సాక్షి, న్యూఢిల్లీ : మన జీవితంలో చోటుచేసుకునే కొన్ని ముఖ్యమైన సంఘటనలను ఎప్పటికీ మరచిపోలేం. ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం, పిల్లాడు పుట్టడం, ప్రేమించినవారు మరణించడం తదితర సంఘటనలను మరవలేం. అలాగే మన జీవితాలను ప్రభావితం చేసే సామాజంలో లేదా దేశంలో జరిగే సంఘటనలకు కూడా మరచిపోలేం. వాటి గురించి చెప్పమంటే నిన్న మొన్న జరిగినట్లే చెప్పగలం. అలాంటి సంఘటనల్లో ఒకటి దేశంలో పెద్ద నోట్ల రద్దు. సరిగ్గా రెండేళ్ల క్రితం అంటే 2016, నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి దేశానికే పెద్ద షాక్ ఇచ్చారు.
దేశంలో రోజు రోజుకు పేరుకుపోతున్న నల్లడబ్బును వెలికి తీయడానికి, నకిలీ కరెన్సీని అరికట్టడానికి, టెర్రరిజాన్ని అణచివేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన లక్ష్యాల్లో ఏ ఒక్క లక్ష్యమైనా నేరవేరిందా? దేశ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి, ఉద్యోగావకాశాలపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపింది?
పెద్ద నోట్లను రద్దు చేసిన మరుసటి రోజు నుంచి సామాన్య ప్రజలు ఏటీఎంల ముందు భారీ ఎత్తున క్యూలు కట్టి అష్టకష్టాలు పడ్డారు. రోజుల తరబడి బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు నిలబడినా ప్రయోజనం లేకపోవడంతో అనేక మంది వృద్ధులు, పింఛనుదారులు క్యూలలోనే ప్రాణాలు వదిలారు. అలా దేశవ్యాప్తంగా 150 మందికిపైగా మరణించారు. రైతులు, ముఖ్యంగా కూరగాయ రైతులు, చిల్లర వ్యాపారులు భారీగా నష్టపోయారు. దేశంలో పలు చిన్న ఫ్యాక్టరీలు మూత పడ్డాయి. కార్మికులు రోడ్డున పడ్డారు. చేనేత కార్మికులు ఉపాధినికోల్పోయి వారి వద్ద పనిచేసే కార్మికులు దిక్కులేకుండా పోయారు. నిత్యావసర సరకుల ధరలు పెరిగిపోయి సామాన్యుల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు ఇబ్బందులు పడ్డారు. ఒక్క రియల్ ఎస్టేట్ రంగానికే రెండు లక్షల కోట్ల రూపాయల న ష్టం వాటిల్లింది.
పేద, మధ్య తరగతి ఇళ్లలో కొన్ని పెళ్లిళ్లు ఆగిపోగా, కొన్ని పెళ్ళిళ్లు వాయిదా పడ్డాయి. మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన 50 రోజుల్లోనే ప్రతికూల ఫలితాలు రావడం మొదలయ్యాయి. అయినా దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలు ఉంటాయంటూ మోదీ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఏడాది గడిచినా ఒక్క మంచి ఫలితం కనిపించలేదు. మోదీ ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థించుకుంటూనే వచ్చింది. ఈ రోజుకు రెండేళ్లు గడిచాయి. అయినా ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు.
దేశం మొత్తం కరెన్సీలో 86 శాతం ఉన్న రూ. 500, రూ 1000 నోట్లను రద్దూ చేయడం వల్ల దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు వెనక్కి రావని, అదంతా నల్లడబ్బుగా భారత ప్రభుత్వానికి మిగులుతుందని ప్రభుత్వం భావించింది. రద్దు చేసిన నోట్లలో 99. 30 శాతం వెనక్కి తిరిగి వచ్చాయి. అంటే, 10. 720 కోట్ల రూపాయలు మాత్రమే బ్యాంకుల్లో డిపాజిట్ కాలేదు. పెద్ద నోట్లను మార్చుకునేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడిన నల్లడబ్బు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలే. పెద్ద నోట్ల రద్దు కారణంగా ప్రభుత్వానికి చిక్కిన నల్లడబ్బు మొత్తం 16 వేల కోట్లే. కొత్త నోట్లను ముద్రించడానికి అయిన ఖర్చు 7,965 కోట్ల రూపాయలు. పట్టబడిన నల్ల డబ్బును లాభం అనుకుంటే అందులో నుంచి నోట్ల ముద్రణకు అయిన ఖర్చును తీసివేస్తే మిగిలేది 8, 035 కోట్ల రూపాయలు. పెద్ద నోట్ల రద్దు చేసిన సంవత్సరంలో పట్టుబడిన నకిలీ కరెన్సీ 7.6 లక్షల రూపాయలు. అంతకుముందు పట్టుబడిన నకిలీ కరెన్సీ 6.3 లక్షల రూపాయలు.
స్థూల జాతీయోత్పత్తి వృద్థి రేటు అంతకుముందు 7.1 శాతం ఉంటే పెద్ద నోట్ల రద్దు కారణంగా అది 5. 7 శాతానికి పడిపోయింది. పడిపోయిన వృద్ధి రేటును దాచి పెట్టేందుకు 2017వ ఆర్థిక సంవత్సరం నుంచి మోదీ ప్రభుత్వం వృద్ధి రేటును లెక్కించేందుకు కొత్త పద్ధతిని ప్రవేశ పెట్టింది. కొత్త పద్ధతి ప్రకారం 2018లో వృద్ధి రేటును 7.3గా చూపింది. కొత్త పద్ధతిని ప్రవేశపెట్టినప్పుడు ఐదేళ్ల క్రితం వృద్ధి రేటు ఎంత ఉన్నదో కొత్త పద్ధతి ప్రకారం లెక్కించి తప్పనిసరిగా చూపించాలన్నది ఆర్థిక నియమం. ఈ నియమం ప్రకారం యూపీఏ ప్రభుత్వం హయాంలో వృద్ధి రేటు 10.5 శాతమని తేలింది. కేంద్ర ప్రభుత్వం స్టాటటిక్స్ వెబ్‌సైట్‌లో ఈ శాతాన్ని తొలుత చూపినా కొన్ని రోజులకే మాయమయింది.
అయినప్పటికి రెండేళ్ల క్రితం పెద్ద నోట్లను రద్దు చూస్తూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, సముచితం సాహసోపేతమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు సమర్థించుకున్నారు. సాహసోపేతం కావచ్చుగానీ సముచితం ఎలా అవుతుందో ఆయనకు, ఆయన ప్రభుత్వానికే తెలియాలి. ఆర్థిక చరిత్ర పుటలో ఈ రోజు ఎప్పటికి నిలిచి పోతుందనడంలో సందేహం లేదు. ‘కొన్ని గాయాలు కాలంతోపాటు మానిపోతుంటాయి. కాన్ని పెద్ద నోట్ల రద్దు చేసిన గాయాలు మానకపోగా, కాలంతోపాటు అవి మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. కులం, మతం, ప్రాంతం, చిన్న, పెద్దా, ముసలి, ముతక, ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని గాయపర్చింది పెద్ద నోట్ల రద్దు’ అంటూ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment