న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్లకు ఉద్వాసన పలుకుతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తునంది. ఇప్పటకే 75 ఏళ్లు పై బడిన వారు ఎన్నికల్లో పోటీ చేయరాదనే నియమం తీసుకొచ్చి సీనియర్లను పక్కన పెడుతున్నారు. ఈ క్రమంలో పార్టీని బలపర్చడంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ముఖ‍్య నాయుకుల విషయంలోను ఇదే వైఖరి అవలంభిస్తూ విమర్శలకు గురవుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ కురువృద్ధుడు, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శ్రమించిన అద్వాణీని ఈ ఎన్నికల్లో పక్కన పెట్టారు.
ఇప్పుడు ఈ జాబితాలో మరో సీనియర్ నేత చేరారు. ‘నన్ను పోటీ చేయవద్దని చెప్పారు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ సీనియర్ నేత మురళి మనోహర్ జోషి. ఈ మేరకు ఆయన ఓటర్లను ఉద్దేశిస్తూ రాశారంటూ ఓ లేఖ కూడా ప్రచారంలో ఉంది. రానున్న ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని పార్టీ తనను కోరిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ‘ప్రియమైన కాన్పూర్ ఓటర్లకు.. రానున్న ఎన్నికల్లో కాన్పూర్ నుంచే కాకుండా.. అసలు ఎక్కడి నుంచి కూడా పోటీ చేయోద్దని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌లాల్ ఈరోజు నన్ను కోరారు’ అని లేఖలో ఉంది. అయితే దీనిపై ఆయన సంతకం లేకపోవడం గమనార్హం.
అయితే తన పట్ల పార్టీ వ్యవహరిస్తున్న తీరుకు మురళీ మనోహర్ జోషి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఒకవేళ తను పోటీ చేసే విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ.. దాన్ని స్వయంగా పార్టీ అధ్యక్షుడు తనకు తెలియజేసి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన మురళీ మనోహర్ పార్టీ జాతీయాధ్యక్షుడిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో ప్రధాని మోదీ కోసం వారణాసి నుంచి తప్పుకున్నారు. కాన్పూర్ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు.
అద్వాణీ విషయంలో కూడా పార్టీ ఇలానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏళ్లుగా అద్వాణీ నాయకత్వం వహిస్తోన్న గాంధీ నగర్ సీటును ఈ ఏడాది అమిత్ షాకు కేటాయించారు. అయితే దీని గురించి అద్వాణీకి ముందుగా సమాచారం ఇవ్వలేదని.. ఆయనను సంప్రదించలేదని సమాచారం. ఈ విషయంలో అద్వాణీ తీవ్రంగా కలత చెందారని ఆయన సన్నిహితులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment