'ఆయన ప్రధాని అయ్యుంటే దేశం పాకిస్థాన్ అయ్యేది'
న్యూఢిల్లీ: సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదటి ప్రధానమంత్రి అయ్యుంటే ఇండియా... పాకిస్థాన్ లా తయారయ్యేదని, ప్రజాస్వామ్యం పతనమయ్యేదని దళిత హక్కుల నేత, రచయిత ప్రొఫెసర్ కంచ ఐలయ్య అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరుగుతున్న టైమ్స్ లిట్ ఫెస్టివల్ లో 'రీ ఇమాజినింగ్ ది రిపబ్లిక్స్ ఐకాన్స్: పటేల్, నెహ్రు, అంబేద్కర్' అనే అంశంపై చర్చలో ఆయన పాల్గొన్నారు.
వల్లభాయ్ పటేల్ దేశానికి మొదటి ప్రధాని అయ్యుంటే దేశ గమనం మరోలా ఉండేదని నరేంద్ర మోదీ పేర్కొనడంతో 2014 ఎన్నికల్లో ఆయన పేరు ప్రముఖంగా వినబడిందని గుర్తు చేశారు. 'అంబేడ్కర్ రాజ్యాంగం రాయడానికి ఆయన(పటేల్) ఒప్పుకోలేదు. హిందూ మహాసభకు ఆయన సన్నిహితంగా మెలిగారు. మనుస్మృతిని నమ్మిన వారు మాత్రమే రాజ్యాంగం రాయాలని ఆయన ఆకాంక్షించారు. పటేల్ ప్రధాని పదవిని చేపట్టివుంటే మనదేశం పాకిస్థాన్ లా తయారయ్యేది. ప్రజాస్వామ్యం కుప్పకూలేది. ప్రజాస్వామ్యం సిద్ధించాక మొదటి 17 ఏళ్లు మనదేశం పాకిస్థాన్ లా వ్యవహరించింది' అని ఐలయ్య అన్నారు.
సామాజిక ఐక్యత, సమానత్వం లేదా రాజకీయ ఏకాభిప్రాయానికి వల్లభాయ్ పటేల్ కృష్టి చేయలేదని ప్రముఖ రచయిత, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ చీఫ్ సుదీంద్ర కులకర్ణి తెలిపారు. సమాజంలో సమస్యల గురించి పట్టనట్టుగా ఆయన వ్యవహరించారని వెల్లడించారు. 'మనకు ఉక్కుమనిషి అక్కర్లేదు. అందరినీ కలుపుపోయే హృదయం ఉన్న నాయకులు కావాలి' అని కులకర్ణి వ్యాఖ్యానించారు. అనన్య వాజపేయి, డి. శ్యామ్ బాబు తదితరులు ఈ చర్చలో పాల్గొన్నారు.