బీదర్‌లో రాహుల్‌కు జ్ఞాపిక అందిస్తున్న దృశ్యం
సాక్షి, బళ్లారి: దేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలను తన గుప్పిట పెట్టుకోవాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. ఇప్పటికే ప్రతి మంత్రిత్వ శాఖలోనూ ఆరెస్సెస్ నుంచి ఓ ప్రత్యేకాధికారి (ఓఎస్డీ) ఉన్నారని అన్నారు. ఏ మంత్రీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం లేదనీ, నోట్లరద్దు ఆరెస్సెస్‌కు చెంది ఉన్న ఓ వ్యక్తి సలహా మేరకే జరిగిందని ఆరోపించారు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థను సరళీకరిస్తామని హామీనిచ్చారు. రాహుల్ కర్ణాటకలో తన నాలుగు రోజుల జనాశీర్వాద యాత్రను మంగళవారం బీదర్‌లో ముగించారు. గుల్బర్గాలో వ్యాపారులు, రైతులతో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ జీఎస్టీని ముందు ప్రయోగాత్మకంగా అమలు చేసి లోపాలు తెలుసుకోవాలన్న కాంగ్రెస్ సూచనను సైతం బీజేపీ పట్టించుకోలేదన్నారు.
భారత్ ఏకాకి అవుతోంది..
మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం వల్ల దక్షిణాసియా ప్రాంతంలో భారత్ ఏకాకిగా మిగులుతోందని రాహుల్ హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం తన వైఖరితో భారత విదేశాంగ విధానంలో ఇబ్బందులు సృష్టిస్తోందని ఆరోపించారు. పాక్, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, మయన్మార్ తదితరాల్లో చైనా ప్రాబల్యాన్ని పెంచుకుంటుండగా, ఆయా దేశాలతో భారత్ బంధం బలహీనపడుతోందని రాహుల్ విశ్లేషించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘నేను లక్షల మందిని కలిసి మాట్లాడాను. కాంగ్రెస్‌కు మంచి వాతావరణం ఉంది’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment