‘ధిక్కారం’ కేసునే మరచిపోవడం దిగ్భ్రాంతికరం | babri case contempt petition pending for 20years | Sakshi
Sakshi News home page

‘ధిక్కారం’ కేసునే మరచిపోవడం దిగ్భ్రాంతికరం

Published Tue, Feb 13 2018 3:50 PM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM

babri case contempt petition pending for 20years - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య స్థల వివాదంపై సుప్రీం కోర్టు త్వరలోనే తుది విచారణను ప్రారంభించనున్న నేపథ్యంలో 1992, డిసెంబర్‌ ఆరవ తేదీన బాబ్రి విధ్వంసానికి సహకరించిన నేతలపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌ విచారణ పునరుద్ధరణకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1995లో సుప్రీం కోర్టులో దాఖలైన ఈ కోర్టు ధిక్కార పిటిషన్‌ ఒకే ఒక్కసారి అంటే, 1997. మార్చి 26వ తేదీన విచారణకు వచ్చింది. 

అదే సంవత్సరం వేసవి సెలవుల తర్వాత ఈ పిటిషన్‌పై విచారణను కొనసాగిస్తామని నాటి సుప్రీం కోర్టు బెంచీ ప్రకటించింది. ఆ తర్వాత ఈ పిటిషన్‌ ఎవరికి అంతుచిక్కని విధంగా మరుగున పడిపోయింది. పిటిషన్‌ను దాఖలు చేసిన వారే కాకుండా, ఇందులో నిందితులుగా ఉన్న వారు కూడా ఈ పిటిషన్‌ను మరచిపోయారు. ఈ పిటిషన్‌లో ఏడుగురు ప్రముఖులు నిందితులుకాగా, నలుగురు ఇప్పటికే మరణించారు. 

అయోధ్య టైటిల్‌ కేసుకు సంబంధించిన వందలాది పిటిషన్లపై విచారణల పరంపర కొనసాగడం, పర్యవసానంగా టైటిల్‌పై 2010లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇవ్వడం, దాన్ని సవాల్‌ చేస్తూ పిటిషనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించడం, ఇప్పుడు సుప్రీం కోర్టులో తుది విచారణం ప్రారంభమవడం లాంటి పరిణామాల మధ్య బాబ్రీ మసీదు విధ్వంసానికి సంబంధించిన కీలకమైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను మరచిపోవడం న్యాయవర్గాలకే దిగ్భ్రాంతి కలిగించే విషయం. ఇందులో ఉన్న నిందితులను గుర్తుచేసుకుంటే పిటిషన్‌ ఎందుకు మరుగున పడిపోయిందో అర్థం చేసుకోవచ్చునుకుంటా! 

పీవీ నర్సింహారావు, ఎస్‌బీ చవాన్, ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్‌ జోషి, కళ్యాణ్‌ సింగ్, విజయ్‌రాజ్‌ సింధియా, అశోక్‌ సింఘాల్‌లు ఈ కేసులో నిందితులు. బాబ్రీ మసీదు వద్ద యథాతథా స్థితిని కొనసాగించాలని, మసీదుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ అలహాబాద్‌ హైకోర్టుతోపాటు సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వీరు ‘మనస్ఫూర్తిగా, ఉద్దేశపూర్వకంగా’ ఉల్లంఘించారని కేసు దాఖలైంది. అయోధ్య–బాబ్రీ వివదానికి సంబంధించి 1961లో సున్నీవక్ఫ్‌ బోర్డుతోపాటు తొలి పిటిషన్‌ను దాఖలు చేసిన సహ వాది మొహమ్మద్‌ హాషిమ్‌ అన్సారీయే ఈ కోర్టు ధిక్కార పిటిష¯Œ ను దాఖలు చేశారు. 

నాడు పీవీ నర్సింహారావు ప్రధాన మంత్రిగా, ఎస్‌బీ చవాన్‌ హోం మంత్రిగా ఉన్నారు. వారు కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకులు. ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, విజయరాజె సింధియా, కళ్యాణ్‌ సింగ్‌లు బీజేపీ అగ్ర నాయకులు. అశోక్‌ సింఘాల్‌ బీజేపీకి మిత్రపక్షమైన విశ్వహిందూ పరిషత్‌ నాయకులు. కళ్యాణ్‌ సింగ్‌ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన నేడు రాజస్థాన్‌ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. వ్యక్తిగతంగా వీరిని పిటిషన్‌లో నిందితులుగా పేర్కొనడంతోపాటు కేంద్ర, యూపీ ప్రభుత్వాలను కూడా ముద్దాయిలుగా పిటిషనర్‌ చేర్చారు. 

ఈ పిటిషన్‌ మొదటిసారి 1997, మార్చి 26వ తేదీన సుప్రీం కోర్టు జస్టిస్‌ జీఎన్‌ రాయ్, జస్టిస్‌ ఎస్పీ బారుచాలతో కూడిన ద్విసభ్య బెంచీ ముందు విచారణకు వచ్చింది. ఆ ఏడాది కోర్టు వేసవి సెలవుల తర్వాత విచారణ కొనసాగిస్తామని బెంచీ ప్రకటించింది. 20 ఏళ్లు గడిచిపోయినా పిటిషన్‌ అతా, పతా లేదు. పిటిషనర్‌ అన్సారీ కూడా 2016, జూలై నెలలో మరణించారు. అయోధ్య టైటిల్‌పై ఫిబ్రవరి నెలలో తుది విచారణ జరుగుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నాయకత్వంలోని త్రిసభ్య బెంచీ ప్రకటించిన నేపథ్యంలో కోర్టు ధిక్కార పిటిషనర్‌ అన్సారీ తరఫు న్యాయవాది షకీల్‌ అహ్మద్‌ సయీద్‌ ఇటీవల సుప్రీం కోర్టు రిజిస్ట్రీని ఆశ్రయించి పిటిషన్‌ గురించి వాకబు చేశారు. ఆయనకు రిజిస్ట్రీ నుంచి వచ్చిన సమాధానం కూడా దిగ్భ్రాంతికరంగానే ఉంది. తాము పలు విచారణ పిటిషన్లతో దీన్ని కలిపినందున దీనిపై ఎప్పుడో సుప్రీం కోర్టు విచారణ జరిపి తీర్పు వెలువరించి ఉంటుందన్న భావనలో ఉన్నామని రిజిస్ట్రీ వర్గాలు తెలిపాయి. 

పిటిషనర్‌ తరఫున విచారణ కొనసాగించాలంటే ఆయన చనిపోయిన 90 రోజుల్లోనే మరో పిటిషన్‌ను దాఖలు చేయాలని, లేదంటే తన తదనంతరం కూడా కేసును కొనసాగించాల్సిందిగా పిటిషనర్‌ తన కుటుంబ సభ్యులు లేదా న్యాయవాదికి వీలునామా రాసిచ్చినట్లయితే కేసును కొనసాగించవచ్చని రిజిస్ట్రీ వర్గాలు ఆయనకు సూచించాయి. దీంతో షకీల్‌ అహ్మద్, పిటిషనర్‌ వీలునామా తనిఖీలో పడ్డారు. చనిపోయిన నిందితులందరిని పిటిషన్‌ నుంచి తొలగించాలని, మిగతా వారిపై విచారణ కొనసాగించాలని కోరుతూ కూడా పిటిషన్‌ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయవర్గాలు చెబుతున్నాయి. 

ఏడుగురు నిందితుల్లో ప్రస్తుతం అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, కళ్యాణ్‌ సింగ్‌లు మాత్రమే ఉన్నారు. బతుకున్నవారిలో ప్రభుత్వ ప్రతినిధులు ఎవరూ లేనందు వల్లనే 20 ఏళ్ల తర్వాతనైనా ఈ పిటిషన్‌ బయటకు వచ్చిందని ఆరోపిస్తున్న వాళ్లు లేకపోలేదు. కానీ పిటిషన్‌లో కేంద్రాన్ని, యూపీ ప్రభుత్వాలను కూడా ముద్దాయిలుగా చేర్చారన్న విషయాన్ని మరువరాదు. ఏది ఏమైనా అయోధ్య టైటిల్‌ కేసులో తీర్పు ఇవ్వడానికి ముందే  కోర్టు ధిక్కార పిటిషన్‌పై తీర్పు వెలువడాలని న్యాయవర్గాలు కోరుతున్నాయి. 

ఆ తర్వాత తీర్పు వెలువడితే ఆశించిన ప్రయోజనం ఉండదని ఆ వర్గాలు వాదిస్తున్నాయి. ఒకవేళ అయోధ్య టైటిల్‌ హిందువులదేనని తీర్పు వస్తే బాబ్రీ మసీదును విధ్వంసం చేయడం సమంజమేనన్న అభిప్రాయం కలుగుతుందన్నది వారి వాదన. ‘న్యాయం ఆలస్యమైతే అసలు న్యాయం జరగనట్లే లెక్క’ అన్న న్యాయసూత్రం ప్రకారమైనా తీర్పు సాధ్యమైనంత త్వరగా వెలువడాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement