శివసేన దాడిని ఖండించిన అద్వానీ
న్యూఢిల్లీ: రాజకీయ నేత, కాలమిస్టు సుధీంద్ర కులకర్ణిపై శివసేన కార్యకర్తలు దాడి చేయడాన్ని బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ ఖండించారు. ప్రజాస్వామ్యంలో అన్నిరకాల అభిప్రాయాలకు స్థానం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
పాకిస్థాన్ విదేశాంగ మాజీ మంత్రి ఖుర్షిద్ మహమూద్ కసూరి రాసిన 'నెయిదర్ ద హాక్ నార్ ఏ డోవ్: ఏన్ ఇన్‌సైడర్స్ ఎకౌంట్ ఆఫ్ పాకిస్తాన్స్ ఫారిన్ పాలసీ' పుస్తకావిష్కరణకు హాజరుకానున్న సుధీంద్ర కులకర్ణిపై శివసేన కార్యకర్తలు నల్లరంగు కుమ్మరించారు. దాంతో కులకర్ణి మొహం అంతా నల్లగా మారిపోయింది.
'ఈ ఉదయం ఇంటికి నుంచి కారులో బయటకు వచ్చాను. కొంత మంది శివసేన కార్యకర్తలు నా కారు ఆపారు. నేను కారులోంచి బయటకు దిగగానే నామీద నల్లరంగు కుమ్మరించారు. వారు నన్ను దూషించార'ని కులకర్ణి వెల్లడించారు. మాతుంగ సబ్ అర్బన్ ప్రాంతంలోని సింగ్ సర్కిల్ లో కులకర్ణి నివాసానికి సమీపంలో ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని ముంబై పోలీసు అధికారి ధనంజయ్ కులకర్ణి తెలిపారు.