L K Advani
-
రాహుల్.. మీ మాటలు బాధించాయి!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత లాల్‌కృష్ణా అద్వానీని చెప్పుతో కొట్టి.. స్టేజీ నుంచి దింపేశారంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘రాహుల్.. అద్వానీ మాకు తండ్రి లాంటి వారు. మీ మాటలు మమ్మల్ని ఎంతగానో బాధించాయి. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం విజ్ఞత పాటిస్తే బాగుంటుంది’ అని సుష్మా ట్వీట్ చేశారు. శుక్రవారం నాగపూర్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ.. ‘ బీజేపీ హిందుత్వం గురించి మాట్లాడుతుంది. హిందుత్వంలో గురు-శిష్య పరంపరకు ప్రత్యేక స్థానం ఉంది. హిందూమతంలో గురువును గొప్పగా చూస్తారు. మోదీ గురువు ఎవరు? అద్వానీ. ఆయనను చెప్పుతో కొట్టి స్టేజీ నుంచి దింపేశారు’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అద్వానీకి టికెట్ నిరాకరించి.. ఆయన స్థానంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను గుజరాత్‌లోని గాంధీనగర్ పార్లమెంట్ స్థానం నుంచి నిలబెట్టిన సంగతి తెలిసిందే. అద్వానీని బలవంతంగా రాజకీయాల నుంచి మోదీ తప్పించారని, గురువుకు గౌరవం ఇవ్వకపోవడం హిందూ సంప్రదాయం కాదని రాహుల్ పేర్కొన్నారు. -
‘నన్ను కూడా పోటీ చేయొద్దన్నారు’
న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్లకు ఉద్వాసన పలుకుతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తునంది. ఇప్పటకే 75 ఏళ్లు పై బడిన వారు ఎన్నికల్లో పోటీ చేయరాదనే నియమం తీసుకొచ్చి సీనియర్లను పక్కన పెడుతున్నారు. ఈ క్రమంలో పార్టీని బలపర్చడంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ముఖ్య నాయుకుల విషయంలోను ఇదే వైఖరి అవలంభిస్తూ విమర్శలకు గురవుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ కురువృద్ధుడు, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శ్రమించిన అద్వాణీని ఈ ఎన్నికల్లో పక్కన పెట్టారు. ఇప్పుడు ఈ జాబితాలో మరో సీనియర్ నేత చేరారు. ‘నన్ను పోటీ చేయవద్దని చెప్పారు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ సీనియర్ నేత మురళి మనోహర్ జోషి. ఈ మేరకు ఆయన ఓటర్లను ఉద్దేశిస్తూ రాశారంటూ ఓ లేఖ కూడా ప్రచారంలో ఉంది. రానున్న ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని పార్టీ తనను కోరిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ‘ప్రియమైన కాన్పూర్ ఓటర్లకు.. రానున్న ఎన్నికల్లో కాన్పూర్ నుంచే కాకుండా.. అసలు ఎక్కడి నుంచి కూడా పోటీ చేయోద్దని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌లాల్ ఈరోజు నన్ను కోరారు’ అని లేఖలో ఉంది. అయితే దీనిపై ఆయన సంతకం లేకపోవడం గమనార్హం. అయితే తన పట్ల పార్టీ వ్యవహరిస్తున్న తీరుకు మురళీ మనోహర్ జోషి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఒకవేళ తను పోటీ చేసే విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ.. దాన్ని స్వయంగా పార్టీ అధ్యక్షుడు తనకు తెలియజేసి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన మురళీ మనోహర్ పార్టీ జాతీయాధ్యక్షుడిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో ప్రధాని మోదీ కోసం వారణాసి నుంచి తప్పుకున్నారు. కాన్పూర్ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. అద్వాణీ విషయంలో కూడా పార్టీ ఇలానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏళ్లుగా అద్వాణీ నాయకత్వం వహిస్తోన్న గాంధీ నగర్ సీటును ఈ ఏడాది అమిత్ షాకు కేటాయించారు. అయితే దీని గురించి అద్వాణీకి ముందుగా సమాచారం ఇవ్వలేదని.. ఆయనను సంప్రదించలేదని సమాచారం. ఈ విషయంలో అద్వాణీ తీవ్రంగా కలత చెందారని ఆయన సన్నిహితులు తెలిపారు. -
భారత్‌ను బలమైన శక్తిగా మార్చిన ఘనత పీవీదే
హైదరాబాద్ : అంతర్జాతీయంగా అనేక ఒడిదుడుకులు ఉన్న సమయంలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ నరసింహారావు చేపట్టిన సంస్కరణలతో భారతదేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రముఖ పాత్రికేయుడు శేఖర్‌గుప్తా అన్నారు. బల హీన భారత్‌ను బలమైన శక్తిగా మార్చిన ఘనత పీవీదేనన్నారు. మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపించాల్సి వచ్చినా జాతీయ భద్రతపై ఆయన ఏనాడూ రాజీపడని దృఢసంకల్పం ప్రదర్శించారని కొనియాడారు. పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆదివారం ‘సాక్షి’ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లోని దస్పల్లా హోటల్లో పీవీ స్మారకోపన్యాసం చేశారు. 1991లో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర అనిశ్చితి ఉండేదని, గల్ఫ్ యుద్ధం ముగింపు, సోవియట్ పతనం, తదితర అంశాలతో భారత్‌లో ఆ కూడా ప్రభావం ఉన్న సమయంలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారని అలాంటి సమయంలో ప్రధానిగా పీవీ బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చినా అయోమయానికి గురికాకుండా దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేశారన్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న భారత్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంతో పాటు, విదేశీ విధానాన్ని కూడా కొత్త పుంతలు తొక్కించారన్నారు. అప్ప టిదాకా రష్యాతో మైత్రీబంధాన్ని నెరుపుతున్న భారత్‌కు సోవియట్ పతనం తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ తదితర దేశాలతో మైత్రి ఏర్పడటానికి పీవీ చేసిన కృషిని చాలామంది మర్చిపోయారన్నారు. అద్వానీ మాటలు నమ్మారు.. బాబ్రీ మసీదు కూల్చివేత అంశంలో పీవీపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలు కావన్నారు. బాబ్రీ మసీదు జోలికి వెళ్లబోమని బీజేపీ నేత అద్వానీ కచ్చితంగా చెప్పిన మాటలను పీవీ నమ్మారని కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేయడంతో పీవీ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని వెల్లడించారు. బాబ్రీ మసీదు విధ్వంసాన్ని ఆపేందుకు రాష్ట్రపతిపాలన విధించి ఉండొచ్చు కదా అని చాలా మంది పీవీని విమర్శిస్తుంటారని అలా కేంద్ర పాలన అమలుకు కనీసం 48 గంటలు పట్టేదని ఆలోగా జరగాల్సిన విధ్వంసం జరిగిపోయిందని పీవీ తనతో చెప్పారని శేఖర్‌గుప్తా గుర్తు చేసుకున్నారు. దేశంలో అల్లర్లు చెలరేగకుండా పీవీ చాకచక్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభంలో అనవసర విషయాల్లో సమయం వృథా చేసి చివరి రెండేళ్లలో జీఎస్టీ లాంటి కీలక సంస్కరణలు అమలు చేయడం ఇబ్బందికరంగా మారిందన్నారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అధ్యక్షత వహించగా గౌరవ అతిథిగా సీనియర్ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు వ్యవహరించారు. జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న పీవీ బహుభాషా కోవిదుడిగా అందరికీ సుపరిచితులని ఆయన రాజకీయాల్లో లేకపోతే కచ్చి తంగా గొప్ప అధ్యాపకుడు, పరిశోధకుడు అయ్యేవారన్నారు. పీవీ తాను నిర్వహించిన అన్ని మంత్రిత్వ శాఖల్లో తనదైన ముద్రను వేసి పనితీరును మెరుగుపరిచారన్నారు. ప్రభుత్వ విభా గాలు సరైన విధానంలో పనిచేసేలా అనేక చర్య లు చేపట్టారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకు నవోదయ విధానాన్ని రూపకల్పన చేయడంలో ఆయన పాత్ర ఎంతో ఉందన్నారు. -
శ్రీదేవి ఆకస్మిక మృతి దిగ్భ్రాంతికరం: ఎల్కే అద్వానీ
న్యూఢిల్లీ: ప్రముఖ నటి శ్రీదేవి ఆకస్మిక మృతిపట్ల బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల కుటుంబసభ్యులకు సంతాపం ప్రకటించారు. ‘శ్రీదేవి భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక ప్రఖ్యాత తార. ఆమె బాలీవుడ్లోనే కాదు తెలుగు, తమిళం వంటి ఇతర ప్రాంతీయ భాషా చిత్రాల్లో నటించి.. దేశ ఐక్యతలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయ సినిమాకు ఆమె ప్రతీకగా నిలిచారు. ఆమె కృషి ఎల్లలు లేనిది’ అని ఆయన పేర్కొన్నారు. తనకు నచ్చిన ఎన్నో సినిమాల్లో శ్రీదేవి నటించారని పేర్కొన్నారు. ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు కుటుంబసభ్యులతో దుబాయ్‌కు వెళ్లిన శ్రీదేవి శనివారం రాత్రి తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కొద్దిసేపటికే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో భర్త బోని కపూర్, కూతురు ఖుషి ఆమె పక్కనే ఉన్నారు. -
‘ధిక్కారం’ కేసునే మరచిపోవడం దిగ్భ్రాంతికరం
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య స్థల వివాదంపై సుప్రీం కోర్టు త్వరలోనే తుది విచారణను ప్రారంభించనున్న నేపథ్యంలో 1992, డిసెంబర్ ఆరవ తేదీన బాబ్రి విధ్వంసానికి సహకరించిన నేతలపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్ విచారణ పునరుద్ధరణకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1995లో సుప్రీం కోర్టులో దాఖలైన ఈ కోర్టు ధిక్కార పిటిషన్ ఒకే ఒక్కసారి అంటే, 1997. మార్చి 26వ తేదీన విచారణకు వచ్చింది. అదే సంవత్సరం వేసవి సెలవుల తర్వాత ఈ పిటిషన్‌పై విచారణను కొనసాగిస్తామని నాటి సుప్రీం కోర్టు బెంచీ ప్రకటించింది. ఆ తర్వాత ఈ పిటిషన్ ఎవరికి అంతుచిక్కని విధంగా మరుగున పడిపోయింది. పిటిషన్‌ను దాఖలు చేసిన వారే కాకుండా, ఇందులో నిందితులుగా ఉన్న వారు కూడా ఈ పిటిషన్‌ను మరచిపోయారు. ఈ పిటిషన్లో ఏడుగురు ప్రముఖులు నిందితులుకాగా, నలుగురు ఇప్పటికే మరణించారు. అయోధ్య టైటిల్ కేసుకు సంబంధించిన వందలాది పిటిషన్లపై విచారణల పరంపర కొనసాగడం, పర్యవసానంగా టైటిల్‌పై 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడం, దాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించడం, ఇప్పుడు సుప్రీం కోర్టులో తుది విచారణం ప్రారంభమవడం లాంటి పరిణామాల మధ్య బాబ్రీ మసీదు విధ్వంసానికి సంబంధించిన కీలకమైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను మరచిపోవడం న్యాయవర్గాలకే దిగ్భ్రాంతి కలిగించే విషయం. ఇందులో ఉన్న నిందితులను గుర్తుచేసుకుంటే పిటిషన్ ఎందుకు మరుగున పడిపోయిందో అర్థం చేసుకోవచ్చునుకుంటా! పీవీ నర్సింహారావు, ఎస్బీ చవాన్, ఎల్కే అద్వానీ, మురళీమనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్, విజయ్‌రాజ్ సింధియా, అశోక్ సింఘాల్‌లు ఈ కేసులో నిందితులు. బాబ్రీ మసీదు వద్ద యథాతథా స్థితిని కొనసాగించాలని, మసీదుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ అలహాబాద్ హైకోర్టుతోపాటు సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వీరు ‘మనస్ఫూర్తిగా, ఉద్దేశపూర్వకంగా’ ఉల్లంఘించారని కేసు దాఖలైంది. అయోధ్య–బాబ్రీ వివదానికి సంబంధించి 1961లో సున్నీవక్ఫ్ బోర్డుతోపాటు తొలి పిటిషన్‌ను దాఖలు చేసిన సహ వాది మొహమ్మద్ హాషిమ్ అన్సారీయే ఈ కోర్టు ధిక్కార పిటిష¯Œ ను దాఖలు చేశారు. నాడు పీవీ నర్సింహారావు ప్రధాన మంత్రిగా, ఎస్బీ చవాన్ హోం మంత్రిగా ఉన్నారు. వారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, విజయరాజె సింధియా, కళ్యాణ్ సింగ్‌లు బీజేపీ అగ్ర నాయకులు. అశోక్ సింఘాల్ బీజేపీకి మిత్రపక్షమైన విశ్వహిందూ పరిషత్ నాయకులు. కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన నేడు రాజస్థాన్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. వ్యక్తిగతంగా వీరిని పిటిషన్లో నిందితులుగా పేర్కొనడంతోపాటు కేంద్ర, యూపీ ప్రభుత్వాలను కూడా ముద్దాయిలుగా పిటిషనర్ చేర్చారు. ఈ పిటిషన్ మొదటిసారి 1997, మార్చి 26వ తేదీన సుప్రీం కోర్టు జస్టిస్ జీఎన్ రాయ్, జస్టిస్ ఎస్పీ బారుచాలతో కూడిన ద్విసభ్య బెంచీ ముందు విచారణకు వచ్చింది. ఆ ఏడాది కోర్టు వేసవి సెలవుల తర్వాత విచారణ కొనసాగిస్తామని బెంచీ ప్రకటించింది. 20 ఏళ్లు గడిచిపోయినా పిటిషన్ అతా, పతా లేదు. పిటిషనర్ అన్సారీ కూడా 2016, జూలై నెలలో మరణించారు. అయోధ్య టైటిల్‌పై ఫిబ్రవరి నెలలో తుది విచారణ జరుగుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నాయకత్వంలోని త్రిసభ్య బెంచీ ప్రకటించిన నేపథ్యంలో కోర్టు ధిక్కార పిటిషనర్ అన్సారీ తరఫు న్యాయవాది షకీల్ అహ్మద్ సయీద్ ఇటీవల సుప్రీం కోర్టు రిజిస్ట్రీని ఆశ్రయించి పిటిషన్ గురించి వాకబు చేశారు. ఆయనకు రిజిస్ట్రీ నుంచి వచ్చిన సమాధానం కూడా దిగ్భ్రాంతికరంగానే ఉంది. తాము పలు విచారణ పిటిషన్లతో దీన్ని కలిపినందున దీనిపై ఎప్పుడో సుప్రీం కోర్టు విచారణ జరిపి తీర్పు వెలువరించి ఉంటుందన్న భావనలో ఉన్నామని రిజిస్ట్రీ వర్గాలు తెలిపాయి. పిటిషనర్ తరఫున విచారణ కొనసాగించాలంటే ఆయన చనిపోయిన 90 రోజుల్లోనే మరో పిటిషన్‌ను దాఖలు చేయాలని, లేదంటే తన తదనంతరం కూడా కేసును కొనసాగించాల్సిందిగా పిటిషనర్ తన కుటుంబ సభ్యులు లేదా న్యాయవాదికి వీలునామా రాసిచ్చినట్లయితే కేసును కొనసాగించవచ్చని రిజిస్ట్రీ వర్గాలు ఆయనకు సూచించాయి. దీంతో షకీల్ అహ్మద్, పిటిషనర్ వీలునామా తనిఖీలో పడ్డారు. చనిపోయిన నిందితులందరిని పిటిషన్ నుంచి తొలగించాలని, మిగతా వారిపై విచారణ కొనసాగించాలని కోరుతూ కూడా పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయవర్గాలు చెబుతున్నాయి. ఏడుగురు నిందితుల్లో ప్రస్తుతం అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్‌లు మాత్రమే ఉన్నారు. బతుకున్నవారిలో ప్రభుత్వ ప్రతినిధులు ఎవరూ లేనందు వల్లనే 20 ఏళ్ల తర్వాతనైనా ఈ పిటిషన్ బయటకు వచ్చిందని ఆరోపిస్తున్న వాళ్లు లేకపోలేదు. కానీ పిటిషన్లో కేంద్రాన్ని, యూపీ ప్రభుత్వాలను కూడా ముద్దాయిలుగా చేర్చారన్న విషయాన్ని మరువరాదు. ఏది ఏమైనా అయోధ్య టైటిల్ కేసులో తీర్పు ఇవ్వడానికి ముందే కోర్టు ధిక్కార పిటిషన్‌పై తీర్పు వెలువడాలని న్యాయవర్గాలు కోరుతున్నాయి. ఆ తర్వాత తీర్పు వెలువడితే ఆశించిన ప్రయోజనం ఉండదని ఆ వర్గాలు వాదిస్తున్నాయి. ఒకవేళ అయోధ్య టైటిల్ హిందువులదేనని తీర్పు వస్తే బాబ్రీ మసీదును విధ్వంసం చేయడం సమంజమేనన్న అభిప్రాయం కలుగుతుందన్నది వారి వాదన. ‘న్యాయం ఆలస్యమైతే అసలు న్యాయం జరగనట్లే లెక్క’ అన్న న్యాయసూత్రం ప్రకారమైనా తీర్పు సాధ్యమైనంత త్వరగా వెలువడాల్సి ఉంది. -
‘అటల్-అద్వానీ కష్టంతో మోదీ ఎంజాయ్’
న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేతలు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, ఎల్కే అద్వానీల కష్టంతో బీజేపీ వాళ్లంతా సుఖాలు అనుభవిస్తున్నారని కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. వారి కష్టంతోనే ప్రధాని నరేంద్రమోదీ మెజార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆయన అన్నారు. మోదీ పనితీరు వల్లే అద్వానీ మనసు గాయపడిందని, నిర్ణయాలు తీసుకునే సమయంలో మోదీ ఎవర్నీ సంప్రదించని తీరు నచ్చలేదని చెప్పారు. జన్ సంఘ్‌కి, జనతా పార్టీకి అద్వానీ చాలా సేవలు అందించారని, బీజేపీలో గొప్ప మార్పు కూడా ఆయనే తీసుకొచ్చారని, ఈ విషయాలను అంత తేలికగా మర్చిపోకూడదని తెలిపారు. ‘అటల్-అద్వానీ టీమ్ కృషే ఇప్పుడు చూస్తున్నదంతా. వారి కష్టం వల్లే మోదీ ప్రధాన మంత్రి అయ్యారు. మెజార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు’ అని దిగ్విజయ్ చెప్పారు. పార్లమెంటులో అధికార పక్షం, విపక్షాల మధ్య పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రతిష్టంభన పరిస్థితులు నెలకొంది. గత కొద్ది రోజులుగా సభలు అస్సలు నడవడం లేదు. దీనిపై అద్వానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
అద్వానీ ఇంటికి మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ నివాసానికి వెళ్లారు. నేడు అద్వానీ పుట్టినరోజు సందర్భంగా పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తన నివాసానికి వచ్చిన మోదీకి అద్వానీ సాదర స్వగతం పలికారు. నేడు అద్వానీ 88వ పడిలోకి ప్రవేశించారు. అద్వానీ నివాసానికి వెళ్లకముందే ఆయనకు ట్విట్టర్ ద్వారానూ బర్త్ డే విషెస్ తెలిపారు మోదీ. అద్వానీ అత్యంత గౌరవనీయులని, మార్గదర్శిగా, ఉత్తేజాన్నిచ్చిన స్పూర్తి ప్రధాతగా నిలుస్తారని పేర్కొన్న మోదీ.. పెద్దాయన ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాననన్నారు. అపారమైన జ్ఞానసంపత్తి, రుజువర్తన అద్వానీ సొంతమని కొనియాడారు. వ్యక్తిగతంగా అద్వానీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, తన జీవితంలో అత్యుత్తమ గురువు ఆయనేనని చెప్పుకొచ్చారు. మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎల్.కె. అద్వానీ 1927, నవంబర్ 8న ప్రస్తుత పాకిస్థాన్ లోని కరాచీలో జన్మించారు. విభజన అనంతరం భారత్ కు వచ్చేశారు. -
హ్యాపీ బర్త్ డే అద్వానీజీ...
న్యూఢిల్లీ : బీజేపీ అగ్రనేత ఎల్ కె అద్వానీకి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ఉదయం అద్వానీ నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛాలు ఇచ్చి బర్త్ డే విషెష్ తెలియచేశారు. సుమారు 20 నిమిషాల పాటు ఆయనతో అమిత్ షా ముచ్చటించారు. మరోవైపు అద్వానీకి ట్విట్టర్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'బెస్ట్ టీచర్ అద్వానీజీ' అంటూ మోదీ ట్విట్ చేశారు. అద్వానీ నుంచి తాను వ్యక్తిగతంగా చాలా నేర్చుకున్నానని ఆయన తెలిపారు. అలాగే పలువురు ప్రముఖులు ..అద్వానీకి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. కాగా బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ నేడు 88వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. -
శివసేన దాడిని ఖండించిన అద్వానీ
న్యూఢిల్లీ: రాజకీయ నేత, కాలమిస్టు సుధీంద్ర కులకర్ణిపై శివసేన కార్యకర్తలు దాడి చేయడాన్ని బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ ఖండించారు. ప్రజాస్వామ్యంలో అన్నిరకాల అభిప్రాయాలకు స్థానం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. పాకిస్థాన్ విదేశాంగ మాజీ మంత్రి ఖుర్షిద్ మహమూద్ కసూరి రాసిన 'నెయిదర్ ద హాక్ నార్ ఏ డోవ్: ఏన్ ఇన్సైడర్స్ ఎకౌంట్ ఆఫ్ పాకిస్తాన్స్ ఫారిన్ పాలసీ' పుస్తకావిష్కరణకు హాజరుకానున్న సుధీంద్ర కులకర్ణిపై శివసేన కార్యకర్తలు నల్లరంగు కుమ్మరించారు. దాంతో కులకర్ణి మొహం అంతా నల్లగా మారిపోయింది. 'ఈ ఉదయం ఇంటికి నుంచి కారులో బయటకు వచ్చాను. కొంత మంది శివసేన కార్యకర్తలు నా కారు ఆపారు. నేను కారులోంచి బయటకు దిగగానే నామీద నల్లరంగు కుమ్మరించారు. వారు నన్ను దూషించార'ని కులకర్ణి వెల్లడించారు. మాతుంగ సబ్ అర్బన్ ప్రాంతంలోని సింగ్ సర్కిల్ లో కులకర్ణి నివాసానికి సమీపంలో ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని ముంబై పోలీసు అధికారి ధనంజయ్ కులకర్ణి తెలిపారు. -
అద్వానీ సంచలనం!
బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ పదునైన వ్యాఖ్యలు చేయడంలో సిద్ధహస్తులు. ఆ వ్యాఖ్యల్లో ఎవరి పేరూ ఉండదు. ఎవరి గురించీ ఫిర్యాదు ఉండదు. ఒక్కోసారి తన గురించి చెప్పుకున్నట్టు ఉంటుంది లేదా ఒక ధోరణి గురించో, కొంతమంది తీరు గురించో చెప్పినట్టు ఉంటుంది. కానీ వీటన్నిటికీ సందర్భశుద్ధి ఉంటుంది. పోల్చుకుని చూస్తే ఆ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నవో తెలిసిపోతుంది. అలా చెప్పడం చాలా అవసరమని అందరూ అనుకునేలా ఆ వ్యాఖ్యలుంటాయి. దేశంలో ఎమర్జెన్సీ విధించి 40 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఒక దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ మళ్లీ అలాంటి పరిస్థితి రాదని చెప్పలేమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేయగల శక్తులు బలంగా ఉండటమే అందుకు కారణమని చెప్పారు. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో మాట్లాడారు. ఈసారి ఆయన ప్రజాజీవితంలో ఉండేవారికి విశ్వసనీయత ఉండటం ఎంత ముఖ్యమో చెప్పారు. కోట్ల రూపాయల కుంభకోణంతో ప్రమేయం ఉండి చట్టానికి దొరక్కుండా విదేశాల్లో తలదాచుకున్న లలిత్ మోదీ వ్యవహారంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా పీకల్లోతు కూరుకుపోగా... కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలకు సంబంధించిన వివాదంలో చిక్కుకున్నారు. వీరంతా బీజేపీకి చెందినవారు. ఇక ఆ పార్టీ మిత్రపక్షమైన తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘ఓటుకు కోట్లు’ కేసులో ఊపిరాడక ఉన్నారు. ఇవన్నీ రోజూ పతాక శీర్షికలుగానో, మొదటి పేజీ కథనాలుగానో పత్రికల్లో అచ్చవుతున్నప్పుడు...చానెళ్లలో పదే పదే చర్చకొస్తున్నప్పుడు అద్వానీ ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారో, ఎవరిని ఉద్దేశించి అన్నారో ఎవరికైనా తెలిసిపోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ బాటలో వెళ్తుంటే అద్వానీ ‘ఘర్ కీ బాత్’లో బిజీగా ఉన్నారని అందరికీ అర్ధమవుతూనే ఉంది. అద్వానీ లేవనెత్తిన అంశాలు చాలా ముఖ్యమైనవి. జనం ఓట్లేసి గెలిపించినప్పుడు వారి ప్రతినిధులుగా బాధ్యతా యుతంగా, నిజాయితీగా మెలగాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉంటుందని ఆయన చెప్పిన మాటలు వర్తమాన స్థితిగతులకు సరిగ్గా సరిపోతాయి. హవాలా వ్యాపారి ఎస్.కె. జైన్ డైరీలో మిగిలిన రాజకీయ నేతలతోపాటు తన పేరు కూడా ఉన్నదని వెల్లడైన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎంపీ పదవికి ఆయన రాజీనామా ఇచ్చారు. ఆ కేసులో నిర్దోషిగా బయటపడ్డాకే తిరిగి లోక్‌సభలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో ఏ ఒక్కరూ ఆ పని చేయలేదు సరిగదా... వారిని అడగవలసిన స్థానాల్లో ఉన్నవారు కూడా మౌనం పాటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిరుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచార సందర్భంలో గానీ, అధికార బాధ్యతలు చేపట్టాకగానీ అందరిలోనూ ఒక అంశాన్ని బలంగా నాటగలిగారు. ఆయన ఏ అంశంలోనైనా దృఢంగా వ్యవహరిస్తారని, అనుకున్నది చేయడంలో ఎలాంటి అడ్డంకులనైనా అధిగమిస్తారని అందరిలోనూ ఒక నమ్మకం ఏర్పడింది. అలా ఏర్పడబట్టే దేశ ప్రజలు బీజేపీకి మునుపెన్నడూ లేనంత భారీ మెజారిటీని కట్టబెట్టారు. అందుకు తగినట్టే తొలి ఏడాదికాలంలో మోదీ అలాగే వ్యవహరించారు. ముఖ్యంగా భూసేకరణ చట్టం విషయంలో పలుమార్లు ఆర్డినెన్స్‌లు తీసుకురావడం... విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నా ఆ చట్ట సవరణపై బిల్లు తీసుకొచ్చి లోక్‌సభలో ఆమోదింపజేసుకోవడం, రాజ్యసభలో సైతం అందుకోసం ఒక ప్రయత్నం చేయడంవంటివి మోదీ పట్టుదలను తెలియజేస్తాయి. ఆ పట్టుదలలోని గుణదోషాల సంగతలా ఉంచి...అనుకున్నది సాధించడానికి ఏటికి ఎదురీదడానికైనా సిద్ధంగా ఉన్నట్టు కనబడింది. కానీ, సుష్మా, వసుంధర, స్మృతి విషయంలో మాత్రం ఆయన దృఢంగా వ్యవహరించలేకపోతున్నారు. వస్తున్న ఆరోపణలను ఖండించడానికి కేంద్రమంత్రులు, పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నా రోజులు గడిచేకొద్దీ ఆ ఆరోపణలు మరింత చిక్కనవుతున్నాయి. సరిగ్గా ఇలాంటి నేపథ్యంలోనే అద్వానీ వ్యాఖ్యానాలను అర్ధం చేసుకోవాలి. ‘నేను నా గురించి మాత్రమే చెబుతున్నాను... మిగిలినవారిపై నేనెలా మాట్లాడతాను’ అని ఆయన తప్పించుకున్నా... తన గురించి ఇప్పుడే ఎందుకు చెప్పుకోవాల్సివచ్చిందన్నది అందరికీ అర్ధమవుతుంది. నేతలు నిజాయితీగా ఉండాల్సిన అవసరాన్ని మాత్రమే కాదు...అంతరాత్మ గురించీ, రాజధర్మం గురించీ కూడా అద్వానీ చెప్పారు. ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీకి చెందినవారైనా, చంద్రబాబైనా ఈ రెండు అంశాలూ ఆలోచించాల్సిన విషయాలు. వెంటనే ఎన్నికలు లేవు గనుకా, ఎప్పటికప్పుడు వెల్లువలా వచ్చిపడే సమాచారం వల్ల జనం దేన్నయినా మర్చిపోతారన్న పేరాశతో ఈ నేతలందరూ ఉన్నట్టు కనబడుతోంది. తాము సులభంగా గట్టెక్కగలమని వీరంతా అనుకుంటున్న ట్టున్నారు. సంక్షోభం తలెత్తినప్పుడు నిర్ణయాత్మకంగా వ్యవహరించలేని నేతలు జనం దృష్టిలో పలచనవుతారని యూపీఏ దురవస్థను చూస్తే ఎవరికైనా అర్ధమవుతుంది. 2009 ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి రాగానే యూపీఏ ప్రభుత్వంపై ఆరోపణలొచ్చినప్పుడు ఆ సర్కారు వ్యవహరించిన తీరు అందరికీ తెలుసు. కామన్వెల్త్ క్రీడల కుంభకోణంలోనైనా, 2జీ స్కాంలోనైనా ఆ ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించింది. ఎలాంటి అవకతవకలూ చోటుచేసుకోలేదని నదురుబెదురూ లేకుండా చెప్పింది. ఆ సంగతేదో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి నిగ్గు తేల్చండని కోరితే ససేమిరా అన్నది. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని దర్యాప్తునకు ఆదేశించాల్సి వచ్చింది. అద్వానీ రాజధర్మం ప్రసక్తి తీసుకొచ్చింది... విశ్వసనీయత గురించి మాట్లాడిందీ అందుకే. ఇలాంటి ఆరోపణల్లో కూరుకుపోయి, నిజాయితీని నిరూపిం చుకోవడానికి సిద్ధపడనివారూ... పదవి పట్టుకుని వేళ్లాడేవారూ మానవబాంబుల వంటివారు. వారు తాము భ్రష్టులు కావడంతోపాటు చుట్టూ ఉన్నవారిని కూడా ముంచేస్తారు. ఒకపక్క పార్లమెంటు వర్షాకాల సమావేశాలు దగ్గరపడుతున్నాయి. నరేంద్ర మోదీ ఇప్పటివరకూ ఈ ఆరోపణల గురించి ఒక్క మాట కూడా మాట్లాడ కుండా కాలక్షేపం చేశారుగానీ ఇకపై అది సాధ్యంకాదు. తమ మంత్రుల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవడంతోపాటు ‘ఓటుకు కోట్ల’ వ్యవహారంలో మిత్రపక్ష నేత చంద్రబాబుకు కూడా తగిన సలహా ఇవ్వడం ఆయనకు తప్పనిసరవుతుంది. -
'ఊహించని స్థాయికి బీజేపీ ఎదిగింది'
న్యూఢిల్లీ: తన జీవితంలో దీపావళి ఇంత అద్భుతంగా జరగడం ఇదే తొలిసారని బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ అన్నారు. ఊహించని స్థాయిలో బీజేపీ ఎదిగిందని అద్వానీ అన్నారు. ఆదివారమిక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ అగ్రనేతలు ఎంపీలనుద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల్లో బీజేపీకి ఘనవిజయం అందించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను నరేంద్ర మోడీ సన్మానించారు. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు తదితరులు మాట్లాడారు. -
పొత్తు కొనసాగితే సంతోషిస్తా: అద్వానీ
అహ్మదాబాద్: మహారాష్ట్రలో బీజేపీ-శివసేన పొత్తు కొనసాగివుంటే బాగుండేదని బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ అభిప్రాయపడ్డారు. తమ పార్టీతో శివసేన పొత్తు కొనసాగితే సంతోషిస్తానని చెప్పారు. మిత్రపక్షంతో పొత్తు చెడకుండా ఉంటే ఆనందపడతానని అన్నారు. అయితే సీట్ల సర్దుబాటు సరిగా లేదని, మరిన్ని ఎక్కువ సీట్లు కావాలని తమ పార్టీ అడగడంలో తప్పులేదని ఆయన సమర్థించారు. శివసేన నేత ఉద్ధవ్ థాక్రే పొత్తు విచ్ఛిన్నం గురించి తనకు ఫోన్ చేసి చెప్పారని వెల్లడించారు. బీజేపీ-శివసేన సీట్ల సర్దుబాటు వ్యవహారంలో తాను జోక్యం చేసుకోలేదని తెలిపారు. అహ్మదాబాద్ లో గురువారం 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో అద్వానీ పాల్గొన్నారు. -
అద్వానీ, జోషిలకు మోడీ ఝలక్
-
అద్వానీ, జోషిలకు మోడీ ఝలక్
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకులు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు నరేంద్ర మోడీ ఝలక్ ఇచ్చారు. పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి అద్వానీ, జోషీలకు ఉద్వాసనకు పలికారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నుంచి కూడా వృద్ధ నేతలను తప్పించారు. వీరి స్థానంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్, ప్రధాన కార్యదర్శి జేపీ నద్దాలను తీసుకున్నారు. అయితే కొత్తగా మార్గదర్శక మండలి ఏర్పాటు చేయనున్నట్టు బీజేపీ ప్రకటించింది. ఇందులో అద్వానీ, జోషీలకు స్థానం కల్పించారు. వీరితో పాటు వాజపేయి, రాజ్‌నాథ్ సింగ్, నరేంద్ర మోడీ కూడా ఉంటారని బీజేపీ వెల్లడించింది. పార్లమెంటరీ బోర్డు పునర్వ్యస్థీకరణతో పార్టీపై నరేంద్ర మోడీ పూర్తి పట్టు సాధించినట్టయింది. ఇంతకుముందే తన సన్నిహితుడు అమిత్ షాకు బీజేపీ అధ్యక్ష పీఠంపై కూర్చుబెట్టిన మోడీ ఇప్పుడు తనతో అంటిముట్టనట్టుగా వ్యవరిస్తున్న కురువృద్ధులను పార్లమెంటరీ బోర్డు నుంచి సాగనంపారు. -
'చపాతి' ఘటనపై అద్వానీ అసంతృప్తి
న్యూఢిల్లీ: రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించిన 'చపాతి' ఘటనపై బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఆమోదయోగ్య చర్య కాదని పేర్కొన్నారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ లో ముస్లింతో బలవంతంగా శివసేన ఎంపీలు చపాతి తినింపించిన ఘటనపై ఆయనీ విధంగా స్పందించారు. తమకు మహారాష్ట్ర వంటకాలు పెట్టలేదనే ఆగ్రహంతో శివసేన ఎంపీలు ముస్లిం కేటరింగ్ సూపర్వైజర్ తో బలవంతంగా చపాతి తినిపించే ప్రయత్నం చేశారు. గతవారం చోటుచేసుకున్న ఈ ఘటనపై బుధవారం పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. -
'తొలి టెస్టులోనే కెప్టెన్... ట్రిఫుల్ సెంచరీ'
సూరజ్‌కుండ్(హర్యానా): ప్రధాని నరేంద్ర మోడీని బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ క్రికెట్ పరిభాషలో పొడిగారు. తొలి టెస్టులోనే కెప్టెన్ అయిన మోడీ ఆరంగ్రేటంతోనే అదరగొట్టారని కితాబిచ్చారు. మొదటి టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ సాధించారని ప్రశంసించారు. 'తొలి మ్యాచ్ లో సెంచరీ లేదా డబుల్ సెంచరీలు చేసిన వారి గురించి మనం వింటుంటాం. ఆడిన తొలి మ్యాచ్ లోనే కెప్టెన్ కిరిటాన్ని దక్కించుకుని, ట్రిఫు్ల్ సెంచరీ చేసిన ఆటగాడి గురించి నేనెప్పుడూ వినలేదు. నరేంద్ర మోడీ ఈ ఘనత సాధించారు' అని అద్వానీ పేర్కొన్నారు. తొలిసారి పార్లమెంటులో అడుగుపెడుతున్న బీజేపీ ఎంపీలకు ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో ప్రసంగిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 300 పైగా సీట్లు గెల్చుకుని విజయదుందుభి మోగించింది. -
'అద్వానీ పేరు మార్చుకో.. మోడీ మాట వింటాడు'
బీజేపీ అగ్రనేతల మధ్య ఉన్న విభేదాలను దృష్టిలో పెట్టుకుని నరేంద్రమోడిపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రివాల్ సెటైర్ విసిరారు. తన మాట మోడీ వినాలంటే ఎల్ కే అద్వానీ పేరు మార్చుకోవాలని కేజ్రివాల్ సూచించారు. అద్వానీ (Advani) పేరులోని V అక్షరాన్ని తీసి వేయాలంటూ బీజేపీ సీనియర్ నేతకు కేజ్రివాల్ ఉచిత సలహా ఇచ్చారు. ఆదానీ గ్రూప్ తో మోడీకి ఉన్న వ్యాపార సంబంధాలపై కేజ్రివాల్ వ్యంగ్యస్త్రాలను వదిలారు. గుజరాత్ లోని ఆదానీ గ్రూప్ కు చెందిన పారిశ్రామిక వేత్తలతో మోడీకి సన్నిహిత సంబంధాలపై ఆప్ నేత విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ప్రధాని అభ్యర్థిత్వంపై మోడీకి బీజేపీ మద్దతుపై అద్వానీ అసంతృప్తిని వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల గాంధీనగర్ సీటు వ్యవహారంపై కూడా విభేదాలు మరింత ముదిరాయి. -
'వాజ్ పేయి, అద్వానీ శకం ముగిసింది'
బీజేపీ లో మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి, ఎల్ కే అద్వానీల శకం ముగిసిందని వాజ్ పేయి మేనకోడలు కరుణా శుక్లా అన్నారు. వార్టు స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు సేవ చేసిన తనను సీనియర్ నేతలు పట్టించుకోలేదని ఆరోపించారు. చత్తీస్ ఘడ్ బీజేపీ శాఖ, ముఖ్యమంత్రి రమణ్ సింగ్ లు అనేకమార్లు తనను అవమానించే విధంగా ప్రవర్తించారని ఆమె విమర్శించారు. నరేంద్రమోడీ, రాజ్ నాథ్ సింగ్ లాంటి కొందరి వ్యక్తుల చెప్పు చేతుల్లోనే బీజేపీ నడుస్తోందన్నారు. బీజేపీ అగ్ర నాయకత్వ తీరుతో మనస్తాపం చెందిన కరుణా శుక్లా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో ఒకే లోకసభ స్థానాన్ని గెలుపొందిన కాంగ్రెస్ కు ఈసారి చత్తీస్ ఘడ్ లో ఎక్కువ స్థానాలు లభిస్తాయని ఆమె అన్నారు. -
సాయుధ దళాలను వంచిస్తోంది
కాంగ్రెస్‌పై మోడీ ధ్వజం ‘ఒక ర్యాంకు-ఒక పెన్షన్’పై 2004 నుంచి ఏం చేసింది అవినీతిపై రాహుల్ మాట్లాడటం హాస్యాస్పదం అధికారమిస్తే దేశాన్ని అభివృద్ధి చేస్తా లూధియానా: సాయుధ దళాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆరోపించారు. మాజీ సైనికోద్యోగులకు ‘ఒక ర్యాంకు-ఒక పెన్షన్’ను అమలు చేయడంలో కాంగ్రెస్ జాప్యాన్ని ఆయన తూర్పారబట్టారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ యూపీఏ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయకుండా ఎన్నికల వేళ హడావుడిగా ప్రకటన చేయడంలోని ఆంతర్యాన్ని గుర్తించాలని కోరారు. ఆదివారం పంజాబ్‌లోని లూధియానా, మాల్వాలలో నిర్వహించిన బహిరంగ సభల్లో మిత్రపక్షమైన శిరోమణి-అకాలీదళ్ నేతలతో కలసి మోడీ మాట్లాడారు. సంప్రదాయ సిక్కు తలపాగా ధరించిన మోడీ సుమారు అరగంటపాటు చేపట్టిన ప్రసంగంలో కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు... మాజీ సైనికోద్యోగుల సంక్షేమంపట్ల కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే 2004 నుంచీ అధికారంలో ఉన్నా ‘ఒక ర్యాంకు-ఒక పెన్షన్’ను ఎందుకు అమలు చేయలేదు? ఈ అంశంపై నేను తరచూ మాట్లాడుతుండటంతో ఈసారి బడ్జెట్లో ప్రకటన చేసింది. వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం 2004లో అధికారంలోకి వచ్చి ఉంటే దీన్ని వెంటనే అమలు చేసేది. ‘ఏబీసీ’లకు కొత్త నిర్వచనం (ఏ-ఆదర్శ్ హౌసింగ్ స్కాం, బీ-బోఫోర్స్ కుంభకోణం, సీ-కోల్ స్కాం) ఇస్తూ ఓవైపు కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోతుంటే ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అవినీతి విషయంలో విపక్షాలపై వేలెత్తి చూపడం హాస్యాస్పదంగా ఉంది. కేంద్రం నుంచి రూపాయి పంపితే 15 పైసలే గ్రామానికి చేరుతోందంటూ నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ పేర్కొనడమే కాంగ్రెస్ అవినీతికి నిదర్శనం. అధికారంలోకి వస్తే ప్రధాని పదవిని దేశానికి కాపాలాదారుగా స్వీకరిస్తా. ప్రభుత్వ ఖజానాపై ‘చెయ్యి’ పడకుండా చూస్తా. కాంగ్రెస్ ఇప్పటివరకూ ప్రజల కళ్లలో మట్టి కొట్టి మోసం చేయగా తాజాగా పెప్పర్ స్ప్రే చల్లడం మొదలు పెట్టింది (తెలంగాణ బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ విజయవాడ ఎంపీ (ప్రస్తుతం మాజీ) లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చల్లడాన్ని ఉదహరిస్తూ...) గుజరాత్‌లోని కచ్ ప్రాంతం నుంచి సిక్కు రైతులు వలస వెళ్తున్నారంటూ సాగుతున్న ప్రచారమంతా బూటకం. పంజాబ్‌లో బీజేపీ-ఎస్ఏడీ కూటమి హిందువులు-సిక్కుల ఐక్యతకు చిహ్నం. సుపరిపాలన ఎలా అందించాలో బన్సీలాల్, ప్రకాశ్‌సింగ్ బాదల్ (ఎస్ఏడీ నేత), ఓం ప్రకాశ్ చౌతాలా (ఐఎన్ఎల్డీ అధినేత), ఫరూఖ్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్) నుంచి నేర్చుకున్నా. అధికారం అందిస్తే దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తా. రైతులకు మేలు చేకూరాలంటే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ పెరగాలి. నష్టాల ఊబిలో ఉన్న రైతులను ఆదుకునేందుకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)ని మూడు విభాగాలుగా చేయాలి. మొదటి విభాగం ఉత్పత్తులను సేకరిస్తే రెండో విభాగం వాటిని నిల్వ చేసే బాధ్యతను, మూడో విభాగం వాటిని సమర్థంగా పంపిణీ చేసే బాధ్యతను చేపట్టాలి. గిడ్డంగుల్లో నిల్వ ఉన్న గోధుమలను రైతుల మధ్య పంపిణీ చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించినా కేంద్రం మాత్రం గోధుమ నిల్వలు కుళ్లిపోయే వరకూ నిరీక్షించి ఆ తర్వాత లిక్కర్ తయారీ బెవరేజీలకు అమ్ముకుంది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. సంక్షిప్తంగా... 2011లో తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ లక్ష్యంగా అమర్చిన పైపు బాంబు ఉదంతంలో ప్రధాన నిందితుడిని కేరళలో ఆదివారం అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. 21 మంది అఫ్ఘానిస్థాన్ సైనికులను తాలిబాన్లు ఆదివారం కాల్చి చంపి, మరో ఏడుగురిని అపహరించిన ఘటనపై అఫ్ఘాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ మండిపడ్డారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ఏరివేయడంలో ఆ దేశ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. {పపంచవ్యాప్తంగా అడవుల నాశనాన్ని ఎప్పటికప్పుడు కళ్లకు కట్టినట్లు చూపే వెబ్‌సైట్‌ను గూగుల్ సెర్చ్ ఇంజిన్ ప్రారంభించింది. ‘గ్లోబల్ ఫారెస్ట్ వాచ్’ పేరుతో ప్రారంభించిన ఈ సైట్లో అటవీప్రాంత నిర్మూలన సమాచారం, నివేదికలు, మ్యాపులు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక నక్సల్ మృతి చెందాడు. జిల్లాలోని ధాదాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అడవుల్లో ఆదివారం ఉదయం కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేపట్టినప్పుడు ఎన్కౌంటర్ జరిగిందని అధికారులు చెప్పారు. -
నరేంద్ర మోడీ ప్రధాని అయితే సంతోషిస్తా: అద్వానీ
బీజేపీ ప్రధాని అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఎంపిక చేయడాన్ని తీవ్రంగా విభేదించిన పార్టీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ తన మనసు మార్చుకున్నారు. మోడీ ప్రధాని అయితే సంతోషిస్తానని అన్నారు. బుధవారం జరిగిన పార్టీ సమావేశంలో అద్వానీ మాట్లాడుతూ.. మోడీ నాయకత్వంలో గుజరాత్ సాధించిన ప్రగతిని చూసి భారత్‌లో మాత్రమే గాక ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని అన్నారు. మోడీని ప్రధానిగా ఎంపిక చేసిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి గైర్హాజరైన అద్వానీ ఆ తర్వాత పలు సమావేశాల్లో మోడీ కలసి వేదిక పంచుకున్నా అంటిముంటనట్టు వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఆయన మనసు మార్చుకుని మోడీని ఆశ్వీరదించడం విశేషం. ఇదిలావుండగా పార్టీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ నాయకులు ధ్వజమెత్తారు. -
ఒకే వేదికపై అద్వానీ, నరేంద్ర మోడీ
బీజేపీ కురువృద్ధుడు ఎల్.కె.అద్వానీ, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఇద్దరూ కలసి ఒకే బహిరంగ వేదికపై దర్శనమిచ్చారు. బీజేపీ తమ ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించిన తర్వాత వీరిద్దరూ కలసి ఓ వేదికపై కనిపించడమిదే తొలిసారి. భోపాల్‌లో బుధవారం జరిగిన పార్టీ సమావేశంలో అద్వానీ, మోడీతో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. మోడీ అభ్యర్థిత్వంపై అద్వానీ కొంతవరకు రాజీపడ్డా మనస్పూర్తిగా సమర్థించడం లేదన్న విషయం ఈ సందర్భంగా బయటపడింది. వేదికపై మోడీ వినమ్రంగా వంగి చేతులు జోడించి ఆశీస్సులు కోరగా, అద్వానీ ఆయన వైపు చూడకుండానే నమస్కరించారు. అద్వానీ తన ప్రసంగంలో మోడీతో పాటు చౌహాన్, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌ను ప్రశంసించారు. కాగా మోడీని ప్రధాని అభ్యర్థిగా పార్టీ ఎంపిక చేసిదంటూ అద్వానీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మోడీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన అద్వానీ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి గైర్హాజరైన సంగతి తెలిసిందే. అనంతరం పార్టీ అగ్రనేతలు బుజ్జగించడంతో అద్వానీ మెత్తబడ్డారు. -
అద్వానీని కలిసిన ఏపీఎన్జీవో నేతలు
బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీని ఏపీఎన్జీవో నేతలు కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండటానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రులు, ఎంపీలతో కలిసి మంగళవారం ప్రధాని మన్మోమోహన్సింగ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సీడబ్ల్యుసీ నిర్ణయాన్ని పునః పరిశీలించే విషయంలో ఎటువంటి హామీ ఇవ్వలేనని, సీమాంధ్రుల విద్యా, ఉపాధి, సాగునీరు, హైదరాబాద్ అంశాలపై కేంద్ర కమిటీ నివేదిక అనంతరం రాష్ట్ర విభజన చేసేలా చర్యలు తీసుకుంటామని మాత్రమే ప్రధాని హామీ ఇచ్చారు. ప్రధానితో పాటు బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ, జేడీ(యూ) అధ్యక్షుడు శరద్ యాదవ్, అన్నాడీఎంకే నేత తంబిదురై, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సుదీప్ బందోపాధ్యాయను సమాజ్ వాది పార్టీ నేత రాంగోపాల్ యాదవ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, సీపీఎం నేత సీతారాం యేచూరి, డీఎంకే నాయకుడు టి.ఆర్.బాలు తదితరులను కలిసి సీమాంధ్రలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ప్రజాందోళనను ఏపీఎన్జీవో నేతలు వివరించారు.