అయోధ్య రామ మందిర్ నిర్మాణంపై బీజేపీ జాతీయాధ్యక్షడు అమిత్ షా ప్రకటన గందరగోళాన్ని సృష్టించింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే మందిర నిర్మాణం ప్రారంభమై తీరుతుందంటూ షా వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. శుక్రవారం హైదరాబాద్‌లో కార్యకర్తల సమావేశంలో షా పైవ్యాఖ్యలు చేసినట్లు కొన్ని ప్రముఖ వెబ్‌సైట్లు, ఛానెళ్లు కథనాలు ప్రచురించాయి.
‘రామ మందిర్ నిర్మాణం జరిగి తీరుతుంది. ఎన్నికలకు ముందే పనులను ప్రారంభిస్తాం. ఎలాగైనా మందిరం నిర్మిస్తాం’అని అమిత్ షా.. పార్టీ కార్యకర్తలతో పేర్కొన్నట్లు ఆ కథనాల సారాంశం. అయితే అమిత్ షా అలాంటి వ్యాఖ్యలేవీ చేయలేదని బీజేపీ వర్గాలు శనివారం వెల్లడించాయి. ఈ మేరకు ట్విటర్‌లో ఓ ట్వీట్ చేసింది.
ఒవైసీ విమర్శలు...
అయితే అమిత్ షా వ్యాఖ్యలు చక్కర్లు కొట్టిన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎన్నికలకు ముందే రామ మందిర నిర్మాణం జరుగుతుందని హైదరాబాద్‌లో షా చెప్పారంట. అంటే అయోధ్య వ్యవహారంలో సుప్రీంకోర్టు బదులు.. షానే తీర్పు ఇస్తారా?. ఎన్నికల నేపథ్యంలో తీర్పు పారదర్శకంగా ఉంటే మంచిది’ అంటూ ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ స్థల వివాదంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment