ఢిల్లీలో సదస్సు సందర్భంగా గ్రూప్ ఫొటో దిగిన ప్రధాని మోదీ, సీజేఐ జస్టిస్ బాబ్డే, కేంద్ర మంత్రి రవిశంకర్. చిత్రంలో జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ లావు నాగేశ్వరరావు, ఇతర సుప్రీంకోర్టు జడ్జీలు ఉన్నారు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఇచ్చిన క్లిష్ట తీర్పులపై భయాందోళనలు వ్యక్తమైనా పట్టించుకోకుండా దేశ ప్రజలు మనస్ఫూర్తిగా స్వాగతించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో శనివారం దేశరాజధానిలో మొదలైన అంతర్జాతీయ న్యాయ సదస్సులో ‘న్యాయవ్యవస్థ –మారుతున్న ప్రపంచం’ అంశంపై ప్రధాని ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. క్లిష్టమైన అంశాలపై ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ప్రపంచవ్యాప్త చర్చకు కారణమయ్యాయి. తీర్పు ఎలా ఉంటుందోనన్న భయాందోళనలు ముందుగా వ్యక్తమయ్యాయి. వాటిని పట్టించుకోకుండా దేశంలోని వంద కోట్ల మంది ప్రజలు న్యాయస్థానం తీర్పులను మనస్ఫూర్తిగా స్వాగతించారు’ అని అన్నారు.
ఎంతో సున్నితమైన ‘అయోధ్య’, ‘ట్రిపుల్ తలాక్’ కేసు సహా వివిధ అంశాలపై ఇటీవలి కాలంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లింగ సమానత్వం లేకుండా ఏ దేశం, ఏ సమాజం కూడా పరిపూర్ణంగా అభివృద్ధి చెందజాలవన్నారు. తమ ప్రభుత్వం సైన్యంలో మహిళలకు సమాన అవకాశాలను కల్పించేందుకు, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి మధ్య సమతూకం ఉండేలా దేశ న్యాయవ్యవస్థ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ‘ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేథ, ఇంటర్నెట్ వంటి వాటిని ప్రజలందరికీ మరింత వేగంగా న్యాయం అందించేందుకు ఉపయోగించుకోవాలి. మారుతున్న కాలంలో సమాచార పరిరక్షణ, సైబర్ నేరాలు న్యాయవ్యవస్థకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి.
రాజ్యాంగానికి మూడు ప్రధానాంగాలైన న్యాయ, శాసనసభ కార్యనిర్వాహక వ్యవస్థలు తమ పరిధిలో పనిచేస్తూ దేశం ఎదుర్కొన్న ఎన్నో సవాళ్లను విజయవంతంగా అధిగమించాయి. ఇలాంటి సత్సంప్రదాయాన్ని నెలకొల్పుకున్నందుకు మనం గర్వపడాలి’ అని ప్రధాని చెప్పారు. పనికిరాని చట్టాలను రద్దు చేయడంతో పాటు సమాజ వికాసానికి అవసరమైన చట్టాలను రూపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని అన్నారు. ఈ కోర్టుల విధానం ద్వారా అన్ని కోర్టులను అనుసంధానించేందుకు, కోర్టు ప్రక్రియను సరళతరం చేసేందుకు నేషనల్ జ్యుడిషియర్ డేటాను నెలకొల్పుతామన్నారు. ఈ ప్రపంచ స్థాయి సదస్సులో 20కి పైగా దేశాల జడ్జీలు హాజరయ్యారు. సదస్సులో సీజేఐ జస్టిస్ బాబ్డే, సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎన్‌వీ రమణ, కేంద్రం మంత్రి రవిశంకర్æ, అటార్నీజనరల్ వేణుగోపాల్ తదితరులు ప్రసంగించారు.
మన న్యాయవ్యవస్థకు 2వేల ఏళ్ల చరిత్ర: సీజేఐ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే మాట్లాడుతూ..‘మొఘల్, డచ్, పోర్చుగీస్, ఇంగ్లిష్ సంస్కృతుల సమ్మేళనమే భారత్ అని పేర్కొన్నారు. దేశంలో సాధారణ న్యాయ వ్యవస్థ 2 వేల ఏళ్లపాటు పరిణామం చెందుతూ వచ్చింది. ఏళ్ల క్రితమే వ్యవస్థీకృతమైన చట్టాలు, న్యాయవ్యవస్థ ఉండేవి. న్యాయాధికారుల సమక్షంలో బహిరంగంగానే విచారణ జరిగేది’అని తెలిపారు. అప్పట్లోని పరిస్థితులను సీజేఐ ప్రస్తావిస్తూ..ఒక వ్యక్తి దోషిత్వం నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేని సందర్భాల్లో ‘కోడి కాలేయం’ పరీక్ష ద్వారా నిర్ధారించేవారు. తీర్పునిచ్చే గ్రామ పెద్ద.. కోడి కాలేయాన్ని బయటకు తీసి, పరీక్షించేవాడు. దానిని బట్టి అప్పటికప్పుడు దోషి ఎవరనేది ధ్రువీకరించే సంప్రదాయం ఈశాన్య రాష్ట్రాల్లోని గ్రామాల్లో ఉండేది. అలాగే, ఎవరైనా వ్యక్తి పదవీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పులి దంతాన్ని పట్టుకునే రివాజు ఉండేది. ఇలాంటివి మన సంప్రదాయాల్లో భిన్నత్వానికి ఉదాహరణలు’ అని తెలిపారు. ‘పెరుగుతున్న సాంకేతికత ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసింది. ఫలితంగా నిర్ణయాల ప్రభావం సంబంధిత న్యాయస్థానం పరిధికి వెలుపలా ఉంటోంది’ అని అన్నారు.
చట్టాలు వర్తమాన పరిస్థితులకు అద్దం పట్టాలి
జస్టిస్ లావు నాగేశ్వరరావు
చట్టాలు వర్తమాన పరిస్థితులకు అద్దం పట్టేలా పరిణామం చెందుతూ ఉండాలని సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ లావు నాగేశ్వరరావు పేర్కొన్నారు. సదస్సులో ఆయన స్వాగతోపన్యాసం చేశారు. ‘చట్టాలు పరిణామం చెందడం అతి ముఖ్యమైన అంశం. దేశ ప్రగతి, సామాజిక పరిస్థితులను ఈ చట్టాలు ప్రతిబింబింపజేస్తాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు పరిణామం చెందనిపక్షంలో అది అన్యాయానికి దారితీస్తుంది’ అని ఆయన అన్నారు. ‘సమాజం, చట్టం మధ్య వారధిలా న్యాయమూర్తి పాత్ర ఉండాలి. వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా న్యాయస్థానాలు చట్టాలకు భాష్యాన్ని చెప్పాలి. ఇలాంటి సందర్భాల్లో న్యాయస్థానాలు జాగ్రత్త వహించాలి. ఇలాంటి సందర్భాల్లో రాజ్యాంగ లక్ష్యాలు, ఉద్దేశాలు ఓడిపోకూడదు..’ అని పేర్కొన్నారు. డెబ్బై ఏళ్లుగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు నిష్పాక్షికంగా, స్వతంత్రంగా న్యాయం వైపు నిలబడ్డారని పేర్కొన్నారు.
ఆన్‌లైన్ డేటాకూ రక్షణ ఉండాలి
వ్యక్తిగత గోప్యతా హక్కును ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు గుర్తించింది. దీని వల్ల ఫోన్ సంభాషణలేకాదు, ఆన్‌లైన్ డేటాకు రక్షణ కల్పించాలి. జాతి అభివృద్ధి, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు మారాలి. ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న వివిధ న్యాయరీతులను అర్థం చేసుకుని, పాటించడం ద్వారా న్యాయ సమస్యలను మరింత సమర్థంగా పరిష్కరించేందుకు వీలు కలుగుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఎంతో కీలకమైన ప్రాథమిక విలువలు, లక్ష్యాలను సాధించేలా జడ్జీలు తీర్పులిచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. గత 70 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హక్కులను కాపాడేందుకు, చట్ట పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు జడ్జీలిచ్చిన తీర్పులే న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడాయి.
జనాకర్షక నిర్ణయాలతో రాజ్యాంగ హక్కులు ప్రభావితం
జస్టిస్ ఎన్.వి.రమణ
జనాకర్షక నిర్ణయాలు రాజ్యాంగ హక్కులను ప్రభావితం చేస్తాయని, న్యాయస్థానాలు ఈ సందర్భంలో సముచిత నిర్ణయం తీసుకుంటూ రాజ్యాంగ విలువలు కాపాడాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. ఈ భూమిపై శాంతి ఉండాలంటే మన జాతి, మన తెగ, మన తరగతి, మన దేశం వంటి వాటిపై మన విధేయతను అధిగమించాలని, ప్రపంచ దృక్పథాన్ని కలిగి ఉండాలని మార్టిన్ లూథర్ కింగ్ చెప్పిన సూక్తిని జస్టిస్ రమణ ఉటంకించారు. ‘మహిళలు ప్రపంచ జనాభాలో సగం ఉన్నారు. మొత్తం ప్రపంచ పనిగంటల్లో మూడింట రెండో వంతు వారిదే. ప్రపంచ ఆదాయంలో పదో వంతు పొందుతారు. కానీ ప్రపంచ సంపదలో 0.01 శాతం కంటే తక్కువ సంపదను వారు కలిగి ఉన్నారు. చాలా దేశాలు తమ రాజ్యాంగం ద్వారా గానీ, మరో విధానంలో గానీ లింగ సమానత్వాన్ని, మహిళల గౌరవాన్ని గుర్తించాలి.
నిత్యం వివక్షకు గురవుతున్న మహిళల అభ్యున్నతిని.. చట్టంలో ఉన్నతమైన ప్రకటనలు చేయడం వల్ల ఉద్దరించలేమని మనం అందరం గ్రహించాం. లింగ సమానత్వాన్ని కాపాడేందుకు న్యాయ వ్యవస్థకు తగినతం అవకాశాలు ఉన్నాయి. అందువల్ల లింగ సమానత్వం కాపాడడంలో ఎలాంటి రాజీ ఉండరాదని మనం గ్రహించాలి..’ అని పేర్కొన్నారు. ‘పర్యావరణ పరిరక్షణకు మనం తీసుకునే చర్యలు కేవలం ప్రస్తుత తరానికే కాకుండా భవిష్యత్తు తరాలకు సురక్షితమైన పర్యావరణాన్ని అందించే గొప్ప పనిగా మనం గ్రహించాలి’ అని అన్నారు. అంతర్జాతీయ సంస్థల ద్వారా ఇంటర్నెట్ సేవలు అందుతు న్నందున ఈ టెక్నాలజీలో వ్యక్తమవుతున్న జాతీయ, అంతర్జాతీయ ఆందోళనలకు తగిన పరిష్కారం చూపాలని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment