ముఖం నిండా నల్లరంగు పులిమారు | Kasuri book launch row: Shiv Sainiks smear black paint on Sudheendra Kulkarni's face | Sakshi
Sakshi News home page

ముఖం నిండా నల్లరంగు పులిమారు

Published Mon, Oct 12 2015 11:02 AM | Last Updated on Sun, Sep 3 2017 10:51 AM

ముఖం నిండా నల్లరంగు పులిమారు

ముఖం నిండా నల్లరంగు పులిమారు

ముంబై: పాకిస్థాన్ విదేశాంగ మాజీ మంత్రి ఖుర్షిద్ మహమూద్ కసూరి రాసిన ఓ పుస్తకాన్ని ముంబైలో ఆవిష్కరించే కార్యక్రమానికి ఆరంభంలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రధానవక్తగా పాల్గొనేందుకు వెళ్తున్న సుధీంద్ర కులకర్ణికి చేదు అనుభవం ఎదురైంది. దారిలోనే ఆయనను అడ్డుకున్న శివసేన కార్యకర్తలు.. ఆయన మీద నల్లరంగు కుమ్మరించారు. దాంతో కులకర్ణి మొహం అంతా నల్లగా మారిపోయింది.

పుస్తకావిష్కరణను ప్రతిఘటిస్తామని ముందే ప్రకటించిన శివసేన కార్యకర్తలు కొంతమంది, రిసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ సుధీంద్ర కులకర్ణి నివాసానికి వచ్చారు. అప్పుడే కారులో బయల్దేరిన ఆయనను మాట్లాడాలని బయటికి  పిలిచారు. ఆయన బయటకు రాగానే నల్లరంగు ఆయన  ముఖంపై పులిమారు. దుర్భాషలాడుతూ దాడిచేసి అవమానించారు. పుస్తకావిష్కరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అయితే తాము ఎవరి బెదిరింపులకూ భయపడేది లేదని, తమ కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తామని సుధీంద్ర కులకర్ణి మీడియాకు స్పష్టం చేశారు. అనంతరం తనపై జరిగిన దాడి విషయాన్ని పోలీసులకు ఫిర్యాదుచేశారు. అయితే.. ఇప్పటివరకు చేసినది చాలా చిన్న చర్యేనని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. తమ కార్యకర్తలు సుధీంద్ర కులకర్ణిపై చేసిన దాడిపట్ల తమకు చాలా గర్వంగా ఉందని కూడా కొంతమంది శివసేన నేతలు చెప్పారు.

మరోవైపు మహారాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి  దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం, పుస్తకావిష్కరణ సభకు పూర్తి భద్రతను ఏర్పాటు చేస్తామని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. శివసేన కార్యకర్తలు ఆదివారం రాత్రి తమ నేత ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. అయితే.. తాను పాకిస్థాన్ నుంచి వచ్చింది హోటల్లో కూర్చోవడానికి కాదంటూ మహమూద్ కసూరి వ్యాఖ్యానించారు. అసలు ఇలా జరుగుతుందని తాను ఊహించలేదని కసూరి చెప్పారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా సాయంత్రం 5.30 గంటలకు నెహ్రూ సెంటర్లో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతుందని సుధీంద్ర కులకర్ణి తెలిపారు. ముఖం నిండా నల్లరంగుతోనే ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement