మలాలా వస్తే ఇలాగే చేస్తారా..?
తనపై శివసేన చేసిన దాడికి అబ్జర్వర్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఛైర్మన్ సుధీంద్ర కులకర్ణి ఘాటుగా స్పందించారు. తనను పాకిస్తాన్ ఏజెంటుగా అభివర్ణించడాన్ని తప్పుపట్టారు. నోబెల్ బహుమతి గ్రహీత మలాలా ముంబయి వస్తే ఇలాగే వ్యవహరిస్తారా..? అని ప్రశ్నించారు. తాను శాంతిని కోరుకునే వ్యక్తినని తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
పాకిస్థాన్ మాజీ మంత్రి ఖుర్షీద్ మహ్మద్ కసూరి రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సోమవారం వెళ్లిన సుధీంద్ర కులకర్ణిపై శివసేన కార్యకర్తలు నల్లరంగు పోసి నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ముంబైలో కసూరి పుస్తకావిష్కరణను రద్దు చేయాలన్న తమ డిమాండ్కు నిరాకరించడంతో శివసేన ఈ దాడికి దిగింది. అయినా సుధీంద్ర వెనకడుగు వేయకుండా కసూరి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.