ట్రిపుల్ తలాక్ తీర్పుపై హర్షాతిరేకాలు
- చారిత్రాత్మక తీర్పన్న ప్రధాని మోదీ
- స్వాగతించిన బీజేపీ, కాంగ్రెస్..
న్యూఢిల్లీ: ముస్లింల ట్రిపుల్ తలాక్ విధానంపై దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం వెలువరించిన తీర్పుపై పలు వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ.. దీనినొక చారిత్రాత్మకమైన తీర్పని, మహిళా సాధికారతకు కొలమానమని అన్నారు.
‘‘ట్రిపుల్ తలాక్ అంశంపై ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకం. ముస్లిం సమాజంలో మహిళలు కూడా పురుషులతో సమానమనే భావనను ఈ తీర్పు ఎలుగెత్తిచాటింది. ఇది మహిళా సాధికారతకు ఒక శక్తివంతమైన కొలమానం కూడా’’ అని మోదీ ట్వీట్ చేశారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ.. ట్రిపుల్ తలాక్‌పై సుప్రీం తీర్పును బీజేపీ స్వాగతిస్తున్నదని, దీనిని ఒక వర్గం ఓటమిగానో, ఇంకొకవర్గం గెలుపుగానో చూడవద్దని కోరారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రులు, న్యాయవాది కపిల్ సిబాల్.. సుప్రీం తీర్పు.. మహిళ వ్యక్తిగత హక్కులను పరిరక్షిస్తుందని అన్నారు. మరో మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ ‘మేం ఊహించిన, కోరుకున్న తీర్పే వచ్చింది’ అని అన్నారు.
(ట్రిపుల్ తలాఖ్: సుప్రీంకోర్టు సంచలన తీర్పు)