note ban
-
పాత వంద రూపాయల నోట్లు రద్దవుతున్నాయా?
పాత వంద రూపాయల నోట్లకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ పుకారు షికారు చేస్తోంది. ఈ నోట్లు రద్దవుతాయంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. పాత నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ గడువు కూడా విధించినట్లు అందులో పేర్కొంటున్నారు. పాత రూ.100 నోటు ఇస్తే తీసుకోవడం లేదంటూ మరికొందరు పోస్టు చేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్)లో ఓ యూజర్ పాత వంద రూపాయల నోట్లు రద్దవుతున్నాయని, 2024 మార్చి 31 వరకు పాత రూ.100 నోట్లను మార్చుకోవాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆదేశించిందని పోస్ట్ చేశారు. ఇది వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా దుకాణదారులు పాత రూ.100 నోటు తీసుకోవడం లేదని హైదరాబాద్‌కు చెందిన మరో యూజర్ పేర్కొన్నారు. ఈ పాత వంద రూపాయల నోట్లకు సంబంధించి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా అంటూ ఆర్బీఐని ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు. @RBI Today, in Ameerpet, Telangana, I encountered an issue where a Pani Puri vendor declined to accept a Rs. 100 note, Could you kindly provide clarification on whether there are any considerations or guidelines regarding the acceptance of such notes in the market? pic.twitter.com/x4c3ONhX0O — Anil G (@anilbjpofficial) December 27, 2023 అయితే పాత వంద రూపాయల నోట్లు నిజంగానే రద్దవుతున్నాయా.. ఆర్బీఐ అలాంటి ప్రకటనలు ఏమైనా ఇచ్చిందా అని పరిశీలించగా ఇవన్నీ ఫేక్ వార్తలని తేలింది. ఇందులో వాస్తవం లేదని ఆర్బీఐ ప్రతినిధి స్పష్టం చేశారు. Yogesh Dayal, the spokesperson for RBI, dismissed the viral claims about the withdrawal of the old Rs 100 notes. https://t.co/sXbIBl92VC pic.twitter.com/SzSARAypZ5 — The Quint (@TheQuint) December 26, 2023 -
ముగిసిన రూ.2 వేల నోటు శకం.. ఆరేళ్ల ప్రస్థానం..
దేశంలో ఇప్పటివరకూ చలామణిలో రూ.2 వేల నోటు శకం ముగిసింది. రూ.2 వేల నోటును భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజాగా చలామణి నుంచి ఉపసంహరించింది. అంటే ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లన్నీ ఆర్బీఐకి తిరిగిచ్చేయాలి. ఇందుకు సెప్టెంబర్ 30ని తుది గడువుగా ప్రకటించింది. ఆరేళ్ల ప్రస్థానం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సందర్భంగా 2016 నవంబర్ 8న ఆర్బీఐ ఈ రూ.2 వేల నోటును ప్రవేశపెట్టింది. మహాత్మ గాంధీ కొత్త సిరీస్‌లో భాగంగా దీంతో పాటు రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లను కొత్త డిజైన్‌తో విడుదల చేసింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు రూ.2 వేల నోటును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది ఆర్బీఐ. ఆకర్షణీయ డిజైన్ రూ. 1000 నోట్లను రద్దు చేశాక దానికి ప్రత్యామ్నాయంగా ఈ కొత్త రూ.2 వేల నోటును ఆర్బీఐ ప్రవేశపెట్టింది. రంగు, డిజైన్ ఆకట్టుకునేలా తీర్చిదిద్దింది. ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన అద్భుత విజయం మంగళ్యాన్ ఉపగ్రహ ప్రయోగం. దీనికి సంబంధించిన చిత్రాన్ని రూ.2 వేల నోటుపై ముద్రించింది. మైసూరులో ప్రింటింగ్ రూ.2 వేల నోట్లను ఆర్బీఐ మైసూరులో ప్రింట్ చేసింది. మైసూరులోని ఆర్బీఐ ముద్రణా కార్యాలయంలో ఈ నోటు తయారైంది. ఆర్బీఐ డేటా ప్రకారం.. 2017 మార్చి ఆఖరు నాటికి 3,285 మిలియన్ నోట్లు చలామణిలో ఉన్నాయి. ఆ తర్వాత ఏడాది వీటి సంఖ్య కేవలం 3,365. అప్పటి నుంచి ముద్రణను క్రమంగా తగ్గించేసింది ఆర్బీఐ. 2018 మార్చి చివరి నాటికి చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్ల విలువ రూ.18,037 కోట్లు. 2020 మార్చి ఆఖరు నాటికి చలామణిలో ఉన్న అన్ని నోట్లలో రూ.20 వేల నోట్లు కేవలం 22.6 శాతం. ఇదీ చదవండి: అంతర్జాతీయ క్రెడిట్ కార్డులపై ఆర్బీఐ గురి.. పరిమితికి మించితే అనుమతి తప్పనిసరి -
నోట్ల రద్దుపై తీర్పు వెల్లడించిన సుప్రీం కోర్టు
ఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. పెద్ద నోట్ల రద్దులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రూ.500, రూ.1000 నోట్లు రద్దు చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. మొత్తం అయిదుగురు న్యాయమూర్తులు ఈ కేసును విచారించగా.. నోట్ల రద్దు నిర్ణయాన్ని నలుగురు న్యాయమూర్తులు సమర్థించారు. జస్టిస్ నాగరత్నం మాత్రం తన నిర్ణయాన్ని దీనికి వ్యతిరేకంగా వెలువరించారు. అధికారిక ఉత్తర్వుల ద్వారా కాకుండా పార్లమెంట్ చట్టం ద్వారా నిర్ణయం అమలు చేస్తే బాగుండేది అని తన తీర్పు ప్రతిలో వెల్లడించారు జస్టిస్ నాగరత్నం. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పార్లమెంటును విస్మరించడం సరైనది కాదని పేర్కొన్నారు జస్టిస్ నాగరత్న. అయితే, మెజార్టీ జడ్జిలు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో నోట్ల రద్దు అంశంలో కేంద్రానికి ఉపశమనం లభించింది. పెద్ద నోట్ల రద్దు అంశంలో కేంద్రం ఉద్దేశమే ముఖ్యమన్న సుప్రీంకోర్టు, ఆ ఉద్దేశాలు నెరవేరలేదన్న కారణంతో నిర్ణయాన్ని కొట్టివేయలేమని తెలిపింది. పూర్తి స్థాయి సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. 2016 నవంబర్ 8వ తేదీన కేంద్రం ఇచ్చిన నోట్ల రద్దు నోటిఫికేషన్ సరైందనేనని బెంచ్ స్పష్టం చేసింది. జస్టిస్ నాగరత్న నోట్ల రద్దుకు వ్యతిరేకంగా మొత్తం 58 పిటిషన్లపై విచారణ జరిగింది. జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలో.. బీఆర్ గవాయ్, ఏఎస్ బొప్పన్నా, వీ రామసుబ్రమణియన్, బీవీ నాగరత్నలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే తీర్పుపై స్పందిస్తూ.. ఆర్థిక విధాన అమలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. నోట్ల రద్దుపై కేంద్రం, ఆర్బీఐ సంప్రదింపులు జరిగాయి. అటువంటి చర్యను తీసుకురావడానికి సహేతుకమైన కారణం ఉంది. దామాషా సిద్ధాంతం వల్ల పెద్ద నోట్ల రద్దు జరగలేదని మేము భావిస్తున్నాము అని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే జస్టిస్ గవాయి వెల్లడించిన తీర్పుతో బెంచ్‌లోని జస్టిస్ నాగర్నత ఒక్కరే విభేధించడం గమనార్హం. నోట్ల రద్దు విషయంలో కేంద్రం వైఖరిని జస్టిస్ నాగరత్న తప్పుపట్టారు. ‘రహస్యంగా చేసిన ఈ చట్టం ఒక ఆర్డినెన్స్. నోట్ల రద్దు విషయంలో ప్రభుత్వం కేవలం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కాకుండా ప్లీనరీ చట్టం రూపంలో నిర్ణయం వెలువరించాల్సింది’’ అని పేర్కొన్నారు. ఇక.. 2016లో వెయ్యి, 500 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన రికార్డులను అందజేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలను గత డిసెంబరు 7న ఆదేశించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఆపై ఇరువర్గాల వాడి వేడి విచారణ పూర్తి కావడంతో.. ఇవాళ్టి తుది తీర్పు మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ధర్మాసనం మాత్రం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్నే సమర్థించింది. -
జ్యూవెలర్లకు ఐటీ షాక్..
ముంబై : నరేంద్ర మోదీ సర్కార్ 2016లో నోట్ల రద్దు ప్రకటించిన సమయంలో బంగారు ఆభరణాలను పెద్ద ఎత్తున విక్రయించిన జ్యూవెలర్లకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. 2016 నవంబర్ 8న ప్రధాని నోట్ల రద్దును వెల్లడించగానే పెద్దసంఖ్యలో కస్టమర్లు తమ షోరూంలో నెక్లెస్‌లు, రింగ్‌లు సహా కనిపించిన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి పాతనోట్లను విడిపించుకున్నారని ముంబైలోని ఓ జ్యూవెలర్ వెల్లడించారు. అప్పటి ఆ అమ్మకాలపై ఆదాయ పన్ను అధికారులు ఇప్పుడు తమకు డిమాండ్ నోటీసులు పంపుతున్నారని ఆయన వాపోయారు. రెండు వారాల్లో జరిగే అమ్మకాలు తాము ఆ ఒక్క రాత్రే జరిపామని తన పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఆ వ్యాపారి తన చివరి పేరును జైన్‌గా పేర్కొన్నారు. కాగా ఆ రాత్రి ఎంతమేరకు టర్నోవర్ జరిగిందో వివరాలు వెల్లడించాలని తనకు మూడు నెలల కిందట ట్యాక్స్ నోటీసులు వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఉత్తర్వులపై ఆయన అప్పీల్‌కు వెళ్లారు. అయితే మన చట్టాల ప్రకారం వివాదాస్పద మొత్తం 20 శాతం సదరు వ్యాపారి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తాము కేసును ఓడిపోతే మిగిలిన మొత్తం చెల్లించేందుకు తాము తమ వ్యాపారాలను మూసివేయాల్సి వస్తుందని జైన్ ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి : ఆలయం వద్ద బయటపడిన బంగారు నాణేలు జైన్ మాదిరిగా దేశవ్యాప్తంగా 15,000 మంది జ్యూవెలర్లకు ట్యాక్స్ డిమాండ్లను జారీ చేశారని ఇండియన్ బులియన్ అండ్ జ్యూవెలర్స్ అసోసియేషన్ కార్యదర్శి సురేంద్ర మెహతా వెల్లడించారు. జెమ్స్, జ్యూవెలరీ రంగానికి చెందిన వారి నుంచి పన్ను అధికారులు రూ 50,000 కోట్లు వసూలు చేయాలని అంచనా వేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అప్పీల్‌కు వెళ్లదల్చుకునే వారు 20 శాతం డిపాజిట్ చేయడం, కేసు ఓడిపోతే మిగిలిన మొత్తం చెల్లించాల్సి రావడం పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుందని, జ్యూవెలర్లు రుణాలు చెల్లించడంలో డిఫాల్ట్ అయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాత రాబడిపై పన్ను డిమాండ్ చేసే అధికారం పన్ను అధికారులకు ఉన్నప్పటికీ మొత్తం రాబడిని పన్నుగా డిమాండ్ చేయడం మాత్రం అసాధారణమని బులియన్ వర్గాలతో పాటు పన్ను నిపుణులూ పేర్కొంటున్నారు. మూడేళ్ల కిందట మరణించిన వ్యక్తి మృతదేహాన్ని తవ్వితీసి ఆ వ్యక్తి ఎలా మరణించాడు..చంపిన వ్యక్తిని పట్టుకోవడం ఎలా అని పోలీసులు ఆరా తీసినట్టుగా ఈ వ్యవహారం ఉందని కోల్‌కతాకు చెందిన ఓ పన్ను అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ ఏడాది పెద్దసంఖ్యలో జ్యూవెలర్లకు టాక్స్ డిమాండ్ నోటీసులు పంపారని, వీటి ద్వారా రూ 1.5 నుంచి రూ 2 లక్షల వరకూ వసూళ్లు రాబట్టాలని ఆశిస్తున్నట్టు ఇద్దరు సీనియర్ ట్యాక్స్ అధికారులు పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ 11 ఏళ్ల కనిష్టస్ధాయిలో ఇబ్బందులకు గురవుతుండటంతో పన్ను లక్ష్యాన్ని అధిగమించేందుకు ఈ కసరత్తు చేపట్టారని జ్యూవెలర్లు వాపోతున్నారు. -
పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ : అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంక్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది. ఈ కేసు విచారణ సందర్భంగా శుక్రవారం మెట్రపాలిటన్ కోర్టు న్యాయమూర్తి రాహుల్‌ను నేరాన్ని మీరు అంగీకరిస్తారా అని అడగ్గా తాను నేరగాడ్ని కాదని ఆయన బదులిచ్చారు. అహ్మదాబాద్ మెట్రపాలిటన్ కోర్టులో జరిగిన కేసు విచారణకు రాహుల్ స్వయంగా హాజరయ్యారు. రూ 15,000 పూచీకత్తుపై రాహుల్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నోట్ల రద్దు జరిగిన అయిదు రోజుల తర్వాత అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంక్‌లో రూ 745.59 కోట్ల నల్ల ధనాన్ని అసలైన నోట్లతో మార్చుకున్నారని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు నమోదైంది. ఈ బ్యాంక్ డైరెక్టర్లలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒకరు కావడం గమనార్హం. ఈ కేసులో వీరిద్దరిపై ప్రాధమిక సాక్ష్యాధారాలు లభించడంతో ఈ ఏడాది ఏప్రిల్ 9న వీరికి కోర్టు సమన్లు జారీ చేసింది. తమ బ్యాంక్‌పై కాంగ్రెస్ నేతలు నిరాధార, తప్పుడు ఆరోపణలు చేసి తమ ప్రతిష్టకు భంగం కలిగించారని బ్యాంకు తన ఫిర్యాదులో పేర్కొంది. -
చలా‘మణీ’కి రెండేళ్లు
అనంతపురం అగ్రికల్చర్ : పెద్ద నోట్ల రద్దు ప్రకటనలో సామాన్య ప్రజలకు పెద్ద కష్టాలే వచ్చాయి. సరిగా రెండేళ్ల క్రితం (2016 నవంబర్ 8న )నోట్ల రద్దు ప్రకటన వెలువడింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రూ.100 నోటు కోసం అన్ని వర్గాల ప్రజలూ నానాపాట్లు పడ్డారు. ప్రకటన మరుసటి రోజు నుంచే చేతిలో రూ.కోట్ల కరెన్సీ ఉన్నా విలువలేని నోట్లుగా చూడాల్సి వచ్చింది. నోట్ల మార్పిడి, కొత్త కరెన్సీ నోట్ల కోసం జనం పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కరెన్సీ కష్టాలతో కటకట పెద్ద నోట్లు చెల్లవని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంకు అందుకనుగుణంగా ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో కరెన్సీ కష్టాలతో అల్లాడిపోయారు. 34 ప్రధాన బ్యాంకులు, వాటి పరిధిలో 457 బ్యాంకు శాఖలు, 556 ఏటీఎంలు ఉన్నా నగు కొరత తీవ్రస్థాయిలో ఏర్పడింది. లక్షలకు లక్షలు దగ్గరున్నా అవి చెల్లుబాటు కాకపోవడంతో భగవంతుడా ఏమిటీ శిక్ష, పగవాడికి కూడా ఇలాటి కష్టాలు రాకూడదని కోరుకున్నారు. పూటకోనిబంధన పెద్ద నోట్ల మార్పిడి, డిపాజిట్లపై పూటకో నిబంధన, రోజుకో షరతు విధించడం, బ్యాంకుల్లో సరైన సదుపాయాలు, తగినంత నగదు నిల్వలు లేకపోవడంతో అటు బ్యాంకర్లు ఇటు అన్ని వర్గాల ప్రజలు పడిన ఇక్కట్లు వర్ణనాతీతం. మొదట్లో కేవలం రూ.2 వేల కొత్త నోట్లు మాత్రమే విడుదల చేయడంతో దాన్ని చిల్లర ‘మార్పిడి’ చేసుకునేందుకు పడిన బాధలు అన్నీ ఇన్నీ కావు. రూ.100 నోటు ఒకటి దొరికిందంటే పండుగ చేసుకున్నారు. పెళ్లిళ్లు, చదువులు, శుభకార్యాలకు అవస్థలు పెళ్లిళ్లు, చదువులు, ఆస్పత్రుల్లో రోగులకు డబ్బులు కట్టలేక సతమతమయ్యారు. ఫించన్లకు వృద్ధులు, వికలాంగులు, పెన్షన్‌కు పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లు, వేతనం కోసం ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ వర్గాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు రైతులు, పొట్టకూటి కోసం పేదలు, తోపుడుబండ్లు, చిరువ్యాపారులు, ఇతరత్రా కార్మికులు, కూలీలు...తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండేళ్లు పూర్తవుతున్నా 2016 నవంబర్ 8 తర్వాత పడిన కష్టాలు, కన్నీళ్లు సామాజిక మాధ్యమాల్లో గుర్తుకు చేసుకుంటున్నారు. ప్రజలకు నిద్రలేని రోజులెన్నో పెద్దనోట్ల రద్దు ప్రకటనను ఓసారి గుర్తుకు తెచ్చుకుంటే ప్రజల వెన్నులో వణుకుపుట్టినంత పని అవుతుందని చెప్తారు. కేవలం రూ.100 నోటు కోసం నిద్రాహారాలు మాని బ్యాంకుల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాసిన సందర్భాలూ ఉన్నాయి. అన్ని పనులూ వదిలేసి బ్యాంకులకు పరుగులు తీశారు. అక్కడ పోలీసు పహారా నడుమ రోజంతా నిలబడితేగానీ చేతికి నోట్లు అందని పరిస్థితి.ఏ బ్యాంకుకు వెళ్లినా ‘నోక్యాష్–క్యాష్ నిల్’ బోర్డులు కనిపించాయి. ఏటీఎంలు నిరవధికంగా మూతబడ్డాయి. నోట్ల రద్దు సందర్భంగా ఏమి జరుగుతోందో ఏమి జరగబోతోందో అంతుచిక్కక ప్రజలు దిక్కుతోచని పరిస్థితి అనుభవించారు. పేదలు, సామాన్యులు, రైతులు, చిరు వ్యాపారుల మరీ ఇబ్బందికర జీవితం గడిపారు. -
ఆర్థిక పుటలో ‘ఈ రోజు’ శాశ్వతం
సాక్షి, న్యూఢిల్లీ : మన జీవితంలో చోటుచేసుకునే కొన్ని ముఖ్యమైన సంఘటనలను ఎప్పటికీ మరచిపోలేం. ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం, పిల్లాడు పుట్టడం, ప్రేమించినవారు మరణించడం తదితర సంఘటనలను మరవలేం. అలాగే మన జీవితాలను ప్రభావితం చేసే సామాజంలో లేదా దేశంలో జరిగే సంఘటనలకు కూడా మరచిపోలేం. వాటి గురించి చెప్పమంటే నిన్న మొన్న జరిగినట్లే చెప్పగలం. అలాంటి సంఘటనల్లో ఒకటి దేశంలో పెద్ద నోట్ల రద్దు. సరిగ్గా రెండేళ్ల క్రితం అంటే 2016, నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి దేశానికే పెద్ద షాక్ ఇచ్చారు. దేశంలో రోజు రోజుకు పేరుకుపోతున్న నల్లడబ్బును వెలికి తీయడానికి, నకిలీ కరెన్సీని అరికట్టడానికి, టెర్రరిజాన్ని అణచివేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన లక్ష్యాల్లో ఏ ఒక్క లక్ష్యమైనా నేరవేరిందా? దేశ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి, ఉద్యోగావకాశాలపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపింది? పెద్ద నోట్లను రద్దు చేసిన మరుసటి రోజు నుంచి సామాన్య ప్రజలు ఏటీఎంల ముందు భారీ ఎత్తున క్యూలు కట్టి అష్టకష్టాలు పడ్డారు. రోజుల తరబడి బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు నిలబడినా ప్రయోజనం లేకపోవడంతో అనేక మంది వృద్ధులు, పింఛనుదారులు క్యూలలోనే ప్రాణాలు వదిలారు. అలా దేశవ్యాప్తంగా 150 మందికిపైగా మరణించారు. రైతులు, ముఖ్యంగా కూరగాయ రైతులు, చిల్లర వ్యాపారులు భారీగా నష్టపోయారు. దేశంలో పలు చిన్న ఫ్యాక్టరీలు మూత పడ్డాయి. కార్మికులు రోడ్డున పడ్డారు. చేనేత కార్మికులు ఉపాధినికోల్పోయి వారి వద్ద పనిచేసే కార్మికులు దిక్కులేకుండా పోయారు. నిత్యావసర సరకుల ధరలు పెరిగిపోయి సామాన్యుల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు ఇబ్బందులు పడ్డారు. ఒక్క రియల్ ఎస్టేట్ రంగానికే రెండు లక్షల కోట్ల రూపాయల న ష్టం వాటిల్లింది. పేద, మధ్య తరగతి ఇళ్లలో కొన్ని పెళ్లిళ్లు ఆగిపోగా, కొన్ని పెళ్ళిళ్లు వాయిదా పడ్డాయి. మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన 50 రోజుల్లోనే ప్రతికూల ఫలితాలు రావడం మొదలయ్యాయి. అయినా దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలు ఉంటాయంటూ మోదీ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఏడాది గడిచినా ఒక్క మంచి ఫలితం కనిపించలేదు. మోదీ ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థించుకుంటూనే వచ్చింది. ఈ రోజుకు రెండేళ్లు గడిచాయి. అయినా ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. దేశం మొత్తం కరెన్సీలో 86 శాతం ఉన్న రూ. 500, రూ 1000 నోట్లను రద్దూ చేయడం వల్ల దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు వెనక్కి రావని, అదంతా నల్లడబ్బుగా భారత ప్రభుత్వానికి మిగులుతుందని ప్రభుత్వం భావించింది. రద్దు చేసిన నోట్లలో 99. 30 శాతం వెనక్కి తిరిగి వచ్చాయి. అంటే, 10. 720 కోట్ల రూపాయలు మాత్రమే బ్యాంకుల్లో డిపాజిట్ కాలేదు. పెద్ద నోట్లను మార్చుకునేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడిన నల్లడబ్బు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలే. పెద్ద నోట్ల రద్దు కారణంగా ప్రభుత్వానికి చిక్కిన నల్లడబ్బు మొత్తం 16 వేల కోట్లే. కొత్త నోట్లను ముద్రించడానికి అయిన ఖర్చు 7,965 కోట్ల రూపాయలు. పట్టబడిన నల్ల డబ్బును లాభం అనుకుంటే అందులో నుంచి నోట్ల ముద్రణకు అయిన ఖర్చును తీసివేస్తే మిగిలేది 8, 035 కోట్ల రూపాయలు. పెద్ద నోట్ల రద్దు చేసిన సంవత్సరంలో పట్టుబడిన నకిలీ కరెన్సీ 7.6 లక్షల రూపాయలు. అంతకుముందు పట్టుబడిన నకిలీ కరెన్సీ 6.3 లక్షల రూపాయలు. స్థూల జాతీయోత్పత్తి వృద్థి రేటు అంతకుముందు 7.1 శాతం ఉంటే పెద్ద నోట్ల రద్దు కారణంగా అది 5. 7 శాతానికి పడిపోయింది. పడిపోయిన వృద్ధి రేటును దాచి పెట్టేందుకు 2017వ ఆర్థిక సంవత్సరం నుంచి మోదీ ప్రభుత్వం వృద్ధి రేటును లెక్కించేందుకు కొత్త పద్ధతిని ప్రవేశ పెట్టింది. కొత్త పద్ధతి ప్రకారం 2018లో వృద్ధి రేటును 7.3గా చూపింది. కొత్త పద్ధతిని ప్రవేశపెట్టినప్పుడు ఐదేళ్ల క్రితం వృద్ధి రేటు ఎంత ఉన్నదో కొత్త పద్ధతి ప్రకారం లెక్కించి తప్పనిసరిగా చూపించాలన్నది ఆర్థిక నియమం. ఈ నియమం ప్రకారం యూపీఏ ప్రభుత్వం హయాంలో వృద్ధి రేటు 10.5 శాతమని తేలింది. కేంద్ర ప్రభుత్వం స్టాటటిక్స్ వెబ్సైట్లో ఈ శాతాన్ని తొలుత చూపినా కొన్ని రోజులకే మాయమయింది. అయినప్పటికి రెండేళ్ల క్రితం పెద్ద నోట్లను రద్దు చూస్తూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, సముచితం సాహసోపేతమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు సమర్థించుకున్నారు. సాహసోపేతం కావచ్చుగానీ సముచితం ఎలా అవుతుందో ఆయనకు, ఆయన ప్రభుత్వానికే తెలియాలి. ఆర్థిక చరిత్ర పుటలో ఈ రోజు ఎప్పటికి నిలిచి పోతుందనడంలో సందేహం లేదు. ‘కొన్ని గాయాలు కాలంతోపాటు మానిపోతుంటాయి. కాన్ని పెద్ద నోట్ల రద్దు చేసిన గాయాలు మానకపోగా, కాలంతోపాటు అవి మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. కులం, మతం, ప్రాంతం, చిన్న, పెద్దా, ముసలి, ముతక, ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని గాయపర్చింది పెద్ద నోట్ల రద్దు’ అంటూ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు గమనార్హం. -
దేశ ప్రజలపై మోదీ సర్జికల్ స్ట్రైక్స్: జిగ్నేష్
గాంధీనగర్ : ప్రధాని నరేంద్ర మోదీపై దళిత ఉద్యమ నేత గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని విమర్శల వర్షం కురిపించారు. 125 కోట్ల దేశ ప్రజలపై ప్రాణాంతకమైన సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. 2016 నవంబర్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత జవాన్లు జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించిన వీడియోలను పలు ఛానల్స్ ఇటీవల ప్రసారం చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మేవాని మంగళవారం గుజరాత్‌లోని తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం వాద్గామ్‌లో మీడియాతో మాట్లాడారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ), పెద్ద నోట్ల రద్దుతో దేశ ప్రజలపై మోదీ సర్జికల్ స్ట్రైక్స్ చేశారని విమర్శించారు. అధికారంలోకి రాగానే రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పిన మోదీ ఒక్కరికి కూడా ఉద్యోగాన్ని ఇవ్వకుండా దేశ యువతపై సర్జికల్ దాడులు చేశారని వ్యాఖ్యానించారు. దేశంలోని రైతుల ఆదాయాన్ని రెండితలు చేస్తామన్న మోదీ ఆ హామీ గాలికొదిలేశారని మండిపడ్డారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన మేవాని.. వాద్గామ్ నియోజకవర్గం నుంచి గెలిచిన విషయం తెలిసిందే. -
రూ.2000 నోటు లాజిక్ నాకు తెలియదు
సాక్షి, కోల్‌కతా : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పట్టణ మేధోవర్గాన్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి అన్నారు. అయితే, గ్రామీణ పౌర సమాజం మాత్రం పెద్ద మొత్తంలో ఈ నిర్ణయాన్ని స్వాగతించిందని చెప్పారు. అయితే, అప్పటికప్పుడు రూ.500 నోట్లను రద్దు చేసిన కేంద్రం వెంటనే అంతకంటే పెద్దదైన రూ.2000 నోటును ఎందుకు తీసుకొచ్చిందోనని, ఆ లాజిక్ తనకు ఇప్పటికీ అర్ధం కాలేదని చెప్పారు. బుధవారం ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో విద్యార్థులతో మమేకమైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'నేను ఆర్థికశాస్త్రంలో పెద్ద నిపుణుడిని కాదు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పట్టణ మేథావులను పెద్దగా ఆకర్షించలేదు.. కానీ, గ్రామాల్లోని భారతీయులు మాత్రం బాగా స్వాగతించారు. పెద్ద నోట్ల నిర్ణయం ఎందుకు తీసుకొచ్చారో నాకు ఇప్పటకీ తెలియదు. నేను పెద్దగా నిపుణుడిని కానప్పటికీ ఒక సామాన్యుడిగా ఆలోచించినప్పుడు కొన్ని కారణాల రీత్యా రూ.500 నోట్లు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం అంతే వేగంగా అంతకంటే పెద్దవైన రూ.2000 నోట్లను ఎందుకు తీసుకొచ్చిందో అన్న లాజిక్ నాకు ఇప్పటికీ అర్ధం కాలేదు. ఇలా ఎందుకు చేశారో నిపుణులు మాత్రమే సమాధానం చెప్పగలరు.. ఈ విషయం నిపుణులనే మీరు కూడా అడగండి. 1950 నుంచి జపాన్, చైనా మాదిరిగా భారత ఐటీ కంపెనీలు స్వల్పశ్రేణి తయారీరంగంపై దృష్టిపెట్టలేదు. మన దురదృష్టం కొద్ది దేశంలో 75శాతం చిన్నారులు స్కూల్‌కు వెళుతున్న వారిలో 8వ తరగతి చేరకముందే స్కూల్ మానేస్తున్నారు. వీరు 22 ఏళ్లకు చేరుకునే సరికి వారికి ఓ ఉపాధి కావాలి. వారికి స్వల్పశ్రేణి తయారీరంగంలోనే అది లభిస్తుంది. భారత్‌లో ఆ రంగం పెద్దగా అభివృద్ధి చెందలేదు. భారత ఆర్థికవేత్తలు ఈ అంశంపై దృష్టి సారించాలి' అని నారాయణమూర్తి తెలిపారు. -
రాహుల్ వాదనకు కమల్ సమర్థన
సాక్షి, చెన్నై : నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలను పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నటుడు కమల్ హాసన్ తప్పుపట్టారు. నోట్ల రద్దును అమలు చేసి ఉండాల్సింది కాదన్న రాహుల్ నిర్ణయాన్ని తాను కొంతవరకూ సమర్ధిస్తానని చెప్పుకొచ్చారు. తమిళనాడు రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం మక్కల్ నీది మయ్యం పేరిట రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన కమల్ నోట్ల రద్దుపై రాహుల్ ప్రకటనను స్వాగతించారు. మరోవైపు తనకు క్రిస్టియన్ మిషనరీల నుంచి నిధులు అందుతున్నాయన్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. తనకు మిషనరీల నుంచి నిధులు వస్తున్నాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, ఈ వాదన హాస్యాస్పదమని కమల్ అన్నారు. దేశంలో మహిళల పరిస్థితి దారుణంగా ఉందని, ఇది అవమానకరమని అభివర్ణించారు. కాగా, ‘తాను ప్రధాని అయితే ఎవరైనా నోట్ల రద్దు ఫైలును తనముందు ఉంచితే దాన్ని చెత్తబుట్టలో వేసేవాడి’నని మలేషియాలో భారత సంతతిని ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నోట్ల రద్దు నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకు తీవ్ర విఘాతం వాటిల్లిందని అన్నారు. -
నోట్ల రద్దు ఐడియా ఆర్ఎస్ఎస్దే..
సాక్షి, బళ్లారి: దేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలను తన గుప్పిట పెట్టుకోవాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. ఇప్పటికే ప్రతి మంత్రిత్వ శాఖలోనూ ఆరెస్సెస్ నుంచి ఓ ప్రత్యేకాధికారి (ఓఎస్డీ) ఉన్నారని అన్నారు. ఏ మంత్రీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం లేదనీ, నోట్లరద్దు ఆరెస్సెస్‌కు చెంది ఉన్న ఓ వ్యక్తి సలహా మేరకే జరిగిందని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థను సరళీకరిస్తామని హామీనిచ్చారు. రాహుల్ కర్ణాటకలో తన నాలుగు రోజుల జనాశీర్వాద యాత్రను మంగళవారం బీదర్‌లో ముగించారు. గుల్బర్గాలో వ్యాపారులు, రైతులతో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ జీఎస్టీని ముందు ప్రయోగాత్మకంగా అమలు చేసి లోపాలు తెలుసుకోవాలన్న కాంగ్రెస్ సూచనను సైతం బీజేపీ పట్టించుకోలేదన్నారు. భారత్ ఏకాకి అవుతోంది.. మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం వల్ల దక్షిణాసియా ప్రాంతంలో భారత్ ఏకాకిగా మిగులుతోందని రాహుల్ హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం తన వైఖరితో భారత విదేశాంగ విధానంలో ఇబ్బందులు సృష్టిస్తోందని ఆరోపించారు. పాక్, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, మయన్మార్ తదితరాల్లో చైనా ప్రాబల్యాన్ని పెంచుకుంటుండగా, ఆయా దేశాలతో భారత్ బంధం బలహీనపడుతోందని రాహుల్ విశ్లేషించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘నేను లక్షల మందిని కలిసి మాట్లాడాను. కాంగ్రెస్‌కు మంచి వాతావరణం ఉంది’ అని చెప్పారు. -
పెద్ద మొత్తంలో డిపాజిట్ చేశారా? అయితే...
సాక్షి, న్యూఢిల్లీ : పాత నోట్ల రద్దు తర్వాత డిపాజిట్ చేసిన పెద్ద మొత్తాల నగదుపై ఆదాయపు పన్ను శాఖ మరోసారి హెచ్చరికలు జారీచేసింది. నోట్ల రద్దు తర్వాత డిపాజిట్ చేసిన ఈ మొత్తాలతో మార్చి 31 వరకు రిటర్నులు దాఖలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ రిటర్నులు దాఖలు చేయకపోతే, జరిమానాలు, న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అర్హులైన ట్రస్ట్‌లు, రాజకీయ పార్టీలు, అసోసియేషన్లు ఈ తుది డెడ్‌లైన్ వరకు ఆదాయపు పన్ను రిటర్నలు దాఖలు చేసి, క్లీన్‌చీట్ పొందాలని పేర్కొంది. ప్రముఖ దినపత్రికల్లో ప్రజా ప్రకటనల ద్వారా ఆదాయపు పన్ను శాఖ ఈ ఆదేశాలను జారీచేసింది. 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాలకు గాను ఐటీఆర్‌లను సమీక్షించుకోవడానికి, పెండింగ్‌లో ఉన్న రిటర్నులు దాఖలు చేయడానికి ఇదే తుది ఆదేశంగా పేర్కొంది. ఒకవేళ మీరు బ్యాంకు అకౌంట్లో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేస్తే.. ఐటీఆర్‌లను ఫైల్ చేయాలని, లేదంటే పెనాల్టీ ఎదుర్కోవాల్సి వస్తుందని పబ్లిక్ అడ్వయిజరీ కూడా హెచ్చరించింది. అన్ని కంపెనీలు, సంస్థలు, బాధ్యతాయుత భాగస్వామ్య సంస్థలు, ట్రస్టులు, అసోసియేషన్లు, రాజకీయ పార్టీలు ఎవరూ కూడా దీనికి మినహాయింపు కాదని, అందరికీ ఇది వర్తిస్తుందని తెలిపింది. రూ.2.5 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో ఆదాయమున్న వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు, రూ.3 లక్షలకు పైన, రూ.5 లక్షలకు పైన ఉన్నఆదాయమున్న సీనియర్ సిటిజన్లందరూ ఈ ఆర్థిక సంవత్సరాలకు గాను రిటర్నులు దాఖలు చేయాలని ప్రకటించింది. -
నష్టాలను బడ్జెట్ తీరుస్తుందా?
సాక్షి, అమరావతి : ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌పై చిన్న, మధ్యతరహా పరిశ్రమలు భారీ ఆశలను పెట్టుకున్నాయి. రెండేళ్ల నుంచి తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఈ రంగాన్ని గాడిలో పెట్టే విధంగా రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటిస్తారని అంచనా వేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీలతో దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా 3.60 కోట్ల యూనిట్లు ఉండగా వీటిపై ఆధారపడి 12 కోట్ల మంది జీవనం సాగిస్తున్నారు. అంతేకాదు దేశీయ తయారీరంగంలో మూడోవంతు, ఎగుమతుల్లో 45 శాతం ఈ రంగం నుంచే ఉన్నాయి. ఇలాంటి అత్యంత కీలకమైన రంగం వరుసదెబ్బలతో కునారిల్లుతోంది. దీంతో ఈ రంగాన్ని ఆదుకునే విధంగా పలు ప్రోత్సాహకాలను అరుణ్ జైట్లీ ఈ బడ్జెట్లో ప్రకటిస్తారా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కార్పొరేట్ ట్యాక్స్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌తో పాటు వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిని పెంచుతారని అంచనా వేస్తున్నట్లు ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ (విజయవాడ చాప్టర్) ప్రెసిడెంట్ ఎం.రాజయ్య 'సాక్షి' కి తెలిపారు. జీఎస్టీలో రిటర్నులు దాఖలు అనేది చిన్న వ్యాపారులకు చాలా ఇబ్బందిగా మారిందని, దీన్ని మరింత సులభతరం చేయాలని చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన వ్యాపారి శబరీనాథ్ కోరారు. సినిమా టికెట్ ధరతో సంబంధం లేకుండా 18 శాతం ఏక పన్ను రేటును అమలు చేయాలని ఏపీ థియేటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముత్తవరవు శ్రీనివాసు తెలిపారు. టీవీలు, ఫ్రిజ్‌లు వంటి కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌పై 28 శాతం పన్ను విధించడంతో అమ్మకాలు తగ్గాయని సోనోవిజన్ మేనేజింగ్ పార్టనర్ భాస్కరమూర్తి తెలిపారు. నోట్ల రద్దు, జీఎస్టీ చిరు వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపించింది. చాలా మంది సీజన్ వ్యాపారులు వివిధ షాపుల్లో గుమస్తాలుగా చేరిపోయారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌పైనే ఆశలు పెట్టుకున్నాం. గుంటూరు ఆంజనేయులు, చిరు వ్యాపారి, ఏలూరు ఎగుమతుల ద్వారా ఆదాయం పెరగాలంటే 2005 ఎస్ఈజెడ్ పాలసీని అమలు చేయాలి. ఆ పాలసీ ప్రకారం ఆదాయ పన్ను నుంచి మినహాయింపునిస్తున్నట్టు ప్రకటించారు. కానీ ప్రస్తుతం మినిమన్ ఆల్ట్రనేటివ్ ట్యాక్స్ పేరుతో 18.5శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. లాభాలను డివిడెండ్లుగా ప్రకటించడానికి కంపెనీ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్‌ని కంపెనీలు భరించాల్సి వస్తుండడంతో భారం పడుతుంది. వినయ్‌శర్మ, ఏడబ్ల్యూస్ ఇండియా చైర్మన్, వీఎస్ఈజెడ్ -
ఆ రెండింటితో నగరాల రియాల్టీ ర్యాంకింగ్స్ ఢమాల్
ముంబై : కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన జీఎస్టీ, గతేడాది ప్రకటించిన నోట్ల రద్దు రియల్ ఎస్టేట్ రంగాన్ని బాగానే దెబ్బకొట్టాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కేవలం లిక్విడిటీ సమస్యలను సృష్టించడం మాత్రమే కాక, నగరాల రియాల్టీ ర్యాంకింగ్స్‌ను పడగొట్టాయి. రియల్ ఎస్టేట్ పరంగాల నగరాల్లో పెట్టుబడులు, అభివృద్ధి క్షీణించాయని రిపోర్టు వెల్లడించింది. అర్బన్ ల్యాండ్ ఇన్స్టిట్యూట్, కన్సల్టెన్సీ పీడబ్ల్యూసీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తెలిసింది. 600 మంది రియాల్టీ నిపుణుల అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ రియల్ ఎస్టేట్-ఆసియా పసిఫిక్ 2018 టైటిల్‌తో రిపోర్టును రూపొందించింది. ఈ రిపోర్టులో 2018లో పెట్టుబడుల గమ్యస్థానంగా ఎక్కువ ఇష్టపడే జాబితాలో ముంబై నగరం 12వ స్థానంతో సరిపెట్టుకుంది. గతేడాది ఈ నగరం రెండో స్థానంలో ఉండేది. అభివృద్ధి అవకాశాల్లో ఇది 8వ స్థానాన్ని సంపాదించుకుంది. అదేవిధంగా పెట్టుబడుల గమ్యస్థానంగా ఎక్కువ ఇష్టపడే జాబితాలో బెంగళూరు, న్యూఢిల్లీ నగరాలు 15వ, 20వ స్థానాలను దక్కించుకున్నాయి. గతేడాది ఇవి 1, 13వ స్థానాల్లో ఉన్నాయి. అదేవిధంగా అభివృద్ధి అవకాశాల్లోనూ ఈ నగరాల స్థానాలు పడిపోయాయి. డిమానిటైజేషన్, జీఎస్టీ సంస్కరణలు నగరాల పెట్టుబడుల్లో, అభివృద్ది అంశాల్లో ప్రభావం చూపాయని పేర్కొంది. -
భారీగా బంగారం, నగదు పట్టుబడింది
నోట్ల రద్దు అనంతరం విమానశ్రయాల్లో భారీగా నగదు, బంగారం పట్టుబడింది. దేశవ్యాప్తంగా ఉన్న విమానశ్రయాల్లో సీఐఎస్ఎఫ్ చేసిన తనిఖీల్లో డిమానిటైజేషన్ కాలం నుంచి ఇప్పటి వరకు రూ.87 కోట్లకు పైగా నగదు, రూ.2600 కేజీల బంగారం, ఇతర విలువైన మెటల్స్ పట్టుబడినట్టు తాజా డేటాలో వెల్లడైంది. గతేడాది నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత పెద్ద ఎత్తున్న నగదు, బంగారం తరలిపోవచ్చని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో దేశంలో నగదు, బంగారం ఎక్కడికీ తరలిపోకుండా విమానాశ్రయాల్లో తనిఖీలు చేపట్టాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సీఐఎస్ఎఫ్ను ఆదేశించింది. ఎలాంటి అనుమానిత నగదు, ఇతర విలువైన వస్తువులున్న వెంటనే స్వాధీనంలోకి తీసుకోవాలని అలర్ట్ చేసింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న 56 సివిల్ ఎయిర్‌పోర్టుల్లో సీఐఎస్ఎఫ్ డేగా కన్ను మాదిరి తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో 2016 నవంబర్ 8 నుంచి 2017 నవంబర్ 7 వరకు రూ.87.17 కోట్ల అనుమానిత నగదును, రూ.1,419.5 కేజీల బంగారాన్ని, 572.63 కేజీల వెండిని గుర్తించినట్టు సీఐఎస్ఎఫ్ డేటా తెలిపింది. దీనిలో ఎక్కువగా ముంబై ఎయిర్‌పోర్టులో రూ.33 కోట్లకు పైగా అనుమానిత నగదును గుర్తించినట్టు పేర్కొంది. ఎక్కువ మొత్తంలో బంగారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషన్ ఎయిరపోర్టులో దొరికినట్టు డేటా వెల్లడించింది. 266 కేజీలకు పైగా వెండిని జైపూర్ ఎయిర్‌పోర్టులో స్వాధీనం చేసుకున్నట్టు సీఐఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. చట్టం ప్రకారం తదుపరి విచారణ కోసం ఈ మొత్తాలన్నింటిన్నీ ఆదాయపు పన్ను శాఖకు అప్పగించామని సీఐఎస్ఎఫ్ అధికార ప్రతినిధి చెప్పారు. సీఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్. ఎయిర్‌పోర్టుల్లో వీరు తమ సేవలను అందిస్తూ ఉంటారు. -
నోట్లరద్దుతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు
నల్లగొండ టూటౌన్ : ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నోట్లరద్దు నిర్ణయంతో ప్రజలకు ఒరిగిందేమి లేదని పీసీసీ ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి ఎంఆర్.వినోద్‌రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నోట్లను రద్దు చేసి సంవత్సరం అయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బ్లాక్‌డేగా పాటించి నల్లగొండలోని క్లాక్‌టవర్ సెంటర్ నుంచి ప్రకాశంబజారు మీదుగా కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. ప్రధానిమోదీ గత ఎన్నికల సమయంలో దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరవైఫల్యం పొందారన్నారు.నోట్ల రద్దు వలన దేశ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా అతలాకుతలం అయ్యిం దన్నారు. అనంతరం ప లు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఆర్వో ఖిమ్యానాయక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుంభం కృష్ణారెడ్డి, గుమ్ముల మోహన్‌రెడ్డి,పాశం సంపత్‌రెడ్డి, బొడ్డుపల్లి శ్రీనివాస్, కటికం సత్తయ్యగౌడ్, పెరిక వెంకటేశ్వర్లు, సంకు ధనలక్ష్మి, శంకర్‌నాయక్, జూకూరు రమేష్, వంగూరు లక్ష్మయ్య, అల్లి సుభాష్, మందడి శ్రీనివాస్‌రెడ్డి, లతీఫ్, సమి, సట్టు శంకర్, కిన్నెర అంజి, ఊట్కూరు వెంకట్‌రెడ్డి, జాజుల లింగయ్య, పెరిక హరిప్రసాద్, పిల్లి రమేష్, వెంకన్న పాల్గొన్నారు. చీకటి రోజు : సీపీఎం నల్లగొండ టౌన్: పెద్దనోట్లు రద్దు భారతదేశానికి చీకటి రోజని సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, పల్లా నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం వామపక్షాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ విగ్రహం నుంచి గడియారం సెంటర్ వరకు నిరసన ప్రదర్శనను నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగదు రహిత సమాజాన్ని నిర్మిస్తామని చెప్పుకుంటున్న మోదీ బ్యాంకు చార్జీల పేరుతో వినియోగదారులపై భారం మోపుతున్నారని విమర్శించారు. నల్లధనాన్ని దేశానికి తీసుకువచ్చే వరకు ప్రజలు నిర్మాణాత్మకమైన పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు ఎండీ సలీం, వి.నారాయణరెడ్డి, పాలడుగు నాగార్జున, సీహెచ్ లక్ష్మినారాయణ, పి.నర్సిరెడ్డి, ఎం.ప్రభావతి, దండెంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, సరోజ, పల్లా దేవెందర్‌రెడ్డి, కలకొండ కాంతయ్య, జినుకుంట్ల సోమయ్య, గంజి మురళీధర్, నలపరాజు సైదులు కోట్ల అశోక్‌రెడ్డి, మహేష్ పాల్గొన్నారు. -
‘నోట్ల రద్దుతో స్వాతంత్ర్యం కోల్పోయాం’
సాక్షి,చెన్నై: నోట్ల రద్దుకు ఏడాది పూర్తయిన క్రమంలో ఈ నిర్ణయంపై డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. నవంబర్ 8 భారత్‌కు బ్లాక్‌డే అని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుతో 1947లో మనం సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని కోల్పోయామన్నారు. ముందస్తు సన్నాహాలు చేపట్టకుండా తొందరపాటు నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ నోట్ల రద్దుతో చోటుచేసుకున్న మరణాలకు బాధ్యత వహించాలన్నారు. నల్లధనాన్ని నిర్మూలించలేని నోట్ల రద్దు ప్రజలందరి జీవితాల్లో విషాదం నింపిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్రహ్మణ్య స్వామి, యశ్వంత్ సిన్హా వంటి బీజేపీ సీనియర్ నేతలే నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుపట్టారన్నారు. నోట్ల రద్దుతో నల్లధనానికి చెక్ పెట్టవచ్చని, నకిలీ నోట్లను అరికట్టవచ్చని, ఉగ్రనిధులకు అడ్డుకట్ట వేయవచ్చని పాలకులు చెప్పినా ఇవేమీ నెరవేరలేదని ఆరోపించారు. ఇక డీఎంకే చీఫ్ కరుణానిధితో ప్రధాని సమావేశం మర్యాదపూర్వకంగా జరిగిందని, దీని వెనుక రాజకీయ అంశాలేమీ లేవని స్టాలిన్ స్పష్టం చేశారు. -
వ్యాపారాలు, ఉద్యోగాలను దెబ్బతీయడం నైతికమా..?
సాక్షి,న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయంపై మోదీ సర్కార్ తీరును మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం తీవ్రంగా తప్పుపట్టారు. నోట్ల రద్దుతో వ్యాపారాలు మూతపడి, లక్షలాది ఉద్యోగాలు కోల్పోతే అది మంచి నిర్ణయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఏడాది కిందట ప్రభుత్వం ప్రకటించిన పెద్ద నోట్ల రద్దును వరుస ట్వీట్లలో చిదంబరం విమర్శించారు. నోట్ల రద్దు నైతిక చర్యని ఆర్థిక మంత్రి సమర్ధించుకుంటున్నారని కోట్లాది మంది ప్రజలను కష్టాల్లోకి నెట్టారని, 15 కోట్ల మంది రోజువారీ కార్మికులకు చుక్కలు చూపించారని నోట్ల రద్దు పర్యవసానాలపై ఆయన విరుచుకుపడ్డారు. జనవరి-ఏప్రిల్ 2017 మధ్య 15 లక్షల ఉద్యోగాలను ఊడగొట్టడం నైతికమా అంటూ చిదంబరం కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు. వేలాది చిన్న మధ్యతరహా పరిశ్రమలు మూతపడటం, సూరత్, భివాండి, మొరదాబాద్, ఆగ్రా, లూథియానా, తిరుపూర్ వంటి పారిశ్రామిక హబ్‌లను విచ్ఛిన్నం చేయడం నైతికమా అని ట్వీట్ చేశారు. నోట్ల రద్దుతో నల్లధనాన్ని సులభంగా తెల్లధనంగా మార్చుకునే మార్గాన్ని ప్రభుత్వం కనిపెట్టలేదా అని నిలదీశారు. నోట్ల రద్దును నైతిక చర్యగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభివర్ణించడం పట్ల చిదంబరం వరుస ట్వీట్లతో కౌంటర్ ఇచ్చారు. ప్రజల చేతిలో ఉన్న నగదు త్వరలోనే నోట్ల రద్దు ప్రకటించిన నవంబర్ 2016 స్థాయిలకు చేరుతుందని చిదంబరం వ్యాఖ్యానించారు. చెలామణిలో ఉన్న నగదు రూ 15 లక్షల కోట్లు దాటి పెరుగుతున్న క్రమంలో త్వరలోనే అది సాధారణ స్థాయైన రూ 17 లక్షల కోట్లకు చేరుతుందని అన్నారు. ఎంత నగదు వ్యవస్థలో ఉండాలన్నది ఆర్బీఐ నిర్ణయమని, నగదు చెలామణిని కృత్రిమంగా తగ్గిస్తే అది డిమాండ్ తగ్గుదలకు, వృద్ధి తరుగుదలకు దారితీస్తుందని చిదంబరం హెచ్చరించారు. నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధించి ఆర్బీఐ బోర్డు అజెండా, బ్యాక్‌గ్రౌండ్ నోట్, అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నోట్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
క్యాష్‌లెస్ 30 శాతమే !
మోర్తాడ్(బాల్కొండ) /నిజామాబాద్‌అర్బన్: జిల్లాలోని 25 ఎస్బీఐ శాఖలను క్యాష్‌లెస్ బ్యాంకింగ్ కోసం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. అందులో మోర్తాడ్ మండలంలోని సుంకెట్, తిమ్మాపూర్, కమ్మర్పల్లి మండలంలోని చౌట్పల్లి, కిసాన్‌నగర్, తొర్లికొండ ఎస్బీఐ శాఖలతో పాటు మరో 20 ఎస్బీఐ శాఖలు ఉన్నాయి. ఈ బ్యాంకుల పరిధిలో క్యాష్‌ను అసలే వినియోగించకూడదని పూర్తిగా డిజిటల్ లావాదేవీలనే నిర్వహించాలని ఉన్నతాధికారులు సూచించారు. బ్యాంకు శాఖ పరిధిలోని వ్యాపారులకు స్వైప్ యంత్రాలను అందించి క్యాష్‌లెస్ లావాదేవీలను నిర్వహించేలా చూడాలని సూచించారు. కాని స్వైప్ యంత్రాలను ఆశించిన విధంగా సరఫరా చేయకపోవడంతో నగదు రహితం నామమాత్రమే అయ్యింది. కాగా గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతం క్యాష్‌లెస్ లావాదేవీలను నిర్వహించడం ఆహ్వానించదగ్గ విషయం అని బ్యాంకర్లు చెబుతున్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంతో బ్యాంకుల్లో కాగితాలతో పని లేకుండా పోయిందని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా నగదు కొరత వల్ల బ్యాంకుల్లో తక్కువ మొత్తంలో డ్రా చేసుకోవడానికే అధికారులు అనుమతి ఇస్తున్నారు. ప్రజలు మాత్రం తమకు అవసరమైన నగదును డ్రా చేసుకోవడానికి రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మరోవైపు పెద్ద నోట్లు రద్దయి ఏడాది పూర్తియినా ప్రజలకు ఇంకా నోట్ల కష్టాలు తప్పలేదు. జిల్లాలో 268 బ్యాంకులు ఉన్నాయి. ఇందులో 33 ప్రెయివేటు బ్యాంకులు ఉన్నాయి. 245 ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయి. ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉండకపోవడం తరచుగా తలెత్తుతున్న సమస్య. ప్రస్తుతం ఏటీఎంలలో రెండువేల నోట్లు కొన్నిసార్లు మాత్రమే అందుబాటులోకి వస్తున్నాయి. ఏటీఎంలలో ఐదు వందల నోట్లు అందుబాటులో ఉంచుతున్నారు. వరుసగా సెలవులు వస్తే, పండుగల సందర్భాలలో ఏటీఎంలలో డబ్బులు అందుబాటులో ఉండటం లేదు. కొన్ని ప్రాంతాలలో ఏటీఎంలు నోట్ల రద్దు తర్వాత పని చేయడం లేదు. నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ కొత్తగా రూ.200, రూ. 50 కొత్త నోట్లు తీసుకువచ్చింది. మొదట్లో స్వైపింగ్ యంత్రాల హడావుడి సాగినా.. ప్రస్తుతం నగదు రహిత లావాదేవీలు తగ్గిపోయాయి. కొద్ది మంది మాత్రమే కొన్ని చోట్ల స్వైపింగ్ విధానాన్ని కొనసాగిస్తున్నారు. నగదురహిత లావాదేవీల కోసం ప్రభుత్వ అవగాహన కార్యక్రమాలు అంతగా ప్రయోజనాన్ని ఇవ్వలేదు. పట్టణ ప్రాంతాల్లో సైతం నగదురహిత లావాదేవీలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. స్వైపింగ్యంత్రాల ద్వారా కొనుగోలు చేస్తే వినియోగదారుడికే పన్నుభారం పడటంతో కొనుగోలు చేపట్టడం లేదు. సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని ఉగ్రవాయి గ్రామంలో 409 కుటుంబాలు ఉండగా మొత్తం జనాభా 1374 ఉన్నారు. పిల్లలుపోను మిగతా 1,156 మందికి బ్యాంకు ఖాతాలు ఇచ్చారు. కామారెడ్డి పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు, స్టేట్‌బ్యాంక్‌లలో వారి ఖాతాలు ఉన్నాయి. నగదు రహిత లావాదేవీల గురించి గ్రామంలో పలుమార్లు సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. గ్రామంలో కిరాణ దుకాణాలు, మెడికల్ షాప్, హోటళ్లు, కల్లు దుకాణాలు.. ఇలా మొత్తంగా 17 మంది వద్ద స్వైప్ మిషన్లు ఏర్పాటు చేయడానికి అధికారులు బ్యాంకర్లకు ప్రతిపాదనలు పంపించారు. అయితే కిరాణ దుకాణం నిర్వహించే రాచర్ల చంద్రం, హోటల్ నిర్వాహకుడు చంద్రాగౌడ్, రేషన్ డీలర్ లావణ్య, గ్రామ పంచాయతి, వాటర్ ప్లాంట్ నిర్వాహకులు మాత్రమే స్వైపింగ్ మిషన్లు తీసుకున్నారు. గ్రామంలో చాలా మంది క్యాష్‌లెస్ ట్రాన్జాక్షన్స్కు దూరంగా ఉన్నారు. చదువురాదని కొంద రు, ఖాతాలో సొమ్ము దాచుకునే స్థోమత లేక ఇంకొందరు.. పాతపద్ధతిలోనే లావాదేవీలు జ రిపారు. 70 నుంచి 80 మంది మాత్రం నూతన విధానాన్ని అనుసరించారు. ఏటీఎం కార్డులతో లావాదేవీలు జరిపారు. రెండు మూడు నెలలు క్యాష్‌లెస్ లావాదేవీలు జరిగాయి. అయితే కొత్తనోట్ల చలామణి పెరగడంతో నగదు కష్టాలు తగ్గాయి. దీంతో ప్రజలు క్రమంగా క్యాష్‌లెస్ ట్రాన్జాక్షన్స్కు దూరమయ్యారు. -
అదే మధనం
నెల్లూరు (సెంట్రల్): నోట్ల కష్టాలు మొదలై ఏడాదైంది. 2016 నవంబర్ 8వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో రూ.ఐదొందలు, రూ.వెయ్యి నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన వెలువడిన విషయం విదితమే. దాంతో ప్రజల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఆ రోజు రాత్రి నుంచి ఏటీఎంలు మూతపడ్డాయి. పాత నోట్లను మార్చుకునేందుకు ప్రజలు రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అన్నపానీ యాలు మానేసి పడిగాపులు పడాల్సిన దుస్థితి దాపురించింది. కష్టం ఫలించి రూ.2 వేల నోట్లు చేతికందినా చిల్లర దొరక్క అవస్థలు పడ్డారు. జీతం సొమ్ము బ్యాంక్ ఖాతాలో ఉన్నా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. పింఛను సొమ్ముల కోసం వృద్ధులు అష్టకష్టాలు పడ్డారు. రూ.500 కొత్త నోట్ల విడుదలలో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. అలా మొదలైన కష్టాలు కనీసం 50 రోజులపాటు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. ఆ తరువాత క్రమంగా ఇబ్బందులు తగ్గుతూ వచ్చినా.. పూర్తిగా వీడలేదు. నేటికీ చిల్లర నోట్ల కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. చాలా ఏటీఎంలు నేటికీ దిష్టి బొమ్మల్లానే కనిపిస్తున్నాయి. నలధనం నిర్మూలన, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ప్రకటించడంతో ప్రజలు కష్టనష్టాలను భరిస్తూ వచ్చారు. కానీ.. పెద్దనోట్ల రద్దు నిర్ణయం చేసిన గాయం ఇంకా మానలేదు. రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికీ కోలుకోలేదు. ఆస్తులు అమ్మేవారు ఉన్నా కొనేవారు ముందుకు రాకపోవడంతో ఈ వ్యాపారం కుప్పకూలింది. రూ.2 వేలు, రూ.500 నోట్లు మార్చుకునేందుకు కూలీలు, సామాన్యులు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చిల్లర నోట్ల సమస్య తీర్చేం దుకు రూ.200, రూ.50 కొత్త నోట్లను విడుదల చేసినా ప్రజలకు ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం పాత 100 నోట్లు, పాత 50 నోట్లు మాత్రమే దిక్కయ్యాయి. లక్ష్యం ఏమైంది! నగదు రహిత లావాదేవీలు నిర్వహిం చడం ద్వారా ప్రజల కష్టాలు తీరుస్తామని.. కరెన్సీ నోట్ల నుంచి విముక్తి కల్పిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున ప్రచారం చేపట్టాయి. నెల్లూరు జిల్లాలో డిజిధన్ లాంటి మేళాలు సైతం నిర్వహించారు. నగదు రహిత లావాదేవీలు జరిపిన వారికి పెద్దఎత్తున బహుమతులు ఇస్తామని జిల్లా ఉన్నతాధికారులు ప్రకటించారు కూడా. కొన్ని రోజులకే అందరూ ఆ విషయాన్ని గాలికొదిలేశారు. 90 శాతం ఆర్థిక లావాదేవీలు కరెన్సీ నోట్ల ఆధారంగానే సాగుతున్నాయి. పెద్దనోట్ల రద్దు తరువాత వ్యాపారులంతా స్వైపింగ్ యంత్రాల ఆధారంగా లావాదేవీలు జరపాలని ఆదేశాలొచ్చాయి. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లంటూ ఆర్బాటం చేశారు. అయితే, స్వైపింగ్ మెషిన్ల పంపిణీలో వెనుకబడ్డారు. జిల్లాలో సుమారు 6 వేల మంది వ్యాపారుల నుంచి స్వైపింగ్ మెషిన్ల కోసం దరఖాస్తులు అందగా.. కేవలం 2,804 మెషిన్లను అందుబాటులోకి తెచ్చి చేతులెత్తేశారు. నగదు రహిత గ్రామాలపై దృష్టి ఏదీ జిల్లాలో కొన్ని గ్రామాలను నగదు రహితంగా మారుస్తామని ప్రకటిం చారు. ఇప్పటికీ ఒక్క గ్రామాన్ని కూడా అలా తీర్చిదిద్దలేకపోయారు. చివరకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన రైల్వేలోనూ 10 శాతం కూడా నగదు రహిత లావాదేవీలు అమలు కావడం లేదు. టికెట్ కొన్నవారు స్వైపింగ్ మెషిన్ ద్వారా నగదు చెల్లించేందుకు దాదాపు 2 నుంచి 5 నిమిషాలు పడుతోంది. ఆ లోపు ఆన్లైన్లో ఉన్న టికెట్లు అయిపోతున్నాయి. దీంతో చాలామంది రిజర్వేషన్ చేసుకునే సందర్భంలోనూ నగదు చెల్లిస్తున్నారు. స్వైపింగ్ మెషిన్లు అందుబాటులో లేవు జిల్లాకు స్వైపింగ్ మెషిన్లు కావా లని ఉన్నతాధికారులకు నివేదిం చాం. అవసరానికి తగినన్ని మెషిన్లు అందుబాటులో లేవు. స్వైపింగ్‌పై పన్ను వసూలు చేస్తున్నారని తెలిసింది. ఈ కారణంగా చాలామంది నగదు రహితంపై మొగ్గు చూపడం లేదు. నగదుతోనే లావాదేవీలు చేస్తున్నారు. జిల్లాలోని పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించాం. –బి.వెంకట్రావ్, -
పెద్దనోట్ల రద్దు ప్రకటించి నేటికి ఏడాది
సాక్షి, రాజమహేంద్రవరం: 2016 నవంబర్ 8... ఈ రోజు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేనిది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ రోజు రాత్రి 9 గంటలకు చేసిన ప్రకటన టీవీల్లో చూసిన ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురయ్యారు. నవంబర్ 8వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి దేశంలో రూ.1000, రూ.500 నోట్ల చెలామణి రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. పేదవాడి నుంచి ధనవంతుల వరకూ ప్రతి ఒక్కరూ పెద్దనోట్లు రద్దు బాధల బారిన పడ్డారు. రద్దు ప్రకటించిన రెండు రోజుల విరామం తర్వాత బ్యాంకుల్లో వాటిని మార్చుకోవచ్చని చెప్పడంతో ప్రజలు బ్యాంకుల వద్ద బారులుదీరారు. చిన్నాపెద్దా తేడా లేకుండా...బ్యాంకు ఖాతా ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ బ్యాంకుల ముందు క్యూ కట్టారు. నగదు మార్చుకోవడంపై పలుమార్లు పరిమితులు విధించినా నగదు కొరత తీరలేదు. ఎప్పడు నగదు వస్తుందో బ్యాంకు అధికారులకూ తెలియని పరిస్థితి. మరో వైపు తమ రోజు వారీ అవసరాలకు కూడా నగదు లేక బ్యాంకుల వద్ద పనులు మానుకుని ప్రజలు పడిగాపులు కాశారు. 50 రోజులన్నది.. 100 రోజులు దాటింది... నగదు మార్పిడి ఇబ్బందులన్నీ డిసెంబర్ 31 నాటికి 50 రోజుల్లో సమసిపోతాయని ప్రధాని మోదీ ప్రకటించినా ఆ సంఖ్య వంద రోజులు దాటింది. ఎప్పటికప్పుడు నగదు కొరత తలెత్తడంతో బ్యాంకుల వద్ద రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. సందట్లో సడేమీయాలా జిల్లాలో ధనవంతులు పేదలతో తమ వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకున్నారు. ఇందుకు బలం చేకూరేలా అనేక ఘటనలు జరిగాయి. పైగా జిల్లాలో నగదు మార్చుకునేందుకు ధనవంతులు, రాజకీయ నేతలు ఒక్కరు కూడా బ్యాంకుల వద్ద క్యూల్లో కనపడకపోవడం గమనార్హం. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల శాఖలు 794 ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 330 శాఖలున్నాయి. పట్టణాలు, నగరాల్లో ఉన్న బ్యాంకుల కన్నా గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో నగదు కొరత సమస్య తీవ్రంగా ఉండడంతో పింఛన్‌దారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏటీఎంల డొల్లతనం... పెద్దనోట్ల రద్దు సమయంలో జిల్లాలో కేవలం ఐదు శాతం ఏటీఎంలే పని చేశాయి. నగదు కొరత వల్ల అన్ని ఏటీఎంలలో బ్యాంకులు నగదును పెట్టలేకపోయాయి. జిల్లాలో ప్రస్తుతం 815 ఏంటీఎంలున్నాయి. పెద్దనోట్ల రద్దు సమయానికి జిల్లాలో 811 ఏటీఎంలు ఉండగా వీటిలో 40 ఏటీఎంలలో కూడా నగదు దొరకని పరిస్థితి. నగదు పెట్టిన కొద్ది నిమిషాలకే ఖాళీ అయిపోయేవి. సాధారణ ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు డిసెంబర్, జనవరి మొదటి వారాల్లో తమ జీతాలు తీసుకోవడానికి కూడా ఏటీఎంలలో నగదు లేకపోవడంతో కనీస అవసరాలు కూడా తీర్చుకోలేకపోయారు. దాదాపు నాలుగు నెలలపాటు కొనసాగిన నగదు నిల్వల కొరతతో ఏటీఎంల నిర్వహణ ఆగిపోయింది. ఫలితంగా జిల్లాలో బ్యాంకులు, ప్రధాన కూడళ్లలో ఉన్న ఏటీఎంలు తప్ప మిగిలిన చోట్ల దాదాపు 30 శాతం ఏటీఎంలలో సాంకేతికపరమైన లోపాలు తలెత్తాయి. ఆ సమస్య ఇప్పటికీ కొనసాగుతోంది. బోసిపోయిన పండుగలు... ప్రధాన పండుగలైన క్రిస్మస్, సంక్రాంతి పడుగలపై పెద్దనోట్ల చెలామణీ రద్దు ప్రభావం స్పష్టంగా కనిపించింది. ర ద్దు నిర్ణయం తీసుకున్న 47 రోజుల తర్వాత డిసెంబర్ 25వ తేదీన జరిగిన క్రిస్మస్ పండుగ, అనంతరం 20 రోజులకు వచ్చిన సంక్రాంతి పండుగలు చేసుకునేందుకు ప్రజల వద్ద నగదు లేని పరిస్థితి. ప్రజల బ్యాంకు ఖాతాల్లో నగదు ఉన్నా ఉపయోగించుకోలేని దుస్థితి. దస్తులు, తినుబండారాలు కూడా కొనుగోళ్లు కనీసం 5 శాతం కూడా జరగలేదు. వస్త్ర వ్యాపారులు మూడు నెలలపాటు కనీసం అద్దెలు చెల్లించుకునేలా కూడా వ్యాపారం జరగలేదంటే పెద్దనోట్ల చెలామణి రద్దు ప్రభావం ఎలా ఉందో అర్థమవుతోంది. పండుగల సీజన్లో జిల్లాలో దాదాపు 200 కోట్ల మేర వస్త్ర వ్యాపార రంగం నష్టపోయింది. ఇక సిబ్బంది జీతాలు చెల్లించలేక కొన్ని దుకాణాల వారు దీర్ఘకాలిక శెలవులు ప్రకటించాయి. కిరాణా తెచ్చుకోవడానికీ డబ్బులు లేవు.. పెద్దనోట్లు రద్దు చేసిన తర్వాత దాదాపు రెండు నెలల వరకూ డబ్బుల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డాం. రెండు వేల నోటు చిల్లర కోసం అష్టకష్టాలు పడ్డాం. ఆ రోజులు మళ్లీ ఊహించుకోలేమండి. ఇంట్లో కిరాణా సామాన్లు తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు. దుకాణాల వద్ద అప్పులు చేశాం. – కె.లక్ష్మీ, గృహిణి, రాజమహేంద్రవరం. పండగల్లో వ్యాపారం కుదేలు ఏడాదిలో 11 నెలలపాటు జరిగే వ్యాపారం ఒకెత్తు. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి సీజన్ నెల రోజుల్లో జరిగే వ్యాపారం అతి ముఖ్యమైనది. 11 నెలల్లో ఎంత వ్యాపారం జరుగుతుంతో అంతకు మించిన వ్యాపారం ఆ నెలలో జరుగుతుంది. గత ఏడాది పెద్దనోట్ల రద్దు వల్ల వ్యాపారం అస్సలు జరుగ లేదు. దాదాపు ఆరు నెలలు ఖర్చులు కూడా పూడ్చుకోలేకపోయాం. – దాసరి ప్రకాశరావు, వస్త్రవ్యాపారి, రాజమహేంద్రవరం. -
‘125 కోట్ల ప్రజల విజయం’
సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు 125 కోట్ల భారతీయుల విజయమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. పెద్ద నోట్ల రద్దుకు ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్లో స్పందించారు. డిమానిటైజేషన్ ప్రక్రియకు 125 కోట్ల భారతీయులు స్వచ్ఛందంగా మద్దతిచ్చారని ఆయన కొనియాడారు. అవినీతి, నల్లధనంపై జరిపిన పోరాటంలో ప్రజలే విజేతలుగా నిలిచారని ఆయన అన్నారు. డిమానిటైజేషన్‌కు సంబంధించిన ఒక గ్రాఫిక్ ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేసిన మోదీ.. దానికి పెద్ద నోట్ల రద్దు.. చారిత్రాత్మక బహుళ పరిణామాల విజయంగా అయన పేర్కొన్నారు. నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రజలు తనకు పూర్తిగా సహకరించారని.. వారికి అభినందనలు తెలిపారు. సరిగ్గా ఏడాది కిందట ప్రధాని నరేంద్రమోదీ ఎవరూ ఊహించని విధంగా అప్పడు చలామణిలో ఉన్న రూ.500, రూ. 1000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు. 125 crore Indians fought a decisive battle and WON. #AntiBlackMoneyDay pic.twitter.com/3NPqEBhqGq — Narendra Modi (@narendramodi) 8 November 2017 -
నోట్ల రద్దుతో లభించిన ప్రయోజనాలివే...
సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద నోట్లను రద్దు చేసి నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ''యాంటీ బ్లాక్ మనీ డే'' గా డీమానిటైజేషన్ వార్షికోత్సవం నిర్వహిస్తోంది. నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా నిర్ణాయక యుద్ధంలో పోరాడి 125 కోట్ల మంది భారతీయులు విజయం సాధించినట్టు కూడా ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దుతో సాధించిన విజయాలను ప్రభుత్వం వివరించింది. అవేమిటో ఓసారి చూద్దాం... భారత దేశంలో ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా అత్యధికంగా నల్లధనం వెలికితీయబడింది. భారతదేశ జనాభాలోని 0.00011% మంది దేశంలోని మొత్తం నగదులో దాదాపుగా 33% డిపాజిట్ చేశారు. 17.73 లక్షల కేసులలో నగదు లావాదేవీలు పన్ను ప్రొఫైల్‌తో సరిపోల్చబడలేదు. 23.22 లక్షల ఖాతాలలో రూ.3.68 లక్షల కోట్ల నగదు డిపాజిట్లు అనుమానాస్పదంగా ఉన్నాయి. అధిక డినామినేషన్ నోట్లు సుమారుగా రూ.6 లక్షల కోట్లకు తగ్గించబడినవి. ఉగ్రవాదానికి, నక్సలిజానికి నిర్ణాయకమైన ఎదురుదెబ్బ కాశ్మీరులో రాళ్ళు రువ్వే సంఘటనలు 75 శాతానికి పైగా తగ్గాయి. వామపక్ష తీవ్రవాద సంఘటనలు 20 శాతానికి పైగా తగ్గాయి. 7.62 లక్షల దొంగనోట్లు కనుగొనబడినవి. భారతదేశపు ఆర్థిక వ్యవస్థ విస్తృత ప్రక్షాళన నల్లధనం, హవాలా వ్యవహారాలు నిర్వహించే షెల్ కంపెనీల గుట్టు బయట పెట్టడం జరిగింది. షెల్ కంపెనీలపై సర్జికల్ దాడులలో 2.24 లక్షల కంపెనీలు మూసివేశారు. 35వేల కంపెనీలకు చెందిన 58వేల బ్యాంకు ఖాతాలు నోట్ల రద్దు తర్వాత రూ.17వేల కోట్ల లావాదేవీలు జప్తు చేయబడినవి. నిర్ధిష్ట రూపకల్పన వలన అధిక అభివృద్ధి, పేదలకు అధిక సంఖ్యలో ఉద్యోగాలు కార్మికుల బ్యాంకు ఖాతాలలోకి జీతం నేరుగా బదిలీ 1.01 కోట్ల మంది ఉద్యోగులు ఈపీఎఫ్‌లో చేర్చబడ్డారు. 1.3 కోట్ల మంది కార్మికులు ఈఎస్ఐసీ వద్ద నమోదు చేసుకున్నారు. దీని ద్వారా సామాజిక భద్రత, ఆరోగ్య ప్రయోజనాలు చేకూరనున్నాయి. నోట్ల రద్దు కారణంగా పన్ను అమలులో అనూహ్యమైన పెంపుదల కొత్త పన్ను చెల్లింపుదార్లు 2015-16లో 66.53 లక్షల నుంచి 2016-17లో 84.21 లక్షలకు 26.6 శాతం మేరకు పెరిగారు. దాఖలు చేసిన ఇ-రిటర్నుల సంఖ్య 2016-17లో 2.35 కోట్ల నుంచి 2017-18లో 3.01 కోట్లకు 27.95 శాతం పెరిగాయి. తక్కువ నగదు ఉపయోగించే విధానానికి మారడం ద్వారా దేశంలో స్వచ్ఛమైన ఆర్థిక వ్యవస్థ 2016 ఆగస్టులో డిజిటల్ లావాదేవీలు 87 కోట్లు ఉండగా.. 2017 ఆగస్టులో 138 కోట్లకు పెరిగాయి. ఇది 58 శాతం వృద్ధి. నోట్ల రద్దు వరకు మొత్తం 15.11 లక్షల పీఓఎస్ మెషిన్లు ఉండగా.. కేవలం 1 సంవత్సరంలో 13 లక్షలకు పైగా పీఓఎస్ మెషిన్లు చేర్చబడినవి. నోట్ల రద్దు కారణంగా ప్రజల రుణాలకు వడ్డీరేటు తగ్గింపు, రియల్ ఎస్టేట్ ధరలలో తగ్గుదల పట్టణ స్థానిక సంస్థల ఆదాయం పెరుగుదల వంటి బహుళ ప్రయోజనాలను పొందారు. -
రూ.36.3కోట్ల పాత నోట్లు స్వాధీనం
సాక్షి, న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు ప్రకటించి రేపటికి (నవంబరు 8) ఏడాది కావస్తోంది. అటు అధికార పక్షం ఈ విజయోత్సవానికి సిద్ధమవుతుండగా, ఇటు ప్రతిపక్షాలు నవంబర్ 8ని బ్లాక్ డేగా ప్రకటించి, నిరసన కార్యక్రమాలకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్లో భారీగా రద్దయిన కరెన్సీని పట్టుకోవడం కలకలం రేపింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) రూ. 36.3 కోట్ల విలువైన రద్దయిన నోట్లను స్వాధీనం చేసుకుంది. జమ్మూ, కాశ్మీర్లో ఉగ్రవాదంపై నిధుల సేకరణకు సంబంధించిన కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ మంగళవారం వెల్లడించింది. రూ. 36,34,78,500 విలువైన నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. ప్రదీప్ చౌహాన్, భాగ్వాన్ సింగ్, వినోద్ శెట్టి, షానవాజ్ మీర్, దీపక్ తోఫ్రాన్ని, మజీద్ సోఫి, ఎజాజుల్ హసన్, జస్విందర్ సింగ్, ఉమయిర్ దార్ లను అరెస్ట్ చేసినట్టు ఎన్ఐఏ వివరించింది. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. జమ్ము కశ్మీర్లో ఏ ప్రాంతంలో దాడులు చేసిందీ వివరాలను ఎన్ఐఎ ఇంకా విడుదల చేయలేదు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కాగా గత కొన్ని నెలలుగా జమ్మూ, కాశ్మీర్లో అనేక ప్రాంతాల్లోఎన్ఐఏ దాడులు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద గ్రూపులు అలజడిని సృష్టిస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏజెన్సీ దర్యాప్తు చేపట్టింది. -
‘ఇలా చేస్తే బ్లాక్ మనీ కనుమరుగు’
సాక్షి,న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయం వెనుక స్ఫూర్తిగా నిలిచిన అర్థక్రాంతి వ్యవస్థాపకులు అనిల్ బొకిల్ బ్లాక్ మనీ నిర్మూలించడానికి ఏం చేయాలో వివరించారు. నోట్ల రద్దు చేపడుతూ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకున్నా నల్లధనాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రస్తుత పన్ను వ్యవస్థను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాను సూచించిన ఇతర చర్యలు చేపట్టకుండా నోట్ల రద్దు ఒక్కదానితోనే ఆశించిన లక్ష్యాలు చేకూరవన్నారు. ఇతర పన్నుల స్థానంలో బ్యాంకింగ్ లావాదేవీల పన్ను విధించడం వంటి తన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్ అయిన బొకిల్ ఈటీ ఆన్‌లైన్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో పలు విషయాలు వెల్లడించారు. తన దృష్టిలో ఇది డిమానెటైజేషన్ కాదని, కేవలం నోట్ల రద్దు మాత్రమేనన్నారు. ప్రభుత్వం చెలామణిలో ఉన్న నగదునే ఈ నిర్ణయం ప్రభావితం చేస్తున్న క్రమంలో డిమానెటైజేషన్ పదం సరికాదని, ఇది కేవలం నోట్ల రద్దు మాత్రమేనన్నారు. నోట్ల రద్దుతో దశాబ్ధాలుగా ప్రజల వద్ద పేరుకుపోయిన పెద్దనోట్లన్నీ బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేరడంతో డిపాజిట్లు పెరిగి రుణాలు ఇచ్చే వెసులుబాటు కలిగిందని చెప్పారు.మరోవైపు డిజిటల్ లావాదేవీలు పెరగడం ఇవన్నీ నోట్ల రద్దుతో సానుకూల పరిణామాలన్నారు. ఆశించిన మేలు జరిగిందా..? ఆర్బీఐ వెల్లడించిన కొన్ని గణాంకాలు పరిశీలిస్తే... గతంలో మొత్తం కరెన్సీలో పెద్దనోట్లైన రూ 500,రూ 1000 నోట్లు 85 శాతంగా ఉంటే ప్రస్తుతం మొత్తం కరెన్సీలో పెద్దనోట్లు రూ 500, రూ 2000 నోట్లు కేవలం 72 శాతమే ఉన్నాయని బొకిల్ గుర్తుచేశారు. నోట్లరద్దుకు ముందు చెలామణిలో ఉన్న నగదు 16.6 లక్షల కోట్లు కాగా, ప్రస్తుతం అది రూ 13.3 లక్షల కోట్లకు తగ్గిందన్నారు. వ్యవస్థాగత మార్పుకు నోట్ల రద్దు కేవలం ఆరంభం మాత్రమేనన్నారు. చెలామణిలో ఉన్న నగదులో బ్లాక్‌మనీని ఇది తగ్గించగలిగిందన్నారు. ఆర్థిక వ్యవస్థ సమతూకానికి నోట్ల రద్దు అవసరమని బొకిల్ స్పష్టం చేశారు. నకిలీ నోట్లకు చెక్ పడటంతో ఉగ్రకార్యకలాపాలకు నిధులు తగ్గిపోయాయని, పన్ను రాబడి పెరిగిందని విశ్లేషించారు.వడ్డీ రేట్లు తగ్గి, నిధుల సమీకరణ వ్యయం దిగివస్తుందన్నారు. కంపెనీలకు రుణ వితరణ పెరగడంతో ఉపాథి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. అర్థక్రాంతి సూచనలన్నీ అమలవలేదు... తాము ప్రభుత్వానికి ప్రతిపాదించిన ఐదు అంశాల ఫార్ములాను మొత్తంగా ప్రభుత్వం ఆమోదించలేదని అన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చే క్రమంలో ప్రభుత్వం తమ ప్రతిపాదనలన్నింటికీ అంగీకరించలేదని భావిస్తున్నామన్నారు. తాము ‘పన్ను రహిత-తక్కువ నగదు’ ఆర్థిక వ్యవస్థను తాము ప్రతిపాదించామన్నారు. పన్నుల స్థానంలో బీటీటీ బ్లాక్‌మనీ పోగుపడటానికి ప్రస్తుత పన్ను వ్యవస్థే కారణమని తాము బలంగా నమ్ముతున్నామని అనిల్ బొకిల్ చెబుతూ ఈ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి కేవలం ఒకే ఒక పన్ను బ్యాంకింగ్ లావాదేవీల పన్ను (బీటీటీ) విధించాలని చెప్పారు. దీనికి తోడు క్రమంగా పెద్ద నోట్లను రద్దు చేసి కేవలం రూ 100, రూ 50 నోట్లనే చెలామణిలో ఉంచాలని సూచించారు.