Ayodhya Issue
-
భయాలున్నా స్వాగతించారు!
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఇచ్చిన క్లిష్ట తీర్పులపై భయాందోళనలు వ్యక్తమైనా పట్టించుకోకుండా దేశ ప్రజలు మనస్ఫూర్తిగా స్వాగతించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో శనివారం దేశరాజధానిలో మొదలైన అంతర్జాతీయ న్యాయ సదస్సులో ‘న్యాయవ్యవస్థ –మారుతున్న ప్రపంచం’ అంశంపై ప్రధాని ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. క్లిష్టమైన అంశాలపై ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ప్రపంచవ్యాప్త చర్చకు కారణమయ్యాయి. తీర్పు ఎలా ఉంటుందోనన్న భయాందోళనలు ముందుగా వ్యక్తమయ్యాయి. వాటిని పట్టించుకోకుండా దేశంలోని వంద కోట్ల మంది ప్రజలు న్యాయస్థానం తీర్పులను మనస్ఫూర్తిగా స్వాగతించారు’ అని అన్నారు. ఎంతో సున్నితమైన ‘అయోధ్య’, ‘ట్రిపుల్ తలాక్’ కేసు సహా వివిధ అంశాలపై ఇటీవలి కాలంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లింగ సమానత్వం లేకుండా ఏ దేశం, ఏ సమాజం కూడా పరిపూర్ణంగా అభివృద్ధి చెందజాలవన్నారు. తమ ప్రభుత్వం సైన్యంలో మహిళలకు సమాన అవకాశాలను కల్పించేందుకు, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి మధ్య సమతూకం ఉండేలా దేశ న్యాయవ్యవస్థ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ‘ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేథ, ఇంటర్నెట్ వంటి వాటిని ప్రజలందరికీ మరింత వేగంగా న్యాయం అందించేందుకు ఉపయోగించుకోవాలి. మారుతున్న కాలంలో సమాచార పరిరక్షణ, సైబర్ నేరాలు న్యాయవ్యవస్థకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. రాజ్యాంగానికి మూడు ప్రధానాంగాలైన న్యాయ, శాసనసభ కార్యనిర్వాహక వ్యవస్థలు తమ పరిధిలో పనిచేస్తూ దేశం ఎదుర్కొన్న ఎన్నో సవాళ్లను విజయవంతంగా అధిగమించాయి. ఇలాంటి సత్సంప్రదాయాన్ని నెలకొల్పుకున్నందుకు మనం గర్వపడాలి’ అని ప్రధాని చెప్పారు. పనికిరాని చట్టాలను రద్దు చేయడంతో పాటు సమాజ వికాసానికి అవసరమైన చట్టాలను రూపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని అన్నారు. ఈ కోర్టుల విధానం ద్వారా అన్ని కోర్టులను అనుసంధానించేందుకు, కోర్టు ప్రక్రియను సరళతరం చేసేందుకు నేషనల్ జ్యుడిషియర్ డేటాను నెలకొల్పుతామన్నారు. ఈ ప్రపంచ స్థాయి సదస్సులో 20కి పైగా దేశాల జడ్జీలు హాజరయ్యారు. సదస్సులో సీజేఐ జస్టిస్ బాబ్డే, సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్రం మంత్రి రవిశంకర్æ, అటార్నీజనరల్ వేణుగోపాల్ తదితరులు ప్రసంగించారు. మన న్యాయవ్యవస్థకు 2వేల ఏళ్ల చరిత్ర: సీజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే మాట్లాడుతూ..‘మొఘల్, డచ్, పోర్చుగీస్, ఇంగ్లిష్ సంస్కృతుల సమ్మేళనమే భారత్ అని పేర్కొన్నారు. దేశంలో సాధారణ న్యాయ వ్యవస్థ 2 వేల ఏళ్లపాటు పరిణామం చెందుతూ వచ్చింది. ఏళ్ల క్రితమే వ్యవస్థీకృతమైన చట్టాలు, న్యాయవ్యవస్థ ఉండేవి. న్యాయాధికారుల సమక్షంలో బహిరంగంగానే విచారణ జరిగేది’అని తెలిపారు. అప్పట్లోని పరిస్థితులను సీజేఐ ప్రస్తావిస్తూ..ఒక వ్యక్తి దోషిత్వం నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేని సందర్భాల్లో ‘కోడి కాలేయం’ పరీక్ష ద్వారా నిర్ధారించేవారు. తీర్పునిచ్చే గ్రామ పెద్ద.. కోడి కాలేయాన్ని బయటకు తీసి, పరీక్షించేవాడు. దానిని బట్టి అప్పటికప్పుడు దోషి ఎవరనేది ధ్రువీకరించే సంప్రదాయం ఈశాన్య రాష్ట్రాల్లోని గ్రామాల్లో ఉండేది. అలాగే, ఎవరైనా వ్యక్తి పదవీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పులి దంతాన్ని పట్టుకునే రివాజు ఉండేది. ఇలాంటివి మన సంప్రదాయాల్లో భిన్నత్వానికి ఉదాహరణలు’ అని తెలిపారు. ‘పెరుగుతున్న సాంకేతికత ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసింది. ఫలితంగా నిర్ణయాల ప్రభావం సంబంధిత న్యాయస్థానం పరిధికి వెలుపలా ఉంటోంది’ అని అన్నారు. చట్టాలు వర్తమాన పరిస్థితులకు అద్దం పట్టాలి జస్టిస్ లావు నాగేశ్వరరావు చట్టాలు వర్తమాన పరిస్థితులకు అద్దం పట్టేలా పరిణామం చెందుతూ ఉండాలని సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ లావు నాగేశ్వరరావు పేర్కొన్నారు. సదస్సులో ఆయన స్వాగతోపన్యాసం చేశారు. ‘చట్టాలు పరిణామం చెందడం అతి ముఖ్యమైన అంశం. దేశ ప్రగతి, సామాజిక పరిస్థితులను ఈ చట్టాలు ప్రతిబింబింపజేస్తాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు పరిణామం చెందనిపక్షంలో అది అన్యాయానికి దారితీస్తుంది’ అని ఆయన అన్నారు. ‘సమాజం, చట్టం మధ్య వారధిలా న్యాయమూర్తి పాత్ర ఉండాలి. వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా న్యాయస్థానాలు చట్టాలకు భాష్యాన్ని చెప్పాలి. ఇలాంటి సందర్భాల్లో న్యాయస్థానాలు జాగ్రత్త వహించాలి. ఇలాంటి సందర్భాల్లో రాజ్యాంగ లక్ష్యాలు, ఉద్దేశాలు ఓడిపోకూడదు..’ అని పేర్కొన్నారు. డెబ్బై ఏళ్లుగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు నిష్పాక్షికంగా, స్వతంత్రంగా న్యాయం వైపు నిలబడ్డారని పేర్కొన్నారు. ఆన్లైన్ డేటాకూ రక్షణ ఉండాలి వ్యక్తిగత గోప్యతా హక్కును ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు గుర్తించింది. దీని వల్ల ఫోన్ సంభాషణలేకాదు, ఆన్లైన్ డేటాకు రక్షణ కల్పించాలి. జాతి అభివృద్ధి, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు మారాలి. ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న వివిధ న్యాయరీతులను అర్థం చేసుకుని, పాటించడం ద్వారా న్యాయ సమస్యలను మరింత సమర్థంగా పరిష్కరించేందుకు వీలు కలుగుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఎంతో కీలకమైన ప్రాథమిక విలువలు, లక్ష్యాలను సాధించేలా జడ్జీలు తీర్పులిచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. గత 70 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హక్కులను కాపాడేందుకు, చట్ట పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు జడ్జీలిచ్చిన తీర్పులే న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడాయి. జనాకర్షక నిర్ణయాలతో రాజ్యాంగ హక్కులు ప్రభావితం జస్టిస్ ఎన్.వి.రమణ జనాకర్షక నిర్ణయాలు రాజ్యాంగ హక్కులను ప్రభావితం చేస్తాయని, న్యాయస్థానాలు ఈ సందర్భంలో సముచిత నిర్ణయం తీసుకుంటూ రాజ్యాంగ విలువలు కాపాడాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. ఈ భూమిపై శాంతి ఉండాలంటే మన జాతి, మన తెగ, మన తరగతి, మన దేశం వంటి వాటిపై మన విధేయతను అధిగమించాలని, ప్రపంచ దృక్పథాన్ని కలిగి ఉండాలని మార్టిన్ లూథర్ కింగ్ చెప్పిన సూక్తిని జస్టిస్ రమణ ఉటంకించారు. ‘మహిళలు ప్రపంచ జనాభాలో సగం ఉన్నారు. మొత్తం ప్రపంచ పనిగంటల్లో మూడింట రెండో వంతు వారిదే. ప్రపంచ ఆదాయంలో పదో వంతు పొందుతారు. కానీ ప్రపంచ సంపదలో 0.01 శాతం కంటే తక్కువ సంపదను వారు కలిగి ఉన్నారు. చాలా దేశాలు తమ రాజ్యాంగం ద్వారా గానీ, మరో విధానంలో గానీ లింగ సమానత్వాన్ని, మహిళల గౌరవాన్ని గుర్తించాలి. నిత్యం వివక్షకు గురవుతున్న మహిళల అభ్యున్నతిని.. చట్టంలో ఉన్నతమైన ప్రకటనలు చేయడం వల్ల ఉద్దరించలేమని మనం అందరం గ్రహించాం. లింగ సమానత్వాన్ని కాపాడేందుకు న్యాయ వ్యవస్థకు తగినతం అవకాశాలు ఉన్నాయి. అందువల్ల లింగ సమానత్వం కాపాడడంలో ఎలాంటి రాజీ ఉండరాదని మనం గ్రహించాలి..’ అని పేర్కొన్నారు. ‘పర్యావరణ పరిరక్షణకు మనం తీసుకునే చర్యలు కేవలం ప్రస్తుత తరానికే కాకుండా భవిష్యత్తు తరాలకు సురక్షితమైన పర్యావరణాన్ని అందించే గొప్ప పనిగా మనం గ్రహించాలి’ అని అన్నారు. అంతర్జాతీయ సంస్థల ద్వారా ఇంటర్నెట్ సేవలు అందుతు న్నందున ఈ టెక్నాలజీలో వ్యక్తమవుతున్న జాతీయ, అంతర్జాతీయ ఆందోళనలకు తగిన పరిష్కారం చూపాలని అభిప్రాయపడ్డారు. -
అయోధ్య తీర్పు: సుప్రీం కోర్టుకు ఆ అధికారం ఎక్కడిది?
సాక్షి, తిరుమల : అయోధ్య కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై గోవర్థన పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ మందిర నిర్మాణం కోసం స్థలం కేటాయింపు సబబేనంటూ.. ఇతర మతాల వారికి స్థలం కేటాయించే అధికారం సుప్రీంకోర్టుకు ఎక్కడిదని ప్రశ్నించారు. వివాదాస్పద స్థలం ఎవరిదో చెప్పాలి గానీ, మరో స్థలం కేటాయించాలని ఎలా చెబుతారంటూ మండిపడ్డారు. ఇలా అయితే రేపు మధుర, కాశీలలో కూడా ఇలానే తీర్పు ఇచ్చి ఆయా ప్రాంతాలను మినీ పాకిస్తాన్లా మార్చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రామ జన్మభూమి కమిటీలో ప్రభుత్వానికి వత్తాసు పలికేవారికి చోటు కల్పిస్తున్నారని విమర్శించారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మఠాలను పక్కన పెట్టి రవిశంకర్ లాంటి వ్యక్తులకు ప్రాధాన్యతనివ్వడం సబబు కాదని పేర్కొన్నారు. దివంగత, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో 2.7 ఎకరాల స్థలాన్ని చెరిసగం పంచాలన్న ప్రతిపాదనను అందరూ అంగీకరించినా తాను వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదన వెనక్కి వెళ్లిపోయిందని వెల్లడించారు. ధర్మాన్ని ధర్మాచార్యులు చెప్పాలి కానీ, ఈ మధ్య ప్రభుత్వాలు నిర్దేశిస్తున్నాయని ఎద్దేవా చేశారు. సెక్యులరిజం పేరుతో బెనారస్ యూనివర్సిటీ డీన్‌గా ఇతర మతస్థుడిని నియమించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు రాసిన పుస్తకాలు చదవుతున్న వారు అధికమవడంతో వేదాలు మరుగున పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా 1133 శాఖలుగా ఉన్న వేదాలు ఇప్పుడు 7 శాఖలకు పడిపోయిందని తెలిపారు. -
అయోధ్య’పై రివ్యూ పిటిషన్ వేస్తాం
అయోధ్యలోని రామ జన్మభూమి– బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూపిటిషన్ దాఖలు చేస్తామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, జమీయత్ ఉలేమా ఎ హింద్ ప్రకటించాయి. లక్నో/న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి– బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్బీ), జమీయత్ ఉలేమా ఎ హింద్ ప్రకటించాయి. ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ మాత్రం సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయబోమన్నారు. వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మించాలని, మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో వేరే చోట సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్‌కు 5 ఎకరాల స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆ ఐదు ఎకరాల స్థలాన్ని స్వీకరించాలా? వద్దా? అనేది నవంబర్ 26న జరిగే బోర్డు సమావేశంలో నిర్ణయిస్తామని వక్ఫ్ బోర్డు చైర్మన్ జుఫర్ ఫారూఖీ తెలిపారు. మసీదు స్థలాన్ని వదులుకోవడం షరియా ప్రకారం సరికాదని ఏఐఎంపీఎల్బీ పేర్కొంది. ఏఐఎంపీఎల్బీ సమావేశం ఆదివారం లక్నోలో జరిగింది. మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాలు ఇస్తామన్న ప్రతిపాదనను అంగీకరించబోమని సమావేశం అనంతరం ఏఐఎంపీఎల్బీ స్పష్టం చేసింది. ‘అది సరైన న్యాయం కాదు.. అలాగే, మాకు జరిగిన నష్టానికి పరిహారం కాబోదు’ అని స్పష్టం చేసింది. ‘ఈ కేసులో ఏఐఎంపీఎల్బీ పిటిషన్‌దారు కాదు. కానీ పిటిషన్‌దారులకు దిశానిర్దేశం చేస్తుంది. ముస్లింల తరఫు పిటిషన్‌దారుల్లో ఐదుగురు రివ్యూ వేసేందుకే మొగ్గు చూపారు’ అని ఏఐఎంపీఎల్బీ సభ్యుడు కమల్ ఫారూఖీ తెలిపారు. ‘మసీదు స్థలం అల్లాకు చెందుతుంది. షరియా ప్రకారం ఆ స్థలాన్ని ఎవరికీ ఇవ్వకూడదు’ అని ఏఐఎంపీఎల్బీ కార్యదర్శి జఫర్యాబ్ జిలానీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పలు పరస్పర విరుద్ధ అంశాలున్నాయన్నారు. ఈ కేసులో తొలుత కేసు వేసినవారిలో ఒకరైన జమీయత్ సంస్థ ఉత్తరప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం సిద్దిఖీ కూడా సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు. సాక్ష్యాలపైనో లేక హేతుబద్ధతపైననో ఆధారపడి తీర్పు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. అయోధ్య కేసులో ముఖ్య పిటిషనర్ అయిన ఇక్బాల్ అన్సారీ మాత్రం రివ్యూ పిటిషన్ వేసే ఆలోచన లేదన్నారు. ముస్లిం వర్గాల వాదనలను, అందించిన సాక్ష్యాధారాలను అంగీకరించిన సుప్రీంకోర్టు.. తీర్పు మాత్రం హిందువులకు అనుకూలంగా ఇచ్చిందని జమీయత్ సంస్థ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ అన్నారు. సమావేశానికి ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా హాజరయ్యారు. ఏఐఎంపీఎల్బీ కార్యదర్శి జఫర్యాబ్ జిలానీ -
'కేసులు పెడితే భయపడేవారు లేరిక్కడ'
సాక్షి, హైదరాబాద్ : బాబ్రీ మసీదు–అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు పై రాజ్యాంగం పరిధిలోనే మాట్లాడానని, కేసులకు భయపడేది లేదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగ బద్ధంగా అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు తనకు ఉందని, బీజేపీ, ఆర్ఎస్ఎస్లను సంతోష పెట్టేలా మాట్లాడలేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉందని తేల్చి చెప్పారు. ‘నాపై ఎంత మాట్లాడుతారో మాట్లాడండి. అది మీ హక్కు. ఎంత అసహనం వెల్లగక్కుతారో వెల్లగక్కండి. బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు భయపడేది లేదు’అని అన్నారు. -
నాలుగు స్తంభాలు!
అయోధ్యలో 1528లో మొఘల్ చక్రవర్తి బాబర్ హయాంలో బాబ్రీ మసీదు నిర్మాణం జరిగితే 1992 డిసెంబర్ 6న కరసేవకులు దాన్ని కూల్చేశారు. అప్పట్లో కీలక స్థానాల్లో ఉండి ఈ ఘటనలో ప్రమేయం ఉన్న నేతలు చాలామంది బీజేపీ నేతలు ఇపుడు అంతగా ప్రాధాన్యం లేని స్థితిలో ఉన్నారు. వారిలో సీనియర్ నాయకులు అద్వానీ, మురళీ మనోహర్జోషి, ఉమాభారతి క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. బాబ్రీ కూల్చివేత కేసులో వీరి ప్రమేయం, అప్పట్లో ఏం చేశారు? ఇప్పుడెలా ఉన్నారో చూద్దాం... న్యూఢిల్లీ: ఎల్.కె.అద్వానీ 1989లో బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక పార్టీ బలోపేతానికి రథయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర రెండు ఘటనలకు దారితీసింది. ఒకటి... 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చివేయటం. రెండోది బీజేపీని అధికార పీఠంపై కూర్చోబెట్టడం. గుజరాత్‌లోని సోమ్‌నాథ్‌లో మొదలైన అద్వానీ రథయాత్ర ఒక్కో రాష్ట్రం దాటుతూ యూపీలోని అయోధ్య చేరుకోవాలి. దారి పొడవునా జనం బ్రహ్మరథం పట్టారు. అంతా బాబ్రీ మసీదు వద్దకు చేరుకోవాలంటూ అద్వానీ ఉద్రిక్త పూరిత ప్రసంగాలు చేశారు. యాత్ర బిహార్‌లో ప్రవేశించినప్పుడు అప్పటి సీఎం లాలూప్రసాద్ యాదవ్ అడ్డుకుని సమస్తిపూర్‌లో అద్వానీని అరెస్ట్ చేయించారు. అదే బీజేపీకి కలిసొచ్చింది. 1991 ఎన్నికల్లో బీజేపీకి 100 సీట్లు దాటిపోయాయి. అద్వానీ లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయ్యారు. 1992 డిసెంబర్ 6న దేశవ్యాప్తంగా తరలివచ్చిన కరసేవకులు బాబ్రీ మసీదుని కూల్చివేశారు. బీజేపీ 1996లో అతిపెద్ద పార్టీగా అవతరించినా వాజ్‌పేయి నేతృత్వంలో 13 రోజులే సాగింది. 1998లో మిత్రపక్షాలతో కలిసి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటై అద్వానీ హోంమంత్రిగా.. తర్వాత ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టినా 13 నెలలే కొనసాగారు. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోవడంతో అద్వానీ ప్రభ తగ్గింది. 2014లో మోదీ ప్రధాని అయ్యాక ఆయన ప్రాధాన్యం మరింత తగ్గింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి, మార్కదర్శక్ మండలి నుంచి తప్పించారు. చివరికి గాంధీ నగర్ సీటు కూడా దక్కలేదు. ప్రస్తుతం బీజేపీకి దూరంగా ఇంచుమించు విశ్రాంత జీవితాన్నే గడుపుతున్నారు. బాబ్రీ కూల్చివేతకు కుట్ర పన్నారంటూ ఆయనపై క్రిమినల్ అభియోగాలు నమోదైనా... వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావటంపై మాత్రం మినహాయింపునిచ్చారు. ఉమాభారతి ఫైర్ బ్రాండ్ ఉమాభారతి బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. మసీదు కూల్చేయండి, మందిరం నిర్మించండి అంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలున్నాయి. అనంతరం రేగిన ఘర్షణలు, అల్లరిమూకల్ని రెచ్చగొట్టడంలో ఆమె ప్రమేయం ఉందంటూ జస్టిస్ లిబర్హాన్ కమిషన్ ఉమాభారతిని బోనులోకి లాగింది. ఆ ఘటనలో తన నైతిక బాధ్యత ఉందని అంగీకరించిన ఉమా... మసీదును కూలగొట్టంలో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తున్నారు. తర్వాత ఆమె రాజకీయ జీవితం ఎన్నో కుదుపులకు లోనయింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2003–04లో పనిచేసిన ఆమెను తర్వాత పార్టీ నుంచి బహిష్కరించారు. మళ్లీ సొంత గూటికి చేరుకుని మోదీ తొలి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఈ ఏడాది ఎన్నికల్లో పోటీకి విముఖత చూపటంతో పార్టీ ఉపాధ్యక్షురాలిని చేశారు. పార్టీలో ఆమె పాత్ర ఇప్పుడు నామమాత్రమేనన్న అభిప్రాయం ఉంది. మసీదు కూల్చివేత కేసులో వ్యక్తిగత హాజరు నుంచి ఆమెను కోర్టు మినహాయించింది. మురళీ మనోహర్ జోషి వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నపుడు మురళీ మనోహర్ జోషి కేంద్ర మంత్రి. ఇప్పుడు మోదీ, అమిత్ షా మధ్య ఉన్నట్టుగా అప్పట్లో ఉప ప్రధానిగా ఉన్న అద్వానీ, కేంద్ర మంత్రిగా ఉన్న జోషి మధ్య సన్నిహిత సంబంధాలుండేవి. యువకుడిగా ఉన్నప్పుడే ఆరెస్సెస్‌లో చేరిన జోషి గోరక్షణ ఉద్యమంలో పాల్గొన్నారు. అద్వానీ రథయాత్రకు అండగా నిలిచారు. అద్వానీ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడయ్యాక 1991లో జోషి బీజేపీ పగ్గాలు చేపట్టారు. మసీదు ప్రాంతం రాముడి జన్మభూమి అని ఆయన గట్టిగా వాదించేవారు. కూల్చివేత సమయంలో పార్టీ అధ్యక్ష హోదాలో ఆయన అయోధ్యకు వెళ్లారు. మందిర నిర్మాణాన్ని ఆపడం ఎవరి తరం కాదంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న ఆరోపణలున్నాయి. క్రిమినల్ కేసుల్లోనూ ఉన్నారు. ఈ ఏడాది ఎన్నికల్లో వయోభారం ∙వల్ల పార్టీ ఆయనకు కాన్పూర్ టికెట్ ఇవ్వలేదు. పార్లమెంటరీ బోర్డు నుంచి, మార్గదర్శక మండలి నుంచి తొలగించింది. అప్పట్నుంచి ఆయన పార్టీకి దూరమైనా అడపాదడపా సమావేశాల్లో పాల్గొంటూ మోదీకి వ్యతిరేకంగా తన గళం వినిపిస్తూనే ఉన్నారు. కల్యాణ్ సింగ్ బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న కల్యాణ్ సింగ్ అదే రోజు సాయంత్రం నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేశారు. గతంలో రాజస్తాన్ గవర్నర్‌గా ఉన్నారు. కానీ ఆయనపై క్రిమినల్ కేసుల్ని తిరగతోడడంతో రాజ్యాంగపరమైన పదవులు చేపట్టకూడదన్న నిబంధనలు అమల య్యాయి. గవర్నర్ పదవిని వదులుకున్నారు. ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సుదీర్ఘ పోరాటానికి ఫలితం: అద్వానీ అయోధ్యలో రామమందిరం కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.రామ జన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అద్వానీ.. ఈ విషయంలో తాను నిర్దోషిగా నిలిచానని చెప్పారు. ‘దేశ స్వాతంత్య్ర పోరాటం తర్వాత సుదీర్ఘ కాలం సాగిన ఉద్యమం ఇదే. ఇందులో పాల్గొనే మహోన్నత అవకాశాన్ని దేవుడు నాకు కల్పించాడు. సుదీర్ఘ పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పుతో ఫలితం దక్కింది. ఏళ్లుగా సాగుతున్న వివాదం కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఈ విషయంలో ఇప్పటివరకు జరిగిన హింస, వివాదా లు అన్నింటినీ వదిలేయండి. శాంతి, సమైక్యతతో ముందుకు సాగండి’అని ప్రజలకు సూచించారు. కరసేవకుల మాట.. సుప్రీంకోర్టు తీర్పుతో ఎట్టకేలకు న్యాయం గెలిచింది. వందల ఏళ్ల నుంచి ప్రజలు పెట్టుకున్న నమ్మకం, విశ్వాసం నిజమైంది. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత ప్రజల విజయమే. కరసేవకు వెళ్లినపుడు నేను అక్కడి పరిస్థితులను స్వయంగా చూశా. రెండు రోజుల ముందే వెళ్లడంతో అయోధ్యలోని ముస్లింలతో మాట్లాడా. వారు సోదర భావంతో వ్యవహరించారు. కూల్చివేత సమయంలో నాతో పాటు వచ్చిన వారంతా సాధారణ భక్తులే. అప్పుడు కిలోమీటర్ దూరంలో అద్వానీ, ఉమాభారతి, అశోక్ సింఘాల్, ధర్మేంద ప్రధాన్ వంటి నేతలు ఉన్నారు. వారి ప్రసంగాలను కూడా విన్నాం. – డాక్టర్ సంగెం శ్రీనివాస్, వరంగల్ అయోధ్యలో ఉన్నది రామమందిరమే అన్న వాస్తవాన్ని సుప్రీంకోర్టు తేల్చింది. కరసేవ సమయంలో నేను అక్కడకు వెళ్లినప్పుడు చిన్న చిన్న విగ్రహాలు, దేవాలయానికి సంబంధించిన çస్తంభాలు బయటపడటం చూశాను. వాటిని ఇప్పుడు మీడియాలో చూపించారు. సాధువులు ఆ స్తంభాలను పక్కన పెట్టి డేరా వేశారు. 11 మెట్లు కట్టి విగ్రహాలను అందులో ప్రతిష్టించారు. ఆ రోజు కరసేవను ప్రజలు చేశారు. ఈ రోజు ప్రజల విశ్వాసం గెలిచింది. – రంగరాజు రుక్మారావు, సూర్యాపేట్ పీవీ మౌనం..ఎందుకని? నాటి ప్రధాని పాత్రపై భిన్న వాదనలు అయోధ్యలో బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చేసిన రోజు నాటి ప్రధాని పీవీ నరసింçహారావు జీవితంలో మాత్రం మాయని మచ్చగానే మిగిలింది. అద్వానీ రథయాత్ర తర్వాత 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చివేస్తుంటే పీవీ చేష్టలుడిగి ఎందుకున్నారు? అన్న ప్రశ్న ఆయన జీవితంపై చెరగని ముద్రను వేసింది. ఒక హిందువుగా పీవీకి సైతం బాబ్రీ మసీదు స్థానంలో రామాలయం నిర్మించాలని ఉందా? అన్న సంశయం ఇప్పటికీ చాలా మందిలో కొనసాగుతూనే ఉంది. హిందూత్వ వాదులైన బీజేపీని ఇరుకున పెట్టడానికే ఆయన మౌనం వహించారనే వాదనలూ ఉన్నాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించినా 1992 నవంబర్ 19–22 తేదీల్లో జరిగిన పొలిటికల్ అఫైర్స్ క్యాబినెట్ కమిటీ సమావేశాల్లో... బాబ్రీని కూల్చివేసే పరిస్థితులున్నట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో పీవీ దృష్టికి తెచ్చింది. కళ్యాణ్ సింగ్‌ని తొలగించాలని కూడా సూచించింది. అయినా పీవీ మిన్నకుండడంలో అంతరార్థం విమర్శలకు తావిచ్చింది. అంతేకాక మసీదు ధ్వంసం సమయంలో పీవీ నరసింహారావు పూజలో కూర్చున్నారని, కరసేవకులు పూర్తిగా కూల్చివేశాకే ఆయన పూజలో నుంచి లేచారని ఓ బుక్‌లో ఆరోపించారు. అయితే బాబ్రీ అంశంలో యూపీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్‌పై పూర్తి విశ్వాసం ఉంచాననీ, ఆయన తన నమ్మకాన్ని వమ్ముచేశారని పీవీ వ్యాఖ్యానించారు. నిజానికి బాబ్రీ కూల్చివేత సమయంలో కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో నిండి ఉంది. పీవీకీ సోనియాకు మధ్య అంతర్గత కలహాలు.. ఆ తరవాత పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులకు దారితీశాయి. పీవీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు..! విధ్వసం విషయంలో ఎస్బీ చవాన్ నేతృత్వంలోని హోం శాఖ ఏమీ చేయలేదన్న విమర్శలను నాటి హోం సెక్రటరీ మాధవ్ గాడ్బే ఆ తరవాత ఖండించారు. జరుగబోతోన్న విధ్వంసాన్ని ఆపటానికి ప్రణాళికను రూపొందించినప్పటికీ పీవీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెప్పారాయన. ఆ రోజు హోం శాఖకీ, ప్రధాని పీవీకీ మధ్య అయోధ్యలో చేపట్టాల్సిన రక్షణాంశాలపై వివాదం ఉన్నట్లు కూడా చెప్పారు. తాను స్వయంగా పీవీని అనేక సార్లు కలిశాననీ, ప్రతిసారీ ఆయన వేచి ఉండమనే చెప్పారనీ వెల్లడిం చారు. ఈ విషయాల్ని 1993 మార్చి 23న తన రిటైర్మెంట్ అనంతరం రాసిన ‘‘అన్ ఫినిష్డ్ ఇన్నింగ్స్’’ (1996లో పబ్లిష్ అయ్యింది)లో గాడ్బే రాసుకున్నారు. -
9 గంటల్లోనే అంతా..
న్యూఢిల్లీ: వేలల్లో పోలీసులు పహారా కాశారు. కానీ లక్షల్లో కరసేవకులు చొచ్చుకొచ్చారు. కొద్ది గంటల్లోనే బాబ్రీ మసీదు నేలమట్టమైంది. 1992, డిసెంబర్ 6న ఐదు వేల మంది కరసేవకులు ఒక్క సారిగా బాబ్రీ మసీదులోకి చొచ్చుకురావడంతో భద్రతా దళాలు చేతులెత్తేశాయట! ఆ సమయంలో అయోధ్యలో 35 కంపెనీల పీఏసీ పోలీసు బలగాలు, 195 కంపెనీల పారామిలటరీ దళాలు, నాలుగు కంపెనీలు సీఆర్పీఎఫ్, 15 బాష్ప వాయువు బృందాలు, 15 మంది పోలీసు ఇన్స్పె క్టర్లు, 30 మంది పోలీసు సబ్ ఇన్స్పెక్టర్లు, 2,300 మంది పోలీసు కానిస్టేబుళ్లు మోహరించి ఉన్నారు. అయినప్పటికీ కరసేవకుల్ని అడ్డుకోవడంలో విఫలమయ్యారని లిబర్హాన్ కమిషన్ నివేదిం చింది. రామ జన్మభూమి–బాబ్రీ మసీదును కూల్చివేసే సమయంలో దాదాపు 75 వేల నుంచి లక్షన్నర మంది కరసేవకులు ఆ ప్రాంతంలో ఉన్నారని పేర్కొంది. లిబర్హాన్ నివేదిక ప్రకారం ఆ రోజు ఏం జరిగిందంటే... ఉదయం 10:30 ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్జోషి వంటి సీనియర్ బీజేపీ నేతలు, వీహెచ్‌పీ నేతలు, సాధువులు కరసేవ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ 20 నిమిషాల సేపు గడిపి మత ప్రబోధకులు ఉపన్యాసం చేస్తున్న రామ్ కథ కుంజ్‌కి చేరారు. ఉదయం 11:45 ఫరీదాబాద్ డీఎం, ఎస్ఎస్పీ రామ జన్మభూమి ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మధ్యాహ్నం 12:00 ఓ టీనేజీ యువకుడు భద్రతా వలయాన్ని ఛేదించుకొని మసీదు గుమ్మటంపైకి ఎక్కాడు. అతనితో పాటు మరో 150 మంది కరసేవకులు, ఒక్కసారిగా మసీదుని చుట్టుముట్టేశారు. మధ్యాహ్నం 12:15 దాదాపు 5 వేల మంది వివాదాస్పద కట్టడంపైకి ఎక్కి కొడవళ్లు, సుత్తులు, రాడ్లతో కూల్చివేతకు దిగారు. అద్వానీ, జోషి, అశోక్ సింఘాల్ వంటి నాయకులు బయటకు వచ్చేయమని చెబుతున్నా వినలేదు. మధ్యాహ్నం 12:45 మసీదు దగ్గరకి వెళ్లడంలో పారామిలటరీ విఫలమైంది. విధ్వంసం జరుగుతున్నా బలగాలు నియంత్రించలేకపోయాయి. రాష్ట్ర పోలీసులు, ప్రావిన్షియల్ ఆర్మ్డ్ బలగాలు ఏ చర్యలూ తీసుకోలేకపోయాయి. మధ్యాహ్నం 1:55 కరసేవకులు మొదటి గుమ్మటాన్ని కూల్చేశారు. మధ్యాహ్నం 3:30 అయోధ్యలో మత ఘర్షణలు చెలరేగాయి సాయంత్రం 5:00 కట్టడం పూర్తిగా కుప్పకూలిపోయింది. సాయంత్రం 6:30 7:00 కేంద్ర కేబినెట్ సమావేశమై యూపీలో రాష్ట్రపతి పాలన విధించింది. సీఎం కల్యాణ్‌సింగ్ రాజీనామా చేశారు. రాత్రి 7:30 విగ్రహాలను యథాతథంగా వాటి స్థానంలో ఉంచారు. తాత్కాలిక రామాలయ నిర్మాణం ప్రారంభించారు. సుప్రీం అధికారాన్ని ఉపయోగించిన కోర్టు అయోధ్య స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు శనివారం తీర్పునిస్తూ.. ఆర్టికల్ 142 ద్వారా తనకు సంక్రమించిన అధికారాన్ని వినియోగించుకుంది. ఆలయ నిర్మాణానికి కేంద్రం ఏర్పాటు చేసే ట్రస్టులో నిర్మోహి అఖాడకు కూడా ప్రాతినిధ్యం ఉండాలని ఈ అధికరణం ద్వారా సూచించింది. ఈ కేసులో కొన్ని పరిధుల నేపథ్యంలో నిర్మోహి అఖాడా పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చినా.. ఆర్టికల్ 142ను ఉపయోగించి అఖాడాకు ట్రస్ట్‌లో ప్రాతినిధ్యం కల్పించాలంది. ఈ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టుకు విశేష అధికారం ఉంటుంది. ఈ ఆర్టికల్ ప్రయోగం ద్వారా ఒక్కోసారి పార్లమెంట్ చట్టాల్ని కూడా పక్కనపెట్టే అధికారం కోర్టుకు ఉంది. తన ముందు పెండింగ్‌లో ఉన్న ఏదైనా కేసులో పూర్తి న్యాయం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నప్పుడు తన అధికారాన్ని ఉపయోగించి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసే అధికారం ఆర్టికల్ 142 కల్పిస్తుంది. గతంలోనూ పలు కేసుల్లో.. 1989 భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు ఉపశమనం కోసం ఈ ఆర్టికల్‌ను ఉపయోగించారు. బాధితులకు రూ.3,337 కోట్ల పరిహారం చెల్లించాలని యూనియన్ కార్బైడ్‌ను అప్పట్లో కోర్టు ఆదేశించింది. ఈ ఆర్టికల్‌ను ఉపయోగించి.. 1993 నుంచి కేంద్రం చేసిన బొగ్గు గనుల కేటాయింపును 2014లో సుప్రీం రద్దు చేసింది. ఈ అధికరణం మేరకు డిసెంబర్ 2016లో తీర్పునిస్తూ.. జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండకూడదని ఆదేశించింది. -
దీపావళికి బంగారం కాదు, కత్తులు కొనండి..
లక్నో : అయోధ్య వివాదంపై కోర్టు తీర్పు త్వరలో రానున్న నేపథ్యంలో బీజేపీ నేత గజరాజ్ రానా ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దంతెరాస్, దీపావళి పండుగలకు బంగారం, వెండి పాత్రలకు బదులు దేశంలోని హిందువులంతా ఇనుముతో చేసిన కత్తులు కొనాలని ఆయన సూచించారు. కోర్టు తీర్పు హిందువులకు అనుకూలంగా వస్తుందంటూనే, తీర్పు ఎలాంటిదైనా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తీవ్ర మార్పులొస్తాయని, ముందు జాగ్రత్తగా ఆత్మ రక్షణ కోసం ఆయుధాలు అవసరమని గజరాజ్ అభిప్రాయపడ్డారు. హిందూ పురాణాల్లో దేవుళ్లు, దేవతలు కూడా తగిన సందర్భాల్లో అనువైన ఆయుధాలు ధరించి ధర్మరక్షణకు పాటుపడ్డారని, ఆకోవలోనే తన వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలి తప్ప వేరే అభిప్రాయాలను ఆపాదించొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలపై యూపీ బీజేపీ అధికార ప్రతినిధి చంద్రమోహన్ స్పందించారు. గజరాజ్ రానా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని, దాంతో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. పార్టీ సభ్యులు వివిధ విషయాలపై చట్టానికి లోబడి స్పందించేలా మార్గదర్శకాలు ఉన్నాయన్నారు. కాగా, రానా గతంలోనూ ... ముస్లింల పవిత్ర ప్రదేశమైన మక్కాలో శివలింగం ఉందని, ఒకప్పుడు హిందువులు అక్కడ నివాసముండేవారంటూ వ్యాఖ్యలు చేశారు. -
‘ఆ భూమి నాకు ఇవ్వండి.. బంగారు ఇటుక ఇస్తాను’
న్యూఢిల్లీ: మొఘల్ వంశానికి చెందిన వ్యక్తిగా చెప్పుకుంటున్న ప్రిన్స్ హబీబుద్దీన్ తుసి ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశాడు. రామ జన్మభూమికి నన్ను హక్కుదారుగా గుర్తించి.. ఆ భూమిని నాకు ఇవ్వండి. నేను అక్కడ రామ మందిరాన్ని నిర్మిస్తాను.. బంగారు ఇటుక ఇస్తానని ప్రకటించాడు. వివరాలు.. తుసి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను చివరి మొఘల్ చక్రవర్తి బహుదూర్ షా జాఫర్ వారసుడిని. రామజన్మభూమిపై నాకే పూర్తిగా హక్కు ఉంది. మా వంశీకుడైన బాబర్ రామ మందిరాన్ని కూల్చి.. బాబ్రీ మసీదును నిర్మించాడు. రామ జన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారు ఎవరూ కూడా తామే ఆ భూమికి నిజమైన హక్కుదారులమని నిరూపించుకోలేకపోయారు’ అన్నాడు. ‘ఇప్పటికైనా సుప్రీం కోర్టు నన్ను నిజమైన హక్కుదారుగా గుర్తించి ఆ భూమిని నాకు అప్పగిస్తే మంచిది. ఆ భూమిని రామ మందిర నిర్మాణం కోసం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మందిర నిర్మాణం కోసం బంగారు ఇటుక ఇస్తాను’ అన్నారు. తుసి ఇప్పటికే మూడు సార్లు అయోధ్యను దర్శించి ప్రార్థనలు చేశారు. గతేడాది అయోధ్యను దర్శించినప్పుడు రామ మందిరాన్ని కూల్చినందుకు గాను హిందువులకు క్షమాపణలు కూడా చెప్పారు. -
అయోధ్యపై వీహెచ్‌పీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) చేపట్టిన ఉద్యమం తాత్కాలికంగా ఆగింది. ‘రామమందిర నిర్మాణ అంశం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రబిందువుగా మారకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరాక మా భవిష్యత్ కార్యచరణను వెల్లడిస్తాం’ అని వీహెచ్‌పీ అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ చెప్పారు. అయోధ్యలో వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మించేందుకు వీలుగా బీజేపీ సర్కారు పార్లమెంటులో చట్టం తేవాలనే డిమాండ్‌తో వీహెచ్‌పీ దేశవ్యాప్తంగా ‘రామజన్మభూమి ఉద్యమం’ను ఉధృతం చేయడం తెల్సిందే. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ర్యాలీలు చేస్తూ, అన్ని పార్టీల ముఖ్యనాయకులను వీహెచ్‌పీ నేతలు కలుస్తున్నారు. నరేంద్ర మోదీ సర్కారుకు ఇబ్బందులు రాకూడన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు. తమకు బీజేపీ మినహా ప్రత్యామ్నాయం లేదని వెల్లడించారు. -
29న అయోధ్యపై విచారణ రద్దు
న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదం కేసులో మంగళవారం జరగాల్సిన విచారణను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారించాల్సి ఉండగా, వారిలో ఒకరైన జస్టిస్ ఎస్ఏ బాబ్డే మంగళవారం అందుబాటులో ఉండరనీ, కాబట్టి కేసు విచారణను ఆ రోజున రద్దు చేస్తున్నామంటూ సుప్రీంకోర్టు రిజస్ట్రీ ఓ నోటీసు విడుదల చేసింది. సీజేఐ రంజన్ గొగోయ్ ఈ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తుండగా, జస్టిస్ బాబ్డేతోపాటు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్‌లు సభ్యులుగా ఉన్నారు. ఈ ధర్మాసనాన్ని ఈ నెల 25న ఏర్పాటు చేశారు. అంతకుముందు ఈ కేసు విచారణలో పాలుపంచుకునేందుకు జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎన్వీ రమణలు విముఖత చూపారు. వారి స్థానంలో జస్టిస్ భూషణ్, జస్టిస్ నజీర్‌లు ధర్మాసనంలో చేరారు. -
‘మందిర్‌పై మాట మార్చారు’
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టులో న్యాయప్రక్రియ ముగిసిన తర్వాతే అయోధ్యలో మందిర నిర్మాణంపై ఆర్డినెన్స్ తీసుకువస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎన్డీఏ మిత్రపక్షం శివసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. మందిర వ్యవహారం కోర్టులో ఉన్నందున ప్రభుత్వం ఏమీ చేయలేదని ప్రధాని చెప్పడాన్ని శివసేన నేత సంజయ్ రౌత్ ఆక్షేపించారు. మందిర్ అంశం న్యాయస్ధాన పరిధిలో ఉందని ప్రధాని తమకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అయోధ్యలో రామమందిరం కోసం వందలాది కరసేవకులు మరణించారని, ముంబైలో బాంబు పేలుళ్లు జరిగాయని చెప్పుకొచ్చారు. మందిర్ పేరుతో ఊచకోతకు బాధ్యులెవరని ప్రశ్నించారు. ఈ అంశంతోనే మీరు (బీజేపీ) అధికారంలోకి వచ్చిన సంగతి మరువరాదని సంజయ్ రౌత్ మండిపడ్డారు. కోర్టుతో పాటు ప్రధాని ప్రకటన చూస్తుంటే చట్టం కంటే శ్రీరాముడు గొప్పవాడు కాదనే అర్ధం స్ఫురిస్తోందన్నారు. కాగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని శివసేన డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
అయోధ్యపై 4న సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: అయోధ్య అంశం జనవరి 4వ తేదీన సుప్రీంకోర్టు ముందుకు రానుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్ల ధర్మాసనం ఈ అంశంలో దాఖలైన పిటిషన్ల విచారణకు ముగ్గురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనుంది. రామ జన్మభూమి–బాబ్రీ మసీదు వివాద ప్రాంతంపై దాఖలైన 14 పిటిషన్లపై విచారణ తేదీలను ఈ ధర్మాసనం ఖరారు చేయనుంది. వివాదాస్పద ప్రాంతంలోని 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డ్, నిర్మోహి అఖారా, రామ్ లల్లా సంస్థలు సమానంగా పంచుకోవాలంటూ 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. ఆధార్ తీర్పుపై రివ్యూ పిటిషన్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆధార్ చట్టం చెల్లుతుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలైంది. గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని ఇంతియాజ్ అలీ పల్సనియా అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. పౌరుల సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు అందించే సాధనంగా ఆధార్ చట్టం మారిపోయిందని పిటిషనర్ కోర్టుకు చెప్పారు. -
నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా మంగళవారం వెలువడనున్న నేపథ్యంలో సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. ఈ సమావేశాల్లో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా, సీబీఐలో అంతర్గత కుమ్ములాటలు, రఫేల్ ఒప్పందంపై కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయోధ్యలో రామాలయం నిర్మాణంపై మిత్రపక్షం శివసేన నుంచే బీజేపీకి ఇబ్బందులు ఎదురుకానున్నాయి. మరోవైపు అగస్టా కుంభకోణం కేసులో మధ్యవర్తి మిషెల్‌ను దుబాయ్ నుంచి భారత్‌కు తీసుకురావడం, విజయ్‌మాల్యా అప్పగింతపై బ్రిటన్ కోర్టు తీర్పును ఈ సమావేశాల్లో ఎన్డీయే ప్రధా న అస్త్రంగా వాడుకోనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రిపుల్ తలాక్, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి తదితర 45 కీలక బిల్లులను ఈ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. -
మందిర నిర్మాణం మరవొద్దు
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆ దిశగానే ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పలు సంఘ్ పరివార్ సంస్థల ప్రతినిధులు సహా వేలాది మంది పాల్గొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వీహెచ్‌పీ నిర్వహించిన ఈ సభలో వేలాదిమంది రామభక్తులు, హిందూవాదులు పాల్గొన్నారు. కాషాయ రంగు టోపీలు ధరించి సభకు వచ్చిన వారంతా ‘మాకు శాంపుల్ వద్దు. టెంపుల్ కావాలి. రామరాజ్యం మళ్లీ తెస్తాం. మందిరం నిర్మిస్తాం’ అంటూ నినాదాలు చేశారు. అధికారంలో ఉన్నవారు ప్రజల మనోభావాలను పట్టించుకోవడం లేదంటూ బీజేపీ ప్రభుత్వంపై ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) సీనియర్ నాయకుడు సురేశ్ భయ్యాజీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రాముడి గుడి కట్టాలంటే చట్టం తీసుకురావడమే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. ధర్మసభలో ప్రసంగిస్తున్న సాధ్వీ రితంభర అప్పటివరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని భయ్యాజీ తెలి పారు. సభలో ఆయన మాట్లాడుతూ ‘అయోధ్యలో రాముడి గుడి కడతామని ఈ రోజు అధికారంలో ఉన్నవారు గతంలో మాట ఇచ్చారు. మందిర నిర్మాణం డిమాండ్‌ను నెరవేర్చాలి. ఆలయాన్ని కట్టాలని మేం అడుక్కోవడం లేదు. మా భావాలను వ్యక్తపరుస్తున్నాం’ అని అన్నారు. సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించాలని కోరుతూ ‘న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోయిన దేశం అభివృద్ధి పథంలో నడవదు. సుప్రీంకోర్టు ప్రజల మనోభావాలు/అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మేం ఏ మతంతోనూ గొడవ పడాలనుకోవడం లేదు’ అని భయ్యాజీ పేర్కొన్నారు. ‘మోదీని వదిలిపెట్టం’ హరిద్వార్‌కు చెందిన స్వామి హంసదేవాచార్య మాట్లాడుతూ రామ మందిరాన్ని కట్టకపోతే ప్రధాని మోదీని తాము వదిలిపెట్టబోమని అన్నారు. హామీ మోదీ నెరవేర్చాల్సిందేనని కోరారు. వీహెచ్‌పీ అధ్యక్షుడు విష్ణు సదాశివ్ కోగ్జే మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలను గౌరవించాలనీ, ప్రజలే సుప్రీం తప్ప కోర్టు కాదని అన్నారు. వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలూ అయోధ్యలో రామమందిర నిర్మాణం డిమాండ్‌కు మద్దతు తెలపాలన్నారు. వీహెచ్‌పీ సభ నేపథ్యంలో ఢిల్లీలో పలుచోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు రామ్ లీలా మైదానంలో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రామ్‌లీలా మైదానంలోకి ప్రవేశిస్తున్న వీహెచ్‌పీ కార్యకర్తలు, మద్దతుదారులు -
అది రాముడి చలవే..
లక్నో : రాముడి వల్లే భారత్ ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా ఎదిగిందని, ప్రజలు ఆదర్శ పురుషుడైన రాముడి జీవితం నుంచి పాఠాలు నేర్చుకోవాలని యూపీ కేబినెట్ మంత్రి లక్ష్మీ నారాయణ చౌధరి వ్యాఖ్యానించారు. అయోధ్యలో దీపావళి సందర్భంగా నిర్వహించిన దీపోత్సవ్ గురించి ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో అయోధ్యలో రాముడు జన్మించిన చోట రామ మందిరం నిర్మించారని మంత్రి గుర్తుచేశారు. అయోథ్యలో రామమందిర నిర్మాణం జరగాలన్నదే దేశ ప్రజల ఆకాంక్షగా ముందుకొస్తోందన్నారు. ప్రజాకాంక్షలకు అద్దం పడుతూ అయోధ్యలో మందిర నిర్మాణం చేపట్టాలని అన్నారు. వీలైనంత త్వరలో మందిర నిర్మాణం పూర్తిచేస్తే అయోధ్య అద్భుత చరిత్రను పదిలపరచడం సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు. అదే జరిగితే అయోధ్యకు పెద్ద ఎత్తున యాత్రికులు తరలివస్తారని, ఫలితంగా పెద్ద ఎత్తున పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. రాముడు యుద్ధవీరుడిగా, తండ్రి మాటకు కట్టుబడ్డ తనయుడిగా తామందరికీ ఆదర్శప్రాయుడని మంత్రి కొనియాడారు. -
‘అయోధ్య’పై మధ్యవర్తిగా ఉంటా: రిజ్వీ
న్యూఢిల్లీ: అయోధ్యలో బాబ్రీమసీదు–రామమందిరం వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకునేందుకు వీలుగా ఇరుపక్షాలతో చర్చలు జరుపుతానని మైనారిటీల జాతీయ కమిషన్(ఎన్సీఎం) చైర్మన్ ఘయోరుల్ హసన్ రిజ్వీ తెలిపారు. రామమందిరం హిందువుల విశ్వాసానికి సంబంధించిన విషయం అయినందున ముస్లింలు పెద్దమనసు చేసుకోవాలని సూచించారు. అయోధ్యలో మందిర నిర్మాణానికి ముస్లింలు అంగీకరిస్తే, కాశి, మధుర సహా మిగతా ప్రాంతాల్లోని మసీదుల విషయంలో హిందూసంస్థలు వెనక్కి తగ్గేలా కృషి చేస్తానన్నారు. -
రామ మందిర్.. షా వ్యాఖ్యలపై లొల్లి
అయోధ్య రామ మందిర్ నిర్మాణంపై బీజేపీ జాతీయాధ్యక్షడు అమిత్ షా ప్రకటన గందరగోళాన్ని సృష్టించింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే మందిర నిర్మాణం ప్రారంభమై తీరుతుందంటూ షా వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. శుక్రవారం హైదరాబాద్‌లో కార్యకర్తల సమావేశంలో షా పైవ్యాఖ్యలు చేసినట్లు కొన్ని ప్రముఖ వెబ్సైట్లు, ఛానెళ్లు కథనాలు ప్రచురించాయి. ‘రామ మందిర్ నిర్మాణం జరిగి తీరుతుంది. ఎన్నికలకు ముందే పనులను ప్రారంభిస్తాం. ఎలాగైనా మందిరం నిర్మిస్తాం’అని అమిత్ షా.. పార్టీ కార్యకర్తలతో పేర్కొన్నట్లు ఆ కథనాల సారాంశం. అయితే అమిత్ షా అలాంటి వ్యాఖ్యలేవీ చేయలేదని బీజేపీ వర్గాలు శనివారం వెల్లడించాయి. ఈ మేరకు ట్విటర్లో ఓ ట్వీట్ చేసింది. ఒవైసీ విమర్శలు... అయితే అమిత్ షా వ్యాఖ్యలు చక్కర్లు కొట్టిన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎన్నికలకు ముందే రామ మందిర నిర్మాణం జరుగుతుందని హైదరాబాద్‌లో షా చెప్పారంట. అంటే అయోధ్య వ్యవహారంలో సుప్రీంకోర్టు బదులు.. షానే తీర్పు ఇస్తారా?. ఎన్నికల నేపథ్యంలో తీర్పు పారదర్శకంగా ఉంటే మంచిది’ అంటూ ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ స్థల వివాదంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
‘ధిక్కారం’ కేసునే మరచిపోవడం దిగ్భ్రాంతికరం
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య స్థల వివాదంపై సుప్రీం కోర్టు త్వరలోనే తుది విచారణను ప్రారంభించనున్న నేపథ్యంలో 1992, డిసెంబర్ ఆరవ తేదీన బాబ్రి విధ్వంసానికి సహకరించిన నేతలపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్ విచారణ పునరుద్ధరణకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1995లో సుప్రీం కోర్టులో దాఖలైన ఈ కోర్టు ధిక్కార పిటిషన్ ఒకే ఒక్కసారి అంటే, 1997. మార్చి 26వ తేదీన విచారణకు వచ్చింది. అదే సంవత్సరం వేసవి సెలవుల తర్వాత ఈ పిటిషన్‌పై విచారణను కొనసాగిస్తామని నాటి సుప్రీం కోర్టు బెంచీ ప్రకటించింది. ఆ తర్వాత ఈ పిటిషన్ ఎవరికి అంతుచిక్కని విధంగా మరుగున పడిపోయింది. పిటిషన్‌ను దాఖలు చేసిన వారే కాకుండా, ఇందులో నిందితులుగా ఉన్న వారు కూడా ఈ పిటిషన్‌ను మరచిపోయారు. ఈ పిటిషన్లో ఏడుగురు ప్రముఖులు నిందితులుకాగా, నలుగురు ఇప్పటికే మరణించారు. అయోధ్య టైటిల్ కేసుకు సంబంధించిన వందలాది పిటిషన్లపై విచారణల పరంపర కొనసాగడం, పర్యవసానంగా టైటిల్‌పై 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడం, దాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించడం, ఇప్పుడు సుప్రీం కోర్టులో తుది విచారణం ప్రారంభమవడం లాంటి పరిణామాల మధ్య బాబ్రీ మసీదు విధ్వంసానికి సంబంధించిన కీలకమైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను మరచిపోవడం న్యాయవర్గాలకే దిగ్భ్రాంతి కలిగించే విషయం. ఇందులో ఉన్న నిందితులను గుర్తుచేసుకుంటే పిటిషన్ ఎందుకు మరుగున పడిపోయిందో అర్థం చేసుకోవచ్చునుకుంటా! పీవీ నర్సింహారావు, ఎస్బీ చవాన్, ఎల్కే అద్వానీ, మురళీమనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్, విజయ్‌రాజ్ సింధియా, అశోక్ సింఘాల్‌లు ఈ కేసులో నిందితులు. బాబ్రీ మసీదు వద్ద యథాతథా స్థితిని కొనసాగించాలని, మసీదుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ అలహాబాద్ హైకోర్టుతోపాటు సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వీరు ‘మనస్ఫూర్తిగా, ఉద్దేశపూర్వకంగా’ ఉల్లంఘించారని కేసు దాఖలైంది. అయోధ్య–బాబ్రీ వివదానికి సంబంధించి 1961లో సున్నీవక్ఫ్ బోర్డుతోపాటు తొలి పిటిషన్‌ను దాఖలు చేసిన సహ వాది మొహమ్మద్ హాషిమ్ అన్సారీయే ఈ కోర్టు ధిక్కార పిటిష¯Œ ను దాఖలు చేశారు. నాడు పీవీ నర్సింహారావు ప్రధాన మంత్రిగా, ఎస్బీ చవాన్ హోం మంత్రిగా ఉన్నారు. వారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, విజయరాజె సింధియా, కళ్యాణ్ సింగ్‌లు బీజేపీ అగ్ర నాయకులు. అశోక్ సింఘాల్ బీజేపీకి మిత్రపక్షమైన విశ్వహిందూ పరిషత్ నాయకులు. కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన నేడు రాజస్థాన్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. వ్యక్తిగతంగా వీరిని పిటిషన్లో నిందితులుగా పేర్కొనడంతోపాటు కేంద్ర, యూపీ ప్రభుత్వాలను కూడా ముద్దాయిలుగా పిటిషనర్ చేర్చారు. ఈ పిటిషన్ మొదటిసారి 1997, మార్చి 26వ తేదీన సుప్రీం కోర్టు జస్టిస్ జీఎన్ రాయ్, జస్టిస్ ఎస్పీ బారుచాలతో కూడిన ద్విసభ్య బెంచీ ముందు విచారణకు వచ్చింది. ఆ ఏడాది కోర్టు వేసవి సెలవుల తర్వాత విచారణ కొనసాగిస్తామని బెంచీ ప్రకటించింది. 20 ఏళ్లు గడిచిపోయినా పిటిషన్ అతా, పతా లేదు. పిటిషనర్ అన్సారీ కూడా 2016, జూలై నెలలో మరణించారు. అయోధ్య టైటిల్‌పై ఫిబ్రవరి నెలలో తుది విచారణ జరుగుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నాయకత్వంలోని త్రిసభ్య బెంచీ ప్రకటించిన నేపథ్యంలో కోర్టు ధిక్కార పిటిషనర్ అన్సారీ తరఫు న్యాయవాది షకీల్ అహ్మద్ సయీద్ ఇటీవల సుప్రీం కోర్టు రిజిస్ట్రీని ఆశ్రయించి పిటిషన్ గురించి వాకబు చేశారు. ఆయనకు రిజిస్ట్రీ నుంచి వచ్చిన సమాధానం కూడా దిగ్భ్రాంతికరంగానే ఉంది. తాము పలు విచారణ పిటిషన్లతో దీన్ని కలిపినందున దీనిపై ఎప్పుడో సుప్రీం కోర్టు విచారణ జరిపి తీర్పు వెలువరించి ఉంటుందన్న భావనలో ఉన్నామని రిజిస్ట్రీ వర్గాలు తెలిపాయి. పిటిషనర్ తరఫున విచారణ కొనసాగించాలంటే ఆయన చనిపోయిన 90 రోజుల్లోనే మరో పిటిషన్‌ను దాఖలు చేయాలని, లేదంటే తన తదనంతరం కూడా కేసును కొనసాగించాల్సిందిగా పిటిషనర్ తన కుటుంబ సభ్యులు లేదా న్యాయవాదికి వీలునామా రాసిచ్చినట్లయితే కేసును కొనసాగించవచ్చని రిజిస్ట్రీ వర్గాలు ఆయనకు సూచించాయి. దీంతో షకీల్ అహ్మద్, పిటిషనర్ వీలునామా తనిఖీలో పడ్డారు. చనిపోయిన నిందితులందరిని పిటిషన్ నుంచి తొలగించాలని, మిగతా వారిపై విచారణ కొనసాగించాలని కోరుతూ కూడా పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయవర్గాలు చెబుతున్నాయి. ఏడుగురు నిందితుల్లో ప్రస్తుతం అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్‌లు మాత్రమే ఉన్నారు. బతుకున్నవారిలో ప్రభుత్వ ప్రతినిధులు ఎవరూ లేనందు వల్లనే 20 ఏళ్ల తర్వాతనైనా ఈ పిటిషన్ బయటకు వచ్చిందని ఆరోపిస్తున్న వాళ్లు లేకపోలేదు. కానీ పిటిషన్లో కేంద్రాన్ని, యూపీ ప్రభుత్వాలను కూడా ముద్దాయిలుగా చేర్చారన్న విషయాన్ని మరువరాదు. ఏది ఏమైనా అయోధ్య టైటిల్ కేసులో తీర్పు ఇవ్వడానికి ముందే కోర్టు ధిక్కార పిటిషన్‌పై తీర్పు వెలువడాలని న్యాయవర్గాలు కోరుతున్నాయి. ఆ తర్వాత తీర్పు వెలువడితే ఆశించిన ప్రయోజనం ఉండదని ఆ వర్గాలు వాదిస్తున్నాయి. ఒకవేళ అయోధ్య టైటిల్ హిందువులదేనని తీర్పు వస్తే బాబ్రీ మసీదును విధ్వంసం చేయడం సమంజమేనన్న అభిప్రాయం కలుగుతుందన్నది వారి వాదన. ‘న్యాయం ఆలస్యమైతే అసలు న్యాయం జరగనట్లే లెక్క’ అన్న న్యాయసూత్రం ప్రకారమైనా తీర్పు సాధ్యమైనంత త్వరగా వెలువడాల్సి ఉంది. -
‘అయోధ్యపై మీకు హక్కు లేదు’
సాక్షి, లక్నో: అయోధ్య వివాదం సున్నీ, షియా వర్గాల మధ్య మంటలు రేపుతోంది. బాబ్రీ మసీదు విషయంలో సున్నీ వక్ప్ బోర్డుకు ఎటువంటి హక్కులు లేవని షియా వక్ఫ్ బోర్డు ప్రకటించింది. బాబ్రీ మసీదు, వివాదాస్పద స్థలం గురించి తమ వద్ద తగిన డాక్యుమెంట్లు ఉన్నాయని షియా వక్ప్‌బోర్డు ఛైర్మన్ వాసిమ్ రిజ్వీ ప్రకటించారు. ఈ డాక్యుమెంట్లను ఇప్పటికే సుప్రీం కోర్టు ముందుంచినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సున్నీ వక్ఫ్ బోర్డు మధుర, కాశీలోని మందిర్-మసీదు వివాదాలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. అదే సమయంలో అయోధ్య వివాదంలో సున్నీ వక్ఫ్ బోర్డు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని వాసిమ్ రిజ్వీ స్పష్టం చేశారు. వివాదాస్పద స్థలంపై కోర్టు షియా వక్ఫ్ బోర్డుకు అనులకూంగా తీర్పునిస్తే.. అందులో హిందువుల మనోభావాలకు అనుగుణంగా ఆలయం నిర్మించుకునేందుకు ఇచ్చేస్తామని ఆయన చెప్పారు. అదే సమయంలో లక్నోలో మరో మసీదు నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. -
అయోధ్యలో రామ మందిరమే
సాక్షి, బెంగళూరు: అయోధ్యలో రామమందిరం మాత్రమే ఉండాలనీ, అక్కడ మరే నిర్మాణానికీ తాము అంగీకరించబోమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ శుక్రవారం స్పష్టం చేశారు. కర్ణాటకలోని ఉడుపిలో శుక్రవారం ప్రారంభమైన మూడురోజుల ‘ధర్మసంసద్’లో ఆయన మాట్లాడుతూ ‘బాబ్రీ మసీదు ధ్వంసమై పాతికేళ్లు అవుతోంది. ఇంకా మనం వేచి చూడటంలో అర్థం లేదు. సంఘ్ పరివార్ సేవకులు రామ మందిర నిర్మాణం ఎప్పుడని అడుగుతున్నారు. రెండేళ్లలో అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి తీరతాం. అక్కడ రామాలయం తప్ప మరే కట్టడాలు ఉండేందుకు వీల్లేదు’ అని పేర్కొన్నారు. మత మార్పిడులపై ఆరెస్సెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. -
‘అయోధ్యలో ఆలయం... లక్నోలో మసీదు’
లక్నో: ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీ మసీదు స్థలంపై తమ హక్కును పూర్తిగా వదులుకోవడానికి సిద్ధమనీ, అందుకు ప్రతిగా లక్నోలో మసీదు నిర్మించాలని ఆ రాష్ట్ర షియా వక్ఫ్‌బోర్డు ప్రతిపాదించింది. ఈ విషయాన్ని గత శనివారమే సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా తెలిపినట్లు షియా వక్ఫ్‌బోర్డు చైర్మన్ వసీం రిజ్వీ చెప్పారు. ఈ వివాదాన్ని పరిష్కరించుకోడానికి ఇదే అత్యుత్తమ మార్గమనీ, లక్నోలోని హుసేనాబాద్‌లో ఎకరా స్థలంలో రాష్ట్రప్రభుత్వం మసీదును నిర్మించాలని కోరారు. అయితే ఈ ప్రతిపాదనను సున్నీ వక్ఫ్‌బోర్డు, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. హక్కును వదులుకుంటామని షియా వక్ఫ్‌బోర్డు చెబుతోందనీ, బాబ్రీ మసీదు స్థలంపై దానికి అసలు హక్కు ఎక్కడుందని సున్నీ వక్ఫ్‌బోర్డు ప్రశ్నించింది. -
రవిశంకర్ మధ్యవర్తిత్వాన్ని మేం అంగీకరించబోం
-
అయోధ్య మధ్యవర్తిత్వం.. ఒవైసీ ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య వివాదాస్పద స్థల అంశంపై ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మధ్యవర్తిగా వ్యవహరించబోతున్న రవిశంకర్‌పై తీవ్రస్థాయిలో ఒవైసీ మండిపడ్డారు. అయోధ్య వివాదంలో ఆయన దౌత్యం అక్కర్లేదని ఆయన చెబుతున్నారు. ‘‘రవిశంకర్ మధ్యవర్తిత్వాన్ని మేం అంగీకరించబోం. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అలాంటి ప్రతిపాదనలకు అంగీకరించబోమని గతంలోనే స్పష్టం చేసింది. అలాంటప్పుడు ఆయన్ని(రవిశంకర్) ఎలా నియమిస్తారు’’ అని ఒవైసీ మండిపడ్డారు. అనవసరంగా ఈ అంశాన్ని రాజకీయం చేయాలని కొందరు యత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. కాగా, నిర్మోహి అఖాదా, ఏఐఎంపీఎల్బీ అయోధ్య వివాదంలో మధ్యవర్తిత్వం వహించాలంటూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ పండిట్ రవిశంకర్‌ను సంప్రదించిన విషయం తెలిసిందే. అందుకు సుముఖత వ్యక్తం చేసిన ఆయన ఈ నెల 16న అయోధ్యలో పర్యటించనున్నారు. తనకు వ్యక్తిగత ఎజెండా అంటూ ఏం లేదని.. చర్చలే అన్ని సమస్యలకు పరిష్కారమని రవిశంకర్ ఇది వరకే స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం కోసం అందరితో సంప్రదింపులు చేపడతానని ఆయన పేర్కొన్నారు కూడా. ఇక చర్చలకు రవిశంకర్‌ను ఆహ్వానిస్తూ సీఎం యోగి ఓ ప్రకటన చేశారు. దేశం ఒక్కటిగా ఉండాలని రవిశంకర్ కొరుకుంటున్నారు. రెండు వర్గాలు అంగీకరిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని అని యోగి ఆ ప్రకటనలో తెలిపారు. -
మసీదులపై మీకేం హక్కుంది?: ఒవైసీ
హైదరాబాద్: ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అయోధ్య అంశంపై ట్విట్టర్లో స్పందించారు. కేవలం ఏదో ఒక మతపెద్ద చెప్పాడన్న కారణంతో మసీదు నిర్మాణం చేపట్టడం జరగదని ఆయన పేర్కొన్నారు. మసీదులన్నింటికి పెద్ద అల్లానే(భగవంతుడు). షియా, సున్ని, బరెల్వి, సూఫీ, దియోబంది, సలఫై, బొహ్రి ఇలా ఎన్ని బోర్డులు ఉన్నా వాటి బాధ్యత నిర్వాహణే తప్ప ఆధిపత్యం చెల్లాయించటం కాదంటూ ట్వీట్ లో ఒవైసీ పేర్కొన్నారు. "అల్లాను, ఆయనిచ్చే తీర్పును నమ్మేవాళ్లు మాత్రమే మసీదును నిర్మిస్తారు. వాళ్ల రక్షణ కోసం అందులో నమాజ్‌లు నిర్వహిస్తారు. కానీ, వాటిపై పూర్తి హక్కు మాత్రం అల్లాదే" అని స్పష్టం చేశారు. అయోధ్యకు దూరంగా ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతంలో మసీదు నిర్మించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఉత్తర ప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టు ముందు ఓ ప్రతిపాదనను ఉంచింది. ఈ నేపథ్యంలోనే ఒవైసీ ఇలా స్పందించారు.