అమానవీయ, నిరంకుశ నిర్ణయం!
నోట్ల రద్దుపై అమర్త్యసేన్ ధ్వజం.. తెలివితక్కువ ఆలోచనన్న ఆర్థికవేత్త
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం అమానవీయం, నిరంకుశమని నోబెల్ అవార్డు గ్రహీత, భారత రత్న డాక్టర్ అమర్త్యసేన్ తీవ్రంగా విమర్శించారు. అధికారాన్ని ప్రదర్శించేందుకు మోదీ తీసుకున్న నిర్ణయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దుయ్యబట్టారు. ‘నల్లధనాన్ని, అవినీతిని అదుపుచేసే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని భారతీయులు హర్షిస్తారు. కానీ దీని అమలులో తీసుకోవాల్సిన చర్యలు ఇవేనా అని మనం ప్రశ్నించాలి. కొద్ది ఫలితం సాధించేందుకు అత్యధికులను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు’అని డాక్టర్ అమర్త్యసేన్ అన్నారు.
అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీనుంచి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నవంబర్ 8న హఠాత్తుగా ప్రకటించిన ఈ నిర్ణయం ద్వారా 6 నుంచి 10 శాతం నల్లధనం మాత్రమే బయటపడుతుందన్నారు. ఈ నిర్ణయం వల్ల కేంద్రం సాధించేది చాలా తక్కువని.. కానీ భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని సేన్ స్పష్టం చేశారు. మోదీ నిర్ణయం మంచిదే అరుునా అమలుతీరు అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. ‘నల్లధనంపై ముందడుగు పడాలని మనమంతా అనుకుంటున్నాం. కానీ ఈ నిర్ణయం మాత్రం తెలివైంది కాదు. మానవత్వంతో తీసుకున్నది అసలే కాదు. ఇలా జరిగి ఉండాల్సింది కాదు’అని అన్నారు. ముఖాముఖి ఆయన మాటల్లోనే..
నిరంకుశత్వం అన్నారు. ఎందుకు?: ‘ప్రజల్లో కరెన్సీపై నమ్మకం పోతోంది. ప్రతి రూపారుు ఓ ప్రామీసరి నోటు లాంటిది. ఈ రూపారుుని గౌరవించకపోవటం ద్వారా ప్రభుత్వం తను చేసిన వాగ్దానాలను నిలుపుకోలేనని చెప్పటమే అవుతుంది. సర్కారు హఠాత్తుగా మీకు డబ్బులు చెల్లించలేమని ప్రజలకు చెప్పటం నిరంకుశం కాదా?’
ఆర్థిక వ్యవస్థ పరిస్థితేంటి?: ‘నేను పెట్టుబడిదారీ వ్యవస్థకు అభిమానిని కాను. కానీ ఈ వ్యవస్థలోనూ నమ్మకం చాలా కీలకం. మోదీ నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఉంది. ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పోతోంది. రేపు బ్యాంకు అకౌంట్లతోనూ ప్రభుత్వం ఇలాగే వ్యవహరించే అవకాశం ఉందేమో. కేంద్రం ఓ సంఖ్యను నిర్ణరుుంచి అంతకంటే ఎక్కువ మొత్తాన్ని అకౌంట్లోనుంచి తీసుకునేందుకు ప్రతీ పౌరుడు సచ్చీలుడినని నిరూపించుకోవాలని అడిగే పరిస్థితీ రావొచ్చు’
మోదీ ఏం చేసినా విమర్శిస్తున్నారు!: ‘నేను ప్రతి విషయంలో మోదీని విమర్శించటం లేదు. నల్లధనంపై ఎక్కుపెట్టిన అస్త్రాన్ని ఆయన సరిగ్గా వినియోగించుకుని ఉంటే నేనే ప్రశంసించేవాణ్ని. ఈ నిర్ణయం వల్ల చట్ట ప్రకారం నడుచుకుంటున్న సామాన్య జనాలకు, తమ సంపాదనకు లెక్కలున్న వారికీ సమస్యలు ఎదురవుతున్నారుు. అదే నన్ను బాధిస్తోంది. మోదీతో నాకున్న అభిప్రాయభేదం దేశాన్ని మించిన అంశాలకు సంబంధించినవి. 31 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీకి.. తమను వ్యతిరేకించిన వారిని దేశ ద్రోహులుగా ప్రకటించే అధికారం లేదని స్పష్టంగా చెప్పదలచుకున్నా’