మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే పాలన నడుస్తుంది
అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ యాదవ్ వ్యాఖ్యలు
బహు భార్యత్వం, ట్రిపుల్ తలాఖ్‌ను తప్పుబట్టిన వైనం
ప్రయాగ్‌రాజ్: దేశంలో మెజారిటీ ప్రజల ఇష్టానుసారం పాలన కొనసాగాలని చెప్పేందుకు మాత్రం సంకోచించనని అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ డాక్టర్ శేఖర్ యాదవ్ వ్యాఖ్యా నించారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆదివారం అలహాబాద్ హైకోర్టు లైబ్రెరీ హాల్లో విశ్వహిందూ పరిషత్ హైకోర్టు యూనిట్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అంశంపై ఆయన మాట్లాడారు. ‘‘మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే చట్టం నడుచుకోవాలి. కుటుంబంగా చూసినా, సమాజంగా చూసినా మెజారిటీ ప్రజల సంక్షేమం, సంతోషమే ముఖ్యం’’ అన్నారు.
ముస్లింలలో ఉన్న బహుభార్యత్వం, త్రిపుల్ తలాఖ్, హలాలా వంటి విధానాలను జడ్జి పరోక్షంగా విమర్శించారు. ‘‘ మా పర్సనల్ లా వీటికి అంగీకరిస్తోందని అది ఏమాత్రం ఆమోదనీయం కాదు. మన శాస్త్రాలు, వేదాల్లో స్త్రీని శక్తిస్వరూపిణిగా భావించారు. నలుగురు భార్యలను కల్గి ఉంటాను, హలాలా, త్రిపుల్ తలాఖ్‌ను పాటిస్తానంటే కుదరదు. సామరస్యం, లింగ సమానత, సామ్యవాదమే యూసీసీ ధ్యేయం. అంతే తప్ప వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్, హిందూయిజాలను అది ప్రోత్సహించదు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment