Sudheendra Kulkarni
-
పోరు నష్టం... పొందు లాభం
గల్వాన్ లోయ ఘటన తర్వాత దిగజారిన భారత్, చైనా సంబంధాలు మెరుగుపడటానికి ఇదే సమయం. రెండు దేశాలూ బలప్రదర్శనతో ప్రయోజనం లేదని గుర్తించాయి. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద దేశాలుగా... విస్తృత ప్రయోజనాలపై దృష్టి పెట్టాల్సి ఉందన్న అవగాహన కూడా పెరిగింది. దీనికితోడు, ప్రస్తుత యుద్ధ వాతావరణంలో అమెరికా ఒత్తిళ్లను తట్టుకుని మరీ రష్యాపై భారత్ ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలూ చేయక పోవడాన్ని ‘డ్రాగన్’ గమనించకుండా ఉండదు. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ప్రయోజనాలను గుర్తిస్తూ సాగడం అవసరం. పాశ్చాత్యుల మాదిరిగా స్వీయ ప్రయోజనాలు మాత్రమే చూసుకోకుండా, ఐదు వేల ఏళ్ల పురాతన సంస్కృతి నేర్పిన జ్ఞానాన్ని భారత్, చైనా ఆచరణలో పెట్టాల్సిన తరుణం ఇది. రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధం జోరుగా సాగుతున్న పరిస్థితులు... భారత్–చైనా సంబంధాలు మెరుగు పడేందుకు కారణం అవుతున్నాయి. వ్యూహాత్మక విషయాల్లో స్వయం ప్రతిపత్తి, స్వతంత్ర విదేశాంగ విధానం కలిగి ఉన్న భారత్... రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో ఒక పక్షం వైపు నిలబడేందుకు నిరాకరిస్తున్న విషయం... అగ్రరాజ్యం అమెరికా ఒత్తిళ్లకు లొంగని తత్వం... డ్రాగన్ దృష్టిని మీరి ఉండే అవకాశమే లేదు. కాబట్టి గల్వాన్ ఘటనను గతకాలపు జ్ఞాపకంగా వదిలేసి, ఇరు దేశాలూ తమ సంబంధాలను మళ్లీ దృఢతరం చేసుకునేందుకు ఇదే మంచి తరుణం. అలాగే భారత్ –చైనా రెండూ కలిసికట్టుగా రష్యా– ఉక్రెయిన్ యుద్ధానికి తెరదింపగలిగితే యూరప్‌లో శాంతికి ఆసియా దేశాలు కృషి చేసే అపురూప ఘట్టం ఒకటి ఆవిష్కృతమవుతుంది. రెండేళ్లుగా భారత్–చైనా సంబంధాలు బాగా దెబ్బ తిన్నాయన డంలో ఎలాంటి సందేహమూ లేదు. లదాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల ఘర్షణతో మొదలైన పతనం ఇప్పుడు పుంజుకునే అవకాశాలు ఏర్పడ్డాయి. సంబంధాలు పూర్వస్థితికి లేదా ఉచ్ఛస్థితికి చేరుకునేందుకు కొంత సమయం పట్టవచ్చు కానీ... కొత్త పరిణామాలు మాత్రం వైషమ్యం తగ్గుముఖం పట్టే ఆశను కల్పిస్తున్నాయి. చైనా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వాంగ్ యీ నేడు భారత్ రానున్నారు. ఇదే విధంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ బీజింగ్ వెళ్లే అవకాశమూ ఉంది. ఇరు దేశాల మంత్రుల పర్యటన... వచ్చే ఏడాది జరిగే ‘బ్రిక్స్’ సమావేశాల్లో పాల్గొనేందుకుగానూ ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు రంగం సిద్ధం చేయడం అనేది నిస్సందేహం. భారత ప్రధాని హాజరీ లేకుండా బ్రిక్స్ సమావేశం జరగడం ఊహించలేము. అదే సమయంలో వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితి ఎంతో కొంత చక్కబడకుండా భారత ప్రధాని చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌తో ముఖాముఖి మాట్లాడే పరిస్థితీ ఉత్పన్నం కాదు. ఇరుదేశాల మధ్య మళ్లీ స్నేహపూరిత వాతావరణం ఏర్పడేందుకు కారణాలేమిటి? బలప్రదర్శనతో ప్రయోజనం లేదని ఇరు దేశాలూ గుర్తించడం మొట్టమొదటి కారణం. ఆశ్చర్యకరమైన విషయం ఏమి టంటే... బల ప్రదర్శన నిష్ప్రయోజనమన్న విషయం ముందుగా చైనా వైపు నుంచే వ్యక్తం కావడం. ఈ నెల ఏడవ తేదీన చైనా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మాట్లాడుతూ, ‘‘లక్ష్యాల సాధనకు ఒకరి కొకరు సహకరించుకోవాలేగానీ... ఒకరి శక్తిని ఇంకొకరు పీల్చేసు కుంటూ ఉండటం సరికాదు’’ అని వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో యాభై వేలమంది సైనికులను మోహరించడం (శక్తి), ఆయుధ వ్యవస్థలను సిద్ధంగా ఉంచుకోవడం పైనే ఈ వ్యాఖ్య అన్నది అర్థం చేసుకోవాలి. కమాండర్ల స్థాయిలో పదిహేనుసార్లు చర్చలు జరిపినా ఉద్రిక్తతల తగ్గింపు అందని మానిపండులాగే మిగిలింది మరి. రాజ కీయంగానూ పరిష్కారం కానరాని నేపథ్యంలో బల ప్రదర్శన చేయడం తర్కానికి నిలిచేది కాదు. ఆ పరిస్థితి తాలూకూ విపరిణా మాలను ఇరుదేశాలూ అనుభవించాల్సి ఉంటుంది. రెండో కారణం... ఒక చిన్న ఘటనతో ద్వైపాక్షిక సంబంధాలు ఇంత దిగజారిపోవాల్సిన అవసరం లేదని ఇరుదేశాలూ గుర్తించడం. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద దేశాలుగా... విస్తృత ప్రయోజనాలపై దృష్టి పెట్టాల్సి ఉందన్న అవగాహన పెరగడం. ఆర్థిక, వాణిజ్య రంగాలతోపాటు వాతావరణ మార్పులపై పోరు, డిజిటల్ టెక్నా లజీలు, ప్రాంతీయంగా శాంతి వంటి అనేకానేక ప్రయోజనాలు ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగ్గా ఉంటేనే సాధ్యమనీ, తద్వారా ప్రపంచస్థాయిలో సరికొత్త భిన్న ధ్రువాత్మక రాజకీయాలకు రూప కల్పన చేయవచ్చుననీ భావించడం. కొన్ని అంశాల్లో ఇరు దేశాల ప్రయోజనాలూ, దృక్కోణాలూ వేరుగా ఉన్నప్పటికీ... చాలా అంశాల్లో సారూప్యతా ఉంది. సారూ ప్యతతో వచ్చే ప్రయోజనాలు పొందాలన్నా... భిన్నాభిప్రాయాల పరిణామాలను నియంత్రించాలన్నా రాజకీయంగా అత్యున్నత స్థాయి చర్చలు అత్యవసరం. గల్వాన్ ఘటన కారణంగా ఈ చర్చల ప్రక్రియ ఆగిపోవడం దురదృష్టకరం. ఈ ఘటనకు ముందు మోదీ, జింగ్పింగ్ దాదాపు 18 సార్లు కలిసినా... ఆ తరువాత మాత్రం ఒక్క సారి కనీసం కలుసుకోలేదు. ఈ స్తబ్ధత ఇరువురికీ మేలు చేసేదేమీ కాదు. భారత్–చైనా మధ్య సంబంధాలు మెరుగుపడాల్సిన అవసరాన్ని చెప్పే ఇంకో కారణం... ప్రాంతీయంగానూ, అంతర్జాతీయంగానూ జరుగుతున్న పరిణామాలు. శాంతి, సుస్థిరతల స్థాపనలో ఇరు దేశా లకూ బాధ్యత, భాగస్వామ్యం ఉంది. అమెరికా బలగాలు వెళ్లిపోయిన తరువాత తాలిబాన్ల చేతిలో చిక్కిన అఫ్గానిస్థాన్ పునర్నిర్మాణంపై కూడా ఇరు దేశాలూ పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. దక్షిణాసియా ప్రాంతంలో ఉగ్రవాదానికీ, మతపరమైన తీవ్రవాదానికీ, వేర్పాటు వాద శక్తులకూ చోటులేకుండా చూడటం కూడా అత్యవసరం. ఈ మూడు లక్ష్యాల సాధనకు పాకిస్తాన్‌తోపాటు ఈ ప్రాంతంలోని అన్ని దేశాల మ«ధ్యా చర్చలు కచ్చితంగా జరగాలి. చైనా ప్రభావం పాకిస్తాన్‌పై కూడా ఉన్న విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కూడా భారత్, చైనా తమ ఆలో చనలను మార్చుకోవాల్సిన పరిస్థితి కల్పించింది. రష్యాతో ఇరుదేశా లకూ మంచి సంబంధాలే ఉండటం దీనికి కారణం. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో అమెరికా ఒత్తిళ్లను తట్టుకుని మరీ రష్యాపై భారత్ ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలూ చేయకపోవడాన్ని చైనా కచ్చితంగా గమనించే ఉంటుంది. ‘‘కొన్ని శక్తులు రెండు ఆసియా దేశాల మధ్య విభజనను సృష్టించేందుకు ప్రయత్నించాయి’’ అన్న బీజింగ్ వ్యాఖ్య ఇక్కడ ప్రస్తావనార్హం. ప్రపంచస్థాయిలో భారత్ అవసరాన్నీ, ప్రాము ఖ్యతనూ చైనా కూడా పరోక్షంగా గుర్తు చేస్తూనే ఉంది. ‘‘భారత్– చైనా భాగస్వా ములూ, మిత్రులూ కావాల్సిన అవసరం ఉంది. ఒకరికి ఒకరు ముప్పుగా పరిణమించకుండా పరస్పర అభివృద్ధికి అవకా శంగా మారాలి’’ అంటూ వాంగ్ యీ ఇటీవల చేసిన వ్యాఖ్య ఇందుకు ఒక ఉదాహరణ. ‘‘భారత్, చైనా దేశాలు అతిపురాతన నాగరికతలకు ఆనవాళ్లు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు మాత్రమే కాకుండా... వేరు చేయలేని ఇరుగూ పొరుగూ కూడా. ఒకరిపై ఒకరికి విశ్వాసం కలిగితే ఆ మైత్రికి హిమాలయాలూ అడ్డు కాబోవు’’ అని కూడా వాంగ్ వ్యాఖ్యానించారు. రెండేళ్ల స్తబ్ధతను ఛేదించేందుకు ఈ ఏడాది గట్టి ప్రయత్నమే జరిగింది. ఇరు దేశాల్లోనూ భారత – చైనా నాగరికతలపై చర్చలు చేపట్టాలని చైనా ప్రతిపాదించడం వీటిల్లో ముఖ్యమైనది. 2019 మే నెలలో జింగ్పింగ్ ఆసియా నాగరికతలపై ఓ చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో భారత్ ఆ చర్చల్లో అధికారికంగా పాల్గొనలేకపోయింది. కానీ.. వీటిల్లో నేను పాల్గొ న్నాను. ఆ కార్యక్రమంలో జింగ్పింగ్ ఆసియా నాగరికతలు రూపు దిద్దుకోవడంలో భారత భాగస్వామ్యంపై ప్రశంసల వర్షం కురిపిం చారు. రుగ్వేదం, గంగ, సింధు నదులతోపాటు అమూల్యమైన బౌద్ధం గురించి కూడా ప్రస్తావించారు. ‘‘పరాజితులు లేని... ఇరు పక్షాలూ విజితులుగా నిలిచేదే మేలైన వివాద పరిష్కారం’’ అన్న గౌతమ బుద్ధుడి వ్యాఖ్యను ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. భారత్, చైనా కూడా ఈ మాటలకు చెవి ఒగ్గడం ఎంతైనా అవసరం. ఇరు దేశాల సరిహద్దుల్లో ఏర్పడ్డ వివాదం పరస్పరం రాజీ పడటం ద్వారా మాత్రమే పరిష్కారమవుతుంది. ఇందుకు ఇరు పక్షాలూ ముందడుగు వేయాలి. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ప్రయోజనాలను గుర్తిస్తూ, పునఃసమీక్ష చేసుకుంటూ సాగడం అవసరం. పాశ్చాత్యుల మాదిరిగా స్వీయ ప్రయోజనాలు మాత్రమే చూసుకోకుండా, హింసను ప్రేరేపించకుండా... భారత్, చైనా ఐదు వేల ఏళ్ల పురాతన సంస్కృతి నేర్పిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాల్సిన సమయం ఇది. అలా చేయని పక్షంలో గల్వాన్ లోయ తరహా ఘర్షణలు మరింత తీవ్రరూపం దాల్చడం తప్పదు! సుధీంద్ర కులకర్ణి వ్యాసకర్త ఫోరమ్ ఫర్ ఎ న్యూ ఆసియా వ్యవస్థాపకులు (‘ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మోదీ ఫెయిల్.. రాహుల్ మాత్రం...
‘కశ్మీర్ సమస్యను పరిష్కరించటంలో ప్రధాని నరేంద్ర మోదీ ఘోరంగా విఫలం అయ్యారు. కానీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని అయితే మాత్రం ఖచ్ఛితంగా ఓ పరిష్కారం చూపగలుగుతారు’... బీజేపీ దిగ్గజం ఎల్కే అద్వానీ మాజీ సహాయకుడు, బీజేపీ మాజీ అధికార ప్రతినిధి సుధీంద్ర కులకర్ణి చెబుతున్న మాటలివి. సాక్షి, ముంబై: మోదీ వల్ల పరిష్కారం కానీ కశ్మీర్ సమస్యను రాహుల్ గాంధీ ఖచ్ఛితంగా పరిష్కరించగలరని సుధీంద్ర ఘంటాపథంగా చెబుతున్నారు. సోమవారం ముంబైలో కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ రాసిన ‘స్పెక్ట్రమ్ పాలిటిక్స్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్‌కు హాజరైన సుధీంద్ర.. రాహుల్‌పై ప్రశంసలు గుప్పించారు. ‘పొరుగున ఉన్న పాకిస్థాన్, చైనాలతో సమస్యలను పరిష్కరించుకోగలిగినప్పుడే భారత్ బలమైన శక్తిగా ఎదుగుతుంది. కానీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ విషయంలో అన్ని రకాలుగా విఫలమైంది. కశ్మీర్లో పరిస్థితులు చక్కబడటం లేదు. అయితే రాహుల్ ప్రధాని అయితే మాత్రం ఆ సమస్యలన్నీ పరిష్కరం కావొచ్చు’ అన్న అభిప్రాయాన్ని సుధీంద్ర వ్యక్తం చేశారు. ‘రాహుల్ గాంధీ మంచి మనసు ఉన్న నేత. అది నేతల్లో చాలా అరుదుగా కనిపించే గుణం. ప్రజలను ఇట్టే ఆకర్షిస్తుంది. అయితే ఆయనకు ఓ సలహా. ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలోనే రాహుల్ అఫ్గనిస్తాన్‌లో పర్యటించారు. అదే విధంగా పాక్, చైనా, బంగ్లాదేశ్‌లో కూడా పర్యటించి అక్కడి నేతలతో ‘కీలక సమస్యల’పై చర్చిస్తే మంచిది’ అని సుధీంద్ర కాంగ్రెస్ అధ్యక్షుడికి సూచించారు. భవిష్యత్తులో రాహుల్ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు సుధీంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు. -
'ఆయన ప్రధాని అయ్యుంటే దేశం పాకిస్థాన్ అయ్యేది'
న్యూఢిల్లీ: సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదటి ప్రధానమంత్రి అయ్యుంటే ఇండియా... పాకిస్థాన్ లా తయారయ్యేదని, ప్రజాస్వామ్యం పతనమయ్యేదని దళిత హక్కుల నేత, రచయిత ప్రొఫెసర్ కంచ ఐలయ్య అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరుగుతున్న టైమ్స్ లిట్ ఫెస్టివల్ లో 'రీ ఇమాజినింగ్ ది రిపబ్లిక్స్ ఐకాన్స్: పటేల్, నెహ్రు, అంబేద్కర్' అనే అంశంపై చర్చలో ఆయన పాల్గొన్నారు. వల్లభాయ్ పటేల్ దేశానికి మొదటి ప్రధాని అయ్యుంటే దేశ గమనం మరోలా ఉండేదని నరేంద్ర మోదీ పేర్కొనడంతో 2014 ఎన్నికల్లో ఆయన పేరు ప్రముఖంగా వినబడిందని గుర్తు చేశారు. 'అంబేడ్కర్ రాజ్యాంగం రాయడానికి ఆయన(పటేల్) ఒప్పుకోలేదు. హిందూ మహాసభకు ఆయన సన్నిహితంగా మెలిగారు. మనుస్మృతిని నమ్మిన వారు మాత్రమే రాజ్యాంగం రాయాలని ఆయన ఆకాంక్షించారు. పటేల్ ప్రధాని పదవిని చేపట్టివుంటే మనదేశం పాకిస్థాన్ లా తయారయ్యేది. ప్రజాస్వామ్యం కుప్పకూలేది. ప్రజాస్వామ్యం సిద్ధించాక మొదటి 17 ఏళ్లు మనదేశం పాకిస్థాన్ లా వ్యవహరించింది' అని ఐలయ్య అన్నారు. సామాజిక ఐక్యత, సమానత్వం లేదా రాజకీయ ఏకాభిప్రాయానికి వల్లభాయ్ పటేల్ కృష్టి చేయలేదని ప్రముఖ రచయిత, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ చీఫ్ సుదీంద్ర కులకర్ణి తెలిపారు. సమాజంలో సమస్యల గురించి పట్టనట్టుగా ఆయన వ్యవహరించారని వెల్లడించారు. 'మనకు ఉక్కుమనిషి అక్కర్లేదు. అందరినీ కలుపుపోయే హృదయం ఉన్న నాయకులు కావాలి' అని కులకర్ణి వ్యాఖ్యానించారు. అనన్య వాజపేయి, డి. శ్యామ్ బాబు తదితరులు ఈ చర్చలో పాల్గొన్నారు. -
శివసేనలో మార్పు వచ్చినట్టనిపిస్తోంది
-
మలాలా వస్తే ఇలాగే చేస్తారా..?
తనపై శివసేన చేసిన దాడికి అబ్జర్వర్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఛైర్మన్ సుధీంద్ర కులకర్ణి ఘాటుగా స్పందించారు. తనను పాకిస్తాన్ ఏజెంటుగా అభివర్ణించడాన్ని తప్పుపట్టారు. నోబెల్ బహుమతి గ్రహీత మలాలా ముంబయి వస్తే ఇలాగే వ్యవహరిస్తారా..? అని ప్రశ్నించారు. తాను శాంతిని కోరుకునే వ్యక్తినని తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. పాకిస్థాన్ మాజీ మంత్రి ఖుర్షీద్ మహ్మద్ కసూరి రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సోమవారం వెళ్లిన సుధీంద్ర కులకర్ణిపై శివసేన కార్యకర్తలు నల్లరంగు పోసి నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ముంబైలో కసూరి పుస్తకావిష్కరణను రద్దు చేయాలన్న తమ డిమాండ్‌కు నిరాకరించడంతో శివసేన ఈ దాడికి దిగింది. అయినా సుధీంద్ర వెనకడుగు వేయకుండా కసూరి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
భావ ప్రకటనపై దాడి
ముంబైలో పాక్ మాజీ మంత్రి కసూరి పుస్తకావిష్కరణకు వ్యతిరేకంగా శివసేన వీరంగం కార్యక్రమ నిర్వాహకుడు, బీజేపీ మాజీ సిద్ధాంతకర్త సుధీంద్ర కులకర్ణిపై సిరా దాడి ♦ పటిష్ట భద్రత నడుమ పుస్తకావిష్కరణ; పాల్గొన్న మొహమ్మద్ కసూరి ముంబై/న్యూఢిల్లీ: ముంబైలో శివ సైనికులు రెచ్చిపోయారు. భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి చేశారు. నగరంలో పాక్ ప్రముఖుల కార్యక్రమాలపై తాము విధించిన అప్రకటిత నిషేధాన్ని ఎదిరించిన పాపానికి ఓ మేధావి ముఖంపై నల్లరంగు పులిమారు. ముంబైలో పాక్ మాజీ విదేశాంగ మంత్రి పుస్తకావిష్కరణ కార్యక్రమం వద్దని హెచ్చరించినా.. బేఖాతరు చేసినందుకు ఆయనను బూతులు తిడుతూ అవమానించారు.ప్రజాస్వామ్యంలో అది చిన్న నిరసన మాత్రమేనంటూ సేన ఎంపీ సంజయ్ రౌత్ వారిని సమర్థించడం కొసమెరుపు. పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ మొహమ్మద్ కసూరి రాసిన ‘నైదర్ ఎ హాక్.. నార్ ఏ డవ్-యాన్ ఇన్సైడర్స్ అకౌంట్ ఆఫ్ పాకిస్తాన్స్ ఫారిన్ పాలసీ’ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం ముంబైలో నిర్వహించేందుకు నిర్ణయించారు. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్(ఓఆర్ఎఫ్) సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ చైర్మన్, ఒకప్పటి బీజేపీ సిద్ధాంతకర్త సుధీంద్ర కులకర్ణి ఆ పనుల్లో ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని విరమించుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని శివసేన నుంచి ఆయనకు హెచ్చరికలు వచ్చాయి. దాంతో ఆయన ఆదివారం రాత్రి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రేను ఆయన నివాసం మాతోశ్రీ లో కలసి, ఈ విషయంలో సహకరించాలని కోరారు. ‘శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు మీకున్నట్లే, పుస్తకావిష్కరణ హక్కు మాకుంద’ని ఠాక్రేతో వాదించారు. అయితే, ఠాక్రే నుంచి ఆయనకు ఎలాంటి హామీ లభించలేదు. దీంతో సోమవారం ఉదయం మాతుంగలోని తన నివాసం నుంచి కారులో బయటకు వచ్చిన సుధీంధ్రను శివసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన కార్లో నుంచి బయటకు వచ్చాక ఆయనపై నల్లరంగు గుప్పించారు. సుధీంధ్ర ముఖంపై, దుస్తులపై నల్లరంగు పులిమి, బూతులు తిడుతూ అవమానించారు. అనంతరం, పూర్తిగా నల్లరంగులో తడిచిపోయిన సుధీంధ్ర.. అదే ఆహార్యంలో కసూరితో కలసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఇలాంటి బెదిరింపులకు లొంగబోనని తేల్చి చెప్పారు. ఇది ప్రజాస్వామ్యానికి జరిగిన అవమానమని అన్నారు. కసూరి మాట్లాడుతూ.. నిరసన తెలిపే విధానం ఇది కాదన్నారు. ఆ తర్వాత సాయంత్రం ముంబైలోని నెహ్రూ సెంటర్లో భారీ బందోబస్తు మధ్య పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కులకర్ణిపై దాడిని బీజేపీ సహా అన్ని పార్టీల నేతలు, మేధావులు, కళాకారులు, సినీ ప్రముఖులు ఖండించారు. అద్వానీ, మాజీ ప్రధాని వాజ్‌పేయిలకు కులకర్ణి సన్నిహితుడు. వారికి గతంలో ప్రసంగ ప్రతులను రాసిచ్చేవారు. ఈ ఘటనపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ.. ‘ఇంకు పోయడంపై చాలామంది బాధపడుతున్నారు. సరిహద్దుల్లో మన సైనికులను చంపి, వారి రక్తాన్ని చిందించిన విషయాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అది ఇంక్ కాదు.. మన సైనికుల రక్తం’ అని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రానికి వచ్చిన ప్రముఖులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వ బాధ్యతను నిర్వర్తిస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టంచేశారు. సానుకూల దృక్పథం కావాలి: కసూరి ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. సానుకూల దృ క్పథం అలవర్చుకోవాలని కసూరి అన్నారు. కార్గిల్ సమయంలో కానీ, 26/11 ముంబై దాడుల సమయంలో కానీ, తాను మంత్రిని కానని స్పష్టం చేశారు. బీజేపీ హయాంలో పెరిగాయి: కాంగ్రెస్ ఈ అసహనాన్ని దేశం సహించబోదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ హెచ్చరించారు. భారత్‌లో ‘దేశీ తాలిబాన్’ను అంగీకరించబోమన్నారు. ఇలాంటి చర్యలు భారత్, పాక్ సంబంధాలను మరింత దెబ్బతీస్తాయని సీపీఐ నేత రాజా పేర్కొన్నారు. కాగా, సుధీంద్రపై నల్లరంగు పోసిన ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అపోహలను తొలగించేందుకే.. పటిష్ట భద్రత నడుమ కసూరి రాసిన ‘నైదర్ ఎ హాక్, నార్ ఎ డవ్’ పుస్తకావిష్కరణ ప్రశాంతం గా ముగిసింది. కార్యక్రమంలో న్యాయవాది ఏజీ నూరానీ, జర్నలిస్ట్ దిలీప్ పద్గావంకర్, నటుడు నసీరుద్దీన్‌షా..పాల్గొన్నారు. ముంబై లో తనకు భద్రత కల్పించిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు కసూరి కృతజ్ఞతలు తెలిపారు. బాలీవుడ్ ప్రముఖుల ఖండన సుధీంద్ర కులకర్ణిపై దాడిని బాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. ‘శివసేన దాడి చాలా బాధాకరం. ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రేలతో మాట్లాడేందుకు చాలా ప్రయత్నించా. కానీ వారు నా కాల్స్‌కు స్పందించలేదు’ అని నటి షబానా ఆజ్మీ ట్వీట్ చేశారు. దాడిని ఖండిస్తూ మహేశ్ భట్, రిషీ కపూర్ తదితరులు కూడా ట్వీట్ చేశారు. సహనం ప్రజాస్వామ్య లక్షణం: అద్వానీ ఒకప్పటి తన అనుచరుడు సుధీంద్రపై దాడిని బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ గర్హించారు. ఎవరైనా తమకు అనుకూలంగా లేనట్లయితే, వారిపై హింసకు దిగుతున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువవుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సుధీంద్రపై దాడిని కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నఖ్వీ, మహేశ్ శర్మ, కిరణ్ రిజిజు తదితరులు తీవ్రంగా ఖండించారు. -
మళ్లీ అదే తీరు!
శతాబ్దాలుగా భారత నాగరికత నిలదొక్కుకోవడానికి కారణమైన వైవిధ్యత, సహనం, బహుళత్వం వంటి విలువలను కాపాడుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చి నాలుగురోజులైంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని అందరినీ కోరారు. కానీ సోమవారం శివసేన కార్యకర్తలు అందుకు భిన్నంగా ప్రవర్తించి ఆ విలువలకు అపచారం చేయడమే కాదు...దేశం పరువు ప్రతిష్టలను మంటగలిపారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించారు. పాకిస్థాన్ మాజీ మంత్రి ఖుర్షీద్ మహ్మద్ కసూరీ రచించిన గ్రంథాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని అడుకోవాలని చూసి, అది సాధ్యంకాదని అర్థమయ్యాక ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్(ఓఆర్ఎఫ్) వ్యవస్థాపకుడు సుధీంద్ర కులకర్ణిపై నల్లరంగు కుమ్మరించి ఆయనను దుర్భాషలాడారు. సుధీంద్ర కులకర్ణి ఎన్డీఏ తొలి దశ పాలనా కాలంలో బీజేపీలో కీలక పాత్ర పోషించారు. అప్పటి ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీకి సహాయకుడిగా పనిచేశారు. అనంతర పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీనుంచి బయటికొచ్చినా మౌలికంగా బీజేపీ సిద్ధాంతాలతో ఆయన విభేదించలేదు. సుధీంద్ర కులకర్ణి విశ్వాసాలేమైనా...వాటితో ఏకీభావం ఉన్నా లేకున్నా ఆయన్ను ఈ దేశంలో అందరూ మేథావిగా గుర్తిస్తారు. గౌరవిస్తారు. అలాంటి వ్యక్తిపై కేవలం తమ ఆదేశాలను ధిక్కరించారన్న ఏకైక కారణంతో శివసేన దాడికి దిగడం అందరినీ విస్మయపరిచింది. న్యూఢిల్లీలో రెండు రోజులక్రితం ఇదే గ్రంథాన్ని ఆవిష్కరించినప్పుడు ఆ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌సిన్హా మాట్లాడారు. అద్వానీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ తదితరులు పాల్గొన్నారు. అదే గ్రంథాన్ని ముంబైలో ఆవిష్కరించాలని నిర్ణయించినప్పుడు దాన్ని జరగనివ్వబోమని శివసేన ప్రకటించింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే సుధీంద్ర ఆదివారం ఆ పార్టీ అధినేత ఉధవ్ ఠాక్రేను కలిశారు. కార్యక్రమాన్ని అడ్డుకోవద్దని అభ్యర్థించారు. కావాలంటే ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపవచ్చునన్నారు. ఇదే శివసేన ఆగ్రహానికి కారణమైంది. తమ హుకుంను ధిక్కరించారన్న అక్కసుతో ఆయనపై నల్లరంగు పోశారు. ముంబై మహానగరానికి ఘనమైన చరిత్ర ఉంది. భిన్న భాషలు, సంస్కృతులు, మతాలు, సంప్రదాయాలతో ఎంతో వైవిధ్యభరితంగా ఉన్న మన దేశానికి అది అచ్చమైన ప్రతీక. దేశంలోని భిన్న ప్రాంతాలనుంచి మాత్రమే కాదు...ప్రపంచంలోని వివిధ దేశాలనుంచి వచ్చి అక్కడ పనిచేస్తుంటారు. సుధీంద్ర కులకర్ణిపై దాడి చేసినవారు ఈ దేశ రాజ్యాంగానికి అపచారం కలిగించడంతోపాటు ముంబై నగర చరిత్రకు కూడా మచ్చ తెచ్చారు. తమ కార్యకర్తల చర్యను సమర్థించుకుంటూ శివసేన నేతలు మాట్లాడిన మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మన దేశంలో ఉగ్రవాద దాడులను ప్రోత్సహిస్తూ, సరిహద్దుల్లో మన సైనికులను చంపుతున్న పాకిస్థాన్‌కు చెందినవారు ఈ నగరంలో సభ పెట్టడానికి వీల్లేదని వారు వాదిస్తున్నారు. ఈ కారణాన్ని చూపే ఈమధ్య ముంబైలో జరగాల్సిన సుప్రసిద్ధ పాక్ గజల్ గాయకుడు గులాం అలీ కార్యక్రమానికి శివసేన అడ్డు తగిలింది. ఆ విషయంలో విజయం సాధించిన తాము కసూరీ పుస్తకావిష్కరణను మాత్రం అడ్డుకోలేకపోతున్నామన్న బాధ శివసేనకు ఉండొచ్చు. ఇంతకూ కసూరీ ఇప్పుడు పాకిస్థాన్ పాలక వ్యవస్థలో భాగస్వామి కాదు. భారత్‌తో సత్సంబంధాలకు అడ్డు తగులుతున్న శక్తులపై ఆయనకు ఆగ్రహం ఉంది. ఆయన రచించిన పుస్తకం పాక్ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నదని అక్కడి మతతత్వవాదులు విమర్శించారు. అలాంటి వ్యక్తిని పాకిస్థాన్ ప్రతినిధిగా పరిగణించడం...పాక్ చర్యలకు బాధ్యుడిగా భావించడం సరైంది అనిపించుకోదు. ఒకవేళ కసూరీ ఆ బాపతు వ్యక్తేనని నమ్మితే...అలాంటి వ్యక్తికి వీసా ఇచ్చి భారత్ రావడానికి దోహదపడినందుకు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారును శివసేన విమర్శించాలి. ఆ కూటమినుంచి తప్పుకోవాలి. కేంద్రంలోనూ, మహారాష్ట్ర సర్కారులోనూ మంత్రి పదవులనుంచి తప్పుకోవాలి. సరిహద్దుల్లో ప్రాణాలర్పిస్తున్న సైనికుల స్మృతికి కసూరీ రాకవల్ల అపచారం జరిగిందనుకుంటే శివసేన చేయాల్సిన పని అది. అంత పెద్ద నిర్ణయం తీసుకోలేకనో ఏమో అది సుధీంద్ర కులకర్ణిని లక్ష్యంగా ఎంచుకుంది. ఈ దాడికి మరో కోణం కూడా ఉంది. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి పైకి కనిపిస్తున్నంత సజావుగా లేదు. నిరుడు జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రంగా పోటీచేసి అధిక స్థానాలు కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పర్చడం...తప్పనిసరై అందులో తాము కొనసాగాల్సిరావడం శివసేనకు నామర్దాగానే ఉంది. అందుకే అవకాశం చిక్కినప్పుడల్లా బీజేపీని మించిన జాతీయవాదులమని నిరూపించుకోవడానికి అది ప్రయత్నిస్తున్నది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ను ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నది. సోమవారం నాటి దాడి కూడా అందులో భాగమే. అయితే ఈ దాడిని ఖండించడంలో అద్వానీ మినహా ఇతర బీజేపీ నేతలు పెద్దగా ఆసక్తి కనబర్చక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలాంటి ఉదంతాలను చూసీచూడనట్టు ఊరుకోవడం వల్లనే వీటి సంఖ్య పెరుగుతోంది. ఎవరిపై ఎలాంటి దాడులకు పాల్పడ్డా తమకేమీ కాదన్న ధోరణిలో కొందరు ప్రవర్తిస్తున్నారు. కసూరీ అభిప్రాయాలతోగానీ, ముంబైలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన సుధీంద్ర కులకర్ణితోగానీ ఎవరికీ ఏకీభావం లేకపోవచ్చు. అంతమాత్రాన దాడులకు దిగడం అప్రజాస్వామికం. ఇలాంటి పోకడలను సహిస్తే దేశంలో ప్రజాస్వామిక వాతావరణం దెబ్బతింటుంది. మంద బలంతో ఏమైనా చేయొచ్చుననుకునే మూకలది పైచేయి అవుతుంది. ఈ సంగతిని ప్రభుత్వాధినేతలు గుర్తించి సక్రమంగా వ్యవహరించాలి. -
