ఏదో వంకన కులమతాల కుంపట్లు రాజేసే పనికి పాల్పడవద్దని సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన హితవు కూడా ప్రభుత్వాల చెవికెక్కడంలేదు. ఇందుకు ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాల పోకడలు నిదర్శనం. కావడ్ యాత్ర సాగే పొడవునా ఆహారం, ఇతర తినుబండారాలు విక్రయించే వ్యాపారులు తమ పేర్లను తెలిపే బోర్డుల్ని ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగం జారీ చేసిన హుకుంను మొన్న జూలైలో సుప్రీంకోర్టు నిలిపి వేయగా, దాన్ని వమ్ము చేస్తూ వేరే మార్గంలో అమలు చేయటానికి అక్కడి ప్రభుత్వం పూనుకోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
యూపీని చూసి మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌లు సైతం వాతలు పెట్టుకున్నాయి. అవి కూడా బీజేపీ ప్రభుత్వాలే. కానీ ఈ మాదిరి ధోరణులకు వ్యతిరేకమని చెప్పే కాంగ్రెస్ నేతృత్వంలోని హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం సైతం ఈ ప్రయత్నమే చేయటం మరింత దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఒక మంత్రి తెలిసీ తెలియక ఏదో అన్నారని కాంగ్రెస్ సంజాయిషీ చెబుతున్నా ఆత్మవిమర్శ చేసుకోవటం ఆ పార్టీ బాధ్యత. ఎవరూ కుల మతాలను ఎంచుకుని పుట్టరు. కానీ పుట్టకనుబట్టి వివక్ష ప్రదర్శించే దురాచారం మన దేశంలో రాజ్యాంగం నిషేధించినా కొనసాగుతూనేవుంది.
దహనకాండకు దిగే వ్యక్తులను దుస్తుల్ని బట్టి పోల్చుకోవచ్చని అయిదేళ్లక్రితం ప్రధాని నరేంద్ర మోదీ అన్నప్పుడు దుమారం రేగింది. అప్పటికి పౌరసత్వ సవరణ చట్టంపై కొనసాగుతున్న ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. దుస్తులే కాదు... ఇంటిపేర్లూ, పేర్లూ, పేర్లచివరవుండే తోకలు, తినే తిండి కూడా సమ స్యాత్మకం కావటం వర్తమానంలో ఎక్కువైంది. దీన్నంతటినీ గమనించబట్టే యూపీ పోలీసుల ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఇలాంటి ఉత్తర్వులిచ్చే అధికారం పోలీసు విభాగానికిఉండదని చెబుతూనే తోపుడు బండ్లు, ధాబాలు, హోటళ్ల యజమానులు స్వచ్ఛందంగా తమ పేర్లు ప్రదర్శించదల్చుకుంటే అభ్యంతరంలేదని, అయితే బలవంతంగా ఆ పని చేయించరాదని సుప్రీంకోర్టు అప్పట్లో తెలిపింది.
ఇప్పుడు ఏకంగా ఆహార భద్రత, ప్రమాణాల చట్టం సవరణ మాటున యూపీ సర్కారు దాన్ని అమలుచేయడానికి పూనుకుంటున్నది. ఆహారంలో కల్తీ జరగకుండా, అపరిశుభ్రత లేకుండా చూడటం తన ఉద్దేశమంటున్నది. హిమాచల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్ సైతం ఆ బాణీనే వినిపిస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవల మతఘర్షణలు చెలరేగటం వెనక ఆహారపదార్థాల విక్రయానికి సంబంధించి బలమైన చట్టం లేకపోవటమే కారణమని ఆయనకు అనిపించిందట!
యూపీఏకు ఆవును చేరిస్తే అది ఎన్డీయే అవుతుందని చాన్నాళ్లక్రితం ఎవరో చమత్కరించారు. తమ చాపకిందకు నీళ్లు రాబోతున్నాయని చివరాఖరులో అర్థమయ్యాక హిందూ ఓటు బ్యాంకును కాపాడుకోవటానికి ఆనాటి యూపీఏ సర్కారు వేసిన అనేక పిల్లిమొగ్గలు చూశాకే అలాంటి వ్యాఖ్యా నాలు వినబడ్డాయి. ఆ మన స్తత్వం పార్టీలో ఇంకా సజీవంగా ఉండటంవల్లే విక్రమాదిత్యసింగ్ ఇలా అన్నారా లేక సీఎం రేసులో భంగపడి కేబినెట్ పదవితో సరిపెట్టుకోవటం జీర్ణించుకోలేక వివాదా స్పదంగా మాట్లాడారా అన్నది ఆ పార్టీ తేల్చుకోవాలి.
ఆహార విక్రయ దుకాణాల దగ్గర యజ మానుల పేర్లుండాలన్న అంశంలో కమిటీ వేశామని, ఇంతకుమించి ముందుకుపోలేదని కాంగ్రెస్ ప్రతినిధి ఇస్తున్న వివరణ సందేహాలను తగ్గించకపోగా పెంచింది. పార్టీకంటూ ఒక సిద్ధాంతం, విధానం ఉందా లేదా? యూపీ నిర్ణయాన్ని నిర్ణయాన్ని పార్టీ వ్యతిరేకించినప్పుడు వేరే రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వం సరిగ్గా అదే పనికి పూనుకోవటంలోని మతలబేమిటి? పేర్లు కాదు... వారి వారి గుర్తింపు కార్డులు ప్రదర్శించాలన్న ప్రతిపాదన వచ్చిందని మరో సంజాయిషీ. ఏమైతేనేం... మతంపేరిట విద్వేషాలు సృష్టించటమే అంతరార్థంగా కనబడుతోంది.
దుకాణంలో విక్రయించే ఆహార పదార్థాలు పరిశుభ్రమైనవని, ప్రామాణికమైనవని విశ్వసిస్తేనే వాటిని జనం కొనుక్కుతింటారు. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేయటమే మన దేశంలో కనిపిస్తుంది. ఈ విషయంలో అవసరమైన చట్టాలున్నాయి. ఆ నిబంధనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకునే విభాగాలు ఉంటున్నాయి. కానీ వాటిని పకడ్బందీగా అమలు చేయటానికి సిద్ధపడని ప్రభుత్వాలు ఆ వంకన విభజన రాజకీయాలకు తెరతీస్తున్నాయి.
ప్రత్యర్థులను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలవికాని హామీలిచ్చి అధికారంలోకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం అందరూ ఎంతో భక్తివిశ్వాసాలతో స్వీకరించే లడ్డూపై ఎలాంటి దుష్ప్రచారం చేసిందో దేశమంతా చూస్తూనే వుంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ తెలివితక్కువ చర్యను స్ఫూర్తిగా తీసుకున్నట్టు కనబడుతోంది.
మనుషుల పేర్లనుబట్టి, వారి ఆహారపుటలవాట్లనుబట్టి వారి మతాలను తెలుసుకోవటం సులభ మవుతుందన్నది వాస్తవమే కావొచ్చు. కానీ వారు విక్రయించే పదార్థాలు సమస్తం కేవలం ఆ కారణంతో మంచివి, ప్రామాణికమైనవి లేదా అపరిశుభ్రమైనవి ఎలా అవుతాయో అనూహ్యం. విపరీత పోకడలున్నవారికి తప్ప ఇటువంటి ఆలోచనలు రావు. సొంతంగా ఎటూ ఉన్నతమైన ఆలోచనలు రావు.
కనీసం రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రమే పాలించాల్సినవారు సర్వోన్నత న్యాయస్థానం హితవు చెప్పాకైనా మారాలికదా! వ్యక్తులుగా వక్రమార్గాలు వెదుక్కోవటం మానవ స్వభావమని సరిపెట్టుకోవచ్చు. రాజ్యం అటువంటి పనులకు పూనుకుంటే అంతిమంగా అరాచకానికి దారితీస్తుంది. కనుక మతిమాలిన చేష్టలను ఇకనైనా మానుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment