సాయుధ దళాలను వంచిస్తోంది | narednra modi fires on congress | Sakshi
Sakshi News home page

సాయుధ దళాలను వంచిస్తోంది

Published Mon, Feb 24 2014 12:31 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM

సాయుధ దళాలను వంచిస్తోంది - Sakshi

సాయుధ దళాలను వంచిస్తోంది

 కాంగ్రెస్‌పై మోడీ ధ్వజం
 ‘ఒక ర్యాంకు-ఒక పెన్షన్’పై 2004 నుంచి ఏం చేసింది
 అవినీతిపై రాహుల్ మాట్లాడటం హాస్యాస్పదం
 అధికారమిస్తే దేశాన్ని అభివృద్ధి చేస్తా

 
 లూధియానా: సాయుధ దళాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆరోపించారు. మాజీ సైనికోద్యోగులకు ‘ఒక ర్యాంకు-ఒక పెన్షన్’ను అమలు చేయడంలో కాంగ్రెస్ జాప్యాన్ని ఆయన తూర్పారబట్టారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ యూపీఏ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయకుండా ఎన్నికల వేళ హడావుడిగా ప్రకటన చేయడంలోని ఆంతర్యాన్ని గుర్తించాలని కోరారు. ఆదివారం పంజాబ్‌లోని లూధియానా, మాల్వాలలో నిర్వహించిన బహిరంగ సభల్లో మిత్రపక్షమైన శిరోమణి-అకాలీదళ్ నేతలతో కలసి మోడీ మాట్లాడారు. సంప్రదాయ సిక్కు తలపాగా ధరించిన మోడీ సుమారు అరగంటపాటు చేపట్టిన ప్రసంగంలో కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.
 
 ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
     మాజీ సైనికోద్యోగుల సంక్షేమంపట్ల కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే 2004 నుంచీ అధికారంలో ఉన్నా ‘ఒక ర్యాంకు-ఒక పెన్షన్’ను ఎందుకు అమలు చేయలేదు?
 
     ఈ అంశంపై నేను తరచూ మాట్లాడుతుండటంతో ఈసారి బడ్జెట్‌లో ప్రకటన చేసింది. వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం 2004లో అధికారంలోకి వచ్చి ఉంటే దీన్ని వెంటనే అమలు చేసేది.
 
     ‘ఏబీసీ’లకు కొత్త నిర్వచనం (ఏ-ఆదర్శ్ హౌసింగ్ స్కాం, బీ-బోఫోర్స్ కుంభకోణం, సీ-కోల్ స్కాం) ఇస్తూ ఓవైపు కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోతుంటే ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అవినీతి విషయంలో విపక్షాలపై వేలెత్తి చూపడం హాస్యాస్పదంగా ఉంది.
 
      కేంద్రం నుంచి రూపాయి పంపితే 15 పైసలే గ్రామానికి చేరుతోందంటూ నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ పేర్కొనడమే కాంగ్రెస్ అవినీతికి నిదర్శనం.
 
     అధికారంలోకి వస్తే ప్రధాని పదవిని దేశానికి కాపాలాదారుగా స్వీకరిస్తా. ప్రభుత్వ ఖజానాపై ‘చెయ్యి’ పడకుండా చూస్తా.
 
     కాంగ్రెస్ ఇప్పటివరకూ ప్రజల కళ్లలో మట్టి కొట్టి మోసం చేయగా తాజాగా పెప్పర్ స్ప్రే చల్లడం మొదలు పెట్టింది (తెలంగాణ బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ విజయవాడ ఎంపీ (ప్రస్తుతం మాజీ) లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చల్లడాన్ని ఉదహరిస్తూ...)
 
     గుజరాత్‌లోని కచ్ ప్రాంతం నుంచి సిక్కు రైతులు వలస వెళ్తున్నారంటూ సాగుతున్న ప్రచారమంతా బూటకం. పంజాబ్‌లో బీజేపీ-ఎస్‌ఏడీ కూటమి హిందువులు-సిక్కుల ఐక్యతకు చిహ్నం.
 
     సుపరిపాలన ఎలా అందించాలో బన్సీలాల్, ప్రకాశ్‌సింగ్ బాదల్ (ఎస్‌ఏడీ నేత), ఓం ప్రకాశ్ చౌతాలా (ఐఎన్‌ఎల్‌డీ అధినేత), ఫరూఖ్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్) నుంచి నేర్చుకున్నా.
 
     అధికారం అందిస్తే దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తా.
     రైతులకు మేలు చేకూరాలంటే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ పెరగాలి. నష్టాల ఊబిలో ఉన్న రైతులను ఆదుకునేందుకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)ని మూడు విభాగాలుగా చేయాలి. మొదటి విభాగం ఉత్పత్తులను సేకరిస్తే రెండో విభాగం వాటిని నిల్వ చేసే బాధ్యతను, మూడో విభాగం వాటిని సమర్థంగా పంపిణీ చేసే బాధ్యతను చేపట్టాలి.
 
     గిడ్డంగుల్లో నిల్వ ఉన్న గోధుమలను రైతుల మధ్య పంపిణీ చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించినా కేంద్రం మాత్రం గోధుమ నిల్వలు కుళ్లిపోయే వరకూ నిరీక్షించి ఆ తర్వాత లిక్కర్ తయారీ బెవరేజీలకు అమ్ముకుంది.
 
     వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి.
 
 సంక్షిప్తంగా...

     2011లో తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ లక్ష్యంగా అమర్చిన పైపు బాంబు ఉదంతంలో ప్రధాన నిందితుడిని కేరళలో ఆదివారం అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.
 
     21 మంది అఫ్ఘానిస్థాన్ సైనికులను తాలిబాన్లు ఆదివారం కాల్చి చంపి, మరో ఏడుగురిని అపహరించిన ఘటనపై అఫ్ఘాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ మండిపడ్డారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ఏరివేయడంలో ఆ దేశ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.  
 
     {పపంచవ్యాప్తంగా అడవుల నాశనాన్ని ఎప్పటికప్పుడు కళ్లకు కట్టినట్లు చూపే వెబ్‌సైట్‌ను గూగుల్ సెర్చ్ ఇంజిన్ ప్రారంభించింది. ‘గ్లోబల్ ఫారెస్ట్ వాచ్’ పేరుతో ప్రారంభించిన ఈ సైట్‌లో అటవీప్రాంత నిర్మూలన సమాచారం, నివేదికలు, మ్యాపులు ఉన్నాయి.
 
     ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక నక్సల్ మృతి చెందాడు. జిల్లాలోని ధాదాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అడవుల్లో ఆదివారం ఉదయం కోబ్రా, సీఆర్‌పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేపట్టినప్పుడు ఎన్‌కౌంటర్ జరిగిందని అధికారులు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement