Nobel Prize winner
-
‘నోబెల్’ ఆర్థికవేత్త కన్నుమూత..
దిగ్గజ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డేనియల్ కాహ్నెమాన్ కన్ను మూశారు. బిహేవియరల్ ఎకనామిక్స్‌లో క్రమశిక్షణను ఎక్కువగా ప్రభావితం చేసే సిద్ధాంతాలను రూపొందించిన కాహ్నెమాన్ 90 సంవత్సరాల వయస్సులో మరణించినట్లు ప్రిస్టన్ యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్-అమెరికన్ విద్యావేత్త అయిన కాహ్నెమాన్ మరణించే వరకు ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో పనిచేశారు. అత్యధికంగా అమ్ముడైన "థింకింగ్, ఫాస్ట్ అండ్ స్లో" అనే పుస్తకాన్ని రాసిన కాహ్నేమాన్, మనుషుల ప్రవర్తన హేతుబద్ధమైన నిర్ణయం తీసుకునే ప్రక్రియలో పాతుకుపోయిందనే భావనకు వ్యతిరేకంగా వాదించారు. అది తరచుగా ప్రవృత్తిపై ఆధారపడి ఉంటుందన్నారు. మనస్తత్వ శాస్త్రం, ఆర్థిక శాస్త్ర రంగాలలో చేసిన పరిశోధనలకు గుర్తింపుగా కాహ్నెమాన్కు 2002లో ఆర్థిక శాస్త్రాలలో నోబెల్ మెమోరియల్ బహుమతి లభించింది. అత్యంత ప్రజాదరణ పొందిన ఆయన సిద్ధాంతం సాంప్రదాయ ఆర్థిక విధానాలను వ్యతిరేకించింది. మనుషులు తమ భావనలను మార్చుకునే విచక్షణను కలిగి ఉంటారని వాదించింది. -
ప్రముఖ సైకాలజిస్ట్ డేనియల్ కానమన్ కన్నుమూత
న్యూజెర్సీ: ప్రపంచ ప్రఖ్యాత మనస్తత్వవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డేనియల్ కానమన్ (90) బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రకటించింది. 1993వ సంవత్సరం నుంచి కానమన్ అక్కడే పనిచేస్తున్నారు. ఆర్థిక శాస్త్రం చదవకపోయినా ప్రవర్తనా ఆర్థికశాస్త్రానికి ఆయన పర్యాయపదంగా మారారు. ఆయన రాసిన పుస్తకం ‘థింకింగ్, ఫాస్ట్ అండ్ స్లో’ ఎంతో ప్రజాదరణ పొందింది. డేనియల్ కానమన్ సిద్ధాంతాలు సామాజికశాస్త్రాలను చాలా మటుకు మార్చివేశాయని ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎల్డార్ షాఫిర్ పేర్కొన్నారు. 1934లో ఇజ్రాయెల్‌లోని టెల్అవీవ్లో కానమన్ జన్మించారు. -
బంగ్లాదేశ్ నోబెల్ గ్రహీతకు 6 నెలల జైలు
ఢాకా: బంగ్లాదేశ్ ఆర్థిక వేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనస్(83)కు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. మరో ముగ్గురితో కలిసి ఆయన స్థాపించిన గ్రామీణ్ టెలికం సంస్థలో కార్మికుల సంక్షేమ నిధిని నెలకొల్పడంలో విఫలమైనట్లు మూడో కార్మిక న్యాయస్థానం జడ్జి షేక్ మరీనా సుల్తానా సోమవారం యూనస్‌కు ఆరు నెలల జైలు శిక్ష విస్తూ తీర్పు వెలువరించారు. అంతేకాదు, తలా రూ.19 వేల జరిమానా విధించారు. అనంతరం వారు పెట్టుకున్న పిటిషన్ల మేరకు నలుగురికీ బెయిల్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ తీర్పును వీరు హైకోర్టులో సవాల్ చేసుకునే వీలుంటుంది. ఈ నెల 7న బంగ్లాదేశ్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. -
ఆమె కథ మన జీవిత కథ
ఆనీ ఎర్నౌ రచనలకు గానీ, శైలికి గానీ అంత ‘వాడి’ ఎక్కడిదంటే... ఎవరు చదువుతుంటే వాళ్లకు అది తమ కథలానే అనిపించడంతో అవి ఎప్పటికప్పుడు పదును తేలుతూ ఉంటాయి! రచయిత్రిగా ఆనీ పోరాటం, ఆమె రచనలు చదివే స్త్రీల పోరాటం వేర్వేరు కాదు. స్త్రీలు తమ శరీరాలపై అధికారాన్ని కలిగి ఉండటానికీ, పురుషులతో సమానంగా జీవించడానికీ చేసే పోరాటమే ఆమె రచనల సారం. ఒక తరం స్త్రీల ఉద్యమగానం అది. ఆమె రచనలన్నీ కూడా కల్పనలా అనిపించే స్వీయ వాస్తవానుభవాలే. సాహిత్యం, సామాజిక శాస్త్రం, చరిత్ర అనే మూడు కూడళ్ల నడుమ నిలబడి సమాజం మరుపున పడి ఉన్న వాళ్ల కోసం ఎలుగెత్తుతున్న స్వరం ఆనీ! సాహిత్యంలో ఇప్పటివరకు పదహారు మంది నోబెల్ గ్రహీతలతో అత్యధికంగా విజేతలను కలిగి ఉన్న దేశం ఫ్రాన్స్. వారిలో ఏకైక మహిళ ఆనీ ఎర్నౌ. 2022 సంవత్సరానికి గాను ఆనీ నోబెల్ విజేతగా నిలిచారు. ఆమె కంటే ముందు 2014లో ప్యాట్రిక్ మాడియానో, 2008లో జె.ఎం.జి. క్లెజియో ఈ ఘనత సాధించారు. ఫ్రాన్స్‌లోని నార్మాండీలో 1940లో జన్మించిన ఆనీ ఎర్నౌ నిరాడంబరమైన కుటుంబంలో పెరిగారు. జీవిక కోసం ఆమె తల్లిదండ్రులు నిత్యావసర వస్తువులను విక్రయించే దుకా ణాన్ని నడుపుతుండేవారు. తర్వాతి కాలంలో ఆ దుకాణం బార్గా, కెఫేగా విస్తరించింది. అక్కడికంతా శ్రామిక వర్గమే వస్తుండేది. తల్లి ప్రోత్సాహం, ప్రోద్బలంతో ఆనీ యూనివర్సిటీ స్థాయి వరకు విద్యను అభ్యసించి, అనంతరం టీచరుగా మారారు. రచయిత్రిగా మారారు. వర్గ వ్యత్యాసాలు, పితృస్వామ్య వ్యవస్థ, అసమానతలు వంటి విస్తృత సామాజిక అంశాలను తన రచనల్లో చర్చించారు. ఆనీ ఎర్నౌ తొలి నవల ‘క్లీన్డ్ ఆఫ్’ (ఫ్రెంచిలో లెజ్ ఆర్మ్వార్ విడేస్) 1974లో వచ్చింది. అయితే ఆమెకు గుర్తింపు వచ్చింది మాత్రం 1983లో వచ్చిన ‘ఎ మ్యాన్స్ ప్లేస్’తోనే. తల్లిదండ్రులు నడిపిన కెఫేలో తను ఎదుగుతున్నప్పటి జ్ఞాపకాలను అందులో రాసుకున్నారామె. తర్వాత 1987లో ‘ఎ ఉమన్ స్టోరీ’ అనే నవల రాశారు. అది ఆనీ తల్లి కథ. అక్కడి నుంచి అంతా రచనా ప్రవాహమే. 2008లో ‘ది ఇయర్స్’ పుస్తకం వచ్చే నాటికి కాలానుక్రమ వైయక్తిక స్మృతుల సమ్మేళనంగా అనేకానేక రచనల్ని చేశారు. ‘ది ఇయర్స్’ ఆనీ స్వీయ గాథ. ఆ నవల ఇంగ్లిష్‌లోకి అనువాదం కాగానే (లెజ్ అన్నీస్ అన్నది ఫ్రెంచి టైటిల్) ఆనీ పేరు సాహితీ ప్రపంచంలో మార్మోగిపోయింది. 1940లు, 90ల మధ్య కాలంలో ఒక స్త్రీ జీవితంలోని ఉత్థాన పతనాలను కథనపరచిన ఈ రచన... మూడో మనిషి చెబుతున్నట్లుగా ముందుకు సాగుతుంది. పాత ఫొటోలను, సినిమా జ్ఞాపకాలను జత పరుస్తూ బాల్యం నుంచి తల్లి అయ్యేవరకు తన జీవితాన్ని అందులో అక్షరబద్ధం చేశారు ఆనీ. 1960లలో తమ కుటుంబం ఎలా జీవించిందీ చెబుతూ, ‘‘మేమెంత సమయాన్ని పొదుపు చేశామో చూసుకుని ఆశ్చర్యపోయే వాళ్లం. సిద్ధంగా అందుబాటులో ఉండే మిరప పొడులతో మా సూప్ తయారయ్యేది. ప్రెస్టో ప్రెషర్ కుక్కర్‌తో త్వరత్వరగా వంట చేసే వాళ్లం. ‘యమోనైజ్’ అయితే రెడీమేడ్‌గా ట్యూబులలో దొరికేసేది. గుడ్డు పచ్చసొన, నూనె, నిమ్మరసం కలిపి తయారు చేసే ఈ మసాలా సాస్‌ను మేమెప్పుడూ సమయం వెచ్చించి సొంతంగా సిద్ధం చేసు కున్నది లేదు. బఠాణీలను తోటలోంచి తెంపుకొచ్చే పని లేకుండా క్యాన్లలో లభించేవాటిని ఇంట్లో తెచ్చి పెట్టుకునేవాళ్లం. చెట్టుపై పండే బేరీ పండ్లను కాకుండా బేరీ పండ్ల సిరప్‌ను వాడేవాళ్లం. జీవితం ఎంత సరళం అయిపోయింది! అదంతా కూడా శతాబ్దాల ప్రయాసలను తుడిచిపెట్టేసే అద్భుతమైన ఆవిష్కరణల ఫలితమే. ఒకరోజు వస్తుంది.. మనమిక ఏదీ చేసుకునే పని లేకుండా’’ అని రాశారు ఆనీ. 1967 గురించి, గర్భ నిరోధక మాత్రల చట్టబద్ధత గురించి చెబుతూ– ‘‘ఆ మాత్రలు జీవితాన్ని ఒక్కసారిగా మార్చేస్తాయని మేము భావించాం. భీతిగొలిపే మా దేహాల నుంచి మాకు విముక్తి లభిస్తుం దనీ, మగవాళ్లకు ఉన్నంత స్వేచ్ఛ ఆ మాత్రలతో మాకూ వచ్చేస్తుందనీ అనుకున్నాం’’ అని రాసుకున్నారు. తన దేశ పౌరురాలికి సాహిత్యంలో నోబెల్ వచ్చిందని తెలియగానే, ఫ్రాన్స్ అధ్యక్షులు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇలా ట్వీట్ చేశారు. ‘‘గత యాభై ఏళ్లుగా ఆనీ ఎర్నౌ దేశ క్రమానుగతులతో పాటు దేశంలోని ప్రజా సమూహాల చారిత్రక జ్ఞాపకాలను అక్షరీకరిస్తున్నారు’’ అని ప్రశంసించారు. ఆనీ రచనా శైలి కత్తిలా పదునైనది. ‘కత్తి పదునులా రాయడం’ పేరుతో 2003లో ఆమె ఒక వ్యాసం కూడా రాశారు. ఆమె రచనలకు గానీ, శైలికి గానీ అంత పదును ఎక్కడిదంటే... ఎవరు చదువుతుంటే వాళ్లకు అది తమ కథలానే అనిపించడంతో అవి పదునెక్కుతాయి. రచయిత్రిగా ఆనీ పోరాటం, ఆమె రచనలు చదివే స్త్రీల పోరాటం వేర్వేరు కాదు. స్త్రీలు తమ శరీరాలపై అధికారాన్ని కలిగి ఉండటానికీ, పురుషులతో సమానంగా జీవించడానికీ చేసే పోరాటమే ఆనీ రచనల్లోని పోరాటం కూడా. ఒక తరం స్త్రీల ఉద్యమగానం అది. ఆమె రచనలన్నీ కూడా కల్పనలా అనిపించే స్వీయ వాస్తవానుభవాలే. ఫ్రాన్స్‌లో గర్భవిచ్ఛిత్తిపై నిషేధం ఉన్నకాలంలో 2000 సంవత్సరంలో ఆమె ‘హ్యాపెనింగ్’ నవల రాశారు. ఆ నవలను అదే పేరుతో ఆడ్రీ దివాన్ సినిమాగా తీశారు. గత ఏడాది విడుదలైన ఆ సినిమా 2021 వెనిస్ చలన చిత్రోత్సవంలో ‘గోల్డెన్ లయన్’ అవార్డు గెలుచుకుంది. సూపర్ మార్కెట్ సంస్కృతి దృక్కోణం నుంచి ఆనీ 2014 లో రాసిన నవల ‘రిగార్డ్లెస్ ల్యూమినరీస్’ సామాజిక అసమానతల్ని సునిశి తంగా పరిశీలించింది. ఈ ఏడాదే విడుదలైన ఆమె కొత్త పుస్తకం ‘జ్యాన్ ఓమె’ తన కన్నా 30 ఏళ్లు చిన్నవాడైన వ్యక్తితో ఆమెకున్న సాన్నిహిత్యం గురించి దాపరికం లేకుండా చెబుతుంది. సాహిత్యం, సామాజిక శాస్త్రం, చరిత్ర అనే మూడు కూడళ్ల నడుమ నిలబడి సమాజం మరుపున పడిపోయిన వాళ్ల కోసం, అసమానతలపై మూగ సాక్షులుగా మిగిలిపోయిన బాధితులకోసం ఎలుగెత్తుతున్న స్వరం ఆనీ ఎర్నౌ. ప్రఖ్యాత ఫ్రెంచి రచయిత మార్సెల్ ప్రూస్ట్ రచనా సంవిధానానికి ప్రూస్టియన్ స్టెయిల్ అని పేరు. కోల్పోయిన గతాన్ని పునరుద్ధరించే, అపస్మారక జ్ఞాపకశక్తిని ప్రేరేపించే గుణం కలిగి ఉండే ఆయన ధోరణే ఆనీ రచనల్లోనూ కనిపిస్తుంది. సమయం గడిచేకొద్దీ కనుమరుగైపోయే జ్ఞాపకాలను అంటి పెట్టుకుని ఉండేందుకు తన రచనను ఒక మార్గంగా ఆమె నిర్మించుకున్నారు. ‘‘ఒక్క సెకనులో అంతా తుడిచి పెట్టుకు పోతుంది. ఊయలకు, మరణశయ్యకు మధ్య పేరుకుపోయిన పదాల నిఘంటువు పక్కకు ఒరిగిపోతుంది. ఇక మిగిలింది నిశ్శబ్దం. మాటలకు పదాలు ఉండవు. ‘నేను’, ‘నాకు’ అనేవి నోటిలోంచి బయ టికి రావు. నలుగురు చేరి నవ్వుకునే వేళ తరాల విస్తారమైన అనామ కత్వంలోకి అదృశ్యం అయ్యే వరకు మనం మన పేరు తప్ప మరేమీ కాదు... మన పేరును ఎవరైనా ఒక కాగితం మీద పెట్టేవరకు’’ అని రాస్తారామె. ఫ్రెంచి సామాజిక శాస్త్రవేత్త పియర్ బోర్డ్యూ ‘‘కళంకానికి గురైనవారికి జ్ఞాపకశక్తి అధికం’’ అంటారు. అవమానం జరిగిన జ్ఞాపకాలను అస్సలు మర్చిపోలేము. 1997లో ఆనీ రాసిన ‘షేమ్’ పుస్తకంలోని కథాంశం ఇదే. భారతీయ దళిత రచయితలు రాసిన కొన్ని పుస్తకాలను కూడా ఆమె చదివారు. ఓం ప్రకాశ్ వాల్మీకి రాసిన ‘జూఠన్ : యాన్ అన్‌టచబుల్ లైఫ్’ వాటిలో ఒకటి. ఇటీవలే ఈ పుస్తకం ఫ్రెంచిలోకి తర్జమా అయింది. అదొక ప్రామాణికమైన అత్మకథ. ముల్క్ రాజ్ అనంద్ రచనలు కూడా ఆమెకు సుపరిచితమే. మరికొన్ని నెలల్లో ఢిల్లీలో వరల్డ్ బుక్ ఫెయిర్ జరగబోతోంది. ఆనీ ఎర్నౌ నోబెల్ గెలుచుకున్న సందర్భం ఒక్కటే కాదు... ఇండియా గౌరవ అతిథిగా ఫ్రాన్స్ ఆ పుస్తక ప్రదర్శనకు వస్తుండటం, 20 కంటే ఎక్కువ మంది ఫ్రెంచి రచయితల బృందం హాజరవుతుండటం కూడా బుక్ ఫెయిర్‌కు మరింత ప్రాధ్యాన్యం తెచ్చింది. ‘పి.ఎ.పి. (పబ్లికేషన్ అసిస్టెంట్ ప్రోగ్రామ్) టాగోర్’ పేరుతో ఇండియా, రొమెయిన్ రోలాండ్ అవార్డ్’ (అపీజే ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్స్ భాగస్వామ్యంతో ఉత్తమ అనువాదానికి ప్రదానం చేసే అవార్డు)తో ఫ్రాన్స్ ఈ పుస్తక ప్రదర్శనలో ఇచ్చుకోబోయే పరస్పర ప్రచురణ సహకారంతో మరిన్ని ఫ్రెంచి పుస్తకాలు భారతీయ భాషల్లోకి తర్జుమా అయ్యే అవకాశం కలుగుతుందని మనం ఆశించవచ్చు. యాదృచ్ఛికమే అయినా ఇక్కడ ఒక విశేషాన్ని గమనించాలి. టాగోర్ (1913), రొమెయిన్ రోలాండ్ (1915) ఇద్దరూ సాహిత్యంలో నోబెల్ గ్రహీతలే. ఎమ్మాన్యుయేల్ లెనెయిన్ వ్యాసకర్త ఇండియాకు ఫ్రాన్స్ రాయబారి (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
ఒంటరి సమూహం
సుమారు ఆరు దశాబ్దాలుగా అలుపెరగకుండా రాస్తున్న ‘అత్యంత ప్రాధాన్యం గల స్త్రీవాద రచయిత్రి’ ఆనీ ఎర్నౌను 2022 నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది. ఈ గౌరవం దక్కిన తొలి ఫ్రెంచ్ మహిళ ఆమె. ప్రపంచవ్యాప్తంగా ఈ పురస్కారం పొందిన పదిహేడో మహిళ. సాహిత్యానికి తక్షణ ప్రయోజనం ఉండకపోవచ్చు; అయినా కూడా మహిళలు, అణిచివేతకు గురైనవారి పోరాట గాథలను సజీవంగా ఉంచుతున్నానంటారు 82 ఏళ్ల ఆనీ ఎర్నౌ. శరీరం, లైంగికత; సాన్నిహిత్య సంబంధాలు; సామాజిక అసమానతలు; చదువు ద్వారా వర్గాన్ని మార్చుకునే ప్రయత్నం ఆమె రచనల్లో కనబడతాయి. ఫ్రాన్స్‌లోని చిన్న పట్టణం నార్మండీలో వారి కుటుంబం నివసించింది. బతకడానికి నాకు పుస్తకాలు అక్కర్లేదని కరాఖండీగా చెప్పే తండ్రిని కలిగిన అతి సాధారణ నేపథ్యం. ఒక కెఫే యజమానిగా అలెగ్జాండర్ డ్యూమా, ఫ్లాబర్ట్, ఆల్బర్ట్ కామూ లాంటి రచయితలను చదవడం వల్ల తనకేం ఒరుగుతుందని ఆయన నిశ్చితాభిప్రాయం. కానీ ఆనీలో అది పూర్తి విరుద్ధంగా పనిచేసింది. పుస్తకాలు మాత్రమే తనకు అత్యంత ప్రీతికరమైనవనీ, ఎంత చెడ్డ జీవితంలోనూ తనను తాను ఒక ‘అ–పాఠకురాలిగా’ ఊహించలేననీ అంటారామె. ఆరేళ్ల వయసు నుంచే అక్షరంలోని గమ్మత్తుకు ఆకర్షితురాలయ్యారు. వందలాది పుస్తకాలను ఉచితంగా చదువుకోవడం కోసమే పుస్తకాల షాపులో పనిచేయాలని కలగన్నారు. ఒక శ్రామిక కుటుంబంలో పుట్టి, బుద్ధెరిగాక మధ్యతరగతి జీవితాలతో పోల్చుకున్నప్పుడు తమ పరిస్థితి పట్ల సిగ్గుపడిన ఆనీ ఎర్నౌ చదువుకోవడం ద్వారా జీవితాలను మార్చుకోగలమన్న అభిప్రాయానికి చాలా త్వరగా వచ్చారు. దానికి అనుగుణంగానే ముందు టీచర్‌గా, అనంతరం లిటరేచర్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. వర్జీనియా వూల్ఫ్ అంటే ఆనీకి పిచ్చి అభిమానం. సైమన్ ది బోవా ఆమె చైతన్యాన్ని విస్తృతపరిచారు. స్త్రీవాదం అనేది తప్పనిసరైనది అన్న అవగాహనతో ఇరవై ఏళ్ల వయసు నుంచే తన రచనా వ్యాసంగం మొదలుపెట్టారు. తన కుటుంబానికి తెలియకుండా చేయించుకున్న అవాంఛిత గర్భస్రావం గురించి ‘క్లీన్డ్ ఔట్’ రాశారు. ఆ అనుభవంలోని జుగుప్స, భయానకాలకు వెరవకుండా, దీన్నే పునర్దర్శనంలాగా ‘హ్యాపెనింగ్’ రాశారు. ఒక స్త్రీ తన శరీరం మీద తన నియంత్రణనూ, స్వాతంత్య్రాన్నీ స్థాపించుకోవడానికి సంబంధించిన అతిముఖ్యమైన నవలగా ఇది నిలిచిపోయింది. తను దాటివచ్చిన జీవిత దశలనే ఆనీ పుస్తకాలుగా మలిచారు. ఆమె కౌమార జీవితం ఒక పుస్తకం. వైవాహిక జీవితం ఒక పుస్తకం. తూర్పు యూరోపియన్ మనిషితో ప్రేమ వ్యవహారం(ప్యాషన్ సింపుల్) ఇంకో పుస్తకం. తల్లి మరణం ఒక పుస్తకం. బ్రెస్ట్ క్యాన్సర్ అనుభవాలు మరో పుస్తకం. ఫ్రాన్స్ చరిత్రతో ముడిపడిన ‘ది ఇయర్స్’ను ఆమె మ్యాగ్నమ్ ఓపస్‌గా పరిగణిస్తారు. ఉత్తమ పురుష(నేను) కథనాలకు భిన్నంగా దీన్ని థర్డ్ పెర్సన్లో రాశారు. ఏ వ్యక్తిగత అనుభవమో ‘పొరపాటున’ సాహిత్యంలోకి వస్తే– దానికీ, తనకూ ఏ సంబంధమూ లేదని ఒక డిస్‌క్లెయిమర్ లాంటిది ఆ రచయిత తగిలించడం కొత్త సంగతేం కాదు. మరీ ముఖ్యంగా సంక్లిష్ట కుటుంబ సంబంధాలు, సన్నిహిత మానవ సంబంధాలు వచ్చినప్పుడు ఈ జాగ్రత్తలు మరీ ఎక్కువ. ఇక వ్యక్తిగతం అన్నదే కొందరికి నిషిద్ధాక్షరి. వ్యక్తి నుంచి కూడా సమాజాన్ని దర్శించవచ్చునన్న అవగాహన ఉన్నవాళ్లు తక్కువ. కానీ ఆనీ ఎర్నౌ సాహిత్య సర్వస్వం ఆత్మకథాత్మకమే. ఇది కల్పన అని చెబితే రచయితకో రక్షణ కవచం ఉంటుందన్న ఆలోచన ఆమెకు లేక కాదు. కానీ అది మోసం చేయడంలా భావించారు. వ్యక్తిగత జీవితాన్ని ఒక ప్రయోగశాలలో పరీక్షించుకున్నంత కచ్చితత్వంతో తన అనుభవాలను నమోదు చేశారు. అందువల్లే ఆమె ‘గ్రేట్ ట్రూత్ టెల్లర్ ఆఫ్ ఫ్రాన్స్’గా నిలవగలిగారు. నార్మండీ లాంటి చిన్నపట్టణంలో తన జీవితాన్నీ, తండ్రితో తన సంబంధాన్నీ ‘ఎ మ్యాన్స్ ప్లేస్’గా రాస్తున్నప్పుడు తన రచనాపద్ధతిని గురించి ఆమె ఘర్షణపడ్డారు. తండ్రిని ఒక కాల్పనిక పాత్రగా మలవడంలో తన రచనా ఉద్దేశమే నెరవేరదని భావించారు. అందుకే ఉన్నది ఉన్నట్టే రాయడానికి సంకల్పించారు. అందుకే ఆమెను ఫిక్షన్ రచయిత అనాలా, నాన్–ఫిక్షన్ రచయిత అనాలా అన్న చర్చకూడా వచ్చింది. కొందరు ఆమెను ‘మెమొయిరిస్ట్’ (జ్ఞాపకాల రచయిత) అన్నారు. నవలగా, ఆత్మకథగా కాకుండా తన రచనలను ఆటోసోషియోబయోగ్రాఫికల్(సామాజిక ఆత్మకథ)గా మలవగలగడం ఆమె ప్రత్యేకత. చరిత్ర, ఆత్మకథల కలగలుపు ఆమె పద్ధతి. ఇంట్లో పుస్తకాలను చూసి, ఇవన్నీ చదువుతావా అని ఆశ్చర్యపోయిన తన కజిన్, పుస్తకాలతో మనుషులకేం పని అన్నట్టుగా బతికిన తన తండ్రిలాంటివాళ్లు నిజానికి తనకు ఎక్కువ స్ఫూర్తి కలిగించారని చెప్పే ఆనీ... మర్చిపోయి అంతర్ధానమయ్యే లోపల జ్ఞాపకాలను పదిలపరుస్తున్నానంటారు. ఫ్రాన్స్ ఉమ్మడి జ్ఞాపకాలను ఆమె తన ద్వారా వ్యక్తం చేస్తున్నారు. అనువాదాల ద్వారా అవి ప్రపంచ స్మృతులుగా కూడా మారాయి. తన ప్రపంచంగా అనిపించని పారిస్ విలాసాలకు దూరంగా ప్రకృతి, నిశ్శబ్దాల కోసం సబర్బన్ ప్రాంతంలో నివసించే ఆనీ ఎర్నౌ... ఒక దశలో ‘మహిళా విప్లవం’ చూడకుండానే చచ్చిపోతానేమో అని భయపడ్డానంటారు. కానీ అబార్షన్ హక్కులు రావడానికీ, స్త్రీ శరీరం మీద మారుతున్న పురుష ప్రపంచ ధోరణికీ ఆమె కూడా ఒక కారణం అయ్యారు. సాహిత్యానికి తక్షణ ప్రయోజనం ఉండకపోవచ్చు; కానీ ప్రయోజనం లేకుండా మాత్రం ఉండదు. -
ఫ్రెంచ్ కవయిత్రికి సాహిత్యంలో నోబెల్
స్టాక్‌హోం: సాహిత్యంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి ఈ ఏడాది ఫ్రెంచ్ రచయిత అనీ అర్నాక్స్(82)కు లభించింది. అనీ అర్నాక్స్ పేరును నోబెల్ కమిటీ ప్రకటించింది. జెండర్, లాంగ్వేజ్, క్లాస్‌కు సంబంధించిన అంశాల్లో ఉన్న విభేదాలపై చాలా స్పష్టమైన రీతిలో ఎర్నాక్స్ అనేక రచనల్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు గానూ నోబెల్ బహుమతి వరించింది. సుమారు 30కి పైగా సాహిత్య రచనలు చేశారు అర్నాక్స్. 1940లో ఆమె నార్మాండీలోని యెవటోట్‌లో జన్మించారు. చాలా సుదీర్ఘ కాలం నుంచి ఎర్నాక్స్ రచనలు చేస్తున్నారు. నోబెల్ బహుమతి ప్రకటన తర్వాత మీడియాతో మాట్లాడారు అర్నాక్స్. ‘ఇది నాకు చాలా పెద్ద గౌరవం. అలాగే.. గొప్ప బాధ్యత, నాకు లభించిన బాధ్యత. రచన అంటే ఓ రాజకీయ చర్య, సామాజిక అసమానతలపై దృష్టి పెట్టడమే.’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. సమాజ రచనలపై భాషను ఆమె ఓ కత్తిలా వాడుతున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. సమాజ రుగ్మతలను రూపుమాపేందుకు ఆమె ఈ ఎత్తుగడతో రచనలు చేస్తున్నట్లు కమిటీ అభిప్రాయపడింది. ఇప్పటికే భౌతిక, రసాయన, వైద్య శాస్త్రాల్లో నోబెల్ విజేతల పేర్లను ప్రకటించారు. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త స్వాంటే పాబోను వైద్య నోబెల్‌కు ఎంపిక చేశారు. మానవ పరిణామ క్రమంపై ఆయన చేసిన పరిశోధనలకు ఈ అవార్డు దక్కించుకున్నారు. 'పవర్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్'లో చేసిన పరిశోధనలకు గానూ ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు వరించింది. రసాయనశాస్త్రంలో నోబెల్ అవార్డును ముగ్గురు శాస్త్రవేత్తలు దక్కించుకున్నారు. శాంతి బహుమతి విజేతను శుక్రవారం, అక్టోబర్ 10వ తేదీన ఆర్థిక రంగంలో నోబెల్ గ్రహీత పేరును వెల్లడిస్తారు. నోబెల్ బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడిష్ క్రోనర్ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. ఇదీ చదవండి: Nobel Prize 2022: కొత్త జాతిని గుర్తించిన స్వాంటే పాబో -
సీఎం వైఎస్ జగన్ పథకాలకు నోబెల్ గ్రహీత గుడెనఫ్ ప్రశంసలు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాలపై నోబెల్ అవార్డు గ్రహీత, జర్మనీ శాస్త్రవేత్త జాన్.బి.గుడెనఫ్ ప్రశంసలు కురిపించారు. పథకాలు అద్భుతంగా ఉన్నాయని, అవన్నీ సమాజగతిని మార్చే కార్యక్రమాలని అన్నారు. గుడెనఫ్ టెక్సాస్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. రాష్ట్ర ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ కుమార్ అన్నవరపు, ఆయన సతీమణి రాజేశ్వరిలు ఇటీవల గుడెనఫ్‌ను కలిసి ఏపీలో విద్యారంగ అభివృద్ధికి సీఎం జగన్ తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. అమ్మఒడి, రైతుభరోసా, తదితర పథకాలు, వాటి లక్ష్యాల గురించి తెలిపారు. వీటిని ఆలకించిన గుడెనఫ్.. గరిష్ట స్థాయిలో ప్రజలు లబ్ధి పొందినప్పుడే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని, ఆ దిశగా ఏపీ సీఎం చేస్తున్న పనులు అద్భుత ఫలితాలిస్తాయని పేర్కొన్నారు. తాను త్వరలోనే ఏపీని సందర్శించాలనుకుంటున్నానని చెప్పారు. గుడెనఫ్ ప్రశంసలతో కూడిన వీడియోను డాక్టర్ కుమార్ విడుదల చేశారు. స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ క్యాథోడ్‌ను కనుగొన్న గుడెనఫ్ జాన్.బి.గుడెనఫ్ 1922 జూలై 25న జన్మించారు. ప్రస్తుతం మానవాళి జీవిన విధానంలో భాగమైపోయిన స్మార్ట్ ఫోన్లో వాడే ‘లిథియమ్–ఇయాన్’ బ్యాటరీ క్యాథోడ్’ను కనుగొన్నదే ఈయనే. ఈ ఆవిష్కరణకుగాను గుడెనఫ్ కు 2019వ సంవత్సరానికి గాను నోబెల్ బహుమతి వచ్చింది. ఈయన కనిపెట్టిన బ్యాటరీయే మనం వాడుతున్న సెల్‌ఫోన్ నడవడానికి కారణమైంది. -
నోబెల్ పురష్కార గ్రహీత వీఎస్ నైపాల్ మృతి
-
నోబెల్ సాహిత్య పురష్కార గ్రహీత మృతి
లండన్ : నోబెల్ సాహిత్య పురష్కార గ్రహీత వీఎస్ నైపాల్ (84) మృతి చెందారు. లండన్‌లోని తన నివాసంలో శనివారం రాత్రి కన్నుమూసినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. భారత సంతతికి చెందిన నైపాల్ పూర్తి పేరు విధ్యాధర సూరజ్ ప్రసాద్ నైపాల్. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆంగ్లసాహిత్యాన్ని అభ్యసించారు. ఆయనకు 2001లో నోబెల్ సాహిత్య పురష్కారం లభించింది. 1932లో వెస్టిండీస్‌లోని ట్రినిడాడ్‌లో ఆయన జన్మించారు. -
లైంగిక అరాచకాలపై ‘యుద్ధం’
♦ చిన్నారులకు దన్నుగా మహోద్యమం: కైలాశ్ సత్యార్థి ♦ ‘శ్రేయస్కర బాల్యంతోనే శ్రేయస్కర భారత్ సాధ్యం ♦ సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 16 వరకు ‘భారత్ యాత్ర’ ♦ కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు 11 వేల కిలోమీటర్ల పర్యటన ♦ అన్ని వర్గాలు భాగస్వామ్యం కావాలని పిలుపు సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా చిన్నారులపై పెరిగిపోతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులు, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటిస్తున్నట్లు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, బాలల హక్కుల పరిరక్షణ ఉద్యమ నేత కైలాశ్ సత్యార్థి వెల్లడించారు. దేశంలోని అన్ని వర్గాలను భాగస్వామ్యం చేసేందుకు మహోద్యమానికి శ్రీకారం చుడుతు న్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 16 వరకు ‘భారత్ యాత్ర’ చేపడుతున్నట్లు వివరించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో చిన్నారుల బాల్యానికి రక్షణ లేకపోవడం దురదృష్టకర మన్నారు. చిన్నారులపై అకృత్యాలకు సంబంధించి గతేడాది దేశవ్యాప్తంగా 15 వేల కేసులు నమోదు కాగా, అందులో 4% కేసుల్లోనే దోషులకు శిక్ష పడిందని, 6% కేసులను కొట్టేశారని, మిగిలిన 90% కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) లెక్కల ప్రకారం గత పదేళ్లలో చిన్నారులపై అకృత్యాలు 5 రెట్లు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘శ్రేయస్కర బాల్యం’ద్వారానే ‘శ్రేయస్కర భారత్’నిర్మాణం సాధ్యపడుతుందన్నారు. కనీస సదుపాయాలు కరువు.. దేశంలో అత్యాచారాలు జరిగిన చిన్నారులకు భౌతికంగా, మానసికంగా భరోసా ఇచ్చేందుకు కనీసం పూర్తి స్థాయిలో వైద్యసదు పాయాలు లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యా నించారు. భయం నుంచి స్వేచ్ఛ కోసం చేస్తున్న ఈ ప్రయత్నానికి అన్ని వర్గాలు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల సత్వర పరిష్కారానికి న్యాయవ్యవస్థను మరింత పటిష్టం చేయాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కోరారు. చిన్నారుల పక్షాన గొంతెత్తేందుకు సమాజం ముందుకు రావాలని, నిశబ్దపు తెరల నుంచి శబ్దం చేసేందుకు చేపట్టిన మహోద్య మాన్ని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ఎన్నో కలలు, అవకాశాలకు ప్రతిబిం బమైన హైదరాబాద్ ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాలని, తెలంగాణ అతిపెద్ద భాగ స్వామి కావాలని ఆయన ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 21న జరిగే భారత్ యాత్రలో పాల్గొనాలని ఎంపీ బి.వినోద్ కుమార్ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ఇదీ యాత్ర స్వరూపం భారత్‌యాత్ర సెప్టెంబర్ 11న కన్యా కుమారిలో ప్రారంభమై అక్టోబర్ 16న ముగుస్తుంది. యాత్రకు అనుబంధంగా అసోం, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జమ్మూ కశ్మీర్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా యాత్రలు ప్రారంభమై ప్రధాన యాత్రలో కలుస్తాయి. ఈ యాత్రకు రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్ర పతిలతో పాటు పార్టీలకు అతీతంగా ఎంపీల మద్దతు లభించింది. దేశంలోని 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 11వేల కిలోమీటర్ల మేర సాగనుంది. యాత్రలో భాగంగా ఆయా ప్రాంతాల్లోన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాల యాల విద్యార్థులతో మమేకమై వారిలో చైతన్యం నింపుతారు. -
ఆమె పోరాటం ఊరికే పోలేదు!
అక్కడి ఆడపిల్లల మీద ఎన్నో ఆంక్షలు. మతం పేరుతో బాలికలపై ఎన్నో అరాచకాలు.. బాలికలను విద్యకు దూరం చేయాలన్న తాలిబన్ల ఫత్వా ఆమె ఖాతరు చేయలేదు. బాలిక విద్యకోసం కృషి చేస్తున్న ఆ చిన్నారిపై ఉగ్రవాదులు దాడి జరిపారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఆ బాలిక విద్య కోసం నేటికి ఉద్యమిస్తూనే ఉంది. తాలిబన్ల తూటాలను ధైర్యంగా ఎదుర్కొంది. బాలిక హక్కుల కోసం మరణం అంచుల దాకా వెళ్లి ఆమె చేసిన పోరాటం ఊరికే పోలేదు. ఆమె సేవలకు గుర్తుగా నోబెల్ శాంతి బహుమతికి వరించింది. ఆమె మరెవరో కాదు.. పాక్ బాలిక యూసఫ్‌జాయ్ మలాలా... మరి ఆమెపై జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన మరిన్ని విషయాలను ఈ రోజు తెలుసుకుందాం...! మలాలా ఎక్కడి అమ్మాయి? పదహారణాల తెలుగింటి అమ్మాయి కాదే. పోనీ పొరుగింటి అమ్మాయా? అసలే కాదు. పోనీ మన దేశానికి చెందిన అమ్మాయా? కానే కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే మన శత్రుదేశమైన పాకిస్థాన్‌కి చెందిన అమ్మాయి. కానీ ఈ అమ్మాయి ఏదైనా ఆశయం కోసం చిన్నగా పిడికిళ్లు బిగిస్తే.. ఆ పిడికిళ్ల ప్రభంజనాన్ని అందుకునేందుకు కోట్లాది చేతులు పైకిలేస్తాయి. అంతే ఉద్విగంగా ఆ పిడికిళ్లు ఆకాశమంత ఎత్తులో ‘‘మేము ఆడపిల్లలం ఆత్మస్ధైర్యానికి ప్రతీకలం’’ అంటూ నినదిస్తాయి. డాక్టర్ కావాలనుకున్నా... జూలై 12, 1997న పాకిస్థాన్‌కి చెందిన ఒక సున్నీ ముస్లిం కుటుంబంలో మలాలా జన్మించింది. చిన్నప్పటినుంచి మలాలాకు డాక్టర్ కావాలని కోరిక ఉండేది. కానీ తండ్రి కోరిక మేరకు రాజకీయాల్లోకి రావాలని నిశ్చయించుకుంది. ఇద్దరు తమ్ముళ్లు నిద్రపోయినా కూడా అర్ధరాత్రి వరకు తండ్రితో రాజకీయాల గురించి చర్చిస్తూనే ఉండేది. రాజకీయాలపై అవగాహన పెంచుకున్న 11 సంవత్సరాల మలాలా 2008 పెషావర్ క్లబ్లో అనర్గళమైన ఉపన్యాసం ఇచ్చింది. ‘‘చదువుకోవడానికి నాకు ఉన్న హక్కును లాక్కోవడానికి మీరెవరు? అంటూ ఉపన్యాసంలో తాలిబన్లను ప్రశ్నించింది. ఈ ఉపన్యాసం స్వాత్‌లోయ మొత్తం ప్రతిధ్వనించింది. ఇక అప్పటినుంచి తాలిబన్లకు మలాలా, ఆమె కుటుంబ సభ్యులు శత్రువులయ్యారు. ఉగ్రవాదుల హుకుం స్వాత్‌లోయలో ఆడపిల్లలకు అక్షరం నిషిద్ధమైంది. బాలిక పాఠశాలలన్ని మూసేయాలని హుకుం జారీచేశారు. ఉగ్రవాదుల ఆదేశాలను ఖతారు చేయని వందకుపైగా బాలిక పాఠశాల భవనాలను పేల్చివేశారు. బడికి వెళ్లే బాలికలను చంపడంతోపాటు ఉపాధ్యాయులను కూడా బహిరంగంగా చంపడం మొదలుపెట్టారు. కొడుకుతో కలిసి బడికి వెళుతున్న ఉపాధ్యాయిని కొడుకు ముందే కాల్చి చంపారు ఉగ్రవాదులు. కరాచిలోని క్వెట్టాలో ఆత్మాహుతి దళసభ్యుడు 40 బాలికలు ఉన్న పాఠశాల బస్సులోకి వెళ్లి తనను తాను పేల్చివేసుకున్నాడు. టీవీలు మూగబోయాయి. స్త్రీలు గడపదాటిరావడం మీద ఆంక్షలు మొదలయ్యాయి. తాలిబన్ల ఆగడాలు రోజురోజుకి పెరిగిపోసాగాయి. మలాలా సొంత ఊరు మింగోరా పట్టణంలో కూడా పాఠశాల భవంతిని ఉగ్రవాదులు పేల్చివేసారు. అయినప్పటికీ మలాలా ఏ మాత్రం భయపడకుండా బడికి వెళుతూనే ఉంది. ఒకరోజు పాఠశాలకు వెళ్లివస్తున్న మలాలాకు ఎదురుగా ముసుగు వేసుకున్న వ్యక్తి వెళ్లి చంపుతానని బెదిరించాడు. తమ మాట వినటం లేదన్న కారణంతో అక్టోబర్ 9, 2012, స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళుతుండగా మలాలాపై ముష్కరులు దాడిచేశారు. తలలోకి బుల్లెట్లు దూసుకపోయాయి. చనిపోయారనుకుని వదిలివెళ్లిపోయారు. కానీ, అదృష్టవశాత్తూ బాలిక ఇంకా ప్రాణాలతోనేఉంది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. కానీ, పాకిస్థాన్‌లో సరైన వైద్య సదుపాయాలు లేనందున బ్రిటన్‌లోని క్వీన్ ఎలిజిబెత్ ఆసుపత్రికి తరలించారు. సర్జరీల మీద సర్జరీలు చేయాలి బతకడం కష్టం అన్నారు. బతికినా ఏదో సమస్య జీవితాంతంవెంటాడుతూనే ఉంటుందన్నారు. మలాలా బతకాలని ప్రపంచంలో అణిచివేతకు గురవుతున్న ప్రతిబాలిక దేవుడిని ప్రార్థించింది. వెట్టిచాకిరీ, వేధింపులకు గురవుతున్న ప్రతి మహిళా మలాలా కోలుకోవాలని పూజలు చేశారు. వీరందరి పూజలు, మలాలా సంకల్పం ఫలించాయి. మొత్తానికి కానీ, మలాలా కళ్లు తెరిచింది. బాలికల హక్కుల కోసం పోరాడేందుకు లేచినిలబడింది. తీవ్రవాదుల తూటాల గాయాల నుంచి 6 నెలల్లోనే కోలుకుని ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. మార్చి, 2013న మలాలా చిరునవ్వుల చిందిస్తూ బ్రిటన్ స్కూల్లో అడుగుపెట్టింది. నోబెల్ శాంతి బహుమతి బాలిక విద్యావ్యాప్తికోసం చేసిన విశేష కృషికి గుర్తింపుగా 2014లో మలాలాకు నోబెల్ శాంతి పురస్కారం లభించింది. బాలకార్మిక నిర్మూలనకోసం కృషిచేసిన కైలాశ్ సత్యార్థితో నోబెల్ బహుమతిని పంచుకుంది. ఈ బహుమతికి ఎంపికైన అతిపిన్న వయస్కురాలు మలాలా. ఆడపిల్లలకు పెన్ను, నోట్‌బుక్ ఇస్తే పరిస్థితులు మారిపోతాయని మలాలా బలంగా నమ్ముతుంది. ‘‘సాటి మనిషిని ప్రేమించడమే నా కుటుంబం నాకు నేర్పిన సంస్కారం. నా మీద తూటాలు కురిపించిన తాలిబన్ వచ్చి నా ఎదురుగా నిలిచినా అతడిని నేను క్షమిస్తాను. గాంధీజీ, మార్టిన్ లూథర్ కింగ్, మదర్ థెరిసాలే నాకు ఆదర్శ’’మని మలాలా చెప్పింది. తాలిబన్లకు చదువు లేదు, అందుకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఐక్యరాజ్యసమితి ఉపన్యాసంలో పేర్కొంది. పది మంది కోసం పనిచేస్తే వంద మంది గుర్తుపెట్టుకుంటారు. భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తే కొన్ని తరాలు గుర్తుపెట్టుకుంటాయి. ఆడపిల్లలకు కూడా చదువు కావాలంటూ గళమెత్తిన మలాలా ఇప్పుడు ప్రపంచంలోని ఎంతోమంది బాలికలకు, యువతులకు మార్గదర్శకమైంది. అందుకే ఇప్పుడు ఆమెను రోల్‌మోడల్‌గా తీసుకుంటున్నారు ప్రపంచ దేశాల యువతులు. – సాక్షి స్కూల్ ఎడిషన్ -
మోదీది అమానవీయ, నిరంకుశ నిర్ణయం!
-
అమానవీయ, నిరంకుశ నిర్ణయం!
నోట్ల రద్దుపై అమర్త్యసేన్ ధ్వజం.. తెలివితక్కువ ఆలోచనన్న ఆర్థికవేత్త న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం అమానవీయం, నిరంకుశమని నోబెల్ అవార్డు గ్రహీత, భారత రత్న డాక్టర్ అమర్త్యసేన్ తీవ్రంగా విమర్శించారు. అధికారాన్ని ప్రదర్శించేందుకు మోదీ తీసుకున్న నిర్ణయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దుయ్యబట్టారు. ‘నల్లధనాన్ని, అవినీతిని అదుపుచేసే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని భారతీయులు హర్షిస్తారు. కానీ దీని అమలులో తీసుకోవాల్సిన చర్యలు ఇవేనా అని మనం ప్రశ్నించాలి. కొద్ది ఫలితం సాధించేందుకు అత్యధికులను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు’అని డాక్టర్ అమర్త్యసేన్ అన్నారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీనుంచి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నవంబర్ 8న హఠాత్తుగా ప్రకటించిన ఈ నిర్ణయం ద్వారా 6 నుంచి 10 శాతం నల్లధనం మాత్రమే బయటపడుతుందన్నారు. ఈ నిర్ణయం వల్ల కేంద్రం సాధించేది చాలా తక్కువని.. కానీ భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని సేన్ స్పష్టం చేశారు. మోదీ నిర్ణయం మంచిదే అరుునా అమలుతీరు అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. ‘నల్లధనంపై ముందడుగు పడాలని మనమంతా అనుకుంటున్నాం. కానీ ఈ నిర్ణయం మాత్రం తెలివైంది కాదు. మానవత్వంతో తీసుకున్నది అసలే కాదు. ఇలా జరిగి ఉండాల్సింది కాదు’అని అన్నారు. ముఖాముఖి ఆయన మాటల్లోనే.. నిరంకుశత్వం అన్నారు. ఎందుకు?: ‘ప్రజల్లో కరెన్సీపై నమ్మకం పోతోంది. ప్రతి రూపారుు ఓ ప్రామీసరి నోటు లాంటిది. ఈ రూపారుుని గౌరవించకపోవటం ద్వారా ప్రభుత్వం తను చేసిన వాగ్దానాలను నిలుపుకోలేనని చెప్పటమే అవుతుంది. సర్కారు హఠాత్తుగా మీకు డబ్బులు చెల్లించలేమని ప్రజలకు చెప్పటం నిరంకుశం కాదా?’ ఆర్థిక వ్యవస్థ పరిస్థితేంటి?: ‘నేను పెట్టుబడిదారీ వ్యవస్థకు అభిమానిని కాను. కానీ ఈ వ్యవస్థలోనూ నమ్మకం చాలా కీలకం. మోదీ నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఉంది. ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పోతోంది. రేపు బ్యాంకు అకౌంట్లతోనూ ప్రభుత్వం ఇలాగే వ్యవహరించే అవకాశం ఉందేమో. కేంద్రం ఓ సంఖ్యను నిర్ణరుుంచి అంతకంటే ఎక్కువ మొత్తాన్ని అకౌంట్లోనుంచి తీసుకునేందుకు ప్రతీ పౌరుడు సచ్చీలుడినని నిరూపించుకోవాలని అడిగే పరిస్థితీ రావొచ్చు’ మోదీ ఏం చేసినా విమర్శిస్తున్నారు!: ‘నేను ప్రతి విషయంలో మోదీని విమర్శించటం లేదు. నల్లధనంపై ఎక్కుపెట్టిన అస్త్రాన్ని ఆయన సరిగ్గా వినియోగించుకుని ఉంటే నేనే ప్రశంసించేవాణ్ని. ఈ నిర్ణయం వల్ల చట్ట ప్రకారం నడుచుకుంటున్న సామాన్య జనాలకు, తమ సంపాదనకు లెక్కలున్న వారికీ సమస్యలు ఎదురవుతున్నారుు. అదే నన్ను బాధిస్తోంది. మోదీతో నాకున్న అభిప్రాయభేదం దేశాన్ని మించిన అంశాలకు సంబంధించినవి. 31 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీకి.. తమను వ్యతిరేకించిన వారిని దేశ ద్రోహులుగా ప్రకటించే అధికారం లేదని స్పష్టంగా చెప్పదలచుకున్నా’ -
జీఎం పంటలు చేపట్టాలి
ఆకలి చావుల నివారణకు అదే మార్గం నోబెల్ అవార్డు గ్రహీత సర్ రిచర్డ్ జాన్ రాబర్ట్స్ సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో ప్రపంచ దేశాలు మరీ ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆకలిచావులను తప్పించుకోవాలంటే జన్యుమార్పిడి(జీఎం) పంటలను పెద్ద ఎత్తున చేపట్టక తప్పదని నోబెల్ అవార్డు గ్రీహ త సర్ రిచర్డ్ జాన్ రాబర్ట్స్ స్పష్టం చేశారు. కొన్ని పార్టీలు, గ్రీన్‌పీస్ వంటి స్వచ్ఛంద సంస్థలు జన్యుమార్పిడి పంటల విషయంలో అసత్యాలను, అర్ధ సత్యాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు రేకెత్తిస్తున్నాయని చెప్పారు. ఇక్కడి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. జీఎం పంటలు మంచివి కావన్న మాటలు నిజం కాదని, పేద దేశాల ఆహార భద్రతకు, మెరుగైన దిగుబడులకు ఇవి అత్యవసరమని చెప్పారు. జీఎం పంటల వల్ల మేలు జరుగుతుందన్న విషయం గ్రీన్‌పీస్ వారికీ తెలుసని, కానీ ఏటా అందే కోటానుకోట్ల నిధుల కోసం వీటిని వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. దిగుబడులు పెరిగితే జీవవైవిధ్యం సాధ్యమే.. జన్యుమార్పిడి పంటల ద్వారా దిగుబడులు 4 రెట్లు పెరిగితే అవసరాలు తీరతాయి కాబట్టి.. అప్పుడు రకరకాల పంటలు పెంచవచ్చని, తద్వారా జీవవైవిధ్యం పెరుగుతుందని రిచర్డ్స్ అన్నారు. గ్రీన్‌పీస్ వ్యవస్థాపకుడు ప్యాట్రిక్ మూర్ సైతం ఇప్పుడు జీఎం పంటలకు అనుకూలంగా మాట్లాడుతున్నారన్నారు. పాశ్చాత్య పోకడలు వద్దు పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా అమెరికా పెట్టుబడుదారీ వ్యవస్థను ప్రచారం చేస్తూ ప్రపంచంలో అశాంతి పెరిగిపోయేందుకు కారణమవుతోందని రిచర్డ్స్ అన్నారు. వ్యవసాయంలో వారు తాము ఆహారంగా తీసుకునే పంటలనే ఎంచుకుని, వాటి దిగుబడులు పెంచి ప్రపంచానికి అందిస్తున్నారని, అభివృద్ధి చెందుతున్న దేశాల పంటల్ని వీరు అభివృద్ధి చేయరన్నారు. కార్యక్రమంలో సీసీఎంబీ డెరైక్టర్ సీహెచ్ మోహన్‌రావు, వ్యవస్థాపక డెరైక్టర్ డాక్టర్ పీఎం భార్గవ తదితరులు పాల్గొన్నారు. -
మలాలా వస్తే ఇలాగే చేస్తారా..?
తనపై శివసేన చేసిన దాడికి అబ్జర్వర్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఛైర్మన్ సుధీంద్ర కులకర్ణి ఘాటుగా స్పందించారు. తనను పాకిస్తాన్ ఏజెంటుగా అభివర్ణించడాన్ని తప్పుపట్టారు. నోబెల్ బహుమతి గ్రహీత మలాలా ముంబయి వస్తే ఇలాగే వ్యవహరిస్తారా..? అని ప్రశ్నించారు. తాను శాంతిని కోరుకునే వ్యక్తినని తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. పాకిస్థాన్ మాజీ మంత్రి ఖుర్షీద్ మహ్మద్ కసూరి రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సోమవారం వెళ్లిన సుధీంద్ర కులకర్ణిపై శివసేన కార్యకర్తలు నల్లరంగు పోసి నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ముంబైలో కసూరి పుస్తకావిష్కరణను రద్దు చేయాలన్న తమ డిమాండ్‌కు నిరాకరించడంతో శివసేన ఈ దాడికి దిగింది. అయినా సుధీంద్ర వెనకడుగు వేయకుండా కసూరి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
గార్షియా మార్క్వెజ్ కన్నుమూత
* సాహిత్యంలో మేజికల్ రియలిజం ప్రక్రియకు ఆద్యుడు * 1982లో నోబెల్ అవార్డు విజేత * లాటిన్ అమెరికా గొంతుకగా ప్రఖ్యాతి మెక్సికో సిటీ: ప్రఖ్యాత లాటిన్ అమెరికన్ రచయిత, నోబెల్ అవార్డు గ్రహీత గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్(87) గురువారం కన్నుమూశారు. గత నెల 31న న్యూమోనియాతో అస్వస్థతకు గురైన మార్క్వెజ్ ఆసుపత్రిలో వారం రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు. మెక్సికో సిటీలోని ఆయన ఇంట్లో తుదిశ్వాస విడిచేటప్పుడు భార్య మెర్సిడెస్ బర్కా, ఇద్దరు కుమారులు గార్షియా పక్కనే ఉన్నారు. మార్క్వెజ్ 1927, మార్చి 6న కొలంబియాలో జన్మించారు. ప్రేమ, కుటుంబం, నియంతృత్వం వంటి అంశాల నేపథ్యంగా మార్క్వెజ్ చేసిన అనేక రచనలు లాటిన్ అమెరికా పాఠకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తన రచనల్లో మేజికల్ రియలిజం పద్ధతిని ప్రవేశపెట్టిన మార్క్వెజ్ ఆ ప్రక్రియకు ఆద్యుడిగా నిలిచారు. ప్రపంచ సాహిత్య రంగంలో ‘గాబో’గా సుపరిచితులైన ఆయన ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్(వందేళ్ల ఏకాంతం-1967)’, ‘ఇన్ ఈవిల్ అవర్’(1962), ‘లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా’(1985) వంటి నవలలు, ‘లీఫ్ స్టార్మ్’(1955), ‘నో వన్ రైట్స్ టు ది కల్నల్’(1961) వంటి నవలికలతో ఖ్యాతిని పొందారు. సాహిత్యరంగంలో కృషికి గుర్తింపుగా 1982లో నోబెల్ అందుకున్నారు. మార్క్వెజ్ మృతి పట్ల కొలంబియన్ అధ్యక్షుడు జువాన్ మానుయెల్ శాంటోస్ ట్విట్టర్లో స్పందిస్తూ.. ఇది వెయ్యేళ్ల ఒంటరితనం, పెను విషాదం అని పేర్కొన్నారు. మూడురోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. మార్క్వెజ్ మృతి నేపథ్యంలో కొలంబియన్లు పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు. గొప్ప దార్శనికత కలిగిన ఓ రచయితను ప్రపంచం కోల్పోయిందం టూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబా మా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే తీవ్ర సంతాపం ప్రకటించారు. ‘లాటిన్ అమెరికా గొం తు అయిన మార్క్వెజ్ ప్రపంచం గొంతుకగా కూడా నిలిచారు. ఆయన ఊహ మనల్ని సంపన్నులను చేసింది. ఆయన మరణం మనల్ని పేదల్ని చేసింది’ అని యూరోపియన్ యూనియన్ అధ్యక్షుడు జోస్ మానుయెల్ బరాసో పేర్కొన్నారు. మార్క్వెజ్ భౌతిక కాయాన్ని సోమవారం ప్రజల సందర్శనార్థం ఉంచిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మార్మిక లోక విహారి! ‘మిత్రుడంటే నీ చేతిని అందుకోవాలి. నీ గుండెను మీటాలి’ అంటాడు మార్క్వెజ్. ఆయ న తన కలంతో లాటిన్ అమెరికా ప్రజలందరి గుండెలనూ తాకాడు. మార్క్వెజ్ రచనల్లో సౌందర్యం, రాజకీయ, సామాజిక స్పృహ సమతూకంలో కనిపిస్తాయి. అదంతా ఆయన లాటిన్ అమెరికా ఐక్యత కోసం పడిన తపనకు ప్రతిబింబమే. ఆ ప్రాంతంలో అమెరికా జోక్యాన్ని ఆయన సదా వ్యతిరేకించాడు. అందుకే అమెరికా ఆయన రాకపై పదేళ్లు నిషేధం విధించింది. ‘మంత్ర వాస్తవికత’(మేజిక్ రియలిజమ్)తో ప్రపంచ సాహితీ లోకాన్ని మైమరపించిన మార్క్వెజ్ స్పానిష్ భాషకు అసాధారణ గౌరవం తెచ్చి పెట్టాడు. 17వ శతాబ్ది రచయిత సెర్వాంటెస్ తర్వాత ఆ భాషకు విశ్వసాహిత్యంలో గుర్తింపు తెచ్చిన వాడిగా లాటిన్ అమెరికా ఆయనను గుర్తు పెట్టుకుంది. కొలంబియాలోని అరాకటాక గ్రామంలో(ఆయన రచనలలోని అద్భుత కాల్పనిక గ్రామం మకుండో ఇదే) పెరిగిన మార్క్వెజ్ను స్థానిక అంశాలు ప్రభావితం చేశాయి. కొలంబియా అంతర్యుద్ధం, లిబరల్ పార్టీ, మాఫియా, కన్నీళ్లు, కడలి అందాలు- అన్నీ ప్రభావం చూపాయి. 3 కోట్ల ప్రతులు అమ్ముడుపోయి, మార్క్వెజ్ కీర్తిని విశ్వవీధుల్లో ఎగరరేసిన ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూ డ్ ’(నూరేళ్ల ఏకాంతం, 1967) నవలానాయకుడి పాత్రకు ప్రేరణ.. కొలంబియా అంతర్యుద్ధంలో కీలకపాత్ర పోషించిన ఆయన తాతే. అందుకే ఆ నవలలో లాటిన్ అమెరికన్ల ఆత్మ కనిపిస్తుంది. 18వ ఏట రచనా వ్యాసంగం ఆరంభించిన మార్క్వెజ్ విశేష సాహిత్య సంపదను ఇచ్చిపోయాడు. -
పురస్కారం: మదర్ థెరిసా.. ప్రపంచ శాంతిదూత
నోబెల్ ఇండియా: అత్యంత ప్రతిష్టాకరమైన నోబెల్ పురస్కార గ్రహీతలలో భారతదేశానికే కీర్తి తెచ్చిన స్త్రీ మదర్ థెరిసా. ఈమెకు 1979వ సంవత్సరంలో నోబెల్ శాంతి పురస్కారం లభించింది. మానవాళికి దారిద్య్రం నుంచి, బాధల నుంచి విముక్తి కల్పించటానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆమెకు ఈ బహుమతి అందజేశారు. మదర్ థెరిసా బాల్యం: మదర్ థెరిసా ఆల్బేనియా దేశంలోని ‘స్కోయె’ పట్టణంలో 1910వ సంవత్సరం ఆగస్టు నెల 26వ తేదీన జన్మించారు. ఆగస్టు 27వ తేదీన ఆమెను రోమన్ క్యాథలిక్ చర్చిలో బాప్టైజ్ చేసి, యాగ్నిస్ గోన్‌జా బొయాహు అని పేరు పెట్టారు. ఆల్బేనియన్ భాషలో గొన్జా అంటే గులాబీ మొగ్గ అని అర్థం. ఆమె తండ్రి నైకోల్ డ్రానాషిల్ బొయాహు. ఆయనకు నలుగురు సంతానం. వారిలో యాగ్నిస్ కడపటిది. చిన్నతనం నుంచి యాగ్నిస్కు రోమన్ క్యాథలిక్ మిషనరీల సేవలకు సంబంధించిన కథలంటే చాలా ఇష్టం. యాగ్నిస్ తండ్రి రాజకీయాలలో ఉంటూ, 1919వ సంవత్సరంలో మరణించారు. యాగ్నిస్ 12 సంవత్సరాల వయసులోనే దైవచింతనతో రోమన్ క్యాథలిక్ చర్చి వైపు ఆకర్షితమయ్యారు. 18 సంవత్సరాల వయసులో ఆమె లొరీటో ఐరిష్ నన్ల వ్యవస్థలో చేరి, ఆంగ్లంలో ప్రావీణ్యత పొంది, 1931 మే నెల 24వ తేదీన ‘నన్’గా ప్రమాణ స్వీకారం చేశారు. వెంటనే ఆమె భారతదేశంలోని కలకత్తా నగరానికి చేరుకుని, 1931 నుంచి 1948 వరకు కలకత్తాలోని సెయింట్ మేరీస్ హైస్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేశారు. భారత్‌లో సేవలు: రోమన్ క్యాథలిక్ మిషనరీల ఆచారం ప్రకారం, యాగ్నిస్ తొలి నామాన్ని థెరిసాగా మార్చుకుని, అందమైన హిమాలయాలలోని డార్జిలింగ్ నగరంలో రోమన్ క్యాథలిక్‌గా సేవలు ప్రారంభించారు. అనంతరం ఆమె కలకత్తా శివార్లలోని ‘ఎంటాలీ’ అనే చోట లొరీటో కాన్వెంట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తూ, అదే స్కూల్లో 1944వ సంవత్సరంలో ప్రధానోపాధ్యాయిని అయ్యారు. ఆ ఏడాది బెంగాల్ రాష్ట్రంలో కరువు వచ్చి, కలకత్తా నగరంలో ఆకలి వల్ల రోగాల వల్ల ఎందరో చనిపోయారు. దానికి తోడు, 1946లో హిందు, ముస్లిం మత వైషమ్యాలు, విధ్వంసకర సంఘటనలు కలకత్తా నగరాన్ని అల్లకల్లోలం చేసి, భయంకరంగా తయారుచేశాయి. మదర్ థెరిసా 1946 సెప్టెంబర్‌లో అంతఃకరణ ప్రబోధంతో సంఘసేవకు శ్రీకారం చుట్టారు. ఆమె కలకత్తా నగరంలోని పేదలు నివసించే పేటలలో తన సహాయ కార్యక్రమాలు ప్రారంభించి, మోతీజిల్ అనే మురికివాడలోని పిల్లలకు ఒక స్కూల్ ప్రారంభించి, అక్కడి పేదలకు సేవ చేయటం ప్రారంభించారు. రోగులకు సేవ చేయటం కోసం ఆమె బీహార్‌లోని పాట్నా నగరంలోని ఒక హాస్పిటల్లో కొద్ది నెలల మెడికల్ ట్రైనింగ్ పొందారు. బెంగాల్ కరువు రోజుల్లో ఆమె సేవను గుర్తించి, అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఎంతగానో ప్రశంసించారు. మదర్ థెరిసా రోమన్ క్యాథలిక్ కేంద్రమైన ‘వాటికన్’ నుంచి ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ స్థాపనకు అనుమతి పొందారు. సాధారణంగా మిషనరీ నన్‌లు ధరించే దుస్తులకు బదులు నీలి అంచు తెల్ల చీరను తమ సంస్థకు గుర్తింపుగా నిర్ణయించారు. ఈ విధంగా థెరిసా రోమన్ క్యాథలిక్ వ్యవస్థకు అనుబంధంగా ఉంటూ, స్వతంత్ర ప్రతిపత్తి గల ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ అనే సేవాసంస్థను నిర్వహించారు. మదర్‌కు నోబెల్: మదర్ థెరిసా సేవలను గుర్తించి, 1979వ సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేశారు. దారిద్య్రంలో బాధపడేవారికి, రోగులకు, అనాథలకు, ఆదరణకు నోచుకోని వృద్ధులకు అందించిన నిస్వార్థ సేవలకు గుర్తింపుగా ఆమెకు నోబెల్ పురస్కారం ఇవ్వటం జరిగింది. ‘ఆమె ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ పురస్కారం అందుకుంటుంద’నే ప్రశ్నకు ‘‘నా రక్తం ఆల్బేనియాది. నా పౌరసత్వం భారత్‌ది. నా విశ్వాసం క్యాథలిక్ మతానిది. నా వ్యక్తిత్వం ప్రపంచానిది. నా హృదయం జీసస్కు చెందినది’’ అని ఉన్నతమైన సమాధానమిచ్చారు థెరిసా. ‘నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా ప్రపంచశాంతిని నెలకొల్పేందుకు మీరిచ్చే సందేశం ఏమిట’ని ప్రశ్నించినప్పుడు ‘‘ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలను ప్రేమిస్తే చాలు, ప్రపంచశాంతి దానంతటదే నెలకొంటుంది’’ అన్నారు మదర్ థెరిసా. నోబెల్ పురస్కార స్వీకరణ ప్రసంగంలో ఆమె‘‘నేటి ప్రపంచంలో ‘దారిద్య్రం’ అనేది కేవలం వెనుకబడిన, ఆర్థికంగా పేద అయిన దేశాలకే పరిమితం కాదు. ఎన్నో విధాలుగాను పురోగమించిన దేశాలలో కూడా ఉందనటానికి చింతిస్తున్నాను. ఆకలితో ఉన్నవారికి ఆహారం సమకూర్చటం ద్వారా పేదరికం తొలగించవచ్చు కాని, సమాజంలో అణగదొక్కబడి, ఆదరణకు నోచుకోనివారికి, ఉగ్రవాదానికి భయపడి బతికేవారికి ఎదురవుతున్న ఆయా దారిద్య్రాలను తొలగించినప్పుడే నిజమైన శాంతి. అబార్షన్లతోపాటు విడాకుల నిర్మూలన కూడా జరిగినప్పుడే మానవులంతా శాంతితో జీవించగలరు’’ అన్నారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ కార్యక్రమాలు: వృద్ధాప్యంలో ఉన్న, మరణానికి చేరువలో ఉన్న అభాగ్యుల కోసం ఆశ్రమం నడపడం. ఈ ఆశ్రమంలో మరణించినవారికి వారి మత కట్టుబాట్లకు అనుగుణంగా ఉత్తర క్రియలు జరపటం(ఆశ్రమంలో మహమ్మదీయులు మరణిస్తే ఖొరాన్ పఠనం, హిందువులు మరణిస్తే వారికి గంగాజలంతో అంత్యక్రియలు, క్రైస్తవులకు చర్చి నిబంధనలకనుగుణంగా నిర్వహించటం) వంటి జనామోదకర విధానాల అమలు. కుష్ఠు రోగులకు ఆశ్రమం నిర్మించి, నగరంలో వివిధ ప్రాంతాలలో వారికి వైద్య సౌకర్యాలు కల్పించటం. 1955లో నిర్మలా శిశుభవనం స్థాపించటం. ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’లో బ్రదర్స్ విభాగం, సిస్టర్స్ విభాగం, ఫాదర్స్ విభాగం ఏర్పాటు చేసి నిష్ణాతులైన సేవకులను తయారుచేయటం. ఇదే క్రమంలో మత ప్రవక్తలను కూడా తయారుచేయడం. దేశదేశాల్లో ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ సంస్థలను ప్రారంభించటం. మదర్ థెరిసా అకుంఠిత దీక్ష, కృషి, పరిశ్రమల ఫలితంగా 1996వ సంవత్సరం నాటికి 100కి పైగా దేశాలలో 517 మిషనరీస్ ఆఫ్ చారిటీ శాఖలు ప్రారంభమ య్యాయి. ఇవి ప్రపంచమంతటా మానవ సేవను కొనసాగిస్తూ ఉన్నాయి. మదర్ థెరిసా అవార్డులు... బహుమతులు: 1962 - పద్మశ్రీ బిరుదు; రామన్ మెగసెసే బహుమతి. 1971 - పోప్ జాన్ 23 శాంతి బహుమతి 1979 - నోబెల్ ‘శాంతి’ బహుమతి 1979 - బాల్జాన్ బహుమతి 1980 - {పపంచంలో అత్యధిక జనాదరణ కలిగిన పదిమందిలో ఒకరిగా గుర్తింపు 2010 - థెరిసా శతజయంతి సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ఐదు రూపాయల నాణెం విడుదల 1983వ సంవత్సరంలో పోప్ జాన్‌పాల్-2ను దర్శించే నిమిత్తం రోమ్ వెళ్లిన మదర్ థెరిసాకు గుండె జబ్బు వచ్చింది. తరువాత 1991లో మెక్సికో నగరానికి వెళ్లినప్పుడు ఆమెకు న్యుమోనియా వచ్చింది. 1996లో ఆమెకు మలేరియా వచ్చి గుండెలో ఎడమ కవాటం పనిచేయటం మానేసింది. దాంతో థెరిసా ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ సంస్థ అధ్యక్ష పదవిని పరిత్యజించారు. చివరకు 1997వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన కలకత్తా నగరంలో కన్నుమూశారు. నవీన్ చావ్లా అనే విశ్రాంత ఐసీఎస్ అధికారి, మదర్ జీవిత చరిత్రను పుస్తకంగా రాసి ప్రచురించారు. మదర్ థెరిసాకు ఎంతోమంది అభిమానులతో పాటు విమర్శకులు కూడా ఉన్నారు. ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ని తన సామ్రాజ్యంగా భావించేవారని, ఆమె అబార్షన్, విడాకులను ప్రోత్సహించకపోవటం యువత స్వేచ్ఛకు ఆటంకమనీ విమర్శల అభిప్రాయం. ఇలాంటి ఎన్ని విమర్శలున్నా మదర్ థెరిసా పేరును ప్రపంచంలో అత్యధిక జనాదరణ గల మొదటి పదిమందిలో ఒకరుగా వరుసగా 18 సార్లు ప్రకటించడం ఆమె విశిష్ట వ్యక్తిత్వాన్ని, సేవా నిరతిని చాటుతున్నాయి. డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు విశ్రాంత రసాయనాచార్యులు -
పురస్కారం: హరగోవింద్ ఖొరానా .. జీవసాంకేతిక బ్రహ్మ
నోబెల్ ఇండియా: హరగోవింద్ ఖొరానా 1952 లో ఎస్తర్ ఎలిజబెత్ సిబ్లర్ అనే స్విస్ వనితను పెళ్లాడారు. వారికి జూలియా ఎలిజబెత్, ఎమిలీయాన్ అనే ఇద్దరు కూతుళ్లు, దేవ్రాయ్ అనే కుమారుడు కలిగారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ పురస్కార గ్రహీతలలో సర్. సి.వి.రామన్ తదనంతరం పేర్కొనదగిన శాస్త్రవేత్త హరగోవింద్ ఖొరానా. ఈయన అవిభక్త భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో జన్మించారు. ప్రస్తుతం ఆ ప్రదేశం పాకిస్తాన్లో ఉంది. ఈయనకు 1968వ సంవత్సరంలో నోబెల్ బహుమతి ప్రదానం జరిగింది. ఖొరానా ఫిజియాలజీ (శరీర ధర్మశాస్త్రం, మెడిసిన్ విభాగం)లో జన్యువులపై పరిశోధనలు చేశారు. హరగోవింద్ ఖొరానా జీవితం: హరగోవింద్ ఖొరానా పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాయపూర్ గ్రామంలో 1922వ సంవత్సరం జనవరి 9వ తేదీన జన్మించారు. వీరిది పేద కుటుంబం. హరగోవింద్ తండ్రి రాయపూర్ గ్రామంలో పన్ను వసూలు చేసే గుమాస్తా (ఫట్వాన్). ఆయనకు నలుగురు కుమారులు ఒక కుమార్తె. వారిలో ఖొరానా కడపటివాడు. చిన్న ఉద్యోగం మీద జీవిస్తూ కూడా పిల్లలకు మంచి చదువులు చెప్పించారాయన. ఆ ఊరిలో చదువుకున్న కుటుంబం వీరిది ఒక్కటే. విద్య... పరిశోధనలు: హరగోవింద్ ఖొరానా లాహోర్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో చదివారు. 1943లో బీఎస్సీ, 1945లో ఎమ్మెస్సీ పట్టాను పొందారు. అదే సంవత్సరంలో ఆయన స్కాలర్షిప్ (ఉపకారవేతనం)తో ఇంగ్లండు వెళ్లి, లివర్‌పూల్ విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడ కర్బన రసాయన శాస్త్రంలో పరిశోధనలు జరిపి, 1948వ సంవత్సరంలో పీహెచ్డీ పట్టా సాధించారు. వెంటనే ఆయన స్విట్జర్లాండ్‌లోని ‘జ్యూరిక్’ నగరంలో పోస్ట్ డాక్టరల్ ఫెలోగా కొద్దికాలం పనిచేశారు. ఆ తర్వాత ఇంగ్లండ్‌కు తిరిగివచ్చి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో కొంతకాలం పనిచేశారు. కేంబ్రిడ్జిలో పనిచేస్తున్న తరుణంలోనే ఖొరానా దృష్టి బయో కెమిస్ట్రీలో ప్రొటీన్లు, న్యూ క్లియర్ ఆమ్లాల రసాయన శాస్త్రంపై పడింది. ఈ దశలో 1952వ సంవత్సరంలో ఖొరానా కెనడాలోని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీలో ఆచార్యునిగా చేరి, న్యూక్లియర్ ఆమ్లాల ఫాస్ఫేట్ ఎస్టర్లపై పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. అయితే ఆయా వర్సిటీలలో ప్రయోగ పరికరాలు తన పరిశోధనలకు తగినట్లుగా లేకపోవటంతో 1960లో ఖొరానా విస్కాన్సిన్లోని ఎంజైమ్‌ల పరిశోధన సంస్థలో చేరారు. అక్కడ పది సంవత్సరాల పాటు పనిచేసిన ఖొరానా, ప్రతిష్టాత్మకమైన ఎమ్ఐటీలో బయాలజీ, రసాయన శాస్త్రాల విభాగంలో ఆల్ఫ్రెడ్.పి.స్లోన్ ఆచార్యునిగా స్థిరపడ్డారు. ఖొరానా ఆవిష్కరణలు: జీవ కణాలలోని ప్రొటీన్లు నిర్వహించే విధులను నిర్ణయించే జన్యువుల కోడ్‌ను సంకేతాలను మొట్టమొదటిసారిగా కనుగొన్నారు హరగోవింద్ ఖొరానా. జన్యు ధర్మాలను నియంత్రించే న్యూక్లియర్ ఆమ్లాలలో ఉండే నాలుగు ప్రధానమైన బేస్ అణువులు 1. ఎడినీన్ 2. సైటోసిన్ 3. యూరసిల్ 4.గ్వానిన్. ఇవి ఒక్కొక్క క్రమంలో అమరి, ఒక్కొక్క ఎమైనో ఆమ్లానికి సంకేతంగా ఉంటాయి. ఈ అమరికలననుసరించి ఆయా ఎమైనో ఆమ్లాల వరుసలు ఏర్పడతాయి. ఉదాహరణకు, నిరేన్ బెర్గ్ అనే శాస్త్రజ్ఞుడు న్యూక్లియర్ ఆమ్ల క్రమం U U U (3 యూరసిల్ యూనిట్లు)గా ఉంటే... అది ఫినైల్ ఎలనీన్ అనే ఎమైనో ఆమ్లానికి సంకేతమని నిర్థారించారు. హరగోవింద్ ఖొరానా పూర్తిగా కర్బన రసాయన సంశ్లేషణా విధానాలతో భిన్నమైన ఎమైనో ఆమ్లాలకు కోడ్లైన్ బేస్ అణువుల క్రమం (UCU CUCUCU) మొదలైన వాటిని తయారుచేసి చూపించారు. ఈ విధమైన మూడేసి యూనిట్లు (ఉదా: UCU, CUC మొదలైన పదాలు) మొత్తం 64 ఉన్నాయని, ఈ మూడేసి యూనిట్ల క్రమాన్ని బట్టి ఆయా ఎమైనో ఆమ్లాలు, వాటి వరుసలను నిర్థారించవచ్చునని కనుగొన్నారు. ఈ విధంగా ప్రయోగశాలలో డీఎన్ఏ (డీ ఆక్సీ రైబో న్యూక్లిక్ ఆమ్లం) సంశ్లేషణ చేయగల్గిన మొట్టమొదటి శాస్త్రజ్ఞుడిగా హరగోవింద్ ఖొరానా పేరుపొందారు. నోబెల్ పురస్కారం: జన్యువులలోని కోడ్లను సమగ్రంగా వివరించగలగటంతో, జన్యువులలో తగు విధంగా మార్పులు చేయటం, జీవరాశులలో జన్యు మార్పిడి విధానాల ద్వారా జన్యువులలో అవాంఛిత లక్షణాలు తొలగించటం, అవసరమైనచోట్ల జన్యు మార్పిడి చేయగలగటం వంటి ఎన్నో విధానాలు అమలులోకి వచ్చాయి. ఖొరానా చేసిన ఈ పరిశోధనల ఫలితంగా ఈ రంగం ‘బయో టెక్నాలజీ’ అనే ప్రత్యేకమైన శాస్త్ర విభాగంగా ఏర్పడింది. జన్యువుల ఉత్పత్తి పారిశ్రామికంగా చేపట్టడానికి కూడా వీలు కలిగింది. ఈ ఆవిష్కరణలకు గాను ఖొరానాకు ఫిజియాలజీ (శరీర ధర్మ శాస్త్రం) విభాగంలో 1968వ సంవత్సరపు నోబెల్ పురస్కారం అందింది. ఈ పురస్కారాన్ని ఎమ్ఐటీకి చెందిన ఖొరానాకు, కార్నెల్ యూనివర్సిటీకి చెందిన రాబర్ట్. డబ్ల్యూ. హాలీ, ఎన్ఐహెచ్కి చెందిన మార్షల్. డబ్ల్యూ. నిరేన్ బర్గ్లకు సంయుక్తంగా ప్రకటించారు. హరగోవింద్ ఖొరానాకు 1968లో లెస్టర్ పురస్కారం, 1987లో యూఎస్ఏ సైన్స్ మెడల్ కూడా లభించాయి. ఖొరానా ఎమ్ఐటీ నుంచి 2007లో పదవీ విరమణ చేశారు. 2011 నవంబర్ 9వ తేదీన కన్నుమూసేనాటికి ఆయన వయసు 89 ఏళ్లు. 2013 నోబెల్ గ్రహీతలు నాస్తికుణ్ని కరుణించిన ‘దైవకణం’ 2013వ సంవత్సరంలో భౌతిక శాస్త్ర విభాగానికి చెందిన నోబెల్ పురస్కారాన్నిఇంగ్లండులోని ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్యుడు పీటర్ హిగ్స్ అనే 84 ఏళ్ల శాస్త్రజ్ఞుడు, బెల్జియం దేశంలో బ్రస్సెల్స్ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడైన ఫ్రాంకోయ్ ఎంగ్లెర్ట్ అనే మరో శాస్త్రవేత్తకు కలిపి ప్రకటించారు. విశ్వ నిర్మాణానికి ఆధారమైన పరమాణువులలోని సూక్ష్మ కణాలలోకెల్లా అతి సూక్ష్మమైన ‘బోసాన్’ వేదా హిగ్స్ కణాల ఉనికిని ప్రయోగాత్మకంగా నిరూపించినందుకు, తద్వారా విశ్వంలోని పదార్థాలు ఏర్పడే విధానం అవగాహన చేసుకునే సౌకర్యం కలిగించినందుకు వీరికి ఈ సంవత్సరపు నోబెల్ పురస్కారం అందజేశారు. బోసాన్లు (Bosons) లేదా హిగ్స్ కణాల ఉనికిని 1924వ సంవత్సరంలోనే సత్యేంద్రనాథ్ బోస్ అనే భారతీయ భౌతిక శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌తో కలిసి మొదటిసారిగా ప్రతిపాదించారు. అందుకే శ్రీ సత్యేంద్రనాథ్ బోస్ జ్ఞాపకార్థం హిగ్స్, ఎంగ్లెర్ట్ శాస్త్రవేత్తలు వాటికి ‘బోసాన్’లు (ఆౌటౌ) అని పేరు పెట్టారు. అయితే సత్యేంద్రనాథ్ ప్రతిపాదన జరిగిన నాలుగు దశాబ్దాల తరువాత, 1964లో ఎంగ్లెర్ట్, హిగ్స్ శాస్త్రవేత్తలు విడివిడిగా పరిశోధనలు జరిపి, బోసాన్ కణాల ఉనికిని తమ సిద్ధాంతాల ద్వారా ప్రతిపాదించారు. అయితే 2010 సంవత్సరం తర్వాత మాత్రమే వారి ప్రతిపాదనలు ప్రయోగం ద్వారా నిరూపించటానికి అవకాశం కలిగింది. సృష్టి ప్రారంభంలో విశ్వమంతా శక్తితో నిండి ఉండేదని, ఈ శక్తి నాలుగు విధాలుగా ఉంటుందని వీరు నిరూపించారు (అవి 1. గురుత్వాకర్షణశక్తి 2. విద్యుదయస్కాంత శక్తి 3. బలహీనమైన రేడియో ధార్మిక విఘటన శక్తి (సూర్యునిలో సంభవించే అణు ప్రక్రియలకు ఈ శక్తి ఆధారం) 4. పరమాణువుల్లో ప్రోటాన్లు, న్యూట్రాన్లను దగ్గరగా పట్టి ఉంచే బలమైన శక్తి). విశ్వంలో ఈ శక్తి యొక్క అనూహ్యమైన మార్పుల వలన పదార్థ కణాలు ఏర్పడతాయి. వాటిలో అతి చిన్నదైన, అస్థిరమైన, ద్రవ్యరాశితో కూడిన కణమే బోసాన్. - డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు విశ్రాంత రసాయనాచార్యులు