ముస్లింలకు కొత్త విడాకుల చట్టం!
- ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తే తెస్తామన్న కేంద్రం
- సుప్రీంకోర్టుకు నివేదించిన ఏజీ
న్యూఢిల్లీ: ముస్లింల వివాహాల క్రమబద్ధీకరణ, విడాకుల కోసం చట్టం తీసుకువచ్చేందుకు కేంద్ర సంసిద్ధత వ్యక్తం చేసింది. ట్రిపుల్ తలాక్ సహా అన్ని విడాకుల విధానాలను సుప్రీంకోర్టు రద్దువేస్తే కొత్త చట్టం తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ (ఏజీ) ముకుల్ రోహత్గీ... ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సోమవారం నివేదించారు. ముస్లింల విడాకుల విధానాలను తాము కొట్టివేసినట్లయితే కేంద్రం ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుందని ధర్మాసనం ప్రశ్నించడంతో రోహత్గీ ఈ వివరణ ఇచ్చారు. విడాకుల కోసం ముస్లిం సమాజంలో అనుసరిస్తున్న మూడు విధానాలు.. తలాక్–ఏ–బిదత్, తలాక్ హసన్, తలాక్ ఆషాన్‌లు ఏకపక్షం, చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
‘పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాన్, లిబియా తదితర ముస్లిం దేశాల్లోనే కాకుండా లౌకిక దేశమైన శ్రీలంకలోనూ ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేశారు. మతపాలిత రాజ్యాలే సంస్కరణలవైపు పయనిస్తోంటే భారత్ వంటి లౌకిక దేశం ఎందుకు వీటిని ఇంకా పాటించాలి?’ అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జె.ఎస్.ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ.. ప్రస్తుతానికైతే ఒక్క ట్రిపుల్ తలాక్ ఇస్లాంలో తప్పనిసరా కాదా అంశంపైనే వాదనలు విని, తీర్పు చెబుతామని స్పష్టం చేసింది. ట్రిపుల్ తలాక్ ఇస్లాంలో భాగం కాదని ప్రభుత్వం నిరూపించాల్సి ఉందని పేర్కొంది.