. వివాహం తర్వాత సంపాదించుకున్న ఆస్తిలో విడాకుల సమయంలో మహిళకు సమాన వాటా అందాలి’ అని తెలిపింది. ఇందుకోసం హిందూ వివాహ చట్టం 1955, ప్రత్యేక వివాహ చట్టం 1954, పార్సీ వివాహ, విడాకుల చట్టం యాక్ట్ 1936, క్రైస్తవ వివాహ చట్టం 1972, ముస్లిం వివాహ రద్దు చట్టం 1939లను సవరించవచ్చని పేర్కొంది. పురుషులకు, మహిళలకు కనిష్ట వివాహ వయస్సు 18 ఏళ్లుగా ఉండాలని, వేర్వేరు వివాహ వయస్సుల్ని రద్దు చేయాలంది.
ప్రస్తుతం వివాహానికి పురుషుడికి 21 ఏళ్లు, మహిళకు 18 ఏళ్లు చట్టబద్ధ వయసుగా ఉంది. వితంతు హక్కులు, వివాహం అనంతరం సొంతంగా సంపాదించుకునే ఆస్తులపై చట్టాలు, సరిదిద్దలేనంతగా వివాహ జీవితం విచ్చిన్నం కావడాన్ని విడాకులను ప్రామాణికంగా తీసుకోవడం వంటి అంశాలపై సూచనలు చేసింది. పార్సీలకు సంబంధించి ఆ మతానికి చెందిన మహిళ వేరే మతస్తుడ్ని వివాహం చేసుకున్నా వారసత్వ ఆస్తిలో ఆమెకు భాగం ఉండాలంది. పిల్లల సంరక్షణ బాధ్యతల అప్పగింతలో వ్యక్తిగత చట్టాలకన్నా ఆ చిన్నారి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కమిషన్ పేర్కొంది.
మతం ముసుగులో..
మత సంప్రదాయాల ముసుగులో ట్రిపుల్ తలాఖ్, బాల్య వివాహాలు వంటి సాంఘిక దురాచారాలు అమలుకాకుండా చూడాల్సి ఉందని కమిషన్ అభిప్రాయపడింది. ఉమ్మడి పౌరస్మృతి చాలా విస్తృతమైందని, దాని పరిణామాల ప్రభావంపై ఎలాంటి అధ్యయనం జరగలేదు అని పేర్కొంది. రెండేళ్ల పాటు విస్తృత పరిశోధన, సంప్రదింపుల అనంతరం భారతదేశంలోని కుటుంబ చట్టాలపై సంప్రదింపుల పత్రం సమర్పిస్తున్నామని తెలిపింది.
విభేదించడం రాజద్రోహం కాదు
ప్రభుత్వాన్ని విమర్శించడం, లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా అంశాలతో విభేదించడం రాజద్రోహం కాదని, ఉద్దేశ పూర్వకంగా చట్టవిరుద్ధంగా, హింసాత్మకంగా ప్రభుత్వాన్ని కూలగొట్టే చర్యలకు పాల్పడినప్పుడే ఆ నేరం రాజద్రోహంగా పరిగణిస్తారని పేర్కొంది. ఐపీసీ 124ఏ సెక్షన్‌ను సమీక్షించాలని, దేశంలో బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన రాజద్రోహం సెక్షన్‌ని పదేళ్ళ క్రితమే బ్రిటన్‌లో రద్దుచేసిన విషయాన్ని కమిషన్ గుర్తుచేసింది. ప్రజాస్వామ్య మనుగడకు భావప్రకటనా స్వేచ్ఛ ఎంతో అవసరమని, జాతి సమగ్రతను కాపాడాలనుకుంటే దానిని హరించకూడదని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment