న్యూఢిల్లీ: మొఘల్ వంశానికి చెందిన వ్యక్తిగా చెప్పుకుంటున్న ప్రిన్స్ హబీబుద్దీన్ తుసి ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశాడు. రామ జన్మభూమికి నన్ను హక్కుదారుగా గుర్తించి.. ఆ భూమిని నాకు ఇవ్వండి. నేను అక్కడ రామ మందిరాన్ని నిర్మిస్తాను.. బంగారు ఇటుక ఇస్తానని ప్రకటించాడు. వివరాలు.. తుసి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను చివరి మొఘల్ చక్రవర్తి బహుదూర్ షా జాఫర్ వారసుడిని. రామజన్మభూమిపై నాకే పూర్తిగా హక్కు ఉంది. మా వంశీకుడైన బాబర్ రామ మందిరాన్ని కూల్చి.. బాబ్రీ మసీదును నిర్మించాడు. రామ జన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారు ఎవరూ కూడా తామే ఆ భూమికి నిజమైన హక్కుదారులమని నిరూపించుకోలేకపోయారు’ అన్నాడు.
‘ఇప్పటికైనా సుప్రీం కోర్టు నన్ను నిజమైన హక్కుదారుగా గుర్తించి ఆ భూమిని నాకు అప్పగిస్తే మంచిది. ఆ భూమిని రామ మందిర నిర్మాణం కోసం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మందిర నిర్మాణం కోసం బంగారు ఇటుక ఇస్తాను’ అన్నారు. తుసి ఇప్పటికే మూడు సార్లు అయోధ్యను దర్శించి ప్రార్థనలు చేశారు. గతేడాది అయోధ్యను దర్శించినప్పుడు రామ మందిరాన్ని కూల్చినందుకు గాను హిందువులకు క్షమాపణలు కూడా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment