సందర్భం
సంగంరెడ్డి సత్యనారాయణ (Sangam Reddy Satyanarayana) పేరు తెలంగాణ పాత తరానికి బాగా పరిచయం. కొత్త తరానికి ఆయన అంతగా తెలియదు. వరంగల్ జిల్లాలోని ముచ్చర్ల (Mucherla) గ్రామంలో 1933 జనవరి 21న పుట్టిన ఆయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మూలమైన ‘నాన్–ముల్కి’ ఉద్యమం 1950లో ప్రారంభమైనప్పుడు దానికి సాహిత్య ప్రాణం పోసిన తొలి విద్యార్థి మేధావి. హన్మకొండలోని మల్టీ పర్పస్ హైస్కూల్ అధ్యక్షుడిగా ఆ స్కూల్‌లోని ఆంధ్ర టీచర్లు, తెలంగాణ భాషను అవమానిస్తుంటే తిరుగుబాటును ఆర్గనైజ్ చేశాడు. అప్పటినుండే పాటలు రాయడం, ఉపన్యాసమివ్వడం, నాటకాలెయ్యడంలో దిట్టగా ఎదిగాడు.
‘పచ్చని చెట్ల పైట రెపరెపలాడంగ; పాడిపంటలనిచ్చి కడుపునింపే తల్లి చల్లని మా తల్లి ముచ్చర్ల గ్రామం’ వంటి పాటతో మొదలెట్టి, నాన్ –ముల్కీ పోరాటంలోనే ‘తెలంగాణ సోదర తెలుసుకో నీ బతుకు; మోసపోతివ నీవు గోస పడతావు’ అనే పాట రాసి, పాడి ఉర్రూత లూగించాడు. తన గ్రామంపై పాట రాసినందున ఆయనను ముచ్చెర్ల సత్యనారాయణ (Mucherla Satyanarayana) అనేవారు. ఊరి నుండి బడికి రోజూ 12 మైళ్ళు నడిచొచ్చే, బట్టలు కూడా సరిగా లేని ఆయన 12వ తరగతి ఫెయిల్ అయ్యాడు. సప్లమెంటరీ రాసి పాసై హైదరాబాద్‌కు వచ్చిసంగీత కళాశాలలో చేరాడు. ఉండటానికి చోటు లేక గూటి కోసం వెతగ్గా రవీంద్ర భారతి పక్కన బీసీ హాస్టల్ (BC Hostel) ఉందని తెలిసి సంగం లక్ష్మీబాయమ్మను కలిసి పాట పాడి ఆమెను మెప్పించి అడ్మిషన్ తెచ్చుకున్నాడు.
ఒక సంవత్సరంలో హిందూస్థానీ, కర్ణాటక సంగీతం నేర్చుకొని సత్యనారాయణ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో (Osmania Arts College) బీఏ తెలుగు, సంస్కృతం, ఎకనామిక్స్ చదువుకున్నాడు. 1956లో తెలంగాణ స్టేట్ ఆంధ్రలో కలిసి ఆంధ్రప్రదేశ్ కావడంతో సత్యనారాయణ, ఆయన మిత్రులు నాన్– ముల్కీ ఉద్యమాన్ని ఆంధ్ర వ్యతిరేక ఉద్యమంగా మార్చారు. ఆ ఉద్యమ మొదటి పాట ఆయన రాసి పాడిందే. అదీ మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మీద.
‘అయ్యయ్యో రామరామ సంజీవరెడ్డి మామ / సునోజి మేరగాన – కహాతా రహే తెలంగాణ /..... / ఛోడోజీ తెలంగాణ – భలే జావో రాయలసీమ’... ఈ పాట ఆ కొత్త ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది. 1948 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి 1956 మధ్యలో అటు ఆంధ్ర నుండి, ఇటు మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుండి బ్రాహ్మణ మైగ్రేషన్ బాగా జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రమంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లిష్ డిగ్రీలు సంపాదించిన బ్రాహ్మణ మేధావులు ప్రొఫెసర్లు అయ్యారు. దాదాపు 1960 నాటికి ఇక్కడి రెడ్లు, వెలమలు ఎంఏ, ఎమ్మెస్సీ పట్టాలు పొందినవారు లేరు.
1953–56 మధ్య సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలనే చర్చల్లో తెలంగాణ ప్రాంతం బ్రాహ్మణ మేధావులు ఉన్నారు. ఇప్పుడు వరంగల్‌లో ఒక హెల్త్ యూనివర్సిటీ పేరు, ఒక కళాక్షేత్రం పేరు పెట్టిన కాళోజీ 1969 వరకు సమైక్యవాదే. సత్యనారాయణ నాన్–ముల్కీ పోరాటం స్కూలు ప్రెసిడెంట్‌గా నడిపినపుడు జయశంకర్ ఆయన క్లాస్‌మేట్. ఇద్దరు కలిసి నాటకాలు వేశారు. కానీ సత్యనారాయణ లాగా మిలిటెంట్ నాన్– ముల్కీ వ్యతిరేక ఉద్యమంలో ఆయన ఉన్న దాఖలాలు లేవు. సత్యనారాయణ గొల్ల (యాదవ) కులంలో పుట్టినందున ఒక క్రియేటివ్ కవిగా, పాటగాడిగా ఆయనకు రావలసినంత గుర్తింపు రాలేదు. 1950 దశకంలో ఉస్మానియాలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన గ్రామానికి పోయి గ్రామ ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్, ఆ తరువాత 1970లో హన్మకొండ సమితి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆనాటి మొట్ట మొదటి దళిత్ కలెక్టర్ కాకి మాధవరావుతో దోస్తీ చేసి గ్రామాలకు అభివృద్ధి పథకాలను తీసుకెళ్లాడు.
చదవండి: ప్రపంచానికి ఏం రాసి పెట్టి ఉంది?
1983 ఎన్టీఆర్ టీడీపీ రాగానే అందులో చేరి ఎమ్మెల్యేగా హయగ్రీవాచారిని చిత్తుగా ఓడించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అయ్యాడు. అయితే అనతి కాలంలోనే వరంగల్ జిల్లాలో మైగ్రేట్ కమ్మ నాయకుడు శివాజిని, కమ్మ డాక్టర్ కల్పనాదేవిని ఆయనపై అజమాయిషికి పెట్టడంతో ఎన్టీఆర్ మీద ఆయన తిరుగుబాటు మొదలైంది. ఆయన ఎన్టీఆర్ మీద కోపంతో నాదెండ్ల భాస్కర్ రావు క్యాంపులో చేరి చివరికి పదవి కోల్పోయాడు. ఆ తరువాత మళ్ళీ కడవరకు అంటే 2016లో చనిపోయే వరకు ప్రత్యేక తెలంగాణ కోసం రకరకాల కార్యక్రమాలు చేపట్టాడు. 2001లో కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీ పెడితే దానిలో చేరి కొంతకాలం పనిచేశాడు.
చదవండి: ఓబీసీల వర్గీకరణతో సమన్యాయం
ఆయన చనిపోయి 8 సంవత్సరాలు అయినా ఆయనకో విగ్రహంగానీ, ఆయన పోతే వరంగల్ ప్రాంతంలో ఏ సంస్థనూ ఎవరూ పెట్టింది లేదు. ఆయనతో పని చేసిన జయశంకర్‌కు, కాళోజీకి, కొండా లక్ష్మణ్‌కి చాలా గుర్తింపు దొరికింది. జీవితంలో సుదీర్ఘకాలం బీదరికంలో బతికిన ఆయన మనకో ఆదర్శాన్ని మిగిల్చాడు.
- ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్
ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు
(జనవరి 21న సంగంరెడ్డి సత్యనారాయణ జయంతి)
Comments
Please login to add a commentAdd a comment