శివసేన దాడిని ఖండించిన అద్వానీ
న్యూఢిల్లీ: రాజకీయ నేత, కాలమిస్టు సుధీంద్ర కులకర్ణిపై శివసేన కార్యకర్తలు దాడి చేయడాన్ని బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ ఖండించారు. ప్రజాస్వామ్యంలో అన్నిరకాల అభిప్రాయాలకు స్థానం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. పాకిస్థాన్ విదేశాంగ మాజీ మంత్రి ఖుర్షిద్ మహమూద్ కసూరి రాసిన 'నెయిదర్ ద హాక్ నార్ ఏ డోవ్: ఏన్ ఇన్సైడర్స్ ఎకౌంట్ ఆఫ్ పాకిస్తాన్స్ ఫారిన్ పాలసీ' పుస్తకావిష్కరణకు హాజరుకానున్న సుధీంద్ర కులకర్ణిపై శివసేన కార్యకర్తలు నల్లరంగు కుమ్మరించారు. దాంతో కులకర్ణి మొహం అంతా నల్లగా మారిపోయింది. 'ఈ ఉదయం ఇంటికి నుంచి కారులో బయటకు వచ్చాను. కొంత మంది శివసేన కార్యకర్తలు నా కారు ఆపారు. నేను కారులోంచి బయటకు దిగగానే నామీద నల్లరంగు కుమ్మరించారు. వారు నన్ను దూషించార'ని కులకర్ణి వెల్లడించారు. మాతుంగ సబ్ అర్బన్ ప్రాంతంలోని సింగ్ సర్కిల్ లో కులకర్ణి నివాసానికి సమీపంలో ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని ముంబై పోలీసు అధికారి ధనంజయ్ కులకర్ణి తెలిపారు. -
ముఖం నిండా నల్లరంగు పులిమారు
ముంబై: పాకిస్థాన్ విదేశాంగ మాజీ మంత్రి ఖుర్షిద్ మహమూద్ కసూరి రాసిన ఓ పుస్తకాన్ని ముంబైలో ఆవిష్కరించే కార్యక్రమానికి ఆరంభంలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రధానవక్తగా పాల్గొనేందుకు వెళ్తున్న సుధీంద్ర కులకర్ణికి చేదు అనుభవం ఎదురైంది. దారిలోనే ఆయనను అడ్డుకున్న శివసేన కార్యకర్తలు.. ఆయన మీద నల్లరంగు కుమ్మరించారు. దాంతో కులకర్ణి మొహం అంతా నల్లగా మారిపోయింది. పుస్తకావిష్కరణను ప్రతిఘటిస్తామని ముందే ప్రకటించిన శివసేన కార్యకర్తలు కొంతమంది, రిసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ సుధీంద్ర కులకర్ణి నివాసానికి వచ్చారు. అప్పుడే కారులో బయల్దేరిన ఆయనను మాట్లాడాలని బయటికి పిలిచారు. ఆయన బయటకు రాగానే నల్లరంగు ఆయన ముఖంపై పులిమారు. దుర్భాషలాడుతూ దాడిచేసి అవమానించారు. పుస్తకావిష్కరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే తాము ఎవరి బెదిరింపులకూ భయపడేది లేదని, తమ కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తామని సుధీంద్ర కులకర్ణి మీడియాకు స్పష్టం చేశారు. అనంతరం తనపై జరిగిన దాడి విషయాన్ని పోలీసులకు ఫిర్యాదుచేశారు. అయితే.. ఇప్పటివరకు చేసినది చాలా చిన్న చర్యేనని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. తమ కార్యకర్తలు సుధీంద్ర కులకర్ణిపై చేసిన దాడిపట్ల తమకు చాలా గర్వంగా ఉందని కూడా కొంతమంది శివసేన నేతలు చెప్పారు. మరోవైపు మహారాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం, పుస్తకావిష్కరణ సభకు పూర్తి భద్రతను ఏర్పాటు చేస్తామని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. శివసేన కార్యకర్తలు ఆదివారం రాత్రి తమ నేత ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. అయితే.. తాను పాకిస్థాన్ నుంచి వచ్చింది హోటల్లో కూర్చోవడానికి కాదంటూ మహమూద్ కసూరి వ్యాఖ్యానించారు. అసలు ఇలా జరుగుతుందని తాను ఊహించలేదని కసూరి చెప్పారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా సాయంత్రం 5.30 గంటలకు నెహ్రూ సెంటర్లో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతుందని సుధీంద్ర కులకర్ణి తెలిపారు. ముఖం నిండా నల్లరంగుతోనే ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